కొన్నేళ్ళ కిందట న్యూయార్క్‌లో జరిగిన ఒక రీజియనల్ సేల్స్ కన్వెన్షన్‌కి షికాగో నగరం నుంచి కొందరు సేల్స్‌మెన్ హాజరయ్యారు. అదయ్యాక తిరిగి షికాగోకి వెళ్ళడానికి వారంతా వేన్‌లో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. ట్రాఫిక్ రద్దీ వల్ల వారు ఎయిర్‌పోర్ట్‌కి ఆలస్యంగా చేరుకున్నారు. ఫైనల్ బోర్డింగ్ కాల్ ప్రకటన కూడా వారు విని హడావిడిగా ఒక చేత్తో ఎయిర్ బ్యాగ్, మరొక చేత్తో టికెట్ పట్టుకుని లోనికి పరుగులు తీశారు. ఆ కంగారులో అక్కడున్న ఏపిల్స్ స్టాండ్‌కి వారిలో ఒకరి కాలు తగిలి ఆ పళ్ళన్నీ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి. సెల్స్‌మెన్ అంతా వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా కౌంటర్ వైపునకు పరిగెత్తారు. ఒక్కరు తప్ప.
అతను ఆగి తన మిత్రుల్లో ఒకరితో గట్టిగా చెప్పాడు. "ఫ్రాన్సిస్. షికాగో చేరగానే నువ్వు మా ఆవిడకు ఫోన్ చేసి నేను తర్వాతి ఫ్లయిట్‌లో వస్తున్నానని చెప్పు"
ఆ ఏపిల్ స్టాండ్ మేనేజ్ చేసే 16 ఏళ్ళ పిల్ల సన్నగా ఏడుస్తూ నేలపై పడిన పళ్ళు ఏరుకుంటోంది.
విమానంలో మిత్రులతో పాటు వెళ్ళకుండా ఆగిన ఆ వ్యక్తి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, నేలపై చెల్లాచెదురుగా పడిన ఆఖరి ఏపిల్ కూడా ఏరి స్టాండ్‌లో ఉంచి చెప్పాడు. "ఏడవక. అన్నీ ఏరాను. దెబ్బ తిన్నవి వేరే ఉంచాను."
ఏడుస్తున్న ఆమె చేతిలో నలభై డాలర్ల నోట్లని ఉంచి చెప్పాడతను. "తీసుకో. ఇది నీకు జరిగిన నష్టానికి సరిపడే పరిహారం. నువ్వు దీని యజమానికి జవాబుదారీ అని నాకు తెలుసు."
ఆమె అతన్ని తడిమి చూస్తూ "మిస్టర్ మీరు జీససా?" అని అడిగింది.
ఆమె అతన్ని భావించినట్లుగా, మనల్ని ఎవరైనా దేవుడు అనుకునేలా, జీవితంలో ఒక్కసారైనా అలా నిస్వార్ధంగా ప్రవర్తించి ఉంటామా?
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.
Friday, August 14, 2009
Wednesday, August 12, 2009
అంధ(ద)మైన దత్తత
సంతానం లేనివారెవరైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఏం చేస్తారు? మొదట తమ మతం, తర్వాత తమ కులం, ఆ తర్వాత తమ బంధువులు లేదా స్నేహితుల కుటుంబాల్లోంచి ఎవర్నైనా దత్తత తీసుకోవాలని చూస్తారు. ఏమీ కాకుంటే అనాథ శరణాలయాలకే చివరిగా వెళ్ళేది. దత్తతగా తీసుకోదలచిన బిడ్డ ఆరోగ్యం సంగతి మరీ ముఖ్యంగా చూసుకుంటారు. ఇక అంగవైకల్యం ఉన్న పిల్లలంటే దత్తత మాట దేవుడెరుగంటూ అలాంటివాళ్ళు వద్దని ఆమడ దూరం పరుగు తీస్తారు. కానీ అమెరికాకు చెందిన అంధుడు జాన్‌కర్ల్ ఫీజ్, మేరీ దంపతులు మాత్రం దేశదేశాల్లో వెతికి వెతికి చివరికి మన దేశంలో అంధ బాలుడైన నాలుగేళ్ళ జ్యోతిని ఈ ఏడాది జూన్‌లో దత్తత తీసుకున్నారు. ఒరిస్సాలోని ప్రముఖ పట్టణం కటక్‌లో ఉన్న "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఈ కారుణ్యపూరిత సంఘటన చోటుచేసుకుంది. అంగవికలురైనవారు మరెవరినైనా దత్తత తీసుకుంటే ఆ బిడ్డ తమకు ఆసరాగా ఉండాలని భావిస్తారు. కానీ, అంధుడైన జాన్‌కర్ల్ తనలాంటి మరొక అంధుడిని దత్తత చేసుకోవడం అందర్నీ విస్మయపరిచింది. ఇందుకు కారణమేంటని అతన్ని అడిగితే.... అంధుడిగా పుట్టి తాను అనుభవిస్తున్న బాధలు మరొకరికి కలుగకుండా చూడాలనే భావనతో అంధ బాలుణ్ణి పెంచుకోదలచినట్లు చెప్పాడు. స్వశక్తితో కంప్యూటర్ సంస్థ యజమానిగా ఎదిగిన జాన్‌కర్ల్ భార్య మేరీ అమెరికాలోని ఒక అంధ విద్యార్థుల పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. ఇక జ్యోతి ఎవరంటే, కటక్‌లోని జగత్‌పూర్‌లో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో పుట్టాడు. పుట్టుకతోనే ఈ బాలుడు అంధుడు కావడంతో అతని తల్లిదండ్రులు ఇతన్ని రోడ్డుపైనే విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఈ అబ్బాయి "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చేరాడు.
