Wednesday, May 31, 2006

నిన్న టీ విక్రేత.... నేడు ఐఏఎస్ విజేత

ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సింఘపూర్ గ్రామంలో నివసిస్తున్న సాహు అనే 62 ఏళ్ల పెద్దమనిషికి గత 30 ఏళ్లుగా తెలిసిన ఏకైక వృత్తి టీ తయారు చేసి బిస్కెట్లు అమ్ముకోవడమే. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. భార్య ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలతో ఉన్న సాహు కుటుంబానికి అతని సంపాదన ఏ మూలకూ చాలదు. మరి ఆయన కొడుకు మనోజ్ కూడా అదే వాతావరణంలో పెరిగినా తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తూ అక్షరాల పుట్టగా రూపొందాడు. ఆ ఊరి పల్లెటూరిలో తన కొడుకు ఒక టీచరు ఉద్యోగం సంపాదిస్తే చాలని మనోజ్ తండ్రి సాహు బుల్లి ఆశ మాత్రం పెట్టుకున్నాడు. ఆ తండ్రికి మనోజ్ అందించిన కానుక ఏమిటో తెలుసా ? ఎటువంటి కనీస సదుపాయాలూ లేని పరిస్థితుల్లో, ఏ మాత్రం శిక్షణ లేకుండా పల్లె వాతావరణంలో పెరిగిన మనోజ్ ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడై జాతీయ స్థాయిలో 34వ ర్యాంకు సాధించాడు. వేలకు వేలు ఫీజులు పోసి పట్టణాల్లోని ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరూ పెద్ద పెద్ద శిక్షణా కేంద్రాల్లో చేరి సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న సంగతి అందరికీ తెలుసు.

మనోజ్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. 10వ తరగతి వరకూ తన పల్లెటూరిలోనే చదువుకున్న మనోజ్ తన ప్రతిభతో ప్రభుత్వ ఉపకార వేతనం పొంది భువనేశ్వర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో యు.జి ముగించాడు. ఆ తర్వాత గుజరాత్‌లోని జునాగఢ్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌లో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. తర్వాత ఉద్యోగాన్వేషణలో ఢిల్లీ వెళ్లి విజయవంతంగా స్వయంకృషితో సివిల్స్ పూర్తి చేశాడు. కేవలం స్వశక్తితోనే ఎదిగిన మనోజ్‌ను మే 28న గ్రామస్తులంతా కలిసి ఉరేగింపుగా తీసుకెళ్లి గౌరవించగా, అతనికి చదువు చెప్పిన ఆ ఉరి ఉపాధ్యాయులే దండలు వేసి ఆశీర్వదించారు. అదే విధంగా ఆనందభాష్పాల మధ్య అతని తల్లిదండ్రులనూ సత్కరించారు. ఆత్మబలం ఉండాలే కానీ దేనినైనా సాధించేందుకు పేదరికం అడ్డుకానేకాదని నిరూపించిన ఎందరో బుద్ధిజీవుల సరసన ఇప్పుడు మనోజ్ కూడా నిలిచాడు. సింఘపూర్ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డే ఈ ఘనతను సాధించినంత ఆనందపడుతున్నారు.