Sunday, October 25, 2020

లాయర్‌గా మారి టీచర్ భరతం పట్టింది...

సుమారు 23 ఏళ్ళ కిందట డార్జిలింగ్ హోంలో విద్యార్థులపై అత్యాచారాలకు పాల్పడి ఇన్నేళ్ళుగా తప్పించుకుంటూ వచ్చిన టీచర్‌ని అప్పటి బాధిత విద్యార్థిని ఒకరు... నేడు లాయరై కటకటాల వెనక్కి పంపించింది. ప్రస్తుతం హాంకాంగ్‌లో ప్రముఖ లాయర్‌గా ఉన్న ఆమె భారత పోలీసులను సంప్రదించి... కేసు పెట్టించి... బెయిల్ కూడా రాకుండా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపింది. అప్పటి తన కీచక టీచర్ నేటికీ పిల్లల్ని బాధ పెడుతున్నాడని తెలిసింది. ఇక వదల కూడదని నిర్ణయించుకున్న ఈ హాంకాంగ్ లాయర్ పట్టుదలను మెచ్చుకోవలసిందే. అరెస్ట్ అయ్యేనాటికి సిలిగురిలో పనిచేస్తున్న జితేష్ ఓఝా అనే ఆ టీచర్‌ను డార్జిలింగ్ డీఎస్పీ రాహుల్ పాండే బృందం వెంటాడి పట్టుకుంది. పోలీసులు మరి కొందరు బాధితులను సంప్రదించి పక్కా సాక్ష్యాలతో అతనికి బేడీలు వేశారు. నాడు 14 ఏళ్ళ వయస్సు విద్యార్థినిగా ఉన్న ఆ లాయర్... నేడు 40ల వయస్సుకు చేరుకున్నారు. ఇటీవల దేశంలో సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమం ద్వారా ఆ లాయర్ స్ఫూర్తి పొంది ఓఝా భరతం పట్టారు. తను దొరకకుండా ఉండటం కోసం ఈ కీచకుడు తరచూ స్కూళ్ళు మారినట్టు సమాచారం. ఎక్కడికక్కడ విద్యార్థులపై అత్యాచారాలు చేస్తూ... అక్కడ దొరికిపోతానేమోనన్న అనుమానం రాగానే మరో స్కూల్లో ఉద్యోగం వెదుక్కుంటూ ఉంటాడు.