Tuesday, July 21, 2009
దైవకార్యం కోసం పడవ మాయం
18వ శతాబ్దంలో సెయింట్ కొలంబియాకు 12 మంది మత ప్రచారకులను ఐరిష్ క్రైస్తవ మిషనరీ అప్పగించి అందరినీ ఉత్తర స్కాట్లాండ్‌కు పంపింది. అయితే, ఉత్తర స్కాట్లాండ్‌లోని పిక్ట్స్ అనే తెగకు చెందినవారు ఈ క్రైస్తవ మత ప్రచారకుల పాలిట యమకింకరుల్లా మారారు. ఈ సంగతి తెలిసీ ఇక్కడకు వచ్చిన కొలంబియా, ఆ మత ప్రచారకులు పడవ దిగిన వెంటనే ఆ పడవను తగలబెట్టేశారు. రాబోయే ప్రమాదాలకు భయపడి ఎప్పుడైనా తాము ఇదే మార్గంలో పడవ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవచ్చనే ఆలోచన రాకుండా, వచ్చినా ఆ అవకాశం లేకుండా కేవలం క్రైస్తవ మత ప్రచారమనే దైవకార్యం కోసం కట్టుబడి వారు తమ పడవను తామే తగులబెట్టుకున్నారు. తర్వాత స్కాట్లాండ్‌లో క్రైస్తవ మతం పాతుకుపోవడంలో వీరంతా అత్యంత కీలకపాత్ర పోషించారు.
మనం నమ్మిన దైవం కోసం దైవ కార్యం చెయ్యడానికి ప్రాణాలివ్వడానికి సిద్ధపడితే అన్నీ అనుకూలిస్తాయని ఈ ఘటన నిరూపించింది.
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
మనం నమ్మిన దైవం కోసం దైవ కార్యం చెయ్యడానికి ప్రాణాలివ్వడానికి సిద్ధపడితే అన్నీ అనుకూలిస్తాయని ఈ ఘటన నిరూపించింది.
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
Monday, July 20, 2009
ప్రాణం పోతుందనుకుని రక్తమిచ్చాడు....
కెనడాలోని ఒంటరియో ప్రావిన్స్‌లో ఉన్న లిజ్ అనే టీనేజర్ ఒక అరుదైన, ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతోంది. ఆమె రోగానికి మందులేదు. ఆ రోగం వచ్చి తగ్గిన ఎవరి రక్తమైనా ఆమెకి ఎక్కిస్తే, అందులోని యాంటీబాడీస్ పనిచేసి ఆమె రోగం తగ్గవచ్చని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి కంప్యూటర్‌లోని రికార్డ్‌లను పరిశీలిస్తే కొద్ది కాలం కిందట మైఖేల్ అనే ఆరేళ్ళ బాలుడికి ఇదే రోగం వచ్చి తగ్గినట్లు వైద్యులకు తెలిసింది. వారు వెంటనే మైఖేల్ అమ్మానాన్నలతో మాట్లాడారు. ఒక ప్రాణం కాపాడటం కోసం రక్త మార్పిడి చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆరేళ్ళ చిన్నారి మైఖేల్‌ని ఒక రోజున ఆసుపత్రికి తీసుకువచ్చారు. రక్త మార్పిడి ఎలా జరుగుతుందో మైఖేల్‌కు వివరించిన వైద్యులు లిజ్ కోసం రక్తమివ్వడానికి అంగీకారమేనా అని అతన్ని అడిగారు. లిజ్ బతకడానికి రక్తం ఇస్తానని చిన్నారి మైఖేల్ చెప్పాడు.
రక్త మార్పిడి జరుగుతోంది. తన ఒంట్లోని రక్తం లిజ్ ఒంట్లోకి ఎక్కడం మైఖేల్ చూశాడు. కాసేపయ్యాక మైఖేల్ ముఖం పాలిపోయింది. ఏడుపు మొదలు పెట్టాడు. నొప్పిగా ఉందా అని ఒక వైద్యుడు అడిగినప్పుడు ఏమీ లేదని జవాబిచ్చాడు.
""నేను ఇక ఎంతసేపట్లో చనిపోతాను?'' అని మైఖేల్ అడిగాడు.
చిన్నపిల్లవాడైన మైఖేల్ తనకు వైద్యులు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. తన ఒంట్లోని రక్తం మొత్తం లిజ్‌కు ఎక్కిస్తారని, దాంతో తాను చచ్చిపోతానన్న అభిప్రాయంతో మైఖేల్ ఉన్నాడు.
""నువ్వు చనిపోవు. రక్తం అంతా తీసుకోం. కొంచమే తీసుకుంటాం'' అని మైఖేల్‌కు చెప్పాడు వైద్యుడు.
అయితే, తన రక్తం మొత్తం తీసేసి లిజ్‌కు ఎక్కిస్తారని, అందువల్ల లిజ్ బతుకుతుందని, అప్పుడు తాను మరణిస్తానని అనుకుని కూడా మైఖేల్ రక్తమివ్వడానికి ముందుకు రావడం ఆసుపత్రిలో అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. రక్తమార్పిడి జరిగాక మైఖేల్ ఇంటికి వెళుతుంటే అందరూ అతన్ని ఆరాధన భావంతో మెచ్చుకుని వీడ్కోలిచ్చారు.

Saturday, June 20, 2009
గవురుమెంటు డాట్రారు
గవురుమెంటు డాట్రారు అని మన పల్లెవాసులు అమాయకంగా పిలుచుకునే ఒక గవర్నమెంట్ డాక్టర్ గారికి కర్తవ్యం పట్ల ఉన్న నిబద్ధత ఎంత విలువైన ఫలితాన్ని ఇచ్చిందో తెలియజెప్పే ఘటన ఇది. జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీ రామారావు, కర్తవ్యం సినిమాలో విజయశాంతి చట్టానికి, న్యాయానికి ఎంత విలువనిచ్చారో తన వద్దకు వచ్చే రోగుల ప్రాణాలకు అంతకంటే ఎక్కువ విలువనిచ్చి కర్తవ్య పాలన చేశారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్ జ్యోతిర్మయి దత్తా. వృత్తిపట్ల దత్తాగారికి ఉన్న అంకితభావం చూస్తే మన తెలుగు సినిమాలు డాక్టర్ ఆనంద్, డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో రోగుల పట్ల ఆదరణ కనబరచిన ఎన్టీ రామారావు, అక్కినేని తప్పక గుర్తుకు వస్తారు. కాకుంటే దత్తా జీవితంలో డ్యూయెట్లుండవు అంతే...
