Monday, April 20, 2009
పెద్దలు ఓటేస్తే పిల్లలకు స్టార్
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఏమిటన్నది నిజంగా గ్రహించిన పాఠశాల ఇది. హైదరాబాద్ నగరం చింతల్‌లో ఉన్న సెయింట్ మార్టిన్ హైస్కూల్ యాజమాన్యం తనకున్న పరిధిలో పౌరులను ఓటు వేసే దిశగా చైతన్యపరిచేందుకు ఓ మంచి పథకం వేసింది. తన పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యత గుర్తెరిగి ఓటు వేస్తే వారి పిల్లల రిపోర్ట్ కార్డ్‌లో సదరు విద్యార్థికి ప్రత్యేక గౌరవం ఇస్తూ బోనస్ స్టార్ కేటాయిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఉత్తమ పౌరులుగా గుర్తిస్తామని కూడా వెల్లడించింది. ఈ బోనస్ స్టార్ ద్వారా ప్రత్యేక గౌరవం పొందడానికి ఆ పిల్లలు తమ అమ్మానాన్నలతో ఓటు వేయించడంతో పాటు తాము ఉత్తమ పౌరుల బిడ్డలమన్న గుర్తింపు కూడా పొందుతారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఓటు వేసినట్లు రుజువు చేసుకోవడానికి ఈ నెల 25న స్వయంగా పాఠశాలకు వచ్చి తమ వేలిపై ఉన్న ఇంకు మార్కును పాఠశాల ఉపాధ్యాయులకు చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే నేతలు అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని, ఇది జరగాలంటే పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు వెయ్యాలన్నది ఈ పాఠశాల గుర్తించిన వాస్తవం.
Saturday, March 28, 2009
ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా...
కొన్నేళ్ళ క్రితం అమెరికాలో మేథ్యూ లిసగే అనే మూడో క్లాసు చదివే విద్యార్థి తనుండే నగరంలోని ఆకలిగొన్న బీదవారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దాంతో అతను "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " అనే కార్యక్రమాన్ని ఆరంభించాడు. అది ఆరంభించిన నాలుగో ఏడు "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " నలభై వేల డాలర్లని సేకరించి అనాథల పొట్టలని నింపగలిగింది.
మరో పిల్లవాడి కథ కూడా ఇలాంటిదే. ఆఫ్రికాలోని రోగగ్రస్థులైన బీదవాళ్ళ కోసం డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ కృషి చేస్తున్నాడని తెలిసిన పదమూడేళ్ళ జాన్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఓ ఉత్తరం రాశాడు. తన దగ్గరున్న డబ్బుతో ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా కొన్నానని, దాన్ని ఆఫ్రికాలోని డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ హాస్పిటల్‌లో పడేయగలరా అని అడిగాడు. ఓ లోకల్ రేడియో స్టేషన్‌కి ఈ సంగతి తెలియడంతో అది ఆ చిన్న పిల్లవాడి గొప్ప మనసు గురించి వార్తగా ప్రసారం చేసింది. అది విన్న ఎంతోమంది తగిన విధంగా స్పందించారు. దాంతో ప్రభుత్వం ఆ పిల్లవాణ్ణి, వేల మంది నుంచి ఉచితంగా వచ్చిన నాలుగు లక్షల డాలర్ల విలువ చేసే నాలుగున్నర టన్నుల మందులతో డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ నడిపే హాస్పిటల్‌కి విమానంలో పంపించింది.
ఆ పిల్లల్లోని నిజాయితీతో కూడుకున్న, బీదలకి సహాయం చేయాలనే తపనని చూసి దేవుడు వాళ్ళకి చేయాల్సిన సహాయాన్ని అనేకమంది మంచివాళ్ళని పరికరాలుగా వాడుకుని చేశాడు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Tuesday, March 17, 2009
కార్ల దొంగ
టర్కీలోని ఓ దొంగకి 16 ఏళ్ళ క్రితం తను చేసిన నాలుగు కారు దొంగతనాలకి పశ్చాత్తాపం కలిగింది. ఆ నాలుగు కార్లలోంచి తను దొంగిలించి అమ్ముకున్న టేప్ రికార్డర్ల ఖరీదు అయిన నాలుగు వందల యూరో డాలర్లని సెంట్రల్ టర్కీలోని కిరిక్కాలె అనే ఊరి పోలీస్ చీఫ్ సలీంకి పంపించాడు. 1992లో తన చేసిన ఆ నాలుగు దొంగతనాల వివరాలని కూడా పంపాడు. ఒకొక్కరికీ వంద యూరో డాలర్లని ఇవ్వమని, తన క్షమాపణలని కూడా తెలియచేయమని కోరాడు. ఆ దొంగ మాత్రం అజ్ఞాతంగానే ఉండిపోయాడు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
Thursday, March 12, 2009
ఓటర్ల కోసం గుంజీళ్ళ దీక్ష
తమిళనాట కోయంబత్తూరు జిల్లా పుదూర్ గ్రామానికి చెందిన వడ్రంగి 23 ఏళ్ళ రామనాథన్‌కు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేదు. తన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనమంతా ఎన్నికల్లో పాల్గొని మంచి నేతలను ఎన్నుకోవాలని మాత్రం గ్రహించాడు. తన కోరిక ఫలించాలని కోరుతూ తన ఊరిలో ఉన్న ఆది వినాయకర్ ఆలయంలో మే 8, 2006వ తేదీ ఉదయం 6 గంటలకు సుముహూర్తం నిర్ణయించుకుని 14 నిమిషాల్లో 1008 గుంజీళ్ళు తీశాడు. ఈ గుంజీళ్ళు సరిగ్గా తీశాడా లేదో గమనించడానికి అక్కడి "యూత్ పవర్ ఫెడరేషన్" ప్రతినిధులు వచ్చి పర్యవేక్షించారు. తన గుంజీళ్ళ దీక్ష పూర్తయిన తర్వాత రామనాథన్ మాట్లాడుతూ మన ప్రజాస్వామిక దేశంలో ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని, రాష్ట్ర భవిష్యత్తును మంచి బాటలో పయనింపజేయాల్సింది ఓటర్లే అయినందున అవినీతి, పక్షపాత వైఖరికి దూరంగా ఉండే నేతలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రాజకీయాల్ని అసహ్యించుకొని ఓట్లేయడం మానకుండా మంచివారికి ఓటు వేయడం ద్వారా స్వలాభం కోసం పాకులాడేవారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. తన కోసం కాకుండా జనం బాగు కోసం గుంజీళ్ళు తీసిన రామనాథన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ... జన జీవితంలో కొత్త కోణం ప్రకాశిస్తుంది.
