Saturday, November 30, 2013

అతనొక్కడే... ఒక చోట స్టూడెంట్.. మరోచోట హెడ్మాస్టర్

అతనే బాబర్ అలీ. 17 సంవత్సరాల ఈ కుర్రాడు 9 ఏళ్ళ వయసుకే ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి అలా అలా ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు భుజానికెత్తుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ గ్రామానికి చెందిన అలీ బెర్హంపూర్‌లో ఉన్న కాసింబజార్ రాజ్ గోవింద సుందరి విద్యాపీఠ్‌లో ఒక పక్క ప్లస్ టూ చదువుకుంటూనే తన ఊళ్ళో పేదల కోసం తమ ఇంటి పెరడులో ఏర్పాటు చేసిన బడికి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాడు. పెరడులో బడి అంటే ఏదో చిన్నదనుకునేరు. ఇక్కడ దాదాపు 800 మంది పేద విద్యార్థులకు అలీ ద్వారా విద్యాబుద్ధులందుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ బడికి గుర్తింపునిచ్చి ఇక్కడి విద్యార్థులకు నెల నెలా బియ్యం సరఫరా చేస్తోంది. బాబర్ అలీ సేవల్ని గుర్తించిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇతనిని పురస్కారాలతో సత్కరించి ప్రోత్సహిస్తున్నాయి.

Saturday, August 31, 2013

సావిత్రికి చేప ప్రసాదం... సత్యమూర్తికి పరమానందం..

నాడు సత్యవ్రతుని కోసం భార్య సావిత్రి యముని వెంటపడి మాంగల్యాన్ని దక్కించుకుంటే... నేడు బిడ్డ సావిత్రి కోసం యజమాని సత్యమూర్తి తపనపడి చేప ప్రసాదం ఇప్పించాడు. అసలీ సావిత్రి ఎవరు?.. ఆమె చేప ప్రసాదం తింటే మాకేంటి?... అనుకుంటారేమో. మన మామూలు కళ్ళకు ఆమె ఒక కుక్కలా కనిపించవచ్చు గానీ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో నివసించే ఏసీ వ్యాపారి సత్యమూర్తికి మాత్రం సావిత్రి తన కన్నబిడ్డ లాంటిదే. ఈ మధ్యన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద వితరణ జరిగినప్పుడు గర్భవతిగా ఉన్న సావిత్రికి కూడా ఈ ప్రసాదం ఇప్పించాలని అనుకున్నారాయన. తన కన్నబిడ్డ లాంటి సావిత్రి కనబోయే బిడ్డలు సైతం ఆరోగ్యంగా ఉండాలని తలచి చేప ప్రసాదం ఇప్పించారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది బత్తిని సోదరుల చేప ప్రసాదం వితరణ సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. బాగ్‌లింగంపల్లిలో ఉండే సత్యమూర్తి అనే అయ్యప్ప స్వామి భక్తుడు 'సావిత్రి'ని తన బండిపై నాంపల్లి గ్రౌండ్స్‌కు తీసుకువచ్చి 'చేప ప్రసాదాన్ని' తినిపించారు. అప్పటికి గర్భవతిగా ఉన్న సావిత్రి శాకాహారే అయినప్పటికీ మంచి ఆరోగ్యం కోసం చేప ప్రసాదం ఇప్పించినట్లు సత్యమూర్తి చెప్పారు. సావిత్రితో చేప ప్రసాదం తినిపించడానికి అక్కడున్న కార్యకర్తలు తొలుత ఇబ్బంది పడినప్పటికీ చివరకు ప్రసాదాన్ని విజయవంతంగా తినిపించారు. పద్ధతి ప్రకారం 45 రోజుల పాటు కచ్చితమైన పత్యం పాటించేలా చూస్తానన్నారు. 'సావిత్రి'ని కన్నబిడ్డలా చూసుకుంటానని, తనతో పాటే పూజల్లో పాల్గొంటుందని సత్యమూర్తి చెప్పారు. చేప ప్రసాదం గురించి బయట ఎన్ని వివాదాలున్నా... ఇక్కడ మాత్రం సావిత్రి పట్ల ఆ యజమానిలో గూడు కట్టుకుని ఉన్న ప్రేమకే పట్టం కడదాం...

Sunday, June 30, 2013

మామూలు బడిలో పెద్దాయన కూతురు

ఒక జిల్లా కలెక్టర్ తన కూతురిని కార్పోరేట్ స్కూల్‌లో కాక సర్కారు బడిలో చేర్పించారంటే నమ్ముతారా!.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు 2011లో కలెక్టర్‌గా పనిచేసిన ఆనంద్ కుమార్ తన ఆరేళ్ళ కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకుని అలాగే చేశారు. తన కుమార్తె గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాలలో రెండవవ తరగతిలో చేర్పించారు. ఈ జిల్లాలో చాలా పెద్ద కార్పోరేట్ బడులున్నా ఈ కలెక్టర్‌ మాత్రం తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించి ఎందరికో ఆదర్శంగా నిలబడ్డారు. తమిళనాడులో జరిగే ప్లస్‌ టూ, ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించిన చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే. ఇక్కడ ఇంకొక విషయమేమంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫాంనే గోపికకూ ఇప్పించారు తప్ప ఆమె కోసం కలెక్టర్ గారు మరింత నాణ్యమైన వస్త్రం తెప్పించి యూనిఫాం కుట్టించలేదు. అంతకు మించిన మరో సంగతేమిటంటే ఆమె తన బడిలో ఉచితంగా పెట్టే మధ్యాహ్న భోజనమే తిన్నది తప్ప ఇంటి నుంచి ప్రత్యేకంగా క్యారేజీ రాలేదు. గోపిక తల్లి ఒక డాక్టర్ అట. జిల్లాకు ఎంతో మేలు చేస్తున్న ఈ కలెక్టర్ గారిని ఆ తర్వాత రాజకీయులు బదిలీ చేయించారు.

