Sunday, December 31, 2023

రితిక పట్టుదల... యూట్యూబ్ పాఠాలతో నీట్‌లో సీటు



చదువుకోవడానికి చాలామంది కోచింగుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఆ అవసరం లేదనీ... శ్రద్ధ ఉంటే మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే ఎంతో సాధించవచ్చని నిరూపించింది. రితికా పాల్ అనే బాలిక. ఈ అమ్మాయి ప్రైవేటు కోచింగ్‌కు డబ్బులు లేక యూట్యూబ్ వీడియోలు చూస్తూ నీట్ పరీక్షలో విజయం సాధించింది. తనలాంటి ఎంతో మందికి మార్గదర్శిగా నిలబడింది. రితికాకు తొలి నుంచీ ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కానీ, కాన్సర్ స్పెషలిస్టు కావాలన్న తన కల నెరవేర్చుకునేందుకు ఆమె ధైర్యంగా రంగంలోకి దిగింది. కానీ, ఈ ప్రయత్నంలో తనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక కష్టాలు పెద్ద అడ్డంకిగా మారాయి. రితిక వద్ద స్మార్ట్ ఫోన్ కూడా లేదు. ప్రైవేటు కోచింగ్‌కు డబ్బులు లేక ఆమె తన స్నేహితుల నుంచి తెచ్చుకున్న పుస్తకాల నుంచి చదువుకునేది. రితిక తండ్రి ఓ ఎంబ్రాయిడరీ కంపెనీలో పనిచేస్తుండగా... తల్లి గృహిణి. చిన్న ఇల్లు. తండ్రికొచ్చే కొద్దిపాటి జీతమే కుటుంబానికి ఆధారం. కానీ కరోనా సంక్షోభం ఆమెకు ఈ ఆసరా కూడా దూరమైంది. ఇన్ని కష్టాలున్నా రితికలో పట్టుదల మాత్రం నిలిచే ఉంది. ఈ పరిస్థితుల్లో రితిక తల్లి తన కూతురికి తోడుగా నిలబడింది. తన నగలు అమ్మి మరీ ఆమెకు కావాల్సిన పుస్తకాలు కొన్నది. దీనికి తోడు రితిక యూట్యూబ్‌లోని ఉచిత వీడియోలు చూసి నీట్‌కు సిద్ధమైంది. కష్టానికి తగ్గ ఫలం ఉంటుందని రితిక విషయంలో నిజమైంది. నీట్ పరీక్షలో ఆమె 502 మార్కులతో దేశం మొత్తం మీద 3032 ర్యాంకుతో డాక్టర్ సీటు సాధించి ఆదర్శంగా నిలబడింది.

Saturday, December 10, 2022

పిల్లల్ని ఉత్తేజపరిచేందుకు టీచర్ ప్లాన్ ఇది...



తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుదురులో ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కాలేజి విద్యార్థినులను ఉత్సాహపరిచేందుకు సమ్మర్ క్యాంపు జరిగినప్పుడు వారి ప్రిన్సిపాల్ ఎస్ రూప ప్రతి రోజూ వాళ్లందరికీ ఒక అరుదైన కానుక ఇచ్చేవారు. పిల్లల్ని మనస్ఫూర్తిగా హృదయానికి హత్తుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చి తరగతి గదుల్లోకి పంపేవారు. అలా చెయ్యడం ద్వారా వారిలో కొత్త శక్తి నింపినట్లయ్యి మరింత ఉత్తేజితులై చదువులోను, ఇతర కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారట. పాలస్తీనాకు చెందిన ఒక టీచర్ ఇలా చేస్తూ తమ స్టూడెంట్స్‌ని ఉత్సాహపరుస్తున్న వీడియో చూసి రూప కూడా ఇలా చేశారట. పిల్లలకు, గురువులకు మధ్య ఒక అనుబంధం ఉండేలా ఇలా చెయ్యడం చాలామంచి పని. ఆమె తర్వాత అక్కడికొచ్చినవారు ఈ మంచి అభిరుచిని కొనసాగిస్తున్నారో లేదో తెలీదు... ఈ మధ్య వెబ్ సైట్స్ చూస్తుంటే కనిపించిన ఈ వార్త మీతో పంచుకోవాలనిపించింది.

Friday, December 31, 2021

అప్పుల్లో కూరుకున్న కుటుంబాన్ని ఆదుకున్న ఎన్నారై...