పసివాడి హృదయం కరిగింది
"పిల్లలూ ఈ రోజు మీకో వీడియో చూపిస్తాం... అది చూచి మనకు తోచిన సాయం చేద్దాం" అని టొరంటోలోని ఒక స్కూలు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశమైన మలావీలోని బాలల దుస్థితిని వీడియో ద్వారా చూపించారు. ఆ స్కూల్లోనే చదువుకుంటున్న తొమ్మిదేళ్ళ భారత సంతతి విద్యార్థి నీల్ అగర్వాల్ పసి హృదయం మలావీ చిన్నారుల కష్టాలు చూచి కరిగిపోయింది. వెంటనే తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న 170 డాలర్ల మొత్తాన్ని (దాదాపు రూ.7,800) యునిసెఫ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. నీల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ భారతీయుడు కాగా, తల్లి ఎలిజబెత్ కెనడాలో పుట్టి పెరిగిన ఇటలీ సంతతి మహిళ. ఇంత పెద్ద మొత్తం (ఆ కుర్రాడి వయసుకు ఇది పెద్ద మొత్తమే...) అలా ఎలా ఇచ్చేశావురా అని అడిగితే... నా వయసు పిల్లలు పేదరికంతో తిండి లేక పాఠశాలలకు కూడా వెళ్ళడం లేదని తెలిసి, ఆ డబ్బు నాకంటే వారికే ఎక్కువ అవసరమనిపించిందని బదులిచ్చాడు ఈ రెండవ బాల కర్ణుడు (ఇలాంటి మరో బాలుడి గురించి ఇంతకు ముందొక కథనం ఇచ్చాను అందుకే రెండవ బాల కర్ణుడు అన్నాను). ఈ ఘటన 2006లో జరిగింది.
Thursday, February 26, 2009
మాకు కరెంట్ వద్దు...
మన పొరుగున ఉన్న భూటాన్ మనకన్నా చిన్న దేశం. మనకన్నా పేద దేశం. కాని భూటాన్ ప్రజల మనసులు మాత్రం చాలా విశాలం. వారికి భూతదయ ఎంత ఎక్కువంటే, నదుల్లోని చేపలని పట్టరు. డబ్భై ఐదు శాతం అడవే అయినా జంతువుల్ని వేటాడి చంపరు. ఆ దేశంలోని ఫోబ్జికా లోయకు తరచూ కొంగలు వలస వస్తూంటాయి. ఆ లోయకి వచ్చే దారిలో ఉన్న ఓ ఊళ్ళోని కరెంటు తీగల మీద వాలి అవి మరణించడం గమనించిన ఆ ఊరి వాసులు విద్యుత్‌కు స్వస్తి చెప్పారు. సౌర శక్తితో తమ ఇళ్ళను వెలిగించుకుంటున్నారు. వారు బాగా సున్నిత మనస్కులు కాబట్టి హింసా ప్రవృత్తి గల రెజ్లింగ్ పోటీలను ప్రసారం చేసే పాశ్చాత్య ఛానెళ్ళకు అడ్డుకట్ట వేశారు. ఫ్యాషన్ టీవీ, టెన్ స్పోర్ట్స్, ఎంటీవీ లాంటి అర్ధనగ్న దృశ్యాలు ప్రసారం చేసే ఛానెళ్ళు కూడా భూటాన్‌లో ప్రసారం కావు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించిన తొలి దేశం కూడా భూటానే. ప్రజలు ఇలాంటి మంచి పనులకు వ్యతిరేకతను తెలియచేయకపోవడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది. సమున్నత సంస్కృతికి మారు పేరని చెప్పుకునే మన భారతీయులంతా భూటాన్‌ను అనుసరించాల్సిన అవసరముంది.
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు
Wednesday, February 18, 2009
వీళ్ళు పే......ద్ద పిల్లలు
శత్రువులు పాలిట తూపాకీ తూటాలాంటివాడు తుఫాన్ కుమార్ అయితే... భారతీయ సైనికుల ధన్వంతరి భారతీ సింగ్. ఈ విద్యార్థులు సాధించిన ఘనతల గురించి చదివాక నేను పెట్టిన శీర్షిక నిజమేనని మీరు కూడా ఒప్పుకుంటారని నా నమ్మకం. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక బృందం) అధిపతి హేమంత్ కర్కారే, అశోక్ కామ్టే తదితరులు ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరాడి అసువులు బాసిన సంగతి తెలిసిందే. వాళ్ళు వేసుకున్న బులెట్ ప్రూఫ్ జాకెట్లు నాసిరకం కావడమన్నది వీరి మరణానికి ఒక కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని బట్టి ఉగ్రవాద నిర్మూలన పట్ల మన పాలనా వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందలాది ప్రాణాలను బలిగొన్న ఆ నాటి దాడి తర్వాత మనం నేర్చుకున్న పాఠాల సంగతేమోగాని ఈ మధ్య మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన ఒక బాలల సైన్స్ సమావేశంలో ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన ఆవిష్కరణలతో ముందుకొచ్చారు.
