Thursday, July 30, 2015
ఖర్చు భరించి వైద్యం చేసిన డాక్టర్ గారు...
డాక్టర్లంటే రోగుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసేవారనే ముద్ర పడిపోయిన రోజులివి. కానీ వైద్య నారాయణులున్నారని నిరూపించారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ఉదయ్ కృష్ణ. ఒక లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు నుజ్జునుజ్జయిపోయి, ఇన్ఫెక్షన్ సోకి గుండెలు అరచేతిలో పెట్టుకున్న ఒక రోగికి ఆపరేషన్ ఖర్చు 1.66 లక్షల రూపాయల్ని ఆయనే భరించారు. ఆ రోగి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన 42 ఏళ్ళ మహిళ కృష్ణకుమారి. యాక్సిడెంట్‌లో ఆమె కాలు విరిగిపోతే ఉన్న డబ్బంతా ఖర్చుచేసి ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారావిడ. అలాంటి పరిస్థితుల్లో తెలిసినవారి ద్వారా డాక్టర్ ఉదయ్ కృష్ణను కలుసుకున్నారు. కృష్ణకుమారికి ఆర్థిక సహాయం, వైద్య సహాయం చేసి తను చేస్తున్న వైద్య వృత్తికి సార్థకత చేకూర్చారు డాక్టర్ ఉదయ్ కృష్ణ.
Thursday, April 30, 2015
దోపిడీ విద్యాసంస్థలు ఉమను చూసి సిగ్గు తెచ్చుకోవాలి..
తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాకు చెందిన ఉమ ఒక మామూలు గృహిణి. కానీ వీధి బాలల కోసం ఆమె చేసిన విద్యా సేవలు చూస్తే ప్రమాణాలు దిగజారిన మన విద్యావ్యవస్థ సిగ్గుతో తల దించుకోవాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్ల పరిసరాల్లో చదువూ సంధ్య లేకుండా తిరిగే వీధి బాలల కోసం ఏదో ఒకటి నిశ్చయించుకుని 2003లో సిరాగూ మాంటిస్సోరీ స్కూలును ఏర్పాటుచేశారామె. బిచ్చగాళ్ల పిల్లలు, వీధి బాలలు ఆ బడిలో చేరేలా ఆమె రోడ్లపై తిరిగి ప్రచారం చేశారు. ఆ పిల్లలకు ఐసిఎస్‌ఇ సిలబస్‌లో విద్యా బోధన చేశారు. అక్కడితో ఆగలేదు. జీవన్ విద్య పేరిట ఐఐటి కోచింగ్ కూడా అందజేస్తున్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వచ్చిన పిల్లలకు వ్యవసాయం, ఆరోగ్యం, వంటలు, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో తర్ఫీదు ఇచ్చి భవిష్యత్తులో వారి అభిరుచికి తగిన రంగాన్ని ఉపాధి కోసం ఎంచుకునేలా తయారు చేస్తున్నారు. తన సేవల్ని అంతటితో ఆపలేదు... సూయం చారిటబుల్ ట్రస్ట్, భారతమాత స్కూలు, కన్నిమేరీ నర్సరీ స్కూలు వంటి మరెన్నో సంస్థల్ని నడుపుతున్నారామె. తిరువల్లూరు, కన్యాకుమారి, నాగపట్నం లాంటి చోట్ల వైద్య శిబిరాలు, విద్యా సంబంధమైన అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నారు.
Saturday, January 31, 2015
అతనికి జ్ఞానం ఉంది... అందుకే...
ఆ రైతు పేరు జ్ఞాన్ సింగ్. స్కూలు పాఠాల జ్ఞానమైతే ఆయనకు లేదు గానీ, తన సమాజానికేం చెయ్యాలో మాత్రం తెలిసిన జ్ఞాని ఆయన. బరేలా అనే గిరిజన జాతికి చెందిన జ్ఞాన్ సింగ్, మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా మెల్ ఫాలియా గ్రామంలో ఉంటారాయన. ఒకసారి అనుకోకుండా ప్రమాదం జరిగితే, పాపం ఆయన కదలలేక... ఏ పనీ చేసుకోలేని అవస్థకు గురయ్యాడు. వైద్యం చేయించుకోవాలంటే, తమ ఊరికి అడ్డుగా ఉన్న ఒక కొండను దాటుకుని వెళ్లాలి. చివరికి ఆ ఊరివాళ్లు నలుగురు జ్ఞాన్ సింగ్‌ని అతి కష్టం మీద మోసుకుని వెళ్లారు. చికిత్స చేయించుకున్నాక కోలుకున్న జ్ఞాన్ సింగ్, తనేం చెయ్యాలో నిర్ణయించుకున్నారు. కత్తి, సుత్తి, గునపం లాంటి సామాగ్రిని సిద్ధం చేసుకుని... ఆ కొండ మధ్యగా దారి ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. మొదట్లో ఆయన సోదరులు, భార్య సలు బాయ్ తోడుగా వచ్చారు. ఏం జరగబోతోందో గ్రహించిన గ్రామస్తులు కూడా వారి నుంచి స్ఫూర్తి తీసుకుని రోడ్డు నిర్మాణం కోసం నడుం బిగించారు. ఇప్పుడు మెల్ ఫాలియా గ్రామ ప్రజలు మన దేశంలోని సోమరులందరికీ స్ఫూర్తిదాతలయ్యారు.