కుమార్తె పెళ్లి కోసం కేరళలోని కొచ్చి పరిధిలో ఉన్న కంజిరమట్టొంకు చెందిన అమీనా అనే మహిళ కీచేరి సర్వీస్ కోపరేటివ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంది. ఈ పెళ్లి కోసం వారి భూమి, ఇల్లు తాకట్టు పెట్టారు. కానీ, సమయానికి అప్పు తీర్చలేకపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. దాచుకున్న సొమ్ము కాస్తా ఆమె భర్త సయ్యద్ మహ్మద్ క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చయిపోయింది. 


తమ ఇల్లు, భూమి దక్కవనే బాధతో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న సమయంలో తమకు దగ్గర్లో ఉన్న పనంగాడు అనే చోటుకు లులు గ్రూప్ కంపెనీకి చెందిన యూసఫ్ అలీ అనే ఎన్నారై వచ్చినట్టు తెలుసుకుని తన గోడు వెళ్లబోసుకుంది.


అమీనా కష్టం తెలుసుకున్న యూసఫ్ తమ ఉద్యోగుల్ని పంపి ఆమె అప్పు తీర్చేసి, జరిమానా కూడా కట్టి, ఆమె భర్తకు చికిత్స కోసం అదనంగా డబ్బులిచ్చి ఆదుకున్నాడు.



ఇలాంటి కష్టాల్లో ఎందరో ఇప్పటికీ ఉన్నారు. డబ్బున్నోళ్లు కాస్త కనికరిస్తే ఆ కష్టాల నుంచి ఎందరో బయటపడతారు.

Sunday, October 25, 2020

లాయర్‌గా మారి టీచర్ భరతం పట్టింది...

సుమారు 23 ఏళ్ళ కిందట డార్జిలింగ్ హోంలో విద్యార్థులపై అత్యాచారాలకు పాల్పడి ఇన్నేళ్ళుగా తప్పించుకుంటూ వచ్చిన టీచర్‌ని అప్పటి బాధిత విద్యార్థిని ఒకరు... నేడు లాయరై కటకటాల వెనక్కి పంపించింది. ప్రస్తుతం హాంకాంగ్‌లో ప్రముఖ లాయర్‌గా ఉన్న ఆమె భారత పోలీసులను సంప్రదించి... కేసు పెట్టించి... బెయిల్ కూడా రాకుండా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపింది. అప్పటి తన కీచక టీచర్ నేటికీ పిల్లల్ని బాధ పెడుతున్నాడని తెలిసింది. ఇక వదల కూడదని నిర్ణయించుకున్న ఈ హాంకాంగ్ లాయర్ పట్టుదలను మెచ్చుకోవలసిందే. అరెస్ట్ అయ్యేనాటికి సిలిగురిలో పనిచేస్తున్న జితేష్ ఓఝా అనే ఆ టీచర్‌ను డార్జిలింగ్ డీఎస్పీ రాహుల్ పాండే బృందం వెంటాడి పట్టుకుంది. పోలీసులు మరి కొందరు బాధితులను సంప్రదించి పక్కా సాక్ష్యాలతో అతనికి బేడీలు వేశారు. నాడు 14 ఏళ్ళ వయస్సు విద్యార్థినిగా ఉన్న ఆ లాయర్... నేడు 40ల వయస్సుకు చేరుకున్నారు. ఇటీవల దేశంలో సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమం ద్వారా ఆ లాయర్ స్ఫూర్తి పొంది ఓఝా భరతం పట్టారు. తను దొరకకుండా ఉండటం కోసం ఈ కీచకుడు తరచూ స్కూళ్ళు మారినట్టు సమాచారం. ఎక్కడికక్కడ విద్యార్థులపై అత్యాచారాలు చేస్తూ... అక్కడ దొరికిపోతానేమోనన్న అనుమానం రాగానే మరో స్కూల్లో ఉద్యోగం వెదుక్కుంటూ ఉంటాడు.

Saturday, August 31, 2019

ఆగ్రా బడి... ఆరోగ్యానికి అగ్రతాంబూలం

తాజ్‌మహల్ అంటే ఆగ్రా గుర్తుకొస్తుంది రైటే... కానీ ఆ స్కూలు పేరు విన్నా ఆగ్రా గుర్తుకు రావలసిందే మరి. ఇంతకీ ఆ స్కూలు ప్రత్యేకతేమిటనేగా మీ సందేహం? ఆ స్కూల్ ఆగ్రాలోని అంబేద్కర్ నగర్‌లో ఉన్న Tedi Bagia Government Middle School. నీటి కరవును ఎదుర్కుంటున్న తేడీ బగియా ప్రాంతంలో ఉన్న ఈ బడిలో 2016లో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ ఇప్పటికే 2 లక్షల 80 వేల లీటర్లకు పైగా వాననీటిని పొదుపు చేసి, పరిశుభ్రమైన జలాన్ని విద్యార్థులకు అందిస్తోంది. సుమారుగా 70వేల రూపాయల డబ్బును ఈ పాఠశాల ఆదా చేసింది. మధ్యాహ్న భోజనం తయారీకి ఈ నీటి వాడకం వల్ల రుచి పెరిగిందని ఈ బడి పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. ప్రిన్సిపాల్ ఎం ఎన్ శర్మ కృషితో ఈ ఫలితం సాధించారు. ఇందుకు Centre for Urban and Regional Excellence (CURE) అనే స్వచ్ఛంద సంస్థ తోడ్పాటునిచ్చిందట. కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు ఈ విద్యార్థుల చాయల్లో కనిపించవు. మరి దేశంలోని మిగిలిన బడులు కూడా ఈ బడిబాట పట్టాలి మరి.

