Monday, December 28, 2009

నెత్తురు ఉడుకుతోంది... మా రక్తం తీసుకోండి

అస్సాం రాష్ట్రానికి 2008వ సంవత్సరం ఒక పీడకలలాంటిది. వరుస బాంబు దాడులతో ఈ ఈశాన్యరాష్ట్రం అతలాకుతలమైంది. అలాంటి ఒక సందర్భంలో జరిగిన భయానక బాంబుదాడి పెద్దసంఖ్యలో జనాన్ని క్షతగాత్రుల్ని చేసింది. వారి ప్రాణం నిలపడానికి కావలసినంత రక్తం లేక ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. చూస్తూ చూస్తూ కళ్ళముందే ప్రాణాలు పోతుంటే తట్టుకోలేకపోయిన గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బందికి మనసు కకావికలమైంది పాపం. చివరికి మీడియా, ఎస్ఎంఎస్‌ల ద్వారా రక్తం కోసం వీలైనంతమందికి విజ్ఞప్తులు పంపారు. ఎవరైనా స్పందిస్తే బాగుంటుందని, ఒక వేళ స్పందించినా వారిచ్చే రక్తం సరిపోతుందో లేదోనన్న ఆందోళన.

మరికాసేపటికి ఉరుకులు పరుగుల మీద వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు. వారంతా బాంబు దాడి బాధితులేమోనని ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి. వచ్చింది బాధితులు కాదు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలవారు, వ్యాపారులు, వినోదరంగాలకు చెందినవారు ముందుకొచ్చి మేమంటే మేమంటూ రక్తమివ్వడానికి ఉత్సాహం చూపారు. బాంబు దాడులతో మా నెత్తురు ఉడికిపోతోంది... మారక్తం తీసుకుని మావాళ్ళను కాపాడండి అని వారంతా ముక్తకంఠంతో స్పందించారు.

ఆ రోజున వారిచ్చిన రక్తంతో ఎందరో బాధితులు బతికిబట్టకట్టారు. బ్లడ్ బ్యాంకుల్లో అయితే ఇక రక్తం దాచే చోటు కూడా లేదు. దాంతో చాలామంది దాతల వివరాలు తీసుకుని అవసరమైతే కబురు చేస్తామని బలవంతంగా తిప్పిపంపారు. ప్రజల స్పందనతో గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎం ఎం దేకా ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఐక్యత దేశమంతటా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. దాతల రక్తంతో పునర్జన్మ ఎత్తిన బాధితులు ఆ ప్రేమ దేవుళ్ళకు చేతులెత్తి మొక్కారు.

Wednesday, December 23, 2009

ఫోన్ చేస్తే రక్తమిస్తా....

మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ప్రశాంతినగర్ వాసి అయిన వరాల ప్రశాంత్ కుమార్ ఎప్పుడూ 'బీ పాజిటివే'. మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ 'సంచార రక్తనిధి'గా ప్రశంసలందుకున్నాడు. అంతేకాదు, ఫోన్ చేస్తే చాలు స్పందిస్తానంటూ తన ఫోన్ నెంబర్లు సైతం బహిరంగంగా ప్రకటించాడు (9397675737, 9949453585). రాత్రి, పగలన్న తేడా లేకుండా అత్యవసర సమయాల్లోను, రక్తం కావాలని వచ్చే టీవీ ప్రకటనలకు స్పందించి రక్తమిచ్చి ఎన్నో ప్రాణాల్ని నిలబెట్టాడు. లెక్కలేనన్నిమార్లు రక్తమివ్వడమేగాక, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాడీ నిజమైన దేశభక్తుడు. ఆర్తులపాలిటి వరాల మూట వరాల ప్రశాంత్ కుమార్.