గవురుమెంటు డాట్రారు అనగానే తమ వద్దకు వచ్చే రోగులకు రంగునీళ్ళు, నాలుగు తెల్ల మాత్రలు ఇచ్చే రకం అనే అభిప్రాయం జనంలో ఉంది. డాక్టర్ జ్యోతిర్మయి దత్తా అలాకాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్శిటీ బిఎ విద్యార్థి అయిన దుర్గాపూర్ నివాసి సంజొయ్ పుట్టుకతోనే కంటిచూపునకు దూరమై తాను గుడ్డివాడినని ధృవపత్రం తీసుకోవడం కోసం నేషనల్ మెడికల్ కాలేజి డాక్టర్ అయిన జ్యోతిర్మయి దత్తా వద్దకు వచ్చాడు. కొందరు డాక్టర్లు ఎంతో కొంత లంచం ఆ చేత్తో పుచ్చుకుని ఈ చేత్తో ధృవపత్రం ఇచ్చేస్తారు. దత్తా అలా చెయ్యకుండా 22 ఏళ్ళ సంజొయ్‌ని పరీక్ష చేశారు. సంజొయ్‌కు పుట్టుక నుంచే కంట్లో శుక్లాలున్నాయి. కంటిపై ఏదైనా బలమైన కాంతిపుంజం పడినప్పుడు కొంత అనుభూతి కలుగుతుంది. ఇతను "స్టిములస్ డిప్రైవేషన్ అమోలైపియా" అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న డాక్టర్ అతనికి శస్త్రచికిత్స చేస్తే తప్పక చూపు వస్తుందని గ్రహించి ఆ విషయాన్నే సంజొయ్‌కు చెప్పారు.
జీవితంలో 22 ఏళ్ళ కాలం చూపులేకుండా గడిపిన సంజొయ్ తనకు చూపు వచ్చే అవకాశాలున్నాయని తెలిసి ఆనందంగా శస్త్రచికిత్సకు ఒప్పుకున్నాడు. దీంతో ఇతనికి పలు పరీక్షలు చేసి ఈ ఏడాది మార్చి 14, ఏప్రిల్ 7 తేదీల్లో రెండు కళ్ళకూ శస్త్రచికిత్స చేశారు. కనుగుడ్డు కదలికలు అపసవ్యంగా ఉండటంతో అవి కూడా సరిచేశారు. కుడి కంట్లో ఉన్న సున్నం నిల్వలు తొలగించారు. మొదటి ఆపరేషన్ జరిగిన ఒక రోజు గడిచాక ఎడమ కంటి కట్టు తీసేసినప్పుడు కంటిపై చాలా బలమైన కాంతిపుంజం పడిన అనుభూతికి అతను లోనయ్యాడు. ఆ విషయాన్నే అతను డాక్టర్‌కు చెప్పాడు. దత్తా వెంటనే ఆ కన్ను తెరవమని సూచించారు. జీవితంలో మొదటిసారిగా తన సాటి మనిషిని చూశాడు సంజొయ్.
వైద్యులూ దత్తాను ఆదర్శంగా తీసుకుంటే అంతా మిమ్మల్ని వైద్యనారాయణులని కొలుస్తారని మర్చిపోకండి.

Sunday, June 14, 2009
బుద్ధి చెప్పే బాంద్రా బ్యానర్
ముంబై నగరంలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో నగల వ్యాపారం చేసుకునే వర్తకుడు కిశోర్ వాల్‌చంద్ జైన్. అందమైన ఆభరణాలను తళతళ మెరిసేలా తయారు చేసి ఖాతాదార్ల మెప్పు పొందడంలో దిట్ట ఈ వ్యాపారి. నగలు మాత్రం తళతళలాడితే సరిపోతుందా? సుందరమైన ఆ నగలు ధరించే తన ఖాతాదారుల మానసిక సౌందర్యం తనకెంతో ముఖ్యం అంటాడీయన. అందుకే తన దుకాణం బయట మంచి సందేశాలతో కనిపించే బ్యానర్‌ను గత 10 ఏళ్ళకు పైగా ప్రదర్శిస్తూ వస్తున్నారు వాల్‌చంద్ జైన్ గారు. సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ బ్యానర్ ప్రత్యేకత . దేశంలో జరిగే ఉగ్రవాద దాడులు, అధికారుల అవినీతి చర్యలు, రాజకీయ నాయకుల పట్ల అసహ్యంతో వారిపై జరిగే బూటు దాడులు వంటివన్నీ ఇక్కడ బ్యానర్ ఐటెమ్స్‌గా మనకు కనిపిస్తాయి. ఇలాంటి పరిణామాలే ఆయుధాలుగా వాల్‌చంద్ గారి బ్యానర్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వారి డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ సిగ్గుపడేలా చేస్తుంది. తమ దుకాణంలోని నగల అమ్మకాలతో వచ్చే లాభాల్ని మిగిలిన వ్యాపారుల్లాగా అనుభవించడంతో సరిపెట్టుకోని వాల్‌చంద్ గారు సమాజం పట్ల తన బాధ్యతను బ్యానర్ సందేశాల రూపంలో నెరవేర్చుతున్నారు. బంగారు నగల్లాగే ఈయన మనసుకూడా భలే మెరిసిపోతుంది కదూ...
Saturday, May 30, 2009
అక్కడ బొబ్బిలి బ్రహ్మన్న లేడు...