ఇందులో పాల్గొన్న భువనేశ్వర్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థి తుఫాన్ కుమార్ సమాల్ తన వంతుగా... క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల (సిసిటివి) పైన తుపాకులు అమర్చి కంట్రోల్ రూం నుంచి వాటిని పేల్చడం ద్వారా ఉగ్రవాదులను అంతమొందించే వ్యవస్థను రూపొందించాడు. దీనివల్ల సమయం వృథా కాదు... ప్రాణ నష్టం చాలా చాలా తగ్గుతుంది. పెద్ద పెద్ద హొటళ్ళలో తిరిగే (రివాల్వింగ్) కెమెరాలుంటాయి. వాటి సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని చూస్తాం. మరో అడుగు ముందుకేసి వాటికి తుపాకులు అమర్చడం ద్వారా పని పూర్తి చెయ్యవచ్చట. తుఫాన్ కుమార్ తుఫాను వేగంతో కదిలే మానవరహిత ప్లాస్టిక్ విమానాన్ని కూడా తయరు చేశాడు. దీంతో శత్రు స్థావరాల్ని కచ్చితంగా కనిపెట్టడంతో పాటుగా తుఫానులు వచ్చి వరద బీభత్సం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు సాయం కూడా చెయ్యవచ్చు...
ఉత్తరప్రదేశ్ నుంచి ఇదే సైన్స్ సమావేశంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థిని, బరైలీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన భారతీ సింగ్, నీటిలోని నాచును ఉపయోగించి సైనికులకు చికిత్స చేసే వ్యవస్థను రూపొందించింది. నాచు నుంచి ప్రొటీన్ తీసి యుద్ధ సమయాల్లో గాయపడిన సైనికులకు బాక్టీరియా వల్ల వ్యాధి వ్యాపించకుండా దీంతో చికిత్స చెయ్యవచ్చట. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పటి సైనికులు వ్యాధులు రాకుండా ఈ నాచును పైన పెట్టుకుని కాపాడుకున్నట్లు చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకుని దీనిని తయారు చేసినట్లు భారతీ సింగ్ చెప్పింది. నాచులోని ప్రొటీన్‌ను బయటకు తీసి కొన్ని వైరస్‌లపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. గడచిన డిసెంబర్ నెలలో తాను కనిపెట్టిన ఈ ఆవిష్కరణపై పేటెంట్ కూడా తీసుకుంది.

Wednesday, February 11, 2009
నస్రీన్ నుయ్యి తవ్వింది
అమ్మానాన్నలు ఎప్పుడు చస్తారా... ఓ గొయ్యి తవ్వి పారేద్దాం అనుకునే ఈ రోజుల్లో... నీళ్ళ కోసం తల్లి పడుతున్న కష్టం చూచి ఆవేదన చెందిన నస్రీన్ ఆమె కోసం ఒక నుయ్యి తవ్వింది. తన చెల్లాయిలు తోడుగా నస్రీన్ 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వింది. ఇక నస్రీన్ ఎవరో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఉన్న మహా విద్యాలయం విద్యార్థిని అయిన నస్రీన్ పేద కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి రంజాన్ ఖాన్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మరోవైపు నస్రీన్ పగలు కళాశాలకు వెళుతూ, విద్యార్థులకు ప్రయివేట్లు చెబుతూ తన వంతుగా నాలుగు రాళ్ళు సంపాదించి తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉండేది. ఈ ఇంట్లో దాహార్తి తీర్చుకోవాలంటే నస్రీన్ తల్లి మైళ్ళ దూరం నడిచి మంచి నీళ్ళు తీసుకురావాల్సిందే. కని పెంచిన తల్లి కష్టం చూడలేకపోయిన ఈ ధీశాలి అమ్మ కోసం ఏమైనా చేసి తీరాలని సంకల్పించుకుని ఇంట్లేనే నుయ్యి తవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు అమ్మా నాన్నా ఒప్పుకోరు. చెల్లెళ్ళతో ఈ సంగతి మాట్లాడి అమ్మానాన్నలకు తెలియకుండా అందరూ కలిసి పలుగు పార పట్టుకొని 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వేశారు. పని పూర్తయ్యాక అమ్మానాన్నల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక మహావిద్యాలయ ప్రిన్సిపాల్ ఆర్ కె పాటిల్ గారైతే నస్రీన్‌ను నోరారా పోగిడి కుట్టుమిషన్ బహుమతిగా ఇచ్చారు. ఇంకా డబ్బు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగి రెండేళ్లయినా ఆ వివరాలు నాకు ఇప్పుడు దొరికాయి.
ఇదంతా చూస్తుంటే లక్క ఇంటి నుంచి తన తల్లి, సోదరుల్ని కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో నిద్ర మానుకొని సొరంగం తవ్విన పాండవ మధ్యముడు భీముడు గుర్తుకు రావడం లేదూ...! భీమసేనుణ్ణి మనం చూడలేకపోయాం గానీ ఈ యుగంలో నస్రీన్ మన కళ్ళముందుంది. ఈ నస్రీన్ భారతంలోని భీముని తలపించింది. ఎందుకంటే సందర్భాలు, పరిస్థితులు వేరైనా దృఢ సంకల్పం ఒక్కటేగా...