Tuesday, December 22, 2009

అతను కూరొండుకోలేదు

చెన్నైలోని పులియంతోపు ప్రాంతంలో జూలై 25, 2006వ తేదీన జరిగిందీ ఘటన. ఉదయం 7.30 గంటల సమయంలో ఒక ఆటోడ్రైవర్ ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడు. అప్పుడు దారిలో పడి ఉన్న ఒక గుడ్లగూబ చుట్టూ కొన్ని కాకులు చేరి దాన్ని పొడుస్తుండటం ఈ ఆటోడ్రైవర్ కంటబడింది. ఒక్కసారిగా బండికి బ్రేక్ వేసి దాన్ని కాకుల బారినుంచి కాపాడి అక్కడికి సమీపాన ఉన్న అగ్నిమాపక దళం సిబ్బందికి విషయం చెప్పాడు. వారు వెంటనే ఆ గుడ్లగూబకు ప్రాథమిక చికిత్స చేసి బ్లూక్రాస్‌కు తరలించారు. అదే దారిలో వెళుతున్న చాలామంది వాహనదారులు వింతగా చూస్తున్నారే తప్ప ఒక్కరూ దానిని కాపాడే ప్రయత్నం చెయ్యలేదని ఆటో డ్రైవర్ ఆవేదన వెలిబుచ్చాడు. అదే మరొకరైతే ఈ గుడ్ల'గూబ గుయ్యిమని'పించి కూర వండేసుకుంటారు. ఒకప్పుడు మనకు రోజూ కనిపించే పిచ్చుకలతోబాటు పలురకాల పక్షి జాతులు నానాటికి అంతరించిపోతూ పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నప్పటికీ చదువుకున్నవారెందరో పట్టించుకోవడంలేదు. వారందరికీ ఆదర్శప్రాయుడీ ఆటో డ్రైవర్ (క్షమించండి, ఇతని పేరు తెలుసుకోలేకపోయాను).

Sunday, December 20, 2009

మూగజీవాల వృద్ధాశ్రమం

మనుషుల్లో మానవత్వం మృగ్యమై మృగాలవుతున్న ఈ రోజుల్లో చెన్నైకి చెందిన 45 ఏళ్ళ అశోక్ మాత్రం మూగజీవాల శోకాన్ని పోగొట్టేందుకు నడుం బిగించారు. 10 సంవత్సరాల కిందట చెన్నైలోని ఇంజంబాక్కంలో "బెంజీస్ డాగ్ అకాడెమీని" ప్రారంభించి తొలుత శునక (కుక్కలు) సంరక్షణ, తర్వాత మార్జాల (పిల్లులు) సంరక్షణ కూడా ఆయన చేపట్టారు. అమ్మానాన్నలు ముసలివారైతే ఎలా వదిలించుకోవాలా అని చూసే ఈ కాలం కుర్రకారు లాంటివారు కాదు అశోక్. ఈ మూగజీవాలకు వయసు మీరినా ఇబ్బందులు ఎదురుకాకుండా "మూగజీవాల వృద్ధాశ్రమం" కూడా ఏర్పాటు చేశారు. అవి తనువు చాలిస్తే వాటి అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా స్మశానవాటికను కూడా ఏర్పాటు చేశారాయన. ఈ మూగజీవాలకు అన్నంపెట్టి, వైద్యసేవలందించి ఆదరించడమేగాక వాటికి వివిధ అంశాల్లో తర్ఫీదునిప్పిస్తుంటారు. అందువల్ల అవి తెలుగు, తమిళ సినిమాల్లోను, వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తుంటాయి. అశోక్ జీవకారుణ్యం గురించిన స్థానికులు ఎప్పుడైనా బయటి ఊళ్ళకు వెళ్ళాల్సి వస్తే వారి జంతువుల్ని కొంతకాలం అశోక్ సంరక్షణలో ఉంచి వెళుతుంటారు. తన సేవలకు చెన్నైలో స్థలం చాలకపోవడంతో సమీపానగల ప్రముఖ పర్యాటకకేంద్రం మహాబలిపురంలో మరో విశ్రాంతి కేంద్రం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సేవలో ఆయన కుటుంబం తోడ్పాటు కూడా ఉంది.