Wednesday, April 17, 2019

భార్య కోసం టాయ్‌లెట్ బెడ్

తమిళనాడులోని నాగర్‌కోయిల్ ప్రాంతానికి చెందిన ఎస్ శరవణ ముత్తు అనే 42 ఏళ్ళ వెల్డింగ్ కార్మికుడు తన భార్య కోసం రిమోట్ కంట్రోల్ బెడ్ తయారు చేసి తన ప్రేమను చాటుకున్నాడు. ఇతని శ్రమను గుర్తించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ జాతీయ స్థాయిలో 2వ బహుమానాన్ని ప్రకటించింది. కొన్ని రోజుల కిందట అనారోగ్యానికి గురైన ముత్తు భార్యకు ఆపరేషన్ జరిగింది. ఆమె మంచం దిగలేని పరిస్థితిని గమనించిన శరవణముత్తు రిమోట్ కంట్రోల్ టాయ్‌లెట్ బెడ్ తయారు చేశాడు. ఇది సెప్టిక్ ట్యాంక్‌కు కనెక్ట్ అయ్యేలా 3 బటన్స్‌తో రూపొందించాడు.

సూపర్ శరవణా... మీలాంటివారుంటే భార్యలకు బాధలుండవు.

Thursday, February 28, 2019

సైన్యం కోసం యాచకురాలి డబ్బులు...

రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరానికి చెందిన నందినీ శర్మ అనే యాచకురాలు అక్కడి బజరంగఢ్ అనే ప్రాంతంలో ఉన్న అంబే మాత అలయం వద్ద యాచిస్తూ జీవించేది. 6 నెలల కిందట అమె మరణించింది. ఆమె తన జీవితకాలంలో భిక్షాటన ద్వారా సేకరించిన 6.61 లక్షల రూపాయలను ఈ ఆలయ ట్రస్టీల చేతికి అప్పగించి ఏదైనా సత్కార్యానికి ఉపయోగించాల్సిందిగా కోరింది. నందినీ శర్మ కోరిక మేరకు పుల్వామా దాడిలో మరణించిన సైనికుల కుటుంబాల సహాయార్థం ట్రస్టీలు ఈ సొమ్మును జిల్లా కలెక్టర్ విశ్వమోహన్ శర్మ ద్వారా చెక్ రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. నందిని ప్రతి రోజూ భిక్షాటన ద్వారా ఆర్జించిన ధనాన్ని బ్యాంకులో దాచేవారు. తనకు ప్రభుత్వ గుర్తింపు ఏదీ లేకపోవడంతో ఆలయ ట్రస్టీల సూచన మేరకు ఒక మెడికల్ షాపు యజమాని అంకుర్ అగర్వాల్‌తో కలసి జాయింట్ అకౌంట్ తెరచి అందులో ఈ డబ్బు వేసేవారు. ఆ డబ్బే ఆమె చివరి కోరిక మేరకు సత్కార్యానికి ఉపయోగపడి ఆ యాచకురాలిని దాతృత్వమూర్తిగా చేసింది. ఆలయ ట్రస్టీల్లో ఒకరైన సందీప్ గౌర్ ఈ వివరాలందించారు.

Thursday, January 31, 2019

అగ్ని ఆహుతి చేస్తే... ఆమె ఆకలి తీర్చింది

 హైదరాబాదులోని నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల అక్కడ వందలాది దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ దుకాణాలు పెట్టుకున్న చిరువ్యాపారులు దిక్కుతోచక ఆకలితో అలమటిస్తుంటే నగరంలోని హిమాయత్ నగర్‌కు చెందిన ఆర్తి అనే మహిళ... అడక్కుండానే అమ్మలా అన్నం వారికి పెట్టి వారి ఆకలి తీర్చారు. ఆలు బాత్‌, పెరుగు చట్నీ తీసుకొచ్చి తన స్నేహితులతో కలిసి నుమాయిష్‌ బాధితులు దాదాపు 200 మందికి వడ్డించారు. భోజనం అయిపోయినా ఆమె సేవలు ఆగిపోలేదు. కర్రీ పఫ్‌లు, బిస్కెట్స్, అరటి పండ్లు, మంచినీళ్ళ ప్యాకెట్లను కూడా అందించి ఆదర్శంగా నిలిచారు ఆర్తి.

