Saturday, August 31, 2019

ఆగ్రా బడి... ఆరోగ్యానికి అగ్రతాంబూలం

తాజ్‌మహల్ అంటే ఆగ్రా గుర్తుకొస్తుంది రైటే... కానీ ఆ స్కూలు పేరు విన్నా ఆగ్రా గుర్తుకు రావలసిందే మరి. ఇంతకీ ఆ స్కూలు ప్రత్యేకతేమిటనేగా మీ సందేహం? ఆ స్కూల్ ఆగ్రాలోని అంబేద్కర్ నగర్‌లో ఉన్న Tedi Bagia Government Middle School. నీటి కరవును ఎదుర్కుంటున్న తేడీ బగియా ప్రాంతంలో ఉన్న ఈ బడిలో 2016లో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ ఇప్పటికే 2 లక్షల 80 వేల లీటర్లకు పైగా వాననీటిని పొదుపు చేసి, పరిశుభ్రమైన జలాన్ని విద్యార్థులకు అందిస్తోంది. సుమారుగా 70వేల రూపాయల డబ్బును ఈ పాఠశాల ఆదా చేసింది. మధ్యాహ్న భోజనం తయారీకి ఈ నీటి వాడకం వల్ల రుచి పెరిగిందని ఈ బడి పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. ప్రిన్సిపాల్ ఎం ఎన్ శర్మ కృషితో ఈ ఫలితం సాధించారు. ఇందుకు Centre for Urban and Regional Excellence (CURE) అనే స్వచ్ఛంద సంస్థ తోడ్పాటునిచ్చిందట. కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు ఈ విద్యార్థుల చాయల్లో కనిపించవు. మరి దేశంలోని మిగిలిన బడులు కూడా ఈ బడిబాట పట్టాలి మరి.

Wednesday, April 17, 2019

భార్య కోసం టాయ్‌లెట్ బెడ్

తమిళనాడులోని నాగర్‌కోయిల్ ప్రాంతానికి చెందిన ఎస్ శరవణ ముత్తు అనే 42 ఏళ్ళ వెల్డింగ్ కార్మికుడు తన భార్య కోసం రిమోట్ కంట్రోల్ బెడ్ తయారు చేసి తన ప్రేమను చాటుకున్నాడు. ఇతని శ్రమను గుర్తించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ జాతీయ స్థాయిలో 2వ బహుమానాన్ని ప్రకటించింది. కొన్ని రోజుల కిందట అనారోగ్యానికి గురైన ముత్తు భార్యకు ఆపరేషన్ జరిగింది. ఆమె మంచం దిగలేని పరిస్థితిని గమనించిన శరవణముత్తు రిమోట్ కంట్రోల్ టాయ్‌లెట్ బెడ్ తయారు చేశాడు. ఇది సెప్టిక్ ట్యాంక్‌కు కనెక్ట్ అయ్యేలా 3 బటన్స్‌తో రూపొందించాడు.

సూపర్ శరవణా... మీలాంటివారుంటే భార్యలకు బాధలుండవు.

Thursday, February 28, 2019

సైన్యం కోసం యాచకురాలి డబ్బులు...

రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరానికి చెందిన నందినీ శర్మ అనే యాచకురాలు అక్కడి బజరంగఢ్ అనే ప్రాంతంలో ఉన్న అంబే మాత అలయం వద్ద యాచిస్తూ జీవించేది. 6 నెలల కిందట అమె మరణించింది. ఆమె తన జీవితకాలంలో భిక్షాటన ద్వారా సేకరించిన 6.61 లక్షల రూపాయలను ఈ ఆలయ ట్రస్టీల చేతికి అప్పగించి ఏదైనా సత్కార్యానికి ఉపయోగించాల్సిందిగా కోరింది. నందినీ శర్మ కోరిక మేరకు పుల్వామా దాడిలో మరణించిన సైనికుల కుటుంబాల సహాయార్థం ట్రస్టీలు ఈ సొమ్మును జిల్లా కలెక్టర్ విశ్వమోహన్ శర్మ ద్వారా చెక్ రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. నందిని ప్రతి రోజూ భిక్షాటన ద్వారా ఆర్జించిన ధనాన్ని బ్యాంకులో దాచేవారు. తనకు ప్రభుత్వ గుర్తింపు ఏదీ లేకపోవడంతో ఆలయ ట్రస్టీల సూచన మేరకు ఒక మెడికల్ షాపు యజమాని అంకుర్ అగర్వాల్‌తో కలసి జాయింట్ అకౌంట్ తెరచి అందులో ఈ డబ్బు వేసేవారు. ఆ డబ్బే ఆమె చివరి కోరిక మేరకు సత్కార్యానికి ఉపయోగపడి ఆ యాచకురాలిని దాతృత్వమూర్తిగా చేసింది. ఆలయ ట్రస్టీల్లో ఒకరైన సందీప్ గౌర్ ఈ వివరాలందించారు.

Thursday, January 31, 2019

అగ్ని ఆహుతి చేస్తే... ఆమె ఆకలి తీర్చింది

 హైదరాబాదులోని నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల అక్కడ వందలాది దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ దుకాణాలు పెట్టుకున్న చిరువ్యాపారులు దిక్కుతోచక ఆకలితో అలమటిస్తుంటే నగరంలోని హిమాయత్ నగర్‌కు చెందిన ఆర్తి అనే మహిళ... అడక్కుండానే అమ్మలా అన్నం వారికి పెట్టి వారి ఆకలి తీర్చారు. ఆలు బాత్‌, పెరుగు చట్నీ తీసుకొచ్చి తన స్నేహితులతో కలిసి నుమాయిష్‌ బాధితులు దాదాపు 200 మందికి వడ్డించారు. భోజనం అయిపోయినా ఆమె సేవలు ఆగిపోలేదు. కర్రీ పఫ్‌లు, బిస్కెట్స్, అరటి పండ్లు, మంచినీళ్ళ ప్యాకెట్లను కూడా అందించి ఆదర్శంగా నిలిచారు ఆర్తి.