ఆస్తి గొడవలొస్తే అన్నదమ్ములే కత్తులు దూసుకునే రోజులివి. డబ్బు విషయంలో తేడాలొస్తే మిత్రులే శత్రువులవుతున్న సమాజమిది. కుల, మత, జాతి, ప్రాంత విభేదాలతో రగిలిపోతున్న ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని వామన్‌ఖేడ్ గ్రామం గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. రాష్ట్రపతి ప్రశంసలు సైతం పొందిన ఈ గ్రామం ఎన్నోసార్లు ఆదర్శగ్రామంగా పురస్కారం అందుకుంది. ఈ ఊరిలో మహిళలకు సమానహక్కులున్నాయి. వేడుకలను అందరూ కలసికట్టుగా నిర్వహించుకుంటారు. ఈర్ష్య, అసూయలకు చోటు లేదిక్కడ. రాథోడ్ వంశానికి చెందినవారే ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికీ ప్రేమాభిమానాలు సరిసమానం. ఏ ఒక్కరికి సహాయం కావాలన్నా, మరే అవసరమున్నా సత్వరం వారికి చేయూత లభిస్తుంది. ఈ గ్రామ స్త్రీలు వారిళ్ళకు చాలావరకూ తాళాలు వెయ్యరు. కొత్తవారెవరైనా ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారి అవసరాన్ని వెంటనే గుర్తించి కావలసిన పనులు చేసిపెట్టి మర్యాదతో సాగనంపుతారు. ఆ మధ్య ఎప్పుడో ఒక వేడుక సందర్భంగా రెండు వర్గాలవారు కేవలం తూలనాడుకున్నందుకు వారిని వెలివేశారు. భారత శిక్షాస్మృతి పరిధిలోకి వచ్చే ఒక్క నేరం కూడా ఈ గ్రామంలో చోటు చేసుకోలేదు. అందువల్లే పోలీసులు కూడా అడుగుపెట్టలేదు. అంతేగాని బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలోలాగా ఆ ఊరు పెద్ద కృష్ణంరాజు పరిపాలనలో లేదు. అక్కడంతా మర్యాద రామన్నలే...
Friday, May 15, 2009
భార్యకోసం కొండను తవ్విన దశరథ్ మాన్జీ
ప్రభుత్వాధికార్ల గుండెల్ని కరిగించడం కన్నా కఠిన శిలల్ని కదిలించడమే తేలిక అని అతను గ్రహించాడు. అర్థాంగి అంటే నిజమైన అర్థం ఎందరికి తెలుసన్నది చెప్పలేం కానీ బీహార్‌కు చెందిన దశరథ్ మాన్జీ జీవితం మాత్రం దీనికి సరైన నిర్వచనమన్నది సూర్యచంద్రులు కనిపిస్తున్నంత నిజం. అతను తన భార్య కోసం 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి బాట ఏర్పరిచాడు. ఇది పూర్తయ్యేనాటికి ఆమె ప్రాణాలతో లేకపోయినా అతని గ్రామస్థుల పాలిట వరమైంది. అదేంటో తెలుసుకుందాం...
బీహార్‌లోని వజీర్‌గంజ్ సమీపాన గల గహ్‌లోర్ ఘాటీ గ్రామానికి చెందిన దశరథ్ మాన్జీ అత్యంత నిరుపేద. ముసాహర్ జాతి (ఎలుకల బొరియల్లో దొరికే ధాన్యాన్ని తిని జీవించే జాతి)కి చెందిన ఈయనంటే మాత్రం ఆ ప్రాంతం వారికి అత్యంత గౌరవం ఉంది. ఈయన్ని దశరథ్ బాబా అని కూడా పిలుస్తారు. 1962లో దశరథ్ భార్య ఫగుణీ ఈయన కోసం పొలానికి భోజనం తీసుకువస్తుండగా కిందపడిపోతే ఆమె చెయ్యి విరిగిపోయింది. వైద్యం కోసం ఊరిలో సదుపాయాలు లేవు. ఊరికి అడ్డుగా ఉన్న కొండను చుట్టి 30 కిలోమీటర్లు ప్రయాణించి గయకు వెళ్ళాల్సిందే. ఈ సంఘటనతో కొండను తవ్వి బాట ఏర్పరచాలన్న సంకల్పానికి ఆయనలో బీజం పడింది. 300 అడుగుల ఎత్తు, 1.5 కిలోమీటర్ వెడల్పున్న ఈ పర్వతాన్ని తవ్వి దారి ఏర్పరచడం అంత సులభం కాదని అందరికీ తెలుసు.
కొండను తవ్వి దారి ఏర్పరచాలనుకుంటున్నట్లు తన వారికి చెప్పగానే అందరూ వేళాకోళం చేశారు. వ్యతిరేకత వ్యక్తమైంది. అదేం పట్టించుకోని దశరథ్ తన మేకలు, ఇతర ఆస్తులు అమ్మి కొండ తవ్వడానికి పనికివచ్చే గడ్డపార, సమ్మెట, ఇతర వస్తువులు కొన్నాడు. ఇది గమనించిన వారు దశరథ్‌ను పిచ్చివాళ్ళ కేటగిరిలో వేసేశారు. సరిగ్గా ఇదే సమయంలో దశరథ్ భార్య జబ్బు పడగా ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో కొండను తవ్వితీరాలన్న ఆలోచన వజ్ర సంకల్పంగా మారింది. కొండను తవ్వడానికి రోజూ తన ఇంటి నుంచి వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుందని భావించిన ధశరథ్ కొండ దగ్గరే గుడిసె కట్టుకుని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు.
అది మొదలు 22 సంవత్సరాల పాటు ఏ ఒక్కరి సాయం లేకుండా రేయింబవళ్ళు శ్రమించి 1984లో 16 అడుగుల వెడల్పుతో చక్కని దారి సిద్ధం చేశాడు. దీంతో గహ్‌లోర్ ఘాటీ ప్రజల కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు వైద్యం కోసం చాలా తక్కువ సమయంలో గమ్యం చేరుకోగలుగుతున్నారు. కొండను తవ్వి ఎలుకలు పట్టే ఈ రోజుల్లో చోటు చేసుకున్న అద్భుతం ఇది.