Monday, August 06, 2018

నా స్కూటర్ ఆ పిచ్చుకలకే అంకితం!

సవీతా టీచర్ ఇంటికి వెళితే ఇనుప వలల మధ్య భద్రంగా ఉన్న ఒక స్కూటర్ కనిపిస్తుంది. అదేదో కేరళ మహారాజులు ఉపయోగించిన  స్కూటర్ అనుకోకండి. దాని మీద వాలే హక్కును కేవలం పిచ్చుకలకు మాత్రమే ఇచ్చారు ఆ టీచర్. ఆ ఊరి వాళ్ళు రోజూ వచ్చి ఆ స్కూటర్‌ని ఓసారి చూసి పోతున్నారు. కొద్ది రోజుల్లో ఈ సీన్ మారి మళ్ళీ ఆ స్కూటర్‌ని ఆవిడ వాడుకుంటారనుకోండి. అది వేరే విషయం ఇంతకీ అసలేం జరిగిందంటే...

ఉపాధ్యాయురాలైన సవీతా మహేంద్రన్ కేరళలోని సత్యమంగళం ప్రాంతంలో ఉన్న అరియప్పంపాళ్యం గ్రామంలో నివసిస్తుంటారు. ఆ మధ్య పని ఉండి ఓ వారం రోజులు సెలవు పెట్టి ఎక్కడికో వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి తన స్కూటర్‌ని పిచ్చుకలు ఉపయోగించుకోవడం ఆమె చూశారు. కాళ్ళు పెట్టుకునే చోట పిచ్చుకలు గూడు కట్టుకుని గుడ్లు పెట్టాయి. ఓ రెండు రోజులయ్యాక వెళ్ళిపోతాయిలే... అనుకున్నారు కానీ అదేం జరగలేదు.

పిచ్చుకల గూడులోని మూడు గుడ్లలో రెండిటి నుంచి పిల్లలు బయటకొచ్చాయి. మరొకటి కూడా పగిలి పిచ్చుక పిల్ల బయటకు వచ్చి, అవన్నీ స్వేచ్ఛగా ఎగిరే వరకూ ఆ స్కూటర్‌ని తాను ఎక్కకూడదని సవీత నిర్ణయించుకున్నారు. తమ వల్ల పిచ్చుకలకు ఇబ్బంది కలగకూడదని, అటు ఎవ్వరూ వెళ్ళకుండా స్కూటర్ చుట్టూ ఇనుప వలలు కట్టించారు.

ఆ పిచ్చుకలు ఎగిరాకే... ఈ బండి చక్రం కదిలేది.

Wednesday, February 28, 2018

రాజు కోడి అక్కడుంటే జాగ్రత్తగా వెళ్ళాలి మరి...

కోడి పేరెత్తగానే ఎప్పుడు కూరొండుకుని తినేద్దామా అనుకుంటారు చాలామంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌లో ఉన్న ఓ కోడిపుంజు ఇంటికి కాపలా కాస్తూ విశ్వాసాన్ని చూపిస్తోంది. మామూలుగా అయితే, మనుషులు దగ్గరకు రాగానే కోళ్లు పరుగులు తీస్తాయి. కానీ సుల్తానాబాదులోని అమృతమ్మ ఇంటి దగ్గర కొత్తవాళ్ళు కనిపిస్తే కోడి వెంటనే దాడి చేస్తుంది. వెంటపడి, తరిమికొడుతుంది. ఈ పుంజు పిల్లగా ఉన్నప్పుడు దానిని ఓ కుక్క నోట కరుచుకుని తీసుకెళుతుండగా... అమృతమ్మ ఆ కుక్కను తరిమేసి కోడిపిల్లను రక్షించింది. చావు బతుకుల్లో ఉన్న ఆ కోడిపిల్లకు చికిత్స చేయించి చక్కగా పెంచి రాజు అని పేరు కూడా పెట్టింది. అప్పటి నుంచి అమృతమ్మకు ఈ కోడి పుంజుతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఒంటరిగా ఉంటున్న అమృతమ్మకు ఈ కోడి పుంజు రక్షణ కల్పిస్తోంది. తన యజమానురాలి అనుమతి లేకుండా ఇంటి వస్తే మీద పడి పొడుస్తుంది. అమృతమ్మ ఆజ్ఞలను అక్షరాలా అనుసరిస్తుంది. ఇంటికి వచ్చినవారిపై ఆ పుంజు దాడి చేసినప్పుడు వద్దని అమృతమ్మ చెబితే చాలు వెంటనే ఆగిపోతుంది. జంతువులు, పక్షులను అందరూ చాలా చిన్నచూపు చూస్తారు. ఈ కోడిపుంజులాంటి చురుకైన పశుపక్ష్యాదులు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి.