Friday, November 28, 2014
తాళిబొట్టు అమ్మేసింది... టాయిలెట్ కోసం..
ఎవరైనా సరే... ఆస్తులు, నగలు ఎప్పుడు అమ్ముకుంటారు? అప్పులు గాని, అనారోగ్య సమస్యలు గాని, పిల్లల చదువుల కోసమో... సొంతిల్లు కట్టుకునేందుకోవడానికో అమ్ముతారు. కానీ మరాఠీ గ్రామీణ మహిళ సంగీత అహాల్వే తన మంగళసూత్రంతో సహా నగలన్నీ అమ్మేసింది. మహారాష్ట్రలోని వషీం జిల్లా పరిధిలో ఉన్న సాయిఖేదా గ్రామ వాసి సంగీత అహ్వాలే. నగల కంటే మరుగుదొడ్డే తన కుటుంబానికి మేలు చేస్తుందని భావించింది. అందుకోసం తన నగలన్నీ అమ్మేసింది. భారతీయ మహిళలు ప్రాణం కంటే మిన్నగా భావించే మంగళసూత్రం కూడా! ఈ సంగతి సర్కారు దృష్టికి వచ్చింది. సంగీతను రాష్ట్ర మంత్రి పంకజ ముండే ప్రభుత్వం తరపున తన కార్యాలయంలో సత్కరించారు. సంగీత స్పందిస్తూ, మరుగుదొడ్డి అనేది ప్రాథమిక అవసరమని, అందుకే నగలమ్మానని తెలిపింది. మంత్రి పంకజ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా తనకు వచ్చే నిధుల్లో 25 శాతం మరుగుదొడ్లు కట్టించేందుకు ఖర్చు చేస్తానన్నారు.
Monday, September 01, 2014
గంగా పుత్రుడు...
అతని పేరు అరుణ్ కృష్ణమూర్తి. 26 ఏళ్ళ వయసు వచ్చేసరికి అతను సాధించిన ఘనత ఏంటో తెలుసా.. దేశంలోని 6 సరస్సులకు జలకళ తీసుకొచ్చాడు. ప్రకృతి మాత మనకు వరంగా ప్రసాదించిన జలవనరులను కాపాడుతున్నాడు. ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని తానే చేస్తున్నాడు. గూగుల్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి మరీ స్వచ్ఛంద సంస్థ స్థాపించి దేశ ప్రజల దాహార్తి తీర్చుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రోలెక్స్ అవార్డు అందుకున్నాడు. యువత దేశానికి ఏం చెయ్యాలన్నది ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా చేసి చూపిస్తున్నాడు. ఎన్విరానమెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా... ఇఎఫ్‌ఐ స్థాపించి సరస్సుల పునరుద్ధరణకు నడుం బిగించాడు ఈ గంగా పుత్రుడు.
Thursday, July 31, 2014
91 ఏళ్ళు + క్యాన్సర్ + నిధుల సేకరణ
ఒక పక్క క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ.. 91 సంవత్సరాల వయసులో 42 కిలోమీటర్ల దూరాన్ని 7గంటల 7నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేశారు బామ్మగారు హారియట్ థాంప్సన్. పైగా ఇదేదో రికార్డు కోసం కాదు. ఈ వయసులోనూ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపనే ఆమెను పరుగు తీయించింది. తన స్నేహితురాలు నిర్వహిస్తున్న లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు బామ్మ పరుగు పెట్టి ఏకంగా 90 వేల డాలర్లను సొసైటీకి ఇచ్చి సత్తా చాటారావిడ. ఈ మారథాన్ పరుగుకు 4 వారాల ముందు హారియట్ 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకున్నారు. దాని వల్ల రెండు కాళ్లకూ విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ పరుగు తీసింది మన బామ్మ. బామ్మగారి 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా తల్లితో పరిగెత్తి, సాయం చేశాడు. ఇంత పెద్ద మారథాన్ పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో రికార్డులకెక్కారు. అందరూ బామ్మ మాట బంగారు మాట అంటుంటారు... బామ్మ బాట కూడా బంగారు బాటేనని ఈ బామ్మగారు రుజువు చేశారు.
Monday, June 30, 2014
గ్రేస్‌కు ఇంజనీరింగ్ సీటొచ్చింది..
హిజ్రాలంటే ఏహ్య భావంతో చూసే సమాజం ఇది. కానీ, తమిళనాడులో గ్రేస్ బాను అనే హిజ్రా తనకు ఎదురైన అవహేళనల్ని తట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. అన్నా యూనివర్శిటీ కౌన్సిలింగ్ ద్వారా అరక్కోణంలోని శ్రీకృష్ణా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ట్రిపుల్ ఇ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్) కోర్సులో చోటు దక్కించుకుంది. పాలిటెక్నిక్‌లో గ్రేస్ 94 శాతం మార్కులతో సంపాదించింది. గ్రేస్ ట్రాన్స్‌జెండర్ కావడంతో ప్లస్ టూలో ఉండగానే తల్లిదండ్రులు వదిలేశారు. అప్పటి నుంచీ ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ వరకూ వచ్చింది.