దశరథ్ జీవించి ఉండగా గుర్తింపు రాలేదుగానీ, 2007లో ఆగస్ట్ 17న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తన 78వ ఏట మరణించినప్పుడు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన నిర్మించిన ఆ బాటకు "దశరథ్ మాన్జీ మార్గ్" అనే పేరు పెట్టారు. గహ్‌లోర్ ఘాటీలో ఈయన పేరిట ఆసుపత్రి నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.
ఇది కేవలం ప్రభుత్వాధికార్లు మాత్రమేకాదు, సమస్యల బారినపడి ఎదుటివాడు ఏడుస్తున్నా మనకెందుకులే అని మిన్నకుండే తోలుమందం ప్రజలందరూ దశరథ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, మరెన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయాలి....

Sunday, May 10, 2009
గుంటూరు గాంధీజీకీ జై
శ్రమదానం అన్న పదం వినగానే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ప్రవేశపెట్టిందేగా అనెయ్యకండి. ఆయనకంటే ముందే శ్రమదానానికి నిజమైన నిర్వచనమిచ్చి 40 ఏళ్ళకు పైగా శ్రమనే దానం చేస్తూ "గుంటూరు గాంధీ"గా పేరు పొందారు వట్టికూటి వెంకట సుబ్బయ్యగారు. గుంటురు జిల్లాలోని పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో 1916, అక్టోబర్ 28న (గాంధీ పుట్టిన నెలలోనే) జన్మించిన ఈయన తన జీవితాన్ని స్వచ్ఛంద సేవకే అంకితం చేశారు. మురికి కాల్వలు, రోడ్లు... చివరికి శ్మశానాలను సైతం శుభ్రం చేస్తూ కనిపిస్తుంటారు. ఈయన సేవలను గుర్తించి ఆ మధ్య మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఈ గుంటూరు గాంధీ గారికి సత్కారం కూడా చేశారు.
Monday, May 04, 2009
తువాలు విసిరే సవాలు
ఆ దేశం పేరు తువాలు. జనాభా కాస్త అటూ ఇటూగా ఒక 12000 మంది ఉండవచ్చు. అక్కడ స్వతంత్రంగా పత్రికా వ్యవస్థ లేకున్నప్పటికీ సామాన్యుల నుంచి సెల్‌లోని ఖైదీ వరకూ అందరినీ సంతృప్తిగా ఉంచే మానవహక్కుల వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. బాలలను హింసించిన పరిణామాలు కానరావు. పలు దేశాల్లో మానవహక్కుల అమలు గురించి 2002లో అమెరికా విదేశాంగశాఖ ఒక నివేదిక రూపొందించింది. ఈ తువాలు దేశంలో ఒక్క తప్పునైనా పట్టుకునేందుకు ఆ శాఖ విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఫిజీకి ఉత్తరంగా ఉన్న ఈ దేశంలో మహిళలపై నేరాలు జరగడం చాలా చాలా అరుదు. తువాలులోని ప్రభుత్వం ప్రజల హక్కుల్ని పూర్తిగా గౌరవిస్తుంది. ఇక్కడేమిటంటే పెద్దలు చెప్పిన మాట చట్టంతో సమానంగా అమలవుతుంది. నివేదిక 2002లో రూపొందించినప్పటికీ ఈ రోజుకు సైతం ఇది మానవహక్కుల పాలిట భూలోక స్వర్గమే. మానవహక్కుల పరిరక్షణలో తువాలు విసిరే సవాలుకు జవాబెక్కడుంది చెప్పండి?
Sunday, April 26, 2009
అంబలి దాతా సుఖీభవ
మండే ఎండల్లో అలసిపోయినవారి సేద తీర్చేందుకు సుమారు 29 ఏళ్ళ కిందట ఒక తల్లి ప్రారంభించిన సేవా యజ్ఞాన్ని ఆమె కుమారుడు నేటికీ కొనసాగిస్తూ పలువురికి ఆదర్శప్రాయుడై నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన సరోజ దాదాపు 3 దశాబ్దాల కిందట ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ప్రారంభమై వేసవికాలం అంతా రాగులతో చేసిన అంబలిని ఉచితంగా అందిస్తూ మృగశిర కార్తె రోజు వరకూ కొనసాగి మిఠాయిల పంపకంతో ముగుస్తుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సరోజ ఆ తర్వాత మరణించినప్పటికీ ఆమె కుమారుడు, ఎలక్ట్రీషియన్ అయిన ప్రభాకర్ తన భార్య కృష్ణవేణితో కలసి ఈ సేవను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్ చిక్కడపల్లి డివిజన్‌లోని బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి కాలనీలో ఈ కేంద్రం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సేవకు చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకు వచ్చినప్పటికీ ప్రభాకర్ సున్నితంగా తిరస్కరించి తన స్వంత ఖర్చుతో ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు. ఈ వేసవి కాలమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ దాహార్తులు, ఆకలిగొన్నవారికి ఇక్కడ అంబలి సిద్ధంగా ఉంటుంది.
Monday, April 20, 2009
పెద్దలు ఓటేస్తే పిల్లలకు స్టార్
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఏమిటన్నది నిజంగా గ్రహించిన పాఠశాల ఇది. హైదరాబాద్ నగరం చింతల్‌లో ఉన్న సెయింట్ మార్టిన్ హైస్కూల్ యాజమాన్యం తనకున్న పరిధిలో పౌరులను ఓటు వేసే దిశగా చైతన్యపరిచేందుకు ఓ మంచి పథకం వేసింది. తన పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యత గుర్తెరిగి ఓటు వేస్తే వారి పిల్లల రిపోర్ట్ కార్డ్‌లో సదరు విద్యార్థికి ప్రత్యేక గౌరవం ఇస్తూ బోనస్ స్టార్ కేటాయిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఉత్తమ పౌరులుగా గుర్తిస్తామని కూడా వెల్లడించింది. ఈ బోనస్ స్టార్ ద్వారా ప్రత్యేక గౌరవం పొందడానికి ఆ పిల్లలు తమ అమ్మానాన్నలతో ఓటు వేయించడంతో పాటు తాము ఉత్తమ పౌరుల బిడ్డలమన్న గుర్తింపు కూడా పొందుతారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఓటు వేసినట్లు రుజువు చేసుకోవడానికి ఈ నెల 25న స్వయంగా పాఠశాలకు వచ్చి తమ వేలిపై ఉన్న ఇంకు మార్కును పాఠశాల ఉపాధ్యాయులకు చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే నేతలు అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని, ఇది జరగాలంటే పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు వెయ్యాలన్నది ఈ పాఠశాల గుర్తించిన వాస్తవం.