Wednesday, November 01, 2017

అందరూ అనుకుంటారు... ఇతను ఆచరించాడు

అవును... పేదోళ్ళకు ఎంతో సాయం చెయ్యాలని ఎందరో అనుకుంటారు. కానీ, జేబులోంచి డబ్బులు తీయాలనేసరికి 'తర్వాత ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు చూద్దాం లే..' అనుకుని జీవితకాలం పాటు వాయిదా వేసుకుంటూ పోతారు. కానీ, హైదరాబాదు వాసి అయిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగి గౌతమ్ కుమార్ మాత్రం తనకు ఆలోచన వచ్చిందే తడవుగా 'సర్వ్ నీడీ' (అవసరార్థులకు సేవ) అనే సంస్థను ప్రారంభించి ఎందరికో అండగా నిలిచాడు. గ్రామాలు, నగరాల్లోని రోడ్లు, ఫుట్ పాత్‌ల మీద కాస్తంత సాయం కోసం ఎదురు చూసి ఆలసిసొలసి పడి ఉండే ఎందరెందరో ఆభాగ్యులకు చూసిన గౌతమ్, వారికి ఎలాగైనా సాయమందించాలని తపనపడి ఈ మహత్కార్యానికి పూనుకున్నాడు. 'సర్వ్ నీడీ'కి అనుబంధంగా మొబైల్ మెడికల్ క్యాంపులు, లాస్ట్ రైట్స్ (అనాథ శవాలకు అంత్యక్రియలు) లాంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాల్ని చేపట్టి ఇందులో మరెందరినో భాగస్వాముల్ని చేశాడు. గౌతం సర్వ్ నీడీకి వందనం, సలాం, సెల్యూట్...

Monday, August 07, 2017

టీచర్ రంగయ్య... మీలా ఉంటే స్కూలు బాగయ్య !

తెలంగాణ రాష్ట్రం కుమరం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న సావర్‌ఖేడ్ గ్రామానికి వెళితే ఉపాధ్యాయులనేవారు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునేవారంతా ఈ గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగయ్యను కలిస్తే ఈ వృత్తికున్న పవిత్రత ఏమిటో అర్థమవుతుంది. తాను పనిచేస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులకు స్వంత డబ్బుతో డిజిటల్‌ పాఠాలు చెబుతున్నారు రంగయ్య. ఇది తెలుగు మీడియం పాఠశాల అయినా ఇంగ్లీష్‌ మీడియంను కూడా మొదలుపెట్టారు.

రంగయ్య అంతటితో ఆగలేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ళలో చేర్చుతుండగా ఆయన మాత్రం తన కూతురు అక్షరను ఇదే పాఠశాలలో చేర్పించి గ్రామస్థులకు, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతున్నారు.

విద్యార్థులకు జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు గుర్తుండేలా పాఠశాల గోడలపై మహత్మజ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ తదితరుల చిత్రాలతో పాటు దేశ, రాష్ట్ర చిహ్నాలు, భారతదేశ, ప్రపంచ చిత్రపటాలను వేయించారు. అలాగే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా గుణింతాలు, ఇంగ్లీష్‌, తెలుగు అక్షరమాలతో పాటు అంకెలను రాయించారు.

సావర్‌ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆరుగురు విద్యార్థులు ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. మరో విద్యార్థి చుక్కా రామయ్య పీపుల్స్‌ ప్రొగ్రెస్‌ టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఉపాధ్యాయుడు రంగయ్య కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

ఉపాధ్యాయుడు రంగయ్య కృషి వల్ల సావర్‌ఖేడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయుడు విద్యాబోధన కొనసాగిస్తుండడంతో గ్రామ ప్రజలు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు పంపించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.