Saturday, May 31, 2014
చెట్టు కొడుకు..
మధ్యప్రదేశ్‌లో నివసించే శ్యామ్ లాల్ పతిదార్ తన కొడుక్కి ప్రతి ఏటా క్రమం తప్పకుండా పుట్టినరోజు వేడుక జరుపుతుంటాడు. కొడుకును ముద్దు పెట్టుకుని మురిసిపోతుంటాడు. ఇంట్లో తిండి గింజలు లేకపోయినా పట్టించుకోడు కానీ, తన చెట్టంత కొడుకు పుట్టినరోజున కేక్ కట్ చేసి, బుడగలు కట్టి నానా హడావుడి చేస్తాడు. ఇంతకీ ఆ కొడుకు అంత గొప్పవాడా.. అని మీరు అడగవచ్చు. అవును మరి. ఆ చెట్టంత కొడుకు మరెవరో కాదు. ఒక వేప చెట్టు. ఆ చెట్టునే తన కొడుకుగా భావించి పండుగ చేస్తుంటాడాయన. శామ్ లాల్‌ను అందరూ ఆదర్శంగా తీసుకుంటే పర్యావరణ సమస్యలే రావని మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఆయన గురించి గొప్పగా చెబుతుంటారు.
Friday, January 31, 2014
పెన్షన్ ఇస్తున్నారుగా... పనిచేస్తా..
రిటైర్ అయిన తరువాత హాయిగా ఇంట్లో కూర్చుందామనుకోలేదు ఆ పెద్దాయన. ఇస్తున్న పెన్షన్‌కు తగిన పని చేస్తానంటూ మళ్ళీ ఆఫీసు బాటపట్టారు. తమిళనాడులోని శ్రీరంగంలో నివసిస్తున్న రిటైర్డ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ వి గోపాలన్ గారి జీవితం ఇది. అక్కడికి 9 కిలోమీటర్ల దూరాన మన్నార్‌పురంలో పనిచేస్తుండేవారు. అయితే 2006లో రిటైర్ అయినప్పటికీ పెన్షన్ పేరిట డబ్బులిస్తున్నారు కనుక అందుక తగ్గ సేవలందిస్తానంటూ రోజూ సైకిల్‌పై అంతదూరం వెళ్ళి స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. తన ఆరోగ్యం భేషుగ్గా ఉందంటూ మళ్ళీ సైకిలెక్కారాయన..
Saturday, November 30, 2013
అతనొక్కడే... ఒక చోట స్టూడెంట్.. మరోచోట హెడ్మాస్టర్
అతనే బాబర్ అలీ. 17 సంవత్సరాల ఈ కుర్రాడు 9 ఏళ్ళ వయసుకే ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి అలా అలా ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు భుజానికెత్తుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ గ్రామానికి చెందిన అలీ బెర్హంపూర్‌లో ఉన్న కాసింబజార్ రాజ్ గోవింద సుందరి విద్యాపీఠ్‌లో ఒక పక్క ప్లస్ టూ చదువుకుంటూనే తన ఊళ్ళో పేదల కోసం తమ ఇంటి పెరడులో ఏర్పాటు చేసిన బడికి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాడు. పెరడులో బడి అంటే ఏదో చిన్నదనుకునేరు. ఇక్కడ దాదాపు 800 మంది పేద విద్యార్థులకు అలీ ద్వారా విద్యాబుద్ధులందుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ బడికి గుర్తింపునిచ్చి ఇక్కడి విద్యార్థులకు నెల నెలా బియ్యం సరఫరా చేస్తోంది. బాబర్ అలీ సేవల్ని గుర్తించిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇతనిని పురస్కారాలతో సత్కరించి ప్రోత్సహిస్తున్నాయి.
Saturday, August 31, 2013
సావిత్రికి చేప ప్రసాదం... సత్యమూర్తికి పరమానందం..
