Sunday, December 31, 2023

రితిక పట్టుదల... యూట్యూబ్ పాఠాలతో నీట్‌లో సీటుచదువుకోవడానికి చాలామంది కోచింగుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఆ అవసరం లేదనీ... శ్రద్ధ ఉంటే మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే ఎంతో సాధించవచ్చని నిరూపించింది. రితికా పాల్ అనే బాలిక. ఈ అమ్మాయి ప్రైవేటు కోచింగ్‌కు డబ్బులు లేక యూట్యూబ్ వీడియోలు చూస్తూ నీట్ పరీక్షలో విజయం సాధించింది. తనలాంటి ఎంతో మందికి మార్గదర్శిగా నిలబడింది. రితికాకు తొలి నుంచీ ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కానీ, కాన్సర్ స్పెషలిస్టు కావాలన్న తన కల నెరవేర్చుకునేందుకు ఆమె ధైర్యంగా రంగంలోకి దిగింది. కానీ, ఈ ప్రయత్నంలో తనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక కష్టాలు పెద్ద అడ్డంకిగా మారాయి. రితిక వద్ద స్మార్ట్ ఫోన్ కూడా లేదు. ప్రైవేటు కోచింగ్‌కు డబ్బులు లేక ఆమె తన స్నేహితుల నుంచి తెచ్చుకున్న పుస్తకాల నుంచి చదువుకునేది. రితిక తండ్రి ఓ ఎంబ్రాయిడరీ కంపెనీలో పనిచేస్తుండగా... తల్లి గృహిణి. చిన్న ఇల్లు. తండ్రికొచ్చే కొద్దిపాటి జీతమే కుటుంబానికి ఆధారం. కానీ కరోనా సంక్షోభం ఆమెకు ఈ ఆసరా కూడా దూరమైంది. ఇన్ని కష్టాలున్నా రితికలో పట్టుదల మాత్రం నిలిచే ఉంది. ఈ పరిస్థితుల్లో రితిక తల్లి తన కూతురికి తోడుగా నిలబడింది. తన నగలు అమ్మి మరీ ఆమెకు కావాల్సిన పుస్తకాలు కొన్నది. దీనికి తోడు రితిక యూట్యూబ్‌లోని ఉచిత వీడియోలు చూసి నీట్‌కు సిద్ధమైంది. కష్టానికి తగ్గ ఫలం ఉంటుందని రితిక విషయంలో నిజమైంది. నీట్ పరీక్షలో ఆమె 502 మార్కులతో దేశం మొత్తం మీద 3032 ర్యాంకుతో డాక్టర్ సీటు సాధించి ఆదర్శంగా నిలబడింది.

Saturday, December 10, 2022

పిల్లల్ని ఉత్తేజపరిచేందుకు టీచర్ ప్లాన్ ఇది...తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుదురులో ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కాలేజి విద్యార్థినులను ఉత్సాహపరిచేందుకు సమ్మర్ క్యాంపు జరిగినప్పుడు వారి ప్రిన్సిపాల్ ఎస్ రూప ప్రతి రోజూ వాళ్లందరికీ ఒక అరుదైన కానుక ఇచ్చేవారు. పిల్లల్ని మనస్ఫూర్తిగా హృదయానికి హత్తుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చి తరగతి గదుల్లోకి పంపేవారు. అలా చెయ్యడం ద్వారా వారిలో కొత్త శక్తి నింపినట్లయ్యి మరింత ఉత్తేజితులై చదువులోను, ఇతర కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారట. పాలస్తీనాకు చెందిన ఒక టీచర్ ఇలా చేస్తూ తమ స్టూడెంట్స్‌ని ఉత్సాహపరుస్తున్న వీడియో చూసి రూప కూడా ఇలా చేశారట. పిల్లలకు, గురువులకు మధ్య ఒక అనుబంధం ఉండేలా ఇలా చెయ్యడం చాలామంచి పని. ఆమె తర్వాత అక్కడికొచ్చినవారు ఈ మంచి అభిరుచిని కొనసాగిస్తున్నారో లేదో తెలీదు... ఈ మధ్య వెబ్ సైట్స్ చూస్తుంటే కనిపించిన ఈ వార్త మీతో పంచుకోవాలనిపించింది.

Friday, December 31, 2021

అప్పుల్లో కూరుకున్న కుటుంబాన్ని ఆదుకున్న ఎన్నారై...


