Wednesday, March 28, 2007

అంధలోకంలో అనుబంధాలు...

తమిళనాడులోని మదురై పరిసరాల్లో ఉన్న శిక్కమంగళం పంచాయితీలో ఓ చిన్న గూడెం అది. ఇక్కడ దాదాపు 40కి పైగా అంధ జంటలు ఉన్నాయి. ఈ గూడానికి తైపూసం అనే వ్యక్తి నాయకుడు కాగా ఆయనా అంధుడే. ఎందుకనో తెలీదుకానీ ఈ ప్రాంతంలో పుట్టిన చాలా మంది జన్మతః అంధులు కాగా, మరి కొందరు పుట్టిన తర్వాత బాల్యంలోనే ఏదో ఒక దశలో అంధులై చూపును కోల్పోతున్నారు. వీళ్లలో చాలామంది సమీపంలోని అంధుల పాఠశాలలో చదువుకుంటారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలు ప్రేమ బంధానికి దారితీయగా ఎన్నో జంటలు వివాహబంధంతో ఒకటయ్యాయి.

తమ ప్రేమ వివాహాలకు సంబంధించి అంధ జంటలు మాట్లాడుతూ తమ పెళ్లిళ్లు బాహ్య సౌందర్యంతో గాక, అంతః సౌందర్యంతో ముడిపడినవి కనుక తాము ఎంతో అవగాహనతో జీవితాల్లో ముందడుగు వేస్తున్నామన్నాయి. కళ్లున్న లోకంలో కేవలం బయటి అందానికే ప్రాధాన్యతనిస్తూ జరిగే చాలా పెళ్ళిళ్లు కొద్ది రోజులకే విడాకులతో పెటాకులు కావడం లేదా అక్రమ సంబంధాలతో ముగిసిపోతున్నాయని వీళ్లంటున్నారు. అంటే, తమ ఉద్దేశం అందరూ గుడ్డివాళ్లు కావాలని కాదని, మనసెరిగి మసలుకోవడం ముఖ్యమని చెబుతున్నామన్నారు.

వీళ్ల జీవనశైలికి సంబంధించిన మరికొన్ని విశేషాలేమిటంటే... పండుగలు పబ్బాలన్నిటినీ కలసికట్టుగా చేసుకుంటారు. ఎలాంటి విభేదాలకూ చోటులేదు. తమ కళ్లకు అన్నీ ఒకేలా ఉంటాయి కనుక అసమానతలకు తావులేదని వారు స్పష్టం చేశారు. వీళ్ల ఐకమత్యాన్ని గమనించిన ప్రభుత్వం ఈ కుటుంబాలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించింది. త్వరలో శాశ్వత నివాసానికి వీలు కలిగేలా పట్టాలు కూడా ఇవ్వనుంది. ఈ అంధలోకంలో అనుబంధాలను పంచుకోవడానికి త్వరలో మరో 40 అంధ కుటుంబాలు ఇక్కడికి రానున్నాయట.

వీళ్ల ఆశ ఏమిటో తెలుసా...? తమ సంతానంలో కళ్లున్న వాళ్లు మరింత పైకెదిగి, తమను విడిచిపోకుండా అండగా ఉండాలన్న ఓ చిన్న కోరిక మాత్రమే. అదే తమ జీవితంలో రాబోయే కొత్త కోణం అంటున్నారు ఈ అంధ బంధువులు... ప్రేమ సింధువులు.