నాడు సత్యవ్రతుని కోసం భార్య సావిత్రి యముని వెంటపడి మాంగల్యాన్ని దక్కించుకుంటే... నేడు బిడ్డ సావిత్రి కోసం యజమాని సత్యమూర్తి తపనపడి చేప ప్రసాదం ఇప్పించాడు. అసలీ సావిత్రి ఎవరు?.. ఆమె చేప ప్రసాదం తింటే మాకేంటి?... అనుకుంటారేమో. మన మామూలు కళ్ళకు ఆమె ఒక కుక్కలా కనిపించవచ్చు గానీ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో నివసించే ఏసీ వ్యాపారి సత్యమూర్తికి మాత్రం సావిత్రి తన కన్నబిడ్డ లాంటిదే. ఈ మధ్యన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద వితరణ జరిగినప్పుడు గర్భవతిగా ఉన్న సావిత్రికి కూడా ఈ ప్రసాదం ఇప్పించాలని అనుకున్నారాయన. తన కన్నబిడ్డ లాంటి సావిత్రి కనబోయే బిడ్డలు సైతం ఆరోగ్యంగా ఉండాలని తలచి చేప ప్రసాదం ఇప్పించారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది బత్తిని సోదరుల చేప ప్రసాదం వితరణ సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. బాగ్‌లింగంపల్లిలో ఉండే సత్యమూర్తి అనే అయ్యప్ప స్వామి భక్తుడు 'సావిత్రి'ని తన బండిపై నాంపల్లి గ్రౌండ్స్‌కు తీసుకువచ్చి 'చేప ప్రసాదాన్ని' తినిపించారు. అప్పటికి గర్భవతిగా ఉన్న సావిత్రి శాకాహారే అయినప్పటికీ మంచి ఆరోగ్యం కోసం చేప ప్రసాదం ఇప్పించినట్లు సత్యమూర్తి చెప్పారు. సావిత్రితో చేప ప్రసాదం తినిపించడానికి అక్కడున్న కార్యకర్తలు తొలుత ఇబ్బంది పడినప్పటికీ చివరకు ప్రసాదాన్ని విజయవంతంగా తినిపించారు. పద్ధతి ప్రకారం 45 రోజుల పాటు కచ్చితమైన పత్యం పాటించేలా చూస్తానన్నారు. 'సావిత్రి'ని కన్నబిడ్డలా చూసుకుంటానని, తనతో పాటే పూజల్లో పాల్గొంటుందని సత్యమూర్తి చెప్పారు. చేప ప్రసాదం గురించి బయట ఎన్ని వివాదాలున్నా... ఇక్కడ మాత్రం సావిత్రి పట్ల ఆ యజమానిలో గూడు కట్టుకుని ఉన్న ప్రేమకే పట్టం కడదాం...
Sunday, June 30, 2013
మామూలు బడిలో పెద్దాయన కూతురు
ఒక జిల్లా కలెక్టర్ తన కూతురిని కార్పోరేట్ స్కూల్‌లో కాక సర్కారు బడిలో చేర్పించారంటే నమ్ముతారా!.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు 2011లో కలెక్టర్‌గా పనిచేసిన ఆనంద్ కుమార్ తన ఆరేళ్ళ కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకుని అలాగే చేశారు. తన కుమార్తె గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో రెండవవ తరగతిలో చేర్పించారు. ఈ జిల్లాలో చాలా పెద్ద కార్పోరేట్ బడులున్నా ఈ కలెక్టర్ మాత్రం తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించి ఎందరికో ఆదర్శంగా నిలబడ్డారు. తమిళనాడులో జరిగే ప్లస్ టూ, ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించిన చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే. ఇక్కడ ఇంకొక విషయమేమంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫాంనే గోపికకూ ఇప్పించారు తప్ప ఆమె కోసం కలెక్టర్ గారు మరింత నాణ్యమైన వస్త్రం తెప్పించి యూనిఫాం కుట్టించలేదు. అంతకు మించిన మరో సంగతేమిటంటే ఆమె తన బడిలో ఉచితంగా పెట్టే మధ్యాహ్న భోజనమే తిన్నది తప్ప ఇంటి నుంచి ప్రత్యేకంగా క్యారేజీ రాలేదు. గోపిక తల్లి ఒక డాక్టర్ అట. జిల్లాకు ఎంతో మేలు చేస్తున్న ఈ కలెక్టర్ గారిని ఆ తర్వాత రాజకీయులు బదిలీ చేయించారు.
Tuesday, April 30, 2013
'స్ఫూర్తిదాత.. శ్రీ మామయ్య
ఆయన అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఎ పట్టా పొందారు. బిజినెస్ స్కూల్‌లో బోధకుడిగానూ పనిచేశారు. వ్యాపార విలువల గురించి లోతైన అధ్యయనం చేసినా జీవితాన్ని మాత్రం మానవతా విలువలతోనే అల్లుకున్నారు. ఆయనే శ్రీవ్యాల్. 2004లో మాతృభూమికి తిరిగి వచ్చిన శ్రీవ్యాల్ బిజినెస్ స్కూల్ బోధకునిగా చేరినప్పుడు ఎదురైన కొన్ని అనుభవాల నుంచి పుట్టిందే "స్ఫూర్తి" ఫౌండేషన్. భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో 2006లో హైదరాబాద్ చర్లపల్ల ప్రాంతంలో ఒక కిరాయి ఇంటిలో ముగ్గురు అనాథ బాలల కేరింతల నడుమ ఈ ఫౌండేషన్ ఆవిర్భవించింది. శ్రీవ్యాల్ స్నేహితులు, దాతల విరాళాలతో ప్రస్తుతం సుమారు 200 మంది చిన్నారులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. తన భార్య వెంకటేశ్వరి తోడ్పాటుతో ఇక్కడి పిల్లలకు అన్నీ తామై వారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు.
పిల్లలంతా శ్రీ మామయ్యగా పిల్చుకునే శ్రీవ్యాల్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దుండిగల్ వద్ద స్థలాన్ని కేటాయించింది. వీరి కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు జెజె మెహతా మెమోరియల్ ఫౌండేషన్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు "స్ఫూర్తి" బాలల కోసం అప్పుడప్పుడూ కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. ఆ మధ్య అమెరికాలోని మేరీలాండ్ ఫస్ట్ లేడీ మేరీ క్యాథరీన్ కూడా ఈ ఫౌండేషన్‌కు వచ్చి అభినందనలు కూడా తెలిపారు.
