Friday, March 28, 2008

మాజీ మంత్రి కొడుకు : పేపర్ల అమ్మకం

కాస్త వీలు చేసుకొని అలా బీహార్‌లోని ముజఫర్‌పూర్ వెళ్లి మెయిన్ మార్కెట్లో నడచి ముందుకు నాలుగడుగులు వేస్తే... "ఆజ్ కా తాజా ఖబర్" అంటూ 50 ఏళ్లు దాటిన ఉదయ్ ప్రకాశ్ గుప్తా గొంతు పీలగా వినిపిస్తుంది. అయితే ఏంటంట అని మీరడగటంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన గురించి ఎవరికీ తెలియదుగా. 60వ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ మంత్రివర్గంలో ఆహారం మరియు పౌర సరఫరాల మంత్రిగా పనిచేసిన మోహన్ లాల్ గుప్తా కొడుకే ఈ ఉదయ్ ప్రకాశ్ గుప్తా.

వార్డు కౌన్సిలర్ కొడుకైతే చాలు ప్రపంచమే తనదైనట్లుగా మధువు, మగువలతో విలాసాల మధ్య ఒళ్లూపై తెలియకుండా మదమెక్కి ప్రవర్తించే ఈ రోజుల్లో ఉదయ్ ప్రకాశ్‌ను నేటి సమాజం వింత జీవిగానే పరిగణిస్తుంది. ఇప్పటి మంత్రులు తమ పిల్లల చేత ఓ వార్తా సంస్థ లేదా టీవీ ఛానల్ పెట్టించేస్తుండగా పాపం మోహన్ లాల్ గారికి, ఉదయ్ ప్రకాశ్‌కు అలాంటి తెలివితేటలు లేకపోయాయి.

ఉదయ్ దైనందిన కార్యక్రలాపాలు పొద్దుటే 4.30 గంటలకు మొదలవుతాయి. ముజఫర్‌పూర్‌లోని నయాటోలాలో ఉన్న తన ఇంటి నుంచి వార్తా పత్రికల కట్టలతో సైకిల్‌పై బయలుదేరి తన ఖాతాదారుల ఇళ్లకెళ్లి పేపర్లు వేస్తుంటాడు. ఈ పని పూర్తయ్యాక మెయిన్ మార్కెట్‌కు వెళ్లి "ఆజ్ కా తాజా ఖబర్" అంటూ పత్రికలు అమ్ముకుంటాడు.

మోటార్ మెకానిక్స్ కోర్సు పూర్తి చేసిన ఉదయ్ తండ్రి మోహన్ లాల్ మంత్రి అయినప్పటికీ సిద్ధాంతాలు, విలువలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. కొడుకు సహా కుటుంబీకులు, బంధువుల పట్ల ఆశ్రత పక్షపాతం కనబరచలేదు. అందుకే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఉదయ్ బీహార్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలింది. ఉదయం ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ 50వ దశకంలో నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు తమ నయాటోలా ఇంటిని సందర్శించిన సంగతులు నెమరు వేసుకున్నారు.

ఈ జీవితం మీకు బాధగా అనిపించడం లేదా అని అడిగితే... ఇదే బాగుందన్న సమాధానమే ఉదయ్ నోటి వెంట వచ్చే జవాబు.