Friday, March 31, 2017

క్యాన్సర్ రోగుల కోసం ఐదు లక్షలిచ్చిన విద్యార్థినులు

హైదరాబాదులో ఐదుగురు విద్యార్థినులు సౌమ్య, సంయుక్త, అద్వితీయ, అనూష, సాత్విక అపూర్వమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఫిబ్రవరి 5న నోవాటెల్‌ హోటల్‌లో  పాటలు పాడి డబ్బు సేకరించారు. సమాజానికి తమవంతు సేవ చేయాలని భావించిన ఈ విద్యార్థినులు ఒక బృందంగా ఏర్పడి సుమారు మూడు గంటలకు పైగా పాటలు పాడారు. మొత్తం  5 లక్షల రూపాయలు సేకరించి ‘గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌’కు అందజేశారు. హైదరాబాదులోని బేగంపేట పర్యాటకభవన్‌లో మార్చి 26న గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు సేకరించిన ఈ డబ్బును కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలోని క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు అందజేస్తామని గ్రేస్‌ క్యాన్సర్‌ కో ఫౌండర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి తెలిపారు.

విద్యార్థిని సౌమ్య మాట్లాడుతూ తాను క్యాన్సర్‌ రోగులను చూశానని, వారికి ఏదైనా చేయాలని అనిపించేదని తెలిపింది. క్యాన్సర్ రోగులకోసం డబ్బు సేకరించేందుకు ఆరు నెలల క్రితమే కార్యాచరణ రూపొందించామని, లక్ష్మణచారి సంగీత కళాశాలకు చెందిన శశికళస్వామి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించామని ఇందులో పాల్గొన్న సంయుక్త అనే ఇంటర్మీడియట్‌ విద్యార్థిని చెప్పింది. రోగులను ఆదుకునేందుకు ముందుకురావాలని వీరు పిలుపునిచ్చారు.

Tuesday, February 28, 2017

గోవు మెడలో గంట వద్దు... మహిళ ఉద్యమం

స్విట్జర్లాండ్ నివాసి నాన్సీ హోల్టన్‌ (42) గోవు మెడలో గంట వద్దంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నెదర్లాండ్‌లో జన్మించిన ఈమె తన ఎనిమిదేళ్ల వయసు నుంచి స్విట్జర్లాండ్‌లోనే నివసిస్తున్నారు. అవుల మెడలో తగిలించే గంటలు బరువుగా ఉంటాయని, అవి ఆవు చర్మానికి రాసుకుపోయి గాయాలు చేస్తుంటాయని నాన్సీ ఆవేదన చెందుతున్నారు. 100 డెసిబుల్స్‌ శబ్దం చేసే ఇలాంటి గంటలను మన కంఠంలో చెవులకు దగ్గరగా ఉంచుకోగలమా?’’ అని నాన్సీ నిలదీస్తారు. గోవు మెడలో గంటలు వద్దని ఆమె ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే, నాన్సీ ఉద్యమం నచ్చని స్విస్ ప్రభుత్వం ఆమెకు పాస్‌పోర్ట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. జంతు హక్కుల కోసం పోరాడే నాన్సీ ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా, మోడల్‌గా పనిచేస్తున్నారు.

Saturday, December 31, 2016

పుస్తక ప్రియులకు, స్టాల్స్‌కు పిల్లలే చిల్లర ఇచ్చారు...

భారత ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సందర్భంలో ప్రజల్ని చిల్లర సమస్య ఎంతగా వేధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనం చిన్న చిన్న అవసరాల కోసం ఏం కొనాలన్నా, వ్యాపారులు అమ్మాలన్నా ఎన్ని తిప్పలు పడ్డారో మనకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు కూడా ఇబ్బందులు తప్పవనే అనుకున్నారు కానీ.... పుస్తక ప్రియులకు చిల్లర సమస్య ఉండరాదని భావించారు ఘట్‌కేసర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పాఠశాల విద్యార్థులు. వరుసగా మూడు రోజుల పాటు రోజుకు రూ.10 వేల చొప్పున బుక్ స్టాల్స్ నిర్వాహకులకు చిల్లర పంచారు. కాస్తంత చిల్లర కోసం జనం ఏటీఎంల దగ్గర క్యూలు కడుతున్నారు. చాలామంది అనారోగ్యం పాలయ్యారు కూడాను. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులు రూ.40 వేల విలువైన చిల్లరను అందించడమంటే మామూలు విషయం కాదు ! భళా‌.. అంటూ ఈ పిల్లలను పుస్తక ప్రియులు నోరారా మెచ్చుకుంటున్నారని ఆ పాఠశాల డైరెక్టర్‌ ఉన్నికృష్ణన్‌ గర్వంగా చెప్పారు. తల్లిదండ్రులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన చిల్లర డబ్బులను కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న ఈ పిల్లలు వాటి ద్వారా పుస్తక ప్రియులకు సాయపడ్డారు. పుస్తక ప్రదర్శనలో ఈ పిల్లలను చూసిన పెద్దలందరూ బ్యాంకుల కన్నా ఈ చిన్నారులే మంచి సేవ చేశారని తెగ పొగిడారు.