"స్ఫూర్తి" బాలలందరికీ భోజనం, బస, వస్త్రాలు, కాన్వెంట్ చదువు ఉచితమే. 7వ తరగతి వరకూ అక్కడి ప్రయివేట్ పాఠశాలలోను, తర్వాత 10వ తరగతి వరకూ "అధ్య"లో వీరిని చదివిస్తారు. సంగీతంతో పాటు ఇక్కడ కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ పాఠ్యప్రణాళికను బోధిస్తారు.
ఈ స్ఫూర్తిని మనందరం అందిపుచ్చుకుందాం...
పిల్లలంతా శ్రీ మామయ్యగా పిల్చుకునే శ్రీవ్యాల్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దుండిగల్ వద్ద స్థలాన్ని కేటాయించింది. వీరి కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు జెజె మెహతా మెమోరియల్ ఫౌండేషన్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు "స్ఫూర్తి" బాలల కోసం అప్పుడప్పుడూ కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. ఆ మధ్య అమెరికాలోని మేరీలాండ్ ఫస్ట్ లేడీ మేరీ క్యాథరీన్ కూడా ఈ ఫౌండేషన్‌కు వచ్చి అభినందనలు కూడా తెలిపారు.
"స్ఫూర్తి" బాలలందరికీ భోజనం, బస, వస్త్రాలు, కాన్వెంట్ చదువు ఉచితమే. 7వ తరగతి వరకూ అక్కడి ప్రయివేట్ పాఠశాలలోను, తర్వాత 10వ తరగతి వరకూ "అధ్య"లో వీరిని చదివిస్తారు. సంగీతంతో పాటు ఇక్కడ కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ పాఠ్యప్రణాళికను బోధిస్తారు.
ఈ స్ఫూర్తిని మనందరం అందిపుచ్చుకుందాం...
Wednesday, January 30, 2013
శివుని మెడలో ఒక పామే.. మరి రతీష్ దగ్గర ?..
పాముల నుంచి కాపాడుకోవడానికి వాటిని చంపాల్సిన పనిలేదని గొంతు చించుకుని అరుస్తుంటాడు రతీష్. విషపూరిత పాములతో ఎలా వ్యవహరించాలో కనిపించినవారికల్లా వివరిస్తుంటాడు. విషముండే పాములేవో.. విషం లేనివి ఏవో యువతరం, విద్యార్థుల్లో అవగాహన కల్గిస్తుంటాడు. అంతెందుకు, వాటి కోసం కోయంబత్తూరు సమీపాన ఇడయారుపాలెంలోని తన ఇంటిని ఏకంగా సర్ప గృహంగా మార్చేశాడు. ఏ పాముకు ప్రమాదం వాటిల్లినా అది రతీష్ సర్పగృహానికి వచ్చి చేరాల్సిందే..
తన ప్రాంతంలోని సుమారు 250 కిలోమీటర్ల పరిధిలో ప్రజల దురవగాహన వల్ల, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ కనీసం 10 పాములు చనిపోతున్నాయని రతీష్ అంచనా. రోడ్డు ప్రమాదాల్లో తోకలు తెగి, శరీరాలకు గాయాలైన దాదాపు యాభైకి పైగా పాములకు ఇతను తన సర్పగృహంలో సేవలందిస్తున్నాడు. అవి కోలుకోగానే అడవుల్లోనూ, కొండల్లోనూ విడిచిపెడుతుంటాడు. పాములకు ఎవరైనా హానికల్గిస్తున్నారని తెలిస్తే సహించడు. వారి ఎదురుగానే ఆ సర్పాలతో మైత్రిని ఏర్పరుచుకుని అబ్బురపరుస్తాడు.
ఆపదలో ఉన్న సర్పాలకు సేవలందించడం కోసం ఏడుగురితో ఒక బృందాన్ని కూడా రతీష్ సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా పాములకు ముప్పు వాటిల్లినట్లు సమాచారం రాగానే ఈ బృందం అక్కడ వాలిపోతుంది. సర్పసేవలో తరిస్తుంది.
తన ప్రాంతంలోని సుమారు 250 కిలోమీటర్ల పరిధిలో ప్రజల దురవగాహన వల్ల, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ కనీసం 10 పాములు చనిపోతున్నాయని రతీష్ అంచనా. రోడ్డు ప్రమాదాల్లో తోకలు తెగి, శరీరాలకు గాయాలైన దాదాపు యాభైకి పైగా పాములకు ఇతను తన సర్పగృహంలో సేవలందిస్తున్నాడు. అవి కోలుకోగానే అడవుల్లోనూ, కొండల్లోనూ విడిచిపెడుతుంటాడు. పాములకు ఎవరైనా హానికల్గిస్తున్నారని తెలిస్తే సహించడు. వారి ఎదురుగానే ఆ సర్పాలతో మైత్రిని ఏర్పరుచుకుని అబ్బురపరుస్తాడు.