Saturday, February 07, 2009
హిజ్రాలు కాదు మానవతా వజ్రాలు
హిజ్రాలు లేదా నపుంసకులనగానే ఈ (అ)సభ్య సమాజానికి గుర్తుకొచ్చేది వయ్యారమొలకబొసి, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేస్తూ డబ్బులడుక్కుంటున్న దృశ్యం. హిజ్రాలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విలేఖరిని దత్తత తీసుకున్న ఈ నిజ సంఘటన గురించి తెలుసుకుంటే వారు మంచోళ్ళకంటే మంచోళ్ళన్న అభిప్రాయానికి రాక తప్పదు. మామూలు మనుషుల కొచ్చే కష్టాలనే పట్టించుకోని ప్రభుత్వం మామూలుగానే వీరి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే దేవుడనేవాడు వీరి కోసం విల్లుపురంలో ఒక మనిషిని పుట్టించాడు. అతనే రామ్మూర్తి. ఈ ఊరిలోనే అర్చకుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి (40 ఏళ్ళు) పత్రికా విలేఖరిగా కూడా సమాచార సేవలందిస్తుంటారు. ఈయన వార్తలు సేకరించడంతో ఆగిపోకుండా ఈ హిజ్రాలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు ఇప్పించారు. వారి హక్కుల కోసం పోరాడుతూ వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు.
తమకేమీ కాని రామ్మూర్తి తమ సంక్షేమం కోసం ఇంతగా శ్రమించడం ఆ హిజ్రాల మనసును కరిగించేసింది. వెంటనే రామ్మూర్తిని తమ కుమారునిగా దత్తత తీసుకోవాలని జిల్లా నపుంసకుల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా 2005 డిసెంబర్ 31న శాస్త్రబద్ధంగా దత్తత స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నపుంసకులను శ్రీకృష్ణుని ప్రతిరూపంగా భావించే హిజ్రాలు తనను దత్తత చేసుకోవడం ఎంతో ఆనందంగాను, గర్వంగాను ఉందని రామ్మూర్తి పారవశ్యంతో చెప్పారు. ఈ మానవతా వజ్రాలను ఎన్ని పొగడ్తలతో ప్రశంసిస్తే సరిపోతుంది చెప్పండి.

Monday, January 26, 2009
పెళ్ళా... తమ్ముడా...
చివరికి తమ్ముడే తన ప్రాణమంది లక్నో యువతి 21 సంవత్సరాల దివ్య. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బాద్ షా నగర్‌కు చెందిన సుభాష్ కుమార్తె దివ్యకు పెళ్ళీడు రావడంతో పెద్దలు మంచి సంబంధం కుదిర్చారు. డిసెంబర్ 6, 2008న పెళ్ళి జరగాల్సి ఉంది. సరిగ్గా అదే సమయానికి ఆమె తమ్ముడు అపూర్వ మూత్రపిండాల సమస్యతో అనారోగ్యం పాలయ్యాడు. దాత ఎవరైనా మూత్రపిండం ఇస్తే తప్ప అతను బతకడని అక్కడి "సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్" వైద్యులు తేల్చి చెప్పారు. తోడబుట్టినవాడి పరిస్థితిని అర్థం చేసుకున్న దివ్య తన మూత్రపిండం తమ్ముడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలా చేస్తే పెళ్ళి మానుకుంటామని మగపెళ్ళివారు హెచ్చరించారు. ఆ పెళ్ళి కోడుకుతో "వెళ్ళవయ్యా వెళ్ళు" అని కరాఖండిగా చెప్పి తన తమ్ముడికే అండగా ఉండాలన్న దృఢ నిశ్చయానికి వచ్చింది. నిజంగా ఆమెది "దివ్య"మైన మనసు కదూ...
Friday, January 23, 2009
నాకు పింఛనొద్దు మొర్రో...
అధికారిక దాఖలాల ప్రకారం ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సాలిజంగ గ్రామానికి చెందిన బంధుదాస్ వయసు 100 ఏళ్ళు దాటింది. బంధుదాస్ పేదవాడైనా అందరికీ ఆత్మబంధువులా మెలుగుతూ తన పనులు తానే చేసుకుంటాడు. ఆ మధ్య కొందరు ప్రభుత్వాధికారులు ఈయన దగ్గరికొచ్చి "అన్నట్టు మీకింకా పింఛన్ అందడంలేదని తెలిసిందండీ... ఇప్పించాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారట. దాంతో చిర్రెత్తుకొచ్చిన బంధుదాస్ "పనులు చేసుకోలేనివాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళకు ప్రభుత్వం సాయం చెయ్యాలి గానీ కాళ్ళూ చేతులు ఆడుతున్నవాళ్ళకు కాదురా బాబు. పింఛనిచ్చి నన్ను ముసలోణ్ణి చెయ్యొద్దు. నాకు పింఛనొద్దు మొర్రో..." అని వాళ్ళను వచ్చినదారినే పంపించేశాడు.
బంధుదాస్ దినచర్యను పరిశీలిస్తే... ఉదయమే 5 గంటలకల్లా లేస్తాడు. కొద్దిగా పాలు, మరమరాలు అల్పాహారంగా తీసుకుని తన ఆవులకు గ్రాసం కోసం తన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకెళతాడు. తన కోసం ఓ నాలుగు తమలపాకులు తెచ్చుకుంటాడు. పశువులకు తన చేత్తో స్వయంగా తినిపిస్తాడు. అప్పుడప్పుడూ పొలంపనుల్లో ఓ చెయ్యి వేస్తాడని గ్రామస్తులు చెప్పారు.
గ్రామ కార్యక్రమాల్లో పాల్గొని జానపద గీతాలు ఆలపించే బంధుదాస్‌ను రోగాలేవీ సమీపించడం తాము చూడలేదని, ఇప్పటికీ ఆయన వద్ద కళ్ళజోడు లేదని కోడలు లత చెప్పింది. దాసు గారికి ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు కాగా, భార్య లబానీకి 90 ఏళ్ళు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె పక్షవాతంతో మంచం పట్టింది. తన ఆహారంలో భాగంగా స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు, నెయ్యి తీసుకుంటానని దాస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలందరికీ బంధుదాస్ మార్గదర్శకునిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పొరుగున ఉన్న బలన్సా గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త సంతోష్ సాహు అన్నారు.

Saturday, December 27, 2008
వీడేరా పోలీస్...