Tuesday, April 30, 2013

'స్ఫూర్తిదాత.. శ్రీ మామయ్య

ఆయన అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఎ పట్టా పొందారు. బిజినెస్ స్కూల్‌లో బోధకుడిగానూ పనిచేశారు. వ్యాపార విలువల గురించి లోతైన అధ్యయనం చేసినా జీవితాన్ని మాత్రం మానవతా విలువలతోనే అల్లుకున్నారు. ఆయనే శ్రీవ్యాల్. 2004లో మాతృభూమికి తిరిగి వచ్చిన శ్రీవ్యాల్ బిజినెస్ స్కూల్ బోధకునిగా చేరినప్పుడు ఎదురైన కొన్ని అనుభవాల నుంచి పుట్టిందే "స్ఫూర్తి" ఫౌండేషన్. భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో 2006లో హైదరాబాద్ చర్లపల్ల ప్రాంతంలో ఒక కిరాయి ఇంటిలో ముగ్గురు అనాథ బాలల కేరింతల నడుమ ఈ ఫౌండేషన్ ఆవిర్భవించింది. శ్రీవ్యాల్ స్నేహితులు, దాతల విరాళాలతో ప్రస్తుతం సుమారు 200 మంది చిన్నారులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. తన భార్య వెంకటేశ్వరి తోడ్పాటుతో ఇక్కడి పిల్లలకు అన్నీ తామై వారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు.

పిల్లలంతా శ్రీ మామయ్యగా పిల్చుకునే శ్రీవ్యాల్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దుండిగల్ వద్ద స్థలాన్ని కేటాయించింది. వీరి కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు జెజె మెహతా మెమోరియల్ ఫౌండేషన్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు "స్ఫూర్తి" బాలల కోసం అప్పుడప్పుడూ కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. ఆ మధ్య అమెరికాలోని మేరీలాండ్ ఫస్ట్ లేడీ మేరీ క్యాథరీన్ కూడా ఈ ఫౌండేషన్‌కు వచ్చి అభినందనలు కూడా తెలిపారు.

"స్ఫూర్తి" బాలలందరికీ భోజనం, బస, వస్త్రాలు, కాన్వెంట్ చదువు ఉచితమే. 7వ తరగతి వరకూ అక్కడి ప్రయివేట్ పాఠశాలలోను, తర్వాత 10వ తరగతి వరకూ "అధ్య"లో వీరిని చదివిస్తారు. సంగీతంతో పాటు ఇక్కడ కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ పాఠ్యప్రణాళికను బోధిస్తారు.

ఈ స్ఫూర్తిని మనందరం అందిపుచ్చుకుందాం...

Wednesday, January 30, 2013

శివుని మెడలో ఒక పామే.. మరి రతీష్ దగ్గర ?..

పాముల నుంచి కాపాడుకోవడానికి వాటిని చంపాల్సిన పనిలేదని గొంతు చించుకుని అరుస్తుంటాడు రతీష్. విషపూరిత పాములతో ఎలా వ్యవహరించాలో కనిపించినవారికల్లా వివరిస్తుంటాడు. విషముండే పాములేవో.. విషం లేనివి ఏవో యువతరం, విద్యార్థుల్లో అవగాహన కల్గిస్తుంటాడు. అంతెందుకు, వాటి కోసం కోయంబత్తూరు సమీపాన ఇడయారుపాలెంలోని తన ఇంటిని ఏకంగా సర్ప గృహంగా మార్చేశాడు. ఏ పాముకు ప్రమాదం వాటిల్లినా అది రతీష్ సర్పగృహానికి వచ్చి చేరాల్సిందే..

తన ప్రాంతంలోని సుమారు 250 కిలోమీటర్ల పరిధిలో ప్రజల దురవగాహన వల్ల, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ కనీసం 10 పాములు చనిపోతున్నాయని రతీష్ అంచనా. రోడ్డు ప్రమాదాల్లో తోకలు తెగి, శరీరాలకు గాయాలైన దాదాపు యాభైకి పైగా పాములకు ఇతను తన సర్పగృహంలో సేవలందిస్తున్నాడు. అవి కోలుకోగానే అడవుల్లోనూ, కొండల్లోనూ విడిచిపెడుతుంటాడు. పాములకు ఎవరైనా హానికల్గిస్తున్నారని తెలిస్తే సహించడు. వారి ఎదురుగానే ఆ సర్పాలతో మైత్రిని ఏర్పరుచుకుని అబ్బురపరుస్తాడు.

ఆపదలో ఉన్న సర్పాలకు సేవలందించడం కోసం ఏడుగురితో ఒక బృందాన్ని కూడా రతీష్ సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా పాములకు ముప్పు వాటిల్లినట్లు సమాచారం రాగానే ఈ బృందం అక్కడ వాలిపోతుంది. సర్పసేవలో తరిస్తుంది.