అంధుని పంట పండింది

సకల అంగాలూ సక్రమంగానే పనిచేస్తున్నా కాలం కలసిరాలేదని కలత చెందే మందమతులకు అతను కనువిప్పు కల్గిస్తున్నాడు. నిరాశ, నిస్పృహలకు లోనైన వారికి ఈ అంధుని జీవితం ఒక గుణపాఠం. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం, చిగురుకోటకు చెందిన భట్రాజు చిననాగేశ్వరరావు కళ్ళముందు ఎప్పుడూ కారు చీకట్లే. ఒకరి తోడు లేకుండా తన జీవితం గడపలేని ప్రతికూల పరిస్థితుల్లో ఇతను వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. పుట్టుకతోనే కళ్ళులేని చిననాగేశ్వరరావు బ్రెయిలీ లిపి నేర్చుకున్నాడు. ఒకనాడు తన తండ్రితో బాటు పొలానికి వెళ్ళివస్తూ ఇతను కూడా సేద్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. కళ్ళు లేకున్నా కూలీలతో పనులు చేయిస్తూ దిగుబడుల్లో సాటి రైతులకంటే ముందున్నాడు. తనకు స్వంతంగా ఉన్న భూమితోపాటు ఇంకొంత భూమిని కౌలుకు సాగుచేసి మంచి 'ఫలసాయం' పొందాడు. ఒకప్పుడు చేపల చెరువుల నిర్వహణలో నష్టం రావడంతో తన భూములమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చినప్పటికీ దిగులుపడక మొక్కవోని దీక్షతో జీవితంలో ముందుగు సాగాడు చిననాగేశ్వరరావు.

Saturday, December 19, 2009

గొల్లనాగయ్య మూలికావైద్యం

మహబూబ్‌నగర్ జిల్లా చర్లపల్లికి చెందిన గొల్ల నాగయ్య కోసం ఆయన ఇంటివద్ద ప్రతిరోజూ వందల సంఖ్యలో జనం నిరీక్షిస్తుంటారు. మూలికావైద్యం, మేకపాలతో మందులివ్వడం ఈయన ప్రత్యేకత. ఏ మాత్రం డబ్బు ఆశించకుండా గత 30 ఏళ్ళ నుంచీ ఆయన ఈ సేవలందిస్తున్నారు. విశేషమేంటంటే... పెద్ద ఆసుపత్రుల్లో పనిచేసే నర్స్‌లు, ఇతర సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఆయన వైద్య సేవలందుకుంటుంటారు. గొల్ల నాగయ్య కుమారులు కూడా తండ్రి బాటనే అనుసరిస్తూ రోగులకు స్వాంతన కల్గిస్తున్నారు. రోగుల సౌకర్యార్థం వారు తమ స్తోమత మేరకు ఒక రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేసి ధన్వంతరి ఆశీస్సులు అందుకుంటున్నారు. గొల్ల నాగయ్య వైద్యం ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయించింది. అన్నట్టు మరిచిపోయా... ఈయన వైద్య సేవలు మూగజీవాలకు కూడా అందుతున్నాయ్.

వికలాంగుని చేపలవేట...

ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం సమీపానగల కె పల్లెపాలెం వాసి ఏసురత్నం. కాళ్ళులేని ఈ మత్స్యకారుడు తన ఇంట్లో పెద్దకొడుకు. ఈ వికలాంగుని చేపలవేటతోనే ఆ ఇంటికి పూటగడుస్తుంది. ముసలివారైన అమ్మానాన్నలు, అత్తింటివారి కట్నం వేధింపులతో తిరిగివచ్చిన సోదరి, మరో చెల్లెలు, ఒక తమ్ముణ్ణి ఇతను పోషిస్తున్నాడు. వీరుగాక మరో ఇద్దరు అక్కచెల్లెళ్ళకు తానే పెళ్ళిళ్ళు చేసి పంపాడు. కాళ్ళులేక తాను వికలాంగుడై ఉన్నప్పటికీ అతి కష్టం మీద తోటి జాలర్ల సాయంతో పడవ నడుపుకుంటూ చేపలకోసం నడి సముద్రంలోకి వెళ్ళోస్తాడితను. తీరనికష్టాలతో ఇతని కుటుంబమూ నడి సంద్రంలోనే ఉంది. అతని గుండె మాత్రం ఆత్మస్థైర్యపు అలలతో కదలాడుతూనే ఉంది. ప్రభుత్వ సాయం ఆశించక తన కుటుంబాన్ని తానే పోషించుకుంటున్న ఈ ఏసురత్నం... ఏ అమ్మానాన్నలకైనా నిజమైన పుత్రరత్నమే...