నాన్నా అని పిలిపించుకోవడానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన పనిలేదు. మరి అక్రమ సంబంధం ద్వారా పిల్లల్ని కంటేనో... అంటారా ? అలాంటి వాళ్లకు తల్లిదండ్రులుగా చెప్పుకునే అర్హత అంతకన్నా ఉండదు. ఆత్మీయతను అందుకోవడానికీ, అనురాగాన్ని పంచుకోవడానికీ ఉన్న మరో మార్గం మానవత్వం. అదే ఒక పోలీస్‌ను నాన్నా అనిపించింది. ఇది వరంగల్ జిల్లాలోని మరిపెడలో చాలాకాలం కిందట జరిగిన సంఘటనే అయినా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం...
ఈ జిల్లాలోని మరిపెడ గ్రామానికి 1997 ప్రాంతంలో 27 ఏళ్ల వయసుగల మతి స్థిమితం లేని ఒక యువతి ఎక్కడి నుంచో వచ్చింది. ఆమెకు తెలుగు తెలియదు. ఊళ్లో వాళ్లు మాత్రం ఆమెను సత్యవతి అని పిలిచేవారు. మనం కూడా అలాగే పిలుద్దాం. సత్యవతి ఆ ఊళ్లో చెట్లు చేమల వెంట, బస్టాండ్ పరిసరాల్లోనూ తిరుగుతూ అడుక్కుంటూ ఉండేది. వయసులో ఉన్న యువతి పట్ల ఓ కామాంధుడి ప్రవర్తన కారణంగా పాపం ఆమె గర్భం దాల్చింది. తనకేమయిందో కూడా తెలియని స్థితిలో సత్యవతి అలాగే ఊరంతా తిరుగుతూ ఉండేది. రోజులు గడుస్తుండగా ఆమె ఒక రోజున ప్రసవవేదన పడుతుంటే అక్కడివారు ఆటో ఎక్కించి ఆసుపత్రికి పంపిస్తున్న తరుణంలో ఆటోలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జరిగిందేంటో కూడా తెలియక ఆ పిచ్చితల్లి బిడ్డను కన్న వెంటనే రోడ్డెక్కి అడుక్కోవడానికి వెళ్లిపోయింది. బస్టాండ్‌లో ఆ పసిగుడ్డు అలాగే పడి ఉంది.
మరిపెడలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామరాజు సాంబయ్య ఈ విషయం తెలుసుకుని ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బిడ్డకు వేద శాస్త్రోక్తంగా సాయికిరణ్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కడి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాయికిరణ్‌ను చేర్చగా ఈ చిచ్చరపిడుగు అతని ఆశలు నెరవేర్చుతూ నూటికి నూరు మార్కులు సంపాదించి చల్ మోహనరంగా అంటున్నాడు. ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన ఈ దేవుడిచ్చిన బిడ్డకు రామరాజు ఘనంగా పుట్టినరోజు జరుపుతుంటారు. అంతేకాదు, ఈ చిన్నారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అక్కడి తపాలా కార్యాలయంలో జమ చేస్తూ వస్తున్నారు. నన్నడిగితే... వీడేరా పోలీస్ అంటాను.

Friday, December 26, 2008
సునామీ... షాజన్ ఉన్నాడు సుమీ!
జీవితాల్ని నాశనం చెయ్యడం నీకు తెలిస్తే... దాన్ని కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. సునామీ... నేనున్నాను సుమీ అంటూ నాలుగేళ్ల కిందట ఇదే రోజున (డిసెంబర్ 26, 2004) చోటుచేసుకున్న జలప్రళయం బారిన పడకుండా నాలుగు నిండు జీవితాల్ని కాపాడాడు తమిళనాట కన్యాకుమారి జిల్లాలో కడియపట్టణానికి చెందిన షాజన్. ఈ ఘటన జరిగినప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న షాజన్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించగా రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి ఇతనికి 'జీవన్‌రక్ష' పురస్కారమిచ్చి గౌరవించారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ఇక్కడి సెయింట్ పీటర్ మాథ్యమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షాజన్ డిసెంబర్ 26, 2004వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటికి దగ్గర్లో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళాడు. ఎగసిపడుతున్న అలల్ని చూచి కేరింతలు కొడుతున్నాడు. అంతలో ఓ భారీ కెరటం షాజన్‌ను కొట్టుకుంటూ తీసుకుపోగా అతని ఒక ఇంటి పై కప్పుమీదకెళ్ళి పడ్డాడు. అది శేఖరాజన్ అనే వ్యక్తి ఇల్లు. ఆ ఇంట్లో కూడా పూర్తిగా నీరు చేరింది. పై కప్పు మీద ఉన్న షాజన్‌కు ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. ఆ ఇంటివారిని అప్రమత్తం చేసిన షాజన్‌ను చూచి కాపాడమంటూ తన మూడు నెలల పసికందును కింద ఉన్న శేఖరాజన్ అతనికి అందించాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా పొదివి పట్టుకున్న షాజన్ పక్కింటి కప్పుపై సురక్షితంగా ఉన్న వృద్ధుని చేతిలో పెట్టాడు.
అప్పుడే ఛార్లెస్ అనే వ్యక్తి ఇంట్లోంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించగా షాజన్ ఆ ఇంటి పైకప్పు ఎక్కి పైనున్న పెంకులు తొలగించి చూశాడు. అందులో తన మిత్రుడు విన్‌బ్రాండో, అతని చెల్లెలు నీటిలో చిక్కుకుని కనిపించారు. షాజన్ వారికి పైనుంచి తన చెయ్యి అందించి సినిమాల్లో చూపించే దృశ్యాల్లోలా వారిని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. పట్టు జారిపోతున్నప్పటికీ పట్టు విడువక వారిని ఉడుం పట్టుతో విజయవంతంగా పైకి లాగి కాపాడాడు. అదే సమయంలో విద్యుత్ స్తంబానికి వేలాడుతూ కనిపించిన ఆంటోని శ్యామల అనే మహిళను కూడా షాజన్ రక్షించాడు. కిందకు దిగడానికి వీల్లేనంతగా సముద్రపు నీరు ఉండగా నేర్పరితనంతో ఇళ్ల పైకప్పులెక్కుతూ వారికి ప్రాణదానం చేశాడు ఈ జాలరి బిడ్డ. మరొకరైతే తాను బయటపడినందుకు బతుకు జీవుడా అంటూ తలదాచుకునేవారే తప్ప షాజన్‌లాగా స్పందించేవారా.