Saturday, March 28, 2009
ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా...
కొన్నేళ్ళ క్రితం అమెరికాలో మేథ్యూ లిసగే అనే మూడో క్లాసు చదివే విద్యార్థి తనుండే నగరంలోని ఆకలిగొన్న బీదవారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దాంతో అతను "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " అనే కార్యక్రమాన్ని ఆరంభించాడు. అది ఆరంభించిన నాలుగో ఏడు "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " నలభై వేల డాలర్లని సేకరించి అనాథల పొట్టలని నింపగలిగింది.
మరో పిల్లవాడి కథ కూడా ఇలాంటిదే. ఆఫ్రికాలోని రోగగ్రస్థులైన బీదవాళ్ళ కోసం డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ కృషి చేస్తున్నాడని తెలిసిన పదమూడేళ్ళ జాన్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఓ ఉత్తరం రాశాడు. తన దగ్గరున్న డబ్బుతో ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా కొన్నానని, దాన్ని ఆఫ్రికాలోని డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ హాస్పిటల్‌లో పడేయగలరా అని అడిగాడు. ఓ లోకల్ రేడియో స్టేషన్‌కి ఈ సంగతి తెలియడంతో అది ఆ చిన్న పిల్లవాడి గొప్ప మనసు గురించి వార్తగా ప్రసారం చేసింది. అది విన్న ఎంతోమంది తగిన విధంగా స్పందించారు. దాంతో ప్రభుత్వం ఆ పిల్లవాణ్ణి, వేల మంది నుంచి ఉచితంగా వచ్చిన నాలుగు లక్షల డాలర్ల విలువ చేసే నాలుగున్నర టన్నుల మందులతో డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ నడిపే హాస్పిటల్‌కి విమానంలో పంపించింది.
ఆ పిల్లల్లోని నిజాయితీతో కూడుకున్న, బీదలకి సహాయం చేయాలనే తపనని చూసి దేవుడు వాళ్ళకి చేయాల్సిన సహాయాన్ని అనేకమంది మంచివాళ్ళని పరికరాలుగా వాడుకుని చేశాడు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Tuesday, March 17, 2009
కార్ల దొంగ
టర్కీలోని ఓ దొంగకి 16 ఏళ్ళ క్రితం తను చేసిన నాలుగు కారు దొంగతనాలకి పశ్చాత్తాపం కలిగింది. ఆ నాలుగు కార్లలోంచి తను దొంగిలించి అమ్ముకున్న టేప్ రికార్డర్ల ఖరీదు అయిన నాలుగు వందల యూరో డాలర్లని సెంట్రల్ టర్కీలోని కిరిక్కాలె అనే ఊరి పోలీస్ చీఫ్ సలీంకి పంపించాడు. 1992లో తన చేసిన ఆ నాలుగు దొంగతనాల వివరాలని కూడా పంపాడు. ఒకొక్కరికీ వంద యూరో డాలర్లని ఇవ్వమని, తన క్షమాపణలని కూడా తెలియచేయమని కోరాడు. ఆ దొంగ మాత్రం అజ్ఞాతంగానే ఉండిపోయాడు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.
Thursday, March 12, 2009
ఓటర్ల కోసం గుంజీళ్ళ దీక్ష
తమిళనాట కోయంబత్తూరు జిల్లా పుదూర్ గ్రామానికి చెందిన వడ్రంగి 23 ఏళ్ళ రామనాథన్‌కు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేదు. తన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనమంతా ఎన్నికల్లో పాల్గొని మంచి నేతలను ఎన్నుకోవాలని మాత్రం గ్రహించాడు. తన కోరిక ఫలించాలని కోరుతూ తన ఊరిలో ఉన్న ఆది వినాయకర్ ఆలయంలో మే 8, 2006వ తేదీ ఉదయం 6 గంటలకు సుముహూర్తం నిర్ణయించుకుని 14 నిమిషాల్లో 1008 గుంజీళ్ళు తీశాడు. ఈ గుంజీళ్ళు సరిగ్గా తీశాడా లేదో గమనించడానికి అక్కడి "యూత్ పవర్ ఫెడరేషన్" ప్రతినిధులు వచ్చి పర్యవేక్షించారు. తన గుంజీళ్ళ దీక్ష పూర్తయిన తర్వాత రామనాథన్ మాట్లాడుతూ మన ప్రజాస్వామిక దేశంలో ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని, రాష్ట్ర భవిష్యత్తును మంచి బాటలో పయనింపజేయాల్సింది ఓటర్లే అయినందున అవినీతి, పక్షపాత వైఖరికి దూరంగా ఉండే నేతలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రాజకీయాల్ని అసహ్యించుకొని ఓట్లేయడం మానకుండా మంచివారికి ఓటు వేయడం ద్వారా స్వలాభం కోసం పాకులాడేవారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. తన కోసం కాకుండా జనం బాగు కోసం గుంజీళ్ళు తీసిన రామనాథన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ... జన జీవితంలో కొత్త కోణం ప్రకాశిస్తుంది.