Wednesday, November 30, 2016

వ్యాపారే గానీ మనసున్నోడు...

వెయ్యి, 500 నోట్ల రద్దయిన ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లర కోసం జనం రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఇలా వయో, లింగ భేదాలతో సంబంధం లేకుండా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద రేయింబవళ్ళు పడిగాపులు కాస్తున్నారు.  పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న కష్టాలు, బ్యాంకులు, ఏటీఎంల దగ్గర పెరుగుతున్న క్యూలను చూసిన ఓ వ్యాపారి వారి కష్టాలు తీర్చడానికి పెద్దమనసుతో ముందుకొచ్చాడు. తన దగ్గరున్న చిల్లర నోట్లు, నాణేలను బ్యాంకులో జమచేసి చిల్లర కష్టాలు తీర్చడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఆయన పేరు చెందిన అవదేశ్ గుప్తా. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఈయన, బ్యాంకులో రూ.1.55 లక్షల మొత్తాన్ని చిల్లర రూపంలో జమచేశాడు. రూ.10, రూ.50, రూ.100 నోట్ల రూపంలో ప్రజల కోసం చిల్లరను జమ చేయడం విశేషం. ఒక వ్యాపారస్తుడైన అవదేశ్‌కు చిల్లర ఎంతో ముఖ్యం. ఆయన వద్ద చిల్లర ఉంటేనే వ్యాపారం బాగా సాగుతుంది. అయితే, చిల్లర డబ్బుల కోసం బ్యాంకుల వద్ద జనం పడుతున్న పాట్లను తొలగించాలనే సదుద్దేశంతో అవదేశ్ ముందుకొచ్చారు. లాభాపేక్షను పక్కన పెట్టి తక్కువ విలువ కలిగిన నోట్లను జమచేశారు. నవంబర్ 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ స్వయంగా ప్రకటించారు. ఆ క్షణం నుంచే చిల్లర సమస్యలు చుట్టుముట్టాయి. అవదేశ్ లాంటివారు మరికొందరు ముందుకొస్తే దేశవ్యాప్తంగా చిల్లర సమస్య కొంతలో కొంతయినా పరిష్కారమవుతుంది.

Sunday, July 31, 2016

తెలియని స్నేహితురాలికి గిఫ్ట్‌గా టాయ్‌లెట్...

పుట్టినరోజులనగానే మనలో చాలామంది స్నేహితులిచ్చి టాయ్స్ కోసం ఎదురుచూస్తుంటాం. అయితే, చెన్నైలో ఉంటున్న విద్యార్థిని అక్షయ (13) తన పుట్టినరోజు సంబరాన్ని కొత్తగా చేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక, తన పుట్టినరోజు నాడు మరో పేద బాలికకు భలే బహుమతిని ఇచ్చింది. ఆమెకు టాయ్‌లెట్ కట్టించి చక్కని కానుకను ఇచ్చింది.  తన పుట్టినరోజున మరో బాలికకు ఇలాంటి సాయం చెయ్యాలని అక్షయ తన తండ్రి జయకాంతన్‌కు చెప్పగానే ఆయన ఎంతో సంతోషించారు. టాయ్‌లెట్ అవసరం ఉన్న ఒక పేద కుటుంబాన్ని గుర్తించాల్సిందిగా Centre for Sustainable Development అనే ఎన్జీవోను కోరారు. ఆ సంస్థ కడలూరు జిల్లాలోని భువనగిరి పట్టణానికి దగ్గర్లో ఉన్న పెరుమత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆర్తి కుటుంబాన్ని లబ్ధిదారుగా గుర్తించింది. అక్షయ తండ్రి జయకాంతన్ ఆ ఎన్జీవోకు 25 వేలు పంపి ఎకోశాన్ టాయ్‌లెట్ ఏర్పాటు చేయించారు.

ఈ రకమైన టాయ్‌లెట్‌కు నీరు అవసరం లేదట. ఆర్తి కుటుంబంలో పిల్లలు పెద్దలు కలిపి ఏడుగురు మహిళలున్నారు. ఈ సాయం వారందరికీ ఉపయోగపడుతుంది. అక్షయ పుట్టినరోజైన జులై 22 కల్లా ఆర్తి కుటుంబానికి ఈ టాయ్‌లెట్ ఉండేలా సిద్ధం చేశారు. ఆ రోజున ఆర్తి కుటుంబంతోనే అక్షయ గడిపి వారి ఆశీర్వాదం తీసుకుంది. ఈ ఫోటోలో అక్షయ, ఆర్తిలను చూడండి...