సునామీ నువ్వెంత?
సునామీ బాధితులైన ఆ చిన్నారులంతా చెన్నైలోని అన్నైసత్య అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలారు. వారు కుమిలిపోలేదు సరికదా బాధల్ని నమిలి మింగేసి, తమలాంటి మరిందరిని ఆదుకునేందుకు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కష్టాల అంధకారంలో కాంతి పుంజాల్లా కదులుతున్నారు. వీళ్లు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. సునామీ సంభవించి ఏడాది పూర్తయిన సందర్భంగా 2005 డిసెంబర్ నెలలో 66 మంది చిన్నారులు 20 నిమిషాల వ్యవధిలో 72 అడుగుల పొడవైన భారీ చిత్రకళాఖండాన్ని రూపొందించారు. దీంతో అప్పటి వరకూ ఉన్న 43 అడుగుల పొడవైన కళాఖండం రికార్డు చెరిగిపోయింది. మరో సందర్భంలో వీరంతా కలసి 24 గంటల సమయంలో 35 ఎకరాల స్థలంలో 1.74 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కారు. తమ సర్వస్వాన్నీ దూరం చేసిన సునామీని వెక్కిరిస్తూ విజయాలు సాధించుకుంటూ పోతున్న ఈ చిట్టి మనసుల ముందు ఓ సునామీ... నువ్వెంత?
అన్నట్టు మరో విషయం సు(నా)మీ... మా ప్రభుత్వాలది కూడా నీలా కరడుగట్టిన హృదయమే. అయితే, ప్రజలది మాత్రం మంచి మనసే. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో చదువుకుంటున్న విద్యార్థినులు కొందరు భారత సునామీ బాధితులకు చేయూతనిచ్చేందుకు వెయ్యి డాలర్ల నిధిని చెక్కు రూపంలో భారత ప్రధానమంత్రికి అందించారు. భారత్‌లో సునామీ వస్తే పాకిస్థాన్ జనం సంతోషిస్తారనుకున్నావు కదూ. వెర్రి సునామీ... జనాన్ని విడదీద్దామనుకున్నావు. నీ పాచికలు పారవులే.

Saturday, December 13, 2008
రక్త సంబంధం ఎన్టీఆర్, సావిత్రి...
ఇది రక్తసంబంధం సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి గురించి కాదుగానీ... అంతకంటే గొప్ప నిజజీవిత పాత్రల గురించి. కాకపోతే ఈ నిజ జీవితగాథలో ఇద్దరికీ పెళ్లి కాలేదు, వీళ్లు డబ్బున్నోళ్లు కాదు. అదే తేడా. ఇక సిద్ధయ్య వయసు 50 ఏళ్ల పైమాటే... అతని చెల్లెలి వయసు బహుశా 40 పైన ఉండొచ్చు. అయినా అతనికి ఆమె "చిట్టి" చెల్లెలే. ఎందుకంటే ఆమెకు పాపం మూర్ఛరోగమట. తాను పెళ్లి చేసుకుంటే తన భార్య, పిల్లల మధ్య ఆమెను పట్టించుకోగలనో లేదో అన్న అనుమానంతో సిద్ధయ్య పెళ్లే చేసుకోలేదు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన సిద్ధయ్య తల్లిదండ్రులు వీరి చిన్న వయసులోనే గతించారు. అప్పట్నుంచీ చెల్లెలు లచ్చవ్వకు అన్నీ సిద్ధయ్యే. తన జీవితాన్ని చెల్లెలి సేవకు అంకితం చేసేశాడు. ఆస్తి పాస్తులేమీ లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అడవికెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఏ రోజుకారోజు బియ్యం కొనుక్కుని చెల్లెలికి వంట చేసిపెట్టి తానూ తింటాడు. ఊరిలో ఎవరి ఇల్లయినా ఖాళీగా ఉంటే వీరు అందులో నివసిస్తుంటారు. వయసు మీదపడిన కొద్దీ శరీరం సహకరించడం లేదని బాధపడుతుంటాడు సిద్ధయ్య. అనుబంధాలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో చెల్లెలి సుఖమే తన జీవితంగా భావించే సిద్ధయ్య లాంటి మనుషులు ఇంకా మన మధ్య ఉన్నారనేది నిజంగా నిజం.
సరోజ చేతిలో ఎర్రజెండా
గడచిన పాతికేళ్లుగా వేలూర్‌లోని వళ్లలార్ బస్టాండ్ గుండా వెళ్లే చెన్నై - బెంగళూర్ జాతీయ రహదారి ప్రాంతంలో చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఇక్కడేదో అదనపు ట్రాఫిక్ పోలీస్ పికెట్ గానీ, ప్రత్యేకంగా సిగ్నలింగ్ వ్యవస్థ గానీ ఉందనుకోకండి. అందుకు కారణం దాదాపు 70 ఏళ్ల పిల్ల (ఆమె చురుకుదనం చూచి నాకైతే ఇలాగే అనాలనిపిస్తోంది) సరోజ చేతిలో ఉండే ఎర్ర జెండా. అందరూ మామీ అని పిలిచే సరోజ ఆ రహదారిపై నిలబడి ఎర్రజెండా చూపిస్తే సైకిల్ నుంచి పంజాబ్ లారీ వరకూ వాహనాలన్నీ ఆగిపోవాల్సిందే. అప్పుడామె తన దగ్గర గుంపుగా నిలుచున్న పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటిస్తుంది. అవతలకెళ్లి ఎర్రజెండా దించాకే ఆ వాహనాలన్నీ కదుల్తాయి. ఇక ఈమె చరిత్ర తెలుసుకుందాం.