ఆపదలో ఉన్న సర్పాలకు సేవలందించడం కోసం ఏడుగురితో ఒక బృందాన్ని కూడా రతీష్ సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా పాములకు ముప్పు వాటిల్లినట్లు సమాచారం రాగానే ఈ బృందం అక్కడ వాలిపోతుంది. సర్పసేవలో తరిస్తుంది.
Friday, November 30, 2012
పంచానన్ పడూయ్.. ఎందరికి తెలుసు ?
రేపటి కోసం అంటూ ఒక్క పైసా దాచుకోకుండా తాను జీవితాంతం గడించిన జీతంలో 90 శాతం మొత్తాన్ని పశ్చిమ బెంగాల్లోని 685 పాఠశాలలకు విరాళంగా ఇచ్చిన ధన్యజీవి, విద్యాదాత శ్రీ పంచానన్ పడూయ్. హౌరాలోని డోమ్‌జడ్ ప్రాంతానికి చెందిన ఈ ఉపాధ్యాయుడు. ఏడేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయి, ఉన్న పొలం కాస్తా కరవు కోరల్లో చిక్కుకోవడంతో ఈ కుటుంబం నిరుపేదగా మారింది. తన తల్లి మట్టికుండల్లో చాలీచాలని బియ్యాన్ని వండిపెట్టేదట. సాయం పొందే అవకాశమేలేకపోయింది. పశువులు కాశారు, గడ్డి కోశారు. డబ్బున్నవారిళ్ళల్లో బట్టలుతికారు. చీరెలు అమ్మారు. జౌళి మిల్లులో పనిచేశారు. ఈ క్రమంలో రాత్రి వేళ చదువుకుని బికాం పాసయ్యారు. రాహ్రాలోని శ్రీ రామకృష్ణ మిషన్ ద్వారా పీజీ పూర్తి చేశారు. చివరికి హిందీ పండితునిగా ఉద్యోగంలో స్థిరపడ్డారు.
ఒకప్పుడు తనకే గనుక ఉద్యోగం వస్తే ఆర్థిక ఇక్కట్లతో చదువుకోలేకపోయిన వారికి ధన సహాయం చేయాలని ఆ రోజుల్లోనే నిశ్చయం చేసుకున్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం పెళ్ళికి దూరంగా ఉండాలని కూడా ఒట్టు పెట్టుకున్నారు శ్రీ పడూయ్. తన ఇంట్లో వెలుగు కోసం లాంతరు, కొవ్వొత్తులూ ఉపయోగించుకుంటూ కరెంట్ వాడకాన్ని సైతం పక్కనపెట్టారు. ఎందుకంటే కరెంటు బిల్లుకయ్యే ఖర్చుతో మరో విద్యార్థికి సాయం చెయ్యచ్చు కదా అంటారాయన. బిగ్డే స్కూలులో 28 సంవత్సరాలు పనిచేసి 1997లో పదవీ విరమణ చేసిన తర్వాత మూడేళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఈయన్ని ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి గౌరవించింది.
ఒకప్పుడు తనకే గనుక ఉద్యోగం వస్తే ఆర్థిక ఇక్కట్లతో చదువుకోలేకపోయిన వారికి ధన సహాయం చేయాలని ఆ రోజుల్లోనే నిశ్చయం చేసుకున్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం పెళ్ళికి దూరంగా ఉండాలని కూడా ఒట్టు పెట్టుకున్నారు శ్రీ పడూయ్. తన ఇంట్లో వెలుగు కోసం లాంతరు, కొవ్వొత్తులూ ఉపయోగించుకుంటూ కరెంట్ వాడకాన్ని సైతం పక్కనపెట్టారు. ఎందుకంటే కరెంటు బిల్లుకయ్యే ఖర్చుతో మరో విద్యార్థికి సాయం చెయ్యచ్చు కదా అంటారాయన. బిగ్డే స్కూలులో 28 సంవత్సరాలు పనిచేసి 1997లో పదవీ విరమణ చేసిన తర్వాత మూడేళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఈయన్ని ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి గౌరవించింది.
Saturday, September 01, 2012
భర్త నుంచి భార్యను రక్షించిన డ్రైవర్...