Friday, November 27, 2009

బ్యాంక్ మేనేజర్ జలయజ్ఞం

కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ దేవరాజ్ అక్కడ మైసూర్ స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 30 నదుల అనుసంధానం, 50 వేలకు పైగా కుంటలకు జీవం పొయ్యడం లక్ష్యంగా కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకూ కొన్నేళ్ళ కిందట పాదయాత్ర చేపట్టారాయన. ఇందుకోసం తన ఉద్యోగానికి 9 నెలల పాటు సెలవు పెట్టి తన యాత్రలో భాగంగా 2006లో ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు. అప్పటికి ఆయన 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. తన పాదయాత్రలో భాగంగా ఆయన పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి నదులను అనుసంధానించాల్సిన అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈయన చేపట్టిన ఈ జలయజ్ఞం స్ఫూర్తిని రాజకీయ నాయకులు కూడా అందిపుచ్చుకోవాలి.

Thursday, November 26, 2009

సేవకుడు బాలసుబ్రహ్మణ్యన్

తమిళనాడులో దక్షిణాది కుంభమేళాగా గుర్తింపు పొందిన మహామాఘం ఉత్సవం అంటే అందరికీ గుర్తుకొస్తారు 95 ఏళ్ల పైబడిన బాలసుబ్రహ్మణ్యన్. ఇంత పెద్దవయసులోనూ ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలలో సేవ చెయ్యడం కోసం పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవకులతో సన్నద్ధులవుతారు బాలసుబ్రహ్మణ్యన్. 1932 నుంచి ఈ సేవాయజ్ఞాన్ని తలపెట్టి 1944, 1956, 1968, 1980, 1992 సంవత్సరాల్లోనూ... తర్వాత 2004లో 95 ఏళ్ళ వయసులోనూ స్వచ్ఛంద సేవకుల బృందానికి నేతృత్వం వహించి తన బాధ్యతను నిర్వర్తించారాయన. స్కాట్స్ అండ్ గైడ్స్‌తో సుదీర్ఘకాల సాన్నిహిత్యం కలిగి ఉన్న బాలసుబ్రహ్మణ్యాన్ని తమిళనాడు ప్రభుత్వం నాగపట్టణం జిల్లాకు శాశ్వత కమిషనర్‌గా నియమించింది. న్యాయశాస్త్రపట్టభద్రుడైన ఈ సేవకుడు క్రైస్తవుల ఆరాధ్యదైవమైన వేలాంకన్నిమాత ఉత్సవానికి కూడా స్వచ్ఛంద సేవకులను తీసుకెళ్ళారు. అక్కడ రోటరీ క్లబ్ అధ్యక్షునిగా, వినియోగదారుల మండలిలోను, ఉచిత న్యాయసహాయ సంఘంలోను సభ్యునిగా సేవలందించారు. నాగపట్టణం సెయింట్ జాన్స్ అంబులెన్స్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.

Thursday, October 29, 2009

యమధర్మరాజా ఎంటర్‌ప్రైజెస్

పాన్ షాపులు, చిల్లర దుకాణాల్లో ఎక్కవగా అమ్ముడయ్యేవి బీడీలు, సిగరెట్లు, కిళ్ళీలు. చెన్నైలోని మందవెలి ప్రాంతంలో చిల్లర కొట్టు నడుపుకుంటున్న శివశంకర్ అనే దుకాణదారుడు ఇవేమీ అమ్మడు. కానీ ఆయన దుకాణం ముందు ఒక బోర్డ్ మాత్రం దర్శనమిస్తుంది. దానిపైన తమిళంలో రాసి ఉన్న ప్రకటనకు తెలుగు అనువాదం ఇది...