సరోజ ఈ ప్రాంతంలోని పర్వతమలై అనే కొండ దిగువన పోరంబోకు స్థలంలో పాత గుడిసెలో నివాసముంటుంది. ఒకప్పుడు స్థానిక గణపతి ఆలయంలో పూజారిగా పనిచేసే ఈమె భర్త వెంకటరామ అయ్యర్ కామెర్ల వ్యాధితో 20 ఏళ్ల కిందటే మరణించారు. అప్పట్నుంచీ పేదరికంతో బాధపడుతున్న సరోజకు 1982లో వంటమనిషిగా ఉద్యోగమిచ్చారు. 1997లో పదవీ విరమణ వయసు రావడంతో ఆ పని కాస్తా పోయింది. కూతుళ్లిద్దరున్నా వారికి పెళ్లిళ్లు కావడంతో వారికి బరువు కాకూడదని ఈమె గుడిసెలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమాజానికి తనకు తోచిన, తాను చేయగల్గిన ఏదో ఒక సహాయం చెయ్యాలన్న తపనతో ఎర్రజెండా చేతబూని పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటించి సహకరిస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ సేవ సాయంత్రం 5 గంటలకు పాఠశాల ముగియడంతో పూర్తవుతుంది. సరోజ సామాజిక స్పృహకు మెచ్చిన పాఠశాల యాజమాన్యం నెలకు రూ.200, ప్రభుత్వం ఇచ్చే నెలవారీ వృద్ధుల పింఛన్ మరో 200 రూపాయలు, పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ఇచ్చేవి ఈమెకు జీవనాధారం. ముదిమిలోనూ మానవసేవతో జీవితంలో కొత్త కోణాన్ని ఆస్వాదిస్తున్న సరోజ మనందరికీ స్ఫూర్తిదాయకమే కదూ...

Friday, November 21, 2008
చీపురు పట్టాడు ఉద్యోగం కొట్టాడు
అక్కడ బోలెడు చెత్త కనిపిస్తోంది. ఉన్నతాధికారులు, పనివాళ్లు అటూ ఇటూ తిరుగుతున్నారు గానీ ఆ చెత్తను తొలగించాలన్న ఇంగితం ఒక్కరికీ కలగలేదు. అదే సమయానికి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లతో ఆ ప్రాంగళం కిటకిటలాడుతోంది. ఇంటర్వ్యూకోసం సూటు బూటు వేసుకుని వచ్చిన 26 ఏళ్ల వికలాంగుడు గోపికన్నన్ పరిస్థితిని గమనించాడు. ఇక ఏమీ ఆలోచించలేదు. వెంటనే అక్కడున్న చీపురు కట్ట తీసుకున్న ఊడ్చడం మొదలు పెట్టి పని పూర్తి చేశాడు. ఇతను ఊడ్చుతున్నప్పుడు అక్కడే ఉన్న పత్రికా ఫోటోగ్రాఫర్లు విలేఖరులు, గోపీకన్నన్ చొరవను ప్రశంసిస్తూ మర్నాడు పత్రికల్లో ప్రశంసిస్తూ వార్తలు వేసారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దృష్టికి వెళ్లడంతో వెంటనే మదురై మార్కెటింగ్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
అసలు విషయం మీకు ఇంకా చెప్పలేదుగా... రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కార్యాలయానికి వేదికైన చెన్నైలోని సచివాలయంలో 2003 జులై నెలలో ఈ సంఘటన జరిగింది. గోపికన్నన్ వికలాంగుడే అయినా విద్యార్హతలతోబాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన మొనగాడు. మదురైలోని సుబ్రమణ్యపుర టీచర్స్ కాలనీ ఇతని నివాసం.

పద్యంతో మద్యం మాయం
అది పశ్చిమగోదావరి జిల్లా కొత్త తలారివాని పాలెం గ్రామం. మద్యం చుక్క పడందే నిద్రపట్టని గంగరాజు పూటుగా తాగి రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చాడు. ఐదో తరగతి చదువుతున్న ఇతని కొడుకు పడాల మహలక్ష్మినాయుడు ఆ రోజే తన పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అద్భుతంగా పద్యాలు పాడి ఒక స్టీల్ కంచం బహుమతిగా అందుకున్నాడు. తండ్రికి ఈ బహుమతి చూపించాలన్న ఆరాటంలో తను సాధించిన బహుమతిని అతనికి చూపించాడు ఆ చిన్నారి. మందు పుచ్చుకున్న మత్తులో ఉన్న గంగరాజు దాన్ని విసిరికొట్టాడు. పాపం ఆ కొడుకు హృదయం గాయపడి నిద్రపోయాడు. కాసేపటికి మత్తుదిగిన గంగరాజు ఆ కంచం ఎప్పుడు కొన్నావని భార్యను అడిగాడు. ఆవిడ జరిగిన సంగతంతా చెప్పింది. తన ప్రవర్తనకు బాధపడిన గంగరాజు వెంటనే కొడుకును నిద్రలేపి పద్యాలు పాడమన్నాడు. తండ్రి అలా అడగటమే మహాభాగ్యంగా తలచిన ఆ కొడుకు వెంటనే రెండు పద్యాలు పాడి వాటి అర్థాలు వివరించాడు. గంగరాజు హృదయం గంగలా ఉప్పొంగింది. స్టీల్ కంచంకంటే పెద్ద బహుమతే ఇస్తాను ఏం కావాలో కోరుకోమని కొడుకుతో అన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోని ఆ కొడుకు ఇక ఏనాడు తాగరాదని తండ్రిని కోరాడు. ఊహ తెలిసినప్పటి నుంచి మద్యంతోనే పెరిగిన గంగరాజు కొడుక్కి మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు.