కలకత్తాలో ఒక ఇల్లాలిని వ్యభిచారకూపంలో పడేయాలనుకున్న భర్త నుంచి ఆమెను ఒక టాక్సీ డ్రైవర్ కాపాడాడు. శ్యామ్ లాల్ సొరెన్ అనే వ్యక్తి తన భార్యతో కలసి ఒక షేర్ టాక్సి ఎక్కాడు. భార్యను వెనుక సీట్లో కూర్చోబెట్టి ముందు సీట్లో ఉన్న డ్రైవర్ పక్కన తాను కూర్చున్నాడు. ఆ షేర్ టాక్సీలో ఉన్న మిగతా ప్రయాణీకులందరూ దిగిపోయాక కలకత్తాలో అమ్మాయిలను అమ్మడానికి సరైన చోటేదని డ్రైవర్ చెవిలో మెల్లగా అడిగాడు. అక్కడికి తీసుకెళితే 250 రూపాయలిస్తానని ఆశపెట్టాడు. శ్యామ్ లాల్ తీరుతో విస్తుపోయిన ఆ డ్రైవర్ మరేమీ మాట్లాడకుండా ఆ మహా నగరంలోని వీధుల గుండా తీసుకెళుతూ సెక్రెటేరియట్ దగ్గర ఆపాడు. అక్కడున్న పోలీసుల్ని పిలిచి శ్యామ్ లాల్ పన్నాగం గురించి చెప్పాడు. పోలీసులు డ్రైవర్‌తో పాటు శ్యామ్ లాల్, అతని భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మూడు నెలల కిందటే పెళ్ళి చేసుకున్న శ్యామ్ లాల్‌కు ఏమైందో తెలియదు గానీ తన భార్యను అత్తారించికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వ్యభిచార కూపంలోకి నెట్టాలని చూశాడు. కానీ టాక్సీ డ్రైవర్ మంచితనంతో ఈ ఘోరం తప్పింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల పైన ఆరోపణలు వస్తుంటాయి. తామంతా అలాంటివారం కాదని ఈ టాక్సీ డ్రైవర్ నిరూపించాడు.
Tuesday, July 31, 2012
రోగాలున్నా డబ్బులు తిరిగిచ్చేశారు..
అక్రమార్జన, అవినీతి కలసి ప్రళయ రుద్రతాండవం చేస్తున్న రోజులివి. వ్యక్తులను.. సామాజిక వాతావరణాన్నీ అనారోగ్యం పట్టి పీడిస్తున్న పరిస్థితులివి. అలాంటి తరుణంలో 89 సంవత్సరాల రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి చార్లెస్ విలియమ్స్ అనే ఆయన తన నిజాయితీని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం మైసూరులో నివసిస్తున్న ఈయన అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ తన పెన్షన్ అకౌంట్‌లో తనకు రావలసిన మొత్తంకంటే ఎక్కువగా జమ అయిన డబ్బును తిరిగిచ్చేశారు.
విలియమ్స్ గారు మన దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా చేరారు. పలు యుద్ధాల్లో పాల్గొని ఎన్నో చారిత్రక అనుభవాల గూడుగా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత తనకు రావలసిన పెన్షన్ మొత్తంలో పొరపాట్లు చోటు చేసుకున్నట్లు గ్రహించిన విలియమ్స్ స్థానిక సైనిక సంక్షేమం, రీసెటిల్మెంట్ బోర్డు వారిని కలుసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి మైసూరులోని వెకరె ఎక్స్ సర్వీస్‌మెన్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎం ఎన్ సుబ్రమణిని సంప్రదించారు. చివరికి మంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌కు చెందిన సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఎక్కువ మొత్తం విలియమ్స్ పెన్షన్ ఖాతాలో పడినట్లు లెక్కల్లో తేలింది.
తనకు అర్హత లేనప్పటికీ fixed medical allowance కింద ప్రతి నెలా రూ.300 చొప్పున అదనపు మొత్తంగా ఖాతాలో 2007 నుంచీ రూ.15,200 జమ అయినట్లు గ్రహించిన విలియమ్స్ ఈ మొత్తాన్ని తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి కంటి సమస్య, గుండెకు ఆపరేషన్ కోసం ప్రస్తుతం ఆయన ఒకటిన్నర లక్ష రూపాయల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తనకు ఇబ్బందులున్నప్పటికీ దేశ ఖజానాపై భారం మోపకూడదన్న నైతికతతో ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు వారికి లేఖ పంపి తనపై ఆర్థిక భారం పడకుండా ఈ డబ్బును సులభ వాయిదాల్లో వెనక్కి తీసుకోవలసిందిగా కోరారు.
ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటో చెప్పనక్కరలేదనుకుంటా...
Saturday, June 30, 2012
రూపాయికే బీజా...పూర్ ఫీడింగ్
ఒక్క రూపాయిస్తే నాలుగు జొన్న రొట్టెలు, వాటికి సరిపడా కూర. ఎంతమంది వచ్చినా ఇదే రేటు అక్కడ. ఇంతకుముందు 50 పైసలకే ఇదంతా ఇచ్చేవారట. 50 పైసలు కనుమరుగైపోవడంతో ఈ ధరను రూపాయికి పెంచారు. ఆ రూపాయి కూడా ఇవ్వలేనివారికి ఉచితంగానే ఈ రొట్టెలు, కూర ఇస్తారు. ఇంతకీ ఈ దృశ్యం ఎక్కడిదనుకుంటున్నారా ? కర్ణాటకలోని బీజాపూర్ పట్టణంలోని కబ్‌రాజీ బజార్‌లో ఉన్న హేమంత్ నగర్ దుకాణం వద్ద ఒక చేత్తో రూపాయి.. మరో చేత్తో విరిగిన పళ్ళెమో లేక పాలిథిన్ కవరో పట్టుకుని మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య సమయంలో పేదలు వరుసలో నిల్చుని ఉంటారు.