Saturday, April 30, 2016

బాలికలకు అపురూపం... మీనమ్మ కానుక !

మీనా మెహతా... ఈ పేరు వింటే సూరత్, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బాలికలందరికీ ఒక ఆరాధనా భావం కలుగుతుంది. ఎందుకంటే, మీనా ఆ బాలికలకు అందిస్తున్న సాయం మిగతా దాతలకంటే భిన్నమైంది కనుక. సాధారణంగా పేద బాలబాలికలకు స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలు, పెన్సిళ్లు, ఒక పూట భోజనం లాంటివి దాతలు అందిస్తుంటారు. కానీ, మీనా మెహతా రూటే సపరేటు. ఈమే ఆ విద్యార్థినుల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. స్కూళ్ళలోని బాలికలకు హైజీన్ కిట్స్, శానిటరీ నాప్‌కిన్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజెపుతుంటారు. ఈ హైజీన్ కిట్స్‌లో శానిటరీ నాప్‌కిన్స్‌తో పాటు లోదుస్తులు, షాంపూ ప్యాకెట్లు, సబ్బులు ఉంటాయి. సూరత్ పరిసరాల్లోని 22 మున్సిపల్ పాఠశాలలు, అంగవికలురకు ఉద్దేశించిన బడులలో మీనా ఈ కిట్స్ పంచుతుంటారు. ఇప్పుడామే విద్యార్థినులకే కాకుండా పేద మహిళలకు కూడా ఈ కిట్స్‌ని ఇస్తున్నారు. మీనా భర్త అతుల్ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని తన వల్ల చెయ్యగల్గినదంతా చేస్తుంటారు.

Thursday, March 31, 2016

1000 బార్బీ బొమ్మలు ఊరికే ఇచ్చేస్తా...

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నార్‌ఫోక్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి 1000 బార్బీ డాల్స్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమె పేరు గియానీ గ్రాహం (Gianni Graham) అవన్నీ తానొక్కత్తే ఆడుకోవడానికి కాదు. తనకి అలాంటి బొమ్మలు చాలానే ఉన్నాయి. కానీ, తనలాగా బొమ్మలతో ఆడుకునే భాగ్యం లేని నిరుపేద బాలికలకు పంచడానికి ఈ సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆడుకునే తోడులేక ఒంటరిగా జీవించే బాలికలకు తానిచ్చే బొమ్మ ఒక స్నేహితురాలిగా ఉంటూ వారిలో నవ్వులు పూయిస్తుందని, అదే తనకు చాలని అంటోంది. తన ఈ కార్యక్రమానికి " ‘1K Barbiers For 1K Girls" అని నామకరణం చేసింది. ఇందుకోసం అదే పేరుతో ఒక వెబ్‌సైట్ కూడా ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి నెల నాటికి 700 బొమ్మలు సేకరించింది. ఈ పాటికి మిగిలినవి కూడా సంపాదించే ఉంటుంది. మంచి పనులు చెయ్యడానికి డబ్బు మాత్రమే ఉండాల్సిన పనిలేదని చాటి చెప్పింది గియానీ...

Sunday, January 31, 2016

పిల్లల కోసం ముంబై కుర్రాడి వెదురు వంతెన

ప్రభుత్వాలు చెయ్యని (చెయ్యగలిగినవే...) పని 17 ఏళ్ల కుర్రాడు పూర్తి చేసి నేటి తరానికి, భావి తరాలకు ఆదర్శంగా నిలిచాడు. ముంబై నగరంలోని సాతే నగర్ ప్రాంతంలో బడికి వెళ్లడానికి రోజూ మురికి కాలువను దాటుతూ నానా అవస్థలు పడుతుండేవారు. ఆ చిన్నారుల అగచాట్లను గమనించిన ఎషాన్ బాల్‌బలే వారి కోసం తాత్కాలికంగా సాతేనగర్ నుంచి పీజీఎంపీ కాలనీ వరకు 100 అడుగుల మేర వెదురుతో ఒక వంతెన నిర్మించాడు. ఇప్పుడిది ఆ చిన్నారులకు విద్యా వరప్రదాయినిగా మారింది. ఈ కుర్రాడు థానేలోని బెడేకర్ కాలేజీలో ప్లస్ 2 చదువుతున్నాడు. ఈ వంతెన 4 అడుగుల వెడల్పుతో ఒకేసారి 50 మంది బరువును మోయగలదట. ఈ కుర్రాడి వంతెన వల్ల అక్కడ స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గాయి. ఆ చిన్నారుల జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఎషాన్‌ని మనసారా ఆశీర్వదిద్దాం...