పసివాడి హృదయం కరిగింది
"పిల్లలూ ఈ రోజు మీకో వీడియో చూపిస్తాం... అది చూచి మనకు తోచిన సాయం చేద్దాం" అని టొరంటోలోని ఒక స్కూలు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశమైన మలావీలోని బాలల దుస్థితిని వీడియో ద్వారా చూపించారు. ఆ స్కూల్లోనే చదువుకుంటున్న తొమ్మిదేళ్ళ భారత సంతతి విద్యార్థి నీల్ అగర్వాల్ పసి హృదయం మలావీ చిన్నారుల కష్టాలు చూచి కరిగిపోయింది. వెంటనే తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న 170 డాలర్ల మొత్తాన్ని (దాదాపు రూ.7,800) యునిసెఫ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. నీల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ భారతీయుడు కాగా, తల్లి ఎలిజబెత్ కెనడాలో పుట్టి పెరిగిన ఇటలీ సంతతి మహిళ. ఇంత పెద్ద మొత్తం (ఆ కుర్రాడి వయసుకు ఇది పెద్ద మొత్తమే...) అలా ఎలా ఇచ్చేశావురా అని అడిగితే... నా వయసు పిల్లలు పేదరికంతో తిండి లేక పాఠశాలలకు కూడా వెళ్ళడం లేదని తెలిసి, ఆ డబ్బు నాకంటే వారికే ఎక్కువ అవసరమనిపించిందని బదులిచ్చాడు ఈ రెండవ బాల కర్ణుడు (ఇలాంటి మరో బాలుడి గురించి ఇంతకు ముందొక కథనం ఇచ్చాను అందుకే రెండవ బాల కర్ణుడు అన్నాను). ఈ ఘటన 2006లో జరిగింది.
Thursday, February 26, 2009
మాకు కరెంట్ వద్దు...
మన పొరుగున ఉన్న భూటాన్ మనకన్నా చిన్న దేశం. మనకన్నా పేద దేశం. కాని భూటాన్ ప్రజల మనసులు మాత్రం చాలా విశాలం. వారికి భూతదయ ఎంత ఎక్కువంటే, నదుల్లోని చేపలని పట్టరు. డబ్భై ఐదు శాతం అడవే అయినా జంతువుల్ని వేటాడి చంపరు. ఆ దేశంలోని ఫోబ్జికా లోయకు తరచూ కొంగలు వలస వస్తూంటాయి. ఆ లోయకి వచ్చే దారిలో ఉన్న ఓ ఊళ్ళోని కరెంటు తీగల మీద వాలి అవి మరణించడం గమనించిన ఆ ఊరి వాసులు విద్యుత్‌కు స్వస్తి చెప్పారు. సౌర శక్తితో తమ ఇళ్ళను వెలిగించుకుంటున్నారు. వారు బాగా సున్నిత మనస్కులు కాబట్టి హింసా ప్రవృత్తి గల రెజ్లింగ్ పోటీలను ప్రసారం చేసే పాశ్చాత్య ఛానెళ్ళకు అడ్డుకట్ట వేశారు. ఫ్యాషన్ టీవీ, టెన్ స్పోర్ట్స్, ఎంటీవీ లాంటి అర్ధనగ్న దృశ్యాలు ప్రసారం చేసే ఛానెళ్ళు కూడా భూటాన్‌లో ప్రసారం కావు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించిన తొలి దేశం కూడా భూటానే. ప్రజలు ఇలాంటి మంచి పనులకు వ్యతిరేకతను తెలియచేయకపోవడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది. సమున్నత సంస్కృతికి మారు పేరని చెప్పుకునే మన భారతీయులంతా భూటాన్‌ను అనుసరించాల్సిన అవసరముంది.
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు
సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు
Wednesday, February 18, 2009
వీళ్ళు పే......ద్ద పిల్లలు
శత్రువులు పాలిట తూపాకీ తూటాలాంటివాడు తుఫాన్ కుమార్ అయితే... భారతీయ సైనికుల ధన్వంతరి భారతీ సింగ్. ఈ విద్యార్థులు సాధించిన ఘనతల గురించి చదివాక నేను పెట్టిన శీర్షిక నిజమేనని మీరు కూడా ఒప్పుకుంటారని నా నమ్మకం. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక బృందం) అధిపతి హేమంత్ కర్కారే, అశోక్ కామ్టే తదితరులు ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరాడి అసువులు బాసిన సంగతి తెలిసిందే. వాళ్ళు వేసుకున్న బులెట్ ప్రూఫ్ జాకెట్లు నాసిరకం కావడమన్నది వీరి మరణానికి ఒక కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని బట్టి ఉగ్రవాద నిర్మూలన పట్ల మన పాలనా వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందలాది ప్రాణాలను బలిగొన్న ఆ నాటి దాడి తర్వాత మనం నేర్చుకున్న పాఠాల సంగతేమోగాని ఈ మధ్య మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన ఒక బాలల సైన్స్ సమావేశంలో ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన ఆవిష్కరణలతో ముందుకొచ్చారు.
ఇందులో పాల్గొన్న భువనేశ్వర్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థి తుఫాన్ కుమార్ సమాల్ తన వంతుగా... క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల (సిసిటివి) పైన తుపాకులు అమర్చి కంట్రోల్ రూం నుంచి వాటిని పేల్చడం ద్వారా ఉగ్రవాదులను అంతమొందించే వ్యవస్థను రూపొందించాడు. దీనివల్ల సమయం వృథా కాదు... ప్రాణ నష్టం చాలా చాలా తగ్గుతుంది. పెద్ద పెద్ద హొటళ్ళలో తిరిగే (రివాల్వింగ్) కెమెరాలుంటాయి. వాటి సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని చూస్తాం. మరో అడుగు ముందుకేసి వాటికి తుపాకులు అమర్చడం ద్వారా పని పూర్తి చెయ్యవచ్చట. తుఫాన్ కుమార్ తుఫాను వేగంతో కదిలే మానవరహిత ప్లాస్టిక్ విమానాన్ని కూడా తయరు చేశాడు. దీంతో శత్రు స్థావరాల్ని కచ్చితంగా కనిపెట్టడంతో పాటుగా తుఫానులు వచ్చి వరద బీభత్సం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు సాయం కూడా చెయ్యవచ్చు...