ఇది దాదాపు నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్న సేవ. అప్పట్లో హేమంత్ తండ్రిగారు కేవలం 10 పైసలకే పేదల కోసం ఈ సేవను ప్రారంభించారట. అప్పటి 10 పైసలుకానివ్వండి.. ఇప్పటి రూపాయి కానివ్వండి. ఈ మొత్తం సొమ్ముకు మరి కొంత డబ్బు చేర్చి వంటవారికి, రొట్టెల కోసం పిండి ఆడే మిల్లువారికి ఇస్తుంటారు. హేమంత్ కుటుంబం చేస్తున్న ఈ సేవ గురించి తెలిసినవారు ఈ సేవలో భాగస్వాములై ఎంతో కొంత సొమ్మును విరాళంగా ఇస్తుంటారు. కొందరైతే జొన్నలు, కూరగాయలు ఇస్తుంటారు. దాతలెవరైనా 08352 250114 ద్వారా హేమంత్ నహర్‌ను సంప్రదించవచ్చు.
Wednesday, May 30, 2012
పదేళ్ళ కుర్రాడు.. ప్లెయిన్ ఐస్‌క్రీం చాలన్నాడు..
ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఆ రోజుల్లో సన్‌డా ఐస్‌క్రీం వెల ఒకొక్కటి యాభై సెంట్లు. ఆ రోజుల్లో పిల్లలకు ఇది మహా ప్రాణమట. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హేరిస్‌బర్గ్ అనే ఊరిలో ఎప్పుటూ కిటకిటలాడే ఒక ఐస్‌క్రీం పార్లర్‌లోకి పదేళ్ళ కుర్రాడొకడు అడుగుపెట్టి టేబుల్ ముందు కూర్చున్నాడు. వెయిట్రెస్ వచ్చి గ్లాస్ మంచినీరు ఇచ్చి నిలబడింది...
ఐస్‌క్రీం సన్‌డా ఎంత ?.. అడిగాడు ఆ అబ్బాయి.
యాభై సెంట్లు.. చెప్పిందామె.
ఆ అబ్బాయి తన జేబులో ఉన్న నాణేల్ని లెక్కబెట్టుకుంటూ మళ్ళీ అడిగాడు.
మామూలు ఐస్‌క్రీం ఎంత ?..
అక్కడ చాలామంది కస్టమర్లు ఉండటంతో "ముప్ఫై ఐదు సెంట్లు.." అని విసుగ్గా చెప్పింది ఆ వెయిట్రెస్.
పిల్లవాడు తన దగ్గరున్న నాణేలన్నిటినీ లెక్కబెట్టుకుని చివరికి ఒక ప్లెయిన్ ఐస్‌క్రీం తెమ్మని అడిగాడు.
ఆమె ఐస్‌క్రీంతో పాటు బిల్ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళింది. ఈ పిల్లవాడు దాన్ని తినేసి కౌంటర్‌లో డబ్బు చెల్లించి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఈ వెయిట్రెస్ ఆ ఖాళీ కప్ తీసుకెళ్ళడానికి ఈ అబ్బాయి కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చింది. ఖాళీ కప్ పక్కనే రెండు నికెల్స్, ఐదు పెన్నీ నాణేలు.. మొత్తం 15 పెన్నీలు కూడా కనిపించాయి. వెయిట్రెస్‌కు టిప్ ఇవ్వడం కోసం పిల్లలు ఎంతో ఇష్టపడే సన్‌డా ఐస్‌క్రీం వద్దనుకుని మరీ ఈ పిల్లవాడు మామూలు ఐస్‌క్రీం ఆర్డర్ చేసినట్లు ఆమె గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు.
సౌజన్యం: శ్రీ మల్లాది కృష్ణమూర్తిగారు...
Saturday, March 31, 2012
పుస్తకాల డాక్టర్..
వైద్యుడి కోసం రోగులు ఎదురు చూస్తుంటారు. ముల్లంగి వెంకట రమణారెడ్డి కోసం పుస్తకాలు ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే చెదలుపట్టి, కుట్లు ఊడి, రేపోమాపో గాలికెగిరిపోయే పరిస్థితుల్లో ఉన్న వేలాది పుస్తకాలకు ఊపిరిపోసి పునర్జన్మనిచ్చారు ఈ విశాఖ వాసి. తన సైకిల్ పై నగరంలోని గ్రంథాలయాల్ని సందర్శించి అక్కడ అట్టలు విడిపోయి, చిరిగిపోయి, కుట్లు తెగిన పుస్తకాలను పట్టుకెళ్ళి బాగుచేసి చదువరుల కోసం సిద్ధం చేస్తుంటారాయన. పుస్తకాలకు జీవంపోయడమేగాక పలు గ్రంథాలయాలకు ఎన్నెన్నో పుస్తకాల్ని తన స్వంత ఖర్చుతో సమకూర్చారు. తెలుగులో తొలి కార్టూనిస్ట్ అయిన తలిశెట్టి రామారావు గురించి పరిశోధన చేశారు. పుస్తకాలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా, వాటి ద్వారా సముపార్జించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన ధన్యజీవి ఈయన. 55 ఏళ్ళ కిందటే బాల వితంతువు అయిన తన మామయ్య కుమార్తెను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. పుస్తకాలనే కాదు సమాజాన్ని సైతం సంస్కరించే వైద్యుడయ్యారు రమణారెడ్డి.
Subscribe to:
Posts (Atom)