కుమార్తె పెళ్లి కోసం కేరళలోని కొచ్చి పరిధిలో ఉన్న కంజిరమట్టొంకు చెందిన అమీనా అనే మహిళ కీచేరి సర్వీస్ కోపరేటివ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంది. ఈ పెళ్లి కోసం వారి భూమి, ఇల్లు తాకట్టు పెట్టారు. కానీ, సమయానికి అప్పు తీర్చలేకపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. దాచుకున్న సొమ్ము కాస్తా ఆమె భర్త సయ్యద్ మహ్మద్ క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చయిపోయింది. 


తమ ఇల్లు, భూమి దక్కవనే బాధతో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న సమయంలో తమకు దగ్గర్లో ఉన్న పనంగాడు అనే చోటుకు లులు గ్రూప్ కంపెనీకి చెందిన యూసఫ్ అలీ అనే ఎన్నారై వచ్చినట్టు తెలుసుకుని తన గోడు వెళ్లబోసుకుంది.


అమీనా కష్టం తెలుసుకున్న యూసఫ్ తమ ఉద్యోగుల్ని పంపి ఆమె అప్పు తీర్చేసి, జరిమానా కూడా కట్టి, ఆమె భర్తకు చికిత్స కోసం అదనంగా డబ్బులిచ్చి ఆదుకున్నాడు.ఇలాంటి కష్టాల్లో ఎందరో ఇప్పటికీ ఉన్నారు. డబ్బున్నోళ్లు కాస్త కనికరిస్తే ఆ కష్టాల నుంచి ఎందరో బయటపడతారు.

Sunday, October 25, 2020

లాయర్‌గా మారి టీచర్ భరతం పట్టింది...

సుమారు 23 ఏళ్ళ కిందట డార్జిలింగ్ హోంలో విద్యార్థులపై అత్యాచారాలకు పాల్పడి ఇన్నేళ్ళుగా తప్పించుకుంటూ వచ్చిన టీచర్‌ని అప్పటి బాధిత విద్యార్థిని ఒకరు... నేడు లాయరై కటకటాల వెనక్కి పంపించింది. ప్రస్తుతం హాంకాంగ్‌లో ప్రముఖ లాయర్‌గా ఉన్న ఆమె భారత పోలీసులను సంప్రదించి... కేసు పెట్టించి... బెయిల్ కూడా రాకుండా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపింది. అప్పటి తన కీచక టీచర్ నేటికీ పిల్లల్ని బాధ పెడుతున్నాడని తెలిసింది. ఇక వదల కూడదని నిర్ణయించుకున్న ఈ హాంకాంగ్ లాయర్ పట్టుదలను మెచ్చుకోవలసిందే. అరెస్ట్ అయ్యేనాటికి సిలిగురిలో పనిచేస్తున్న జితేష్ ఓఝా అనే ఆ టీచర్‌ను డార్జిలింగ్ డీఎస్పీ రాహుల్ పాండే బృందం వెంటాడి పట్టుకుంది. పోలీసులు మరి కొందరు బాధితులను సంప్రదించి పక్కా సాక్ష్యాలతో అతనికి బేడీలు వేశారు. నాడు 14 ఏళ్ళ వయస్సు విద్యార్థినిగా ఉన్న ఆ లాయర్... నేడు 40ల వయస్సుకు చేరుకున్నారు. ఇటీవల దేశంలో సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమం ద్వారా ఆ లాయర్ స్ఫూర్తి పొంది ఓఝా భరతం పట్టారు. తను దొరకకుండా ఉండటం కోసం ఈ కీచకుడు తరచూ స్కూళ్ళు మారినట్టు సమాచారం. ఎక్కడికక్కడ విద్యార్థులపై అత్యాచారాలు చేస్తూ... అక్కడ దొరికిపోతానేమోనన్న అనుమానం రాగానే మరో స్కూల్లో ఉద్యోగం వెదుక్కుంటూ ఉంటాడు.