ఇక దీని మూలానికొద్దాం. మహాలక్ష్మి నాయుడు చదువుతున్న పాఠశాలలోని అతని గురువు పీలా బాబ్జీ ఈ బాలుడికి పద్య పఠనం నేర్పారు. అనకాపల్లిలో జరిగిన వివి రమణ వర్థంతి సభ సందర్భంగా బాబ్జీ తన గురువైన డాక్టర్ మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో మిగతా పిల్లలతోబాడు నాయుడుచేత కూడా పద్యాలు పాడించారు. రసరమ్యంగా ఉన్న నాయుడి ఆలాపనకు ముగ్ధులై ఈ కంచం బహుమతిగా ఇచ్చారు. ఆ పద్యమే ఆ తండ్రిచేత మద్యం మాన్పించింది. గంగరాజు భార్య సన్యాసమ్మ ఎన్నోమార్లు భర్తచేత తాగుడు మాన్పించాలని ప్రయత్నించింది. తాగనని గంగరాజు మాట ఇచ్చి మళ్లీ అదే బాట పట్టేవాడు. కానీ కొడుకు పద్యం వారి జీవితానికి కొత్త కోణాన్ని చూపించింది.

Friday, October 10, 2008
దానవీరశూర బాల కర్ణ
నాన్నా, ఈ కుర్రాడెవరు ? అని వార్తాపత్రిక చదువుతున్న తన తండ్రిని అందులో ఉన్న ఫొటో గురించి అడిగాడు ఐదేళ్ల సంజీవ్ కుమార్.
"అతనికి గుండె జబ్బు బాబూ. సాయం చెయ్యమని అడుగుతున్నారు. ఆపరేషన్ చెయ్యకపోతే చచ్చిపోతాట్ట" అని బదులిచ్చాడు తండ్రి వేణుగోపాల్.
"ఆ సాయం మనం చెయ్యలేమా నాన్నా ?" అడిగాడు సంజీవ్.
"అంత డబ్బు మన దగ్గర లేదుగా..." బదులిచ్చాడు నాన్న.
"సరేగానీ, నాకు ఈ దీపావళికి ఎన్ని రూపాయల బాణసంచా కొనిస్తావ్?" చెప్పు అనడిగాడు ఈ చిన్నారి.
తండ్రికి ఈ ప్రశ్న ఎందుకో అర్థం కాకపోయినా... "ఓ 2,500 రూపాయలవి కొంటా" అని చెప్పాడు నాన్న.
"అయితే, ఆ డబ్బు ఆ అబ్బాయికిచ్చి సాయం చేద్దాం." అని సంజీవ్ చెప్పగానే ఒక్కసారి ఆ కన్న తండ్రికి ఒళ్లు పులకరించి గగుర్పొడిచింది. చిన్న పిల్లాడికి వచ్చిన ఆలోచన తనకు రాకపోవడం పట్ల సిగ్గుపడ్డాడు కూడా.
ఈ సంఘటన 2003లో జరిగింది. ఆ రోజు మొదలుకొని చిన్నారి సంజీవ్ తన తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో ఓ 50 మందికి పైగా ఆపన్నులను ఆదుకున్నాడు. ఈ సాయాన్ని అతను పోస్ట్ ద్వారా పంపిస్తాడు. సాయమందుకున్నవారు కృతజ్ఞతతో రాసే ఉత్తరాల్ని చూచి పరమానందం పొందుతుంటాడు ఈ చెన్నై చిన్నారి.
హాకీ వీరుడుకూడా అయిన ఈ బాలకర్ణుడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా తమిళనాడు తరఫున పలు అంతర్ రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నాడు. మంచి హాకీ క్రీడాకారునిగా ఎదిగి ఆ డబ్బుతో తన సేవలను కొనసాగిస్తాట్ట. ఈ బుల్లి కర్ణుడి ఆశయం ఎన్నో జీవితాలకు కోత్త కోణాల్ని చూపించాలని ఆశిద్దాం.

Sunday, September 21, 2008
కుక్కపిల్ల ఉచితం
ఎవరైనా వికలాంగులను పెళ్లి చేసుకున్న విషయం ఆమె చెవినబడితే చాలు. వెంటనే వివరాలు తెలుసుకుని వీవీఐపీల ద్వారా వారికి కావలసిన సామగ్రి అందచేయడం తమిళనాడులోని నామక్కల్ పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న మలర్ విళి అలవాటు. ఆవిడ అంతటితో ఆగిపోదు. అవయువాలన్నీ సక్రమంగా ఉన్న మనుషులకే నేటి సమాజంలో ఒంటరి పోరాటం తప్పడంలేదు. అందుకే ఆపత్సమయంలో అండగా ఉండేందుకు వికలాంగులకు ఒక కుక్కపిల్లను కూడా కొనిస్తారీమె. తాను కూడా వికలాంగురాలు కావడంతో వికలాంగుల బాధలు ఎలా ఉంటాయో మలర్ విళికి బాగా తెలుసు. వికలాంగులకు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈమె కృషి చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌తో చర్చలు జరుపుతారు.
తన తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఒకరైన మలర్ విళి చరిత్రలో ఎం.ఎ పట్టా అందుకున్నారు. గృహిణిగా, ఉద్యోగినిగా, సామాజిక సేవకురాలిగా ఎన్నో బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈమె గురించి తెలిసేనాటికి ఈవిడ నామక్కల్‌లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిగా ఎక్కడికి బదిలీ అయితే ఆ ప్రాంతంలో తన సేవలు కొనసాగిస్తుంటారు.

Subscribe to:
Posts (Atom)