బంపర్ బహుమతులు

రోజూ క్రమం తప్పక బీడీలు, సిగరెట్లు తాగేవారికి మా యమధర్మరాజ ఎంటర్‌ప్రైజెస్ అందించే అద్భుతమైన బహుమతులు.

మొదటి బహుమతి - గుండె జబ్బు

రెండవ బహుమతి - పక్షవాతం

మూడవ బహుమతి - టీబీ

వారం వారం కానుక - ఆర్థిక సమస్యలు

శాశ్వత కానుక - మనోవేదన

బంపర్ బహుమతి - క్యాన్సర్...

ఇవి చాలా... ఇంకా కావాలా ?

కళాకారుడు... సేవాతత్పరుడు

అతను ఒక సాధారణ తోటమాని కొడుకు. పేరు ప్రభాకరన్ (25). తమిళనాడులోని తన స్వస్థలమైన ముత్తుక్కాడులో తన 12వ సంవత్సరం నుంచీ సంప్రదాయ కళలైన తప్పెట, సిలంబాట్టం (కర్రసాము), గరగాట్టం, ఒయిలాట్టం, దేవరాట్టం లాంటివి నేర్చుకుని అమెరికా, బెల్జియం, స్పెయిన్, నెదర్లాండ్స్, హాలెండ్ తదితర దేశాల్లో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. అతను కేవలం ప్రదర్శనలకే పరిమితం కాలేదు. ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బుతో వికలాంగులకు చేయూతనిస్తుంటాడు. తనను ఇంతవాడిని చేసిన సంప్రదాయ కళల పునరుద్ధరణకు తోడ్పడుతుంటాడు. కళాకారులు ఎలా జీవించాలో చెప్పే పాఠమై నిలిచాడు. రుద్రవీణ సినిమాలో చిరంజీవిలాగా...

Tuesday, September 29, 2009

కండ(డా)క్టర్

బస్సులో టిక్కెట్ల గురించేకాదు, ప్రయాణీకుల ఆరోగ్యపు ఇక్కట్ల గురించి కూడా తెలుసు ఆ కండక్టర్ గారికి. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు తన ప్రవృత్తిగా వనమూలిగా వైద్యాన్ని ఎంచుకున్నారు. పేదలకు ఉచితంగా వనమూలికా వైద్యం చేస్తుంటారు. తన ఇంటి పెరట్లోనే ఔషధ మొక్కలు పెంచుతూ చిన్నతనం నుంచే మూలికల పట్ల మంచి అవగాహన పెంచుకున్నారు. ఆది, మంగళవారాలు ఈయనకు సెలవుదినాలు కావడంతో తన భార్య తోడ్పాటుతో ఇంటివద్దే మందులు తయారు చేసి స్థానికులకు వైద్యపరమైన చేయూతనిస్తున్నారు.

బాలింతలారా మొక్కలతో రండి

పండంటి బిడ్డను ప్రసవించేందుకు ఆ ఆసుపత్రికి వెళ్ళే ఏ గర్భిణి అయినా ఒక మొక్కను చేతబట్టుకుని మాత్రమే ఆ మెట్లెక్కాలి. అటు పర్యావరణ పరిరక్షణ, ఇటు రోగుల ఉల్లాసం లక్ష్యంగా ఆ ఆసుపత్రి వైద్యులు పెట్టిన నిబంధన అది. దీనిని కనులారా గాంచాలనుకుంటే తమిళనాడులోని మదురై జిల్లా రాజ్‌కూర్‌లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలి. ఇక్కడున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవానికి వచ్చే ప్రతి బాలింతా ఒక మొక్కను నాటాలని ఆసుపత్రి సిబ్బంది ఒక వినూత్న పథకం ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఆసుపత్రికి "మొక్కల ఆసుపత్రి" అనే పేరు వచ్చేసింది. అంతేకాదు, ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించే ఈ ఆసుపత్రి వైద్యురాలి సెల్ నెంబర్ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు. అందువల్ల వారు ఎప్పుడైనా తమ ఆరోగ్య సమస్యలపై ఏ సమయంలోనైనా వైద్యురాలిని సంప్రదించవచ్చు. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి మారుపేరని తరచూ విమర్శలు వెల్లువెత్తే నేటి పరిస్థితుల మధ్య ఒక ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ప్రజల మేలు కోరి ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

Friday, August 14, 2009

మిస్టర్, మీరు జీససా?