ఉత్తరప్రదేశ్ నుంచి ఇదే సైన్స్ సమావేశంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థిని, బరైలీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన భారతీ సింగ్, నీటిలోని నాచును ఉపయోగించి సైనికులకు చికిత్స చేసే వ్యవస్థను రూపొందించింది. నాచు నుంచి ప్రొటీన్ తీసి యుద్ధ సమయాల్లో గాయపడిన సైనికులకు బాక్టీరియా వల్ల వ్యాధి వ్యాపించకుండా దీంతో చికిత్స చెయ్యవచ్చట. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పటి సైనికులు వ్యాధులు రాకుండా ఈ నాచును పైన పెట్టుకుని కాపాడుకున్నట్లు చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకుని దీనిని తయారు చేసినట్లు భారతీ సింగ్ చెప్పింది. నాచులోని ప్రొటీన్‌ను బయటకు తీసి కొన్ని వైరస్‌లపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. గడచిన డిసెంబర్ నెలలో తాను కనిపెట్టిన ఈ ఆవిష్కరణపై పేటెంట్ కూడా తీసుకుంది.

Wednesday, February 11, 2009
నస్రీన్ నుయ్యి తవ్వింది
అమ్మానాన్నలు ఎప్పుడు చస్తారా... ఓ గొయ్యి తవ్వి పారేద్దాం అనుకునే ఈ రోజుల్లో... నీళ్ళ కోసం తల్లి పడుతున్న కష్టం చూచి ఆవేదన చెందిన నస్రీన్ ఆమె కోసం ఒక నుయ్యి తవ్వింది. తన చెల్లాయిలు తోడుగా నస్రీన్ 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వింది. ఇక నస్రీన్ ఎవరో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఉన్న మహా విద్యాలయం విద్యార్థిని అయిన నస్రీన్ పేద కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి రంజాన్ ఖాన్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మరోవైపు నస్రీన్ పగలు కళాశాలకు వెళుతూ, విద్యార్థులకు ప్రయివేట్లు చెబుతూ తన వంతుగా నాలుగు రాళ్ళు సంపాదించి తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉండేది. ఈ ఇంట్లో దాహార్తి తీర్చుకోవాలంటే నస్రీన్ తల్లి మైళ్ళ దూరం నడిచి మంచి నీళ్ళు తీసుకురావాల్సిందే. కని పెంచిన తల్లి కష్టం చూడలేకపోయిన ఈ ధీశాలి అమ్మ కోసం ఏమైనా చేసి తీరాలని సంకల్పించుకుని ఇంట్లేనే నుయ్యి తవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు అమ్మా నాన్నా ఒప్పుకోరు. చెల్లెళ్ళతో ఈ సంగతి మాట్లాడి అమ్మానాన్నలకు తెలియకుండా అందరూ కలిసి పలుగు పార పట్టుకొని 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వేశారు. పని పూర్తయ్యాక అమ్మానాన్నల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక మహావిద్యాలయ ప్రిన్సిపాల్ ఆర్ కె పాటిల్ గారైతే నస్రీన్‌ను నోరారా పోగిడి కుట్టుమిషన్ బహుమతిగా ఇచ్చారు. ఇంకా డబ్బు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగి రెండేళ్లయినా ఆ వివరాలు నాకు ఇప్పుడు దొరికాయి.
ఇదంతా చూస్తుంటే లక్క ఇంటి నుంచి తన తల్లి, సోదరుల్ని కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో నిద్ర మానుకొని సొరంగం తవ్విన పాండవ మధ్యముడు భీముడు గుర్తుకు రావడం లేదూ...! భీమసేనుణ్ణి మనం చూడలేకపోయాం గానీ ఈ యుగంలో నస్రీన్ మన కళ్ళముందుంది. ఈ నస్రీన్ భారతంలోని భీముని తలపించింది. ఎందుకంటే సందర్భాలు, పరిస్థితులు వేరైనా దృఢ సంకల్పం ఒక్కటేగా...

Saturday, February 07, 2009
హిజ్రాలు కాదు మానవతా వజ్రాలు
హిజ్రాలు లేదా నపుంసకులనగానే ఈ (అ)సభ్య సమాజానికి గుర్తుకొచ్చేది వయ్యారమొలకబొసి, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేస్తూ డబ్బులడుక్కుంటున్న దృశ్యం. హిజ్రాలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విలేఖరిని దత్తత తీసుకున్న ఈ నిజ సంఘటన గురించి తెలుసుకుంటే వారు మంచోళ్ళకంటే మంచోళ్ళన్న అభిప్రాయానికి రాక తప్పదు. మామూలు మనుషుల కొచ్చే కష్టాలనే పట్టించుకోని ప్రభుత్వం మామూలుగానే వీరి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే దేవుడనేవాడు వీరి కోసం విల్లుపురంలో ఒక మనిషిని పుట్టించాడు. అతనే రామ్మూర్తి. ఈ ఊరిలోనే అర్చకుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి (40 ఏళ్ళు) పత్రికా విలేఖరిగా కూడా సమాచార సేవలందిస్తుంటారు. ఈయన వార్తలు సేకరించడంతో ఆగిపోకుండా ఈ హిజ్రాలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు ఇప్పించారు. వారి హక్కుల కోసం పోరాడుతూ వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు.
తమకేమీ కాని రామ్మూర్తి తమ సంక్షేమం కోసం ఇంతగా శ్రమించడం ఆ హిజ్రాల మనసును కరిగించేసింది. వెంటనే రామ్మూర్తిని తమ కుమారునిగా దత్తత తీసుకోవాలని జిల్లా నపుంసకుల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా 2005 డిసెంబర్ 31న శాస్త్రబద్ధంగా దత్తత స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నపుంసకులను శ్రీకృష్ణుని ప్రతిరూపంగా భావించే హిజ్రాలు తనను దత్తత చేసుకోవడం ఎంతో ఆనందంగాను, గర్వంగాను ఉందని రామ్మూర్తి పారవశ్యంతో చెప్పారు. ఈ మానవతా వజ్రాలను ఎన్ని పొగడ్తలతో ప్రశంసిస్తే సరిపోతుంది చెప్పండి.

Subscribe to:
Posts (Atom)