Saturday, August 31, 2019

ఆగ్రా బడి... ఆరోగ్యానికి అగ్రతాంబూలం

తాజ్‌మహల్ అంటే ఆగ్రా గుర్తుకొస్తుంది రైటే... కానీ ఆ స్కూలు పేరు విన్నా ఆగ్రా గుర్తుకు రావలసిందే మరి. ఇంతకీ ఆ స్కూలు ప్రత్యేకతేమిటనేగా మీ సందేహం? ఆ స్కూల్ ఆగ్రాలోని అంబేద్కర్ నగర్‌లో ఉన్న Tedi Bagia Government Middle School. నీటి కరవును ఎదుర్కుంటున్న తేడీ బగియా ప్రాంతంలో ఉన్న ఈ బడిలో 2016లో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ ఇప్పటికే 2 లక్షల 80 వేల లీటర్లకు పైగా వాననీటిని పొదుపు చేసి, పరిశుభ్రమైన జలాన్ని విద్యార్థులకు అందిస్తోంది. సుమారుగా 70వేల రూపాయల డబ్బును ఈ పాఠశాల ఆదా చేసింది. మధ్యాహ్న భోజనం తయారీకి ఈ నీటి వాడకం వల్ల రుచి పెరిగిందని ఈ బడి పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. ప్రిన్సిపాల్ ఎం ఎన్ శర్మ కృషితో ఈ ఫలితం సాధించారు. ఇందుకు Centre for Urban and Regional Excellence (CURE) అనే స్వచ్ఛంద సంస్థ తోడ్పాటునిచ్చిందట. కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు ఈ విద్యార్థుల చాయల్లో కనిపించవు. మరి దేశంలోని మిగిలిన బడులు కూడా ఈ బడిబాట పట్టాలి మరి.

Wednesday, April 17, 2019

భార్య కోసం టాయ్‌లెట్ బెడ్

తమిళనాడులోని నాగర్‌కోయిల్ ప్రాంతానికి చెందిన ఎస్ శరవణ ముత్తు అనే 42 ఏళ్ళ వెల్డింగ్ కార్మికుడు తన భార్య కోసం రిమోట్ కంట్రోల్ బెడ్ తయారు చేసి తన ప్రేమను చాటుకున్నాడు. ఇతని శ్రమను గుర్తించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ జాతీయ స్థాయిలో 2వ బహుమానాన్ని ప్రకటించింది. కొన్ని రోజుల కిందట అనారోగ్యానికి గురైన ముత్తు భార్యకు ఆపరేషన్ జరిగింది. ఆమె మంచం దిగలేని పరిస్థితిని గమనించిన శరవణముత్తు రిమోట్ కంట్రోల్ టాయ్‌లెట్ బెడ్ తయారు చేశాడు. ఇది సెప్టిక్ ట్యాంక్‌కు కనెక్ట్ అయ్యేలా 3 బటన్స్‌తో రూపొందించాడు.

సూపర్ శరవణా... మీలాంటివారుంటే భార్యలకు బాధలుండవు.

Thursday, February 28, 2019

సైన్యం కోసం యాచకురాలి డబ్బులు...

రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరానికి చెందిన నందినీ శర్మ అనే యాచకురాలు అక్కడి బజరంగఢ్ అనే ప్రాంతంలో ఉన్న అంబే మాత అలయం వద్ద యాచిస్తూ జీవించేది. 6 నెలల కిందట అమె మరణించింది. ఆమె తన జీవితకాలంలో భిక్షాటన ద్వారా సేకరించిన 6.61 లక్షల రూపాయలను ఈ ఆలయ ట్రస్టీల చేతికి అప్పగించి ఏదైనా సత్కార్యానికి ఉపయోగించాల్సిందిగా కోరింది. నందినీ శర్మ కోరిక మేరకు పుల్వామా దాడిలో మరణించిన సైనికుల కుటుంబాల సహాయార్థం ట్రస్టీలు ఈ సొమ్మును జిల్లా కలెక్టర్ విశ్వమోహన్ శర్మ ద్వారా చెక్ రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. నందిని ప్రతి రోజూ భిక్షాటన ద్వారా ఆర్జించిన ధనాన్ని బ్యాంకులో దాచేవారు. తనకు ప్రభుత్వ గుర్తింపు ఏదీ లేకపోవడంతో ఆలయ ట్రస్టీల సూచన మేరకు ఒక మెడికల్ షాపు యజమాని అంకుర్ అగర్వాల్‌తో కలసి జాయింట్ అకౌంట్ తెరచి అందులో ఈ డబ్బు వేసేవారు. ఆ డబ్బే ఆమె చివరి కోరిక మేరకు సత్కార్యానికి ఉపయోగపడి ఆ యాచకురాలిని దాతృత్వమూర్తిగా చేసింది. ఆలయ ట్రస్టీల్లో ఒకరైన సందీప్ గౌర్ ఈ వివరాలందించారు.