కొన్నేళ్ళ కిందట న్యూయార్క్‌లో జరిగిన ఒక రీజియనల్ సేల్స్ కన్వెన్షన్‌కి షికాగో నగరం నుంచి కొందరు సేల్స్‌మెన్ హాజరయ్యారు. అదయ్యాక తిరిగి షికాగోకి వెళ్ళడానికి వారంతా వేన్‌లో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. ట్రాఫిక్ రద్దీ వల్ల వారు ఎయిర్‌పోర్ట్‌కి ఆలస్యంగా చేరుకున్నారు. ఫైనల్ బోర్డింగ్ కాల్ ప్రకటన కూడా వారు విని హడావిడిగా ఒక చేత్తో ఎయిర్ బ్యాగ్, మరొక చేత్తో టికెట్ పట్టుకుని లోనికి పరుగులు తీశారు. ఆ కంగారులో అక్కడున్న ఏపిల్స్ స్టాండ్‌కి వారిలో ఒకరి కాలు తగిలి ఆ పళ్ళన్నీ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి. సెల్స్‌మెన్ అంతా వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా కౌంటర్ వైపునకు పరిగెత్తారు. ఒక్కరు తప్ప.

అతను ఆగి తన మిత్రుల్లో ఒకరితో గట్టిగా చెప్పాడు. "ఫ్రాన్సిస్. షికాగో చేరగానే నువ్వు మా ఆవిడకు ఫోన్ చేసి నేను తర్వాతి ఫ్లయిట్‌లో వస్తున్నానని చెప్పు"

ఆ ఏపిల్ స్టాండ్ మేనేజ్ చేసే 16 ఏళ్ళ పిల్ల సన్నగా ఏడుస్తూ నేలపై పడిన పళ్ళు ఏరుకుంటోంది.

విమానంలో మిత్రులతో పాటు వెళ్ళకుండా ఆగిన ఆ వ్యక్తి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, నేలపై చెల్లాచెదురుగా పడిన ఆఖరి ఏపిల్ కూడా ఏరి స్టాండ్‌లో ఉంచి చెప్పాడు. "ఏడవక. అన్నీ ఏరాను. దెబ్బ తిన్నవి వేరే ఉంచాను."

ఏడుస్తున్న ఆమె చేతిలో నలభై డాలర్ల నోట్లని ఉంచి చెప్పాడతను. "తీసుకో. ఇది నీకు జరిగిన నష్టానికి సరిపడే పరిహారం. నువ్వు దీని యజమానికి జవాబుదారీ అని నాకు తెలుసు."

ఆమె అతన్ని తడిమి చూస్తూ "మిస్టర్ మీరు జీససా?" అని అడిగింది.

ఆమె అతన్ని భావించినట్లుగా, మనల్ని ఎవరైనా దేవుడు అనుకునేలా, జీవితంలో ఒక్కసారైనా అలా నిస్వార్ధంగా ప్రవర్తించి ఉంటామా?

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.

Wednesday, August 12, 2009

అంధ(ద)మైన దత్తత

సంతానం లేనివారెవరైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఏం చేస్తారు? మొదట తమ మతం, తర్వాత తమ కులం, ఆ తర్వాత తమ బంధువులు లేదా స్నేహితుల కుటుంబాల్లోంచి ఎవర్నైనా దత్తత తీసుకోవాలని చూస్తారు. ఏమీ కాకుంటే అనాథ శరణాలయాలకే చివరిగా వెళ్ళేది. దత్తతగా తీసుకోదలచిన బిడ్డ ఆరోగ్యం సంగతి మరీ ముఖ్యంగా చూసుకుంటారు. ఇక అంగవైకల్యం ఉన్న పిల్లలంటే దత్తత మాట దేవుడెరుగంటూ అలాంటివాళ్ళు వద్దని ఆమడ దూరం పరుగు తీస్తారు. కానీ అమెరికాకు చెందిన అంధుడు జాన్‌కర్ల్ ఫీజ్, మేరీ దంపతులు మాత్రం దేశదేశాల్లో వెతికి వెతికి చివరికి మన దేశంలో అంధ బాలుడైన నాలుగేళ్ళ జ్యోతిని ఈ ఏడాది జూన్‌లో దత్తత తీసుకున్నారు. ఒరిస్సాలోని ప్రముఖ పట్టణం కటక్‌లో ఉన్న "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఈ కారుణ్యపూరిత సంఘటన చోటుచేసుకుంది. అంగవికలురైనవారు మరెవరినైనా దత్తత తీసుకుంటే ఆ బిడ్డ తమకు ఆసరాగా ఉండాలని భావిస్తారు. కానీ, అంధుడైన జాన్‌కర్ల్ తనలాంటి మరొక అంధుడిని దత్తత చేసుకోవడం అందర్నీ విస్మయపరిచింది. ఇందుకు కారణమేంటని అతన్ని అడిగితే.... అంధుడిగా పుట్టి తాను అనుభవిస్తున్న బాధలు మరొకరికి కలుగకుండా చూడాలనే భావనతో అంధ బాలుణ్ణి పెంచుకోదలచినట్లు చెప్పాడు. స్వశక్తితో కంప్యూటర్ సంస్థ యజమానిగా ఎదిగిన జాన్‌కర్ల్ భార్య మేరీ అమెరికాలోని ఒక అంధ విద్యార్థుల పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. ఇక జ్యోతి ఎవరంటే, కటక్‌లోని జగత్‌పూర్‌లో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో పుట్టాడు. పుట్టుకతోనే ఈ బాలుడు అంధుడు కావడంతో అతని తల్లిదండ్రులు ఇతన్ని రోడ్డుపైనే విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఈ అబ్బాయి "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చేరాడు.

Tuesday, July 21, 2009

దైవకార్యం కోసం పడవ మాయం

18వ శతాబ్దంలో సెయింట్ కొలంబియాకు 12 మంది మత ప్రచారకులను ఐరిష్ క్రైస్తవ మిషనరీ అప్పగించి అందరినీ ఉత్తర స్కాట్లాండ్‌కు పంపింది. అయితే, ఉత్తర స్కాట్లాండ్‌లోని పిక్ట్స్ అనే తెగకు చెందినవారు ఈ క్రైస్తవ మత ప్రచారకుల పాలిట యమకింకరుల్లా మారారు. ఈ సంగతి తెలిసీ ఇక్కడకు వచ్చిన కొలంబియా, ఆ మత ప్రచారకులు పడవ దిగిన వెంటనే ఆ పడవను తగలబెట్టేశారు. రాబోయే ప్రమాదాలకు భయపడి ఎప్పుడైనా తాము ఇదే మార్గంలో పడవ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవచ్చనే ఆలోచన రాకుండా, వచ్చినా ఆ అవకాశం లేకుండా కేవలం క్రైస్తవ మత ప్రచారమనే దైవకార్యం కోసం కట్టుబడి వారు తమ పడవను తామే తగులబెట్టుకున్నారు. తర్వాత స్కాట్లాండ్‌లో క్రైస్తవ మతం పాతుకుపోవడంలో వీరంతా అత్యంత కీలకపాత్ర పోషించారు.

మనం నమ్మిన దైవం కోసం దైవ కార్యం చెయ్యడానికి ప్రాణాలివ్వడానికి సిద్ధపడితే అన్నీ అనుకూలిస్తాయని ఈ ఘటన నిరూపించింది.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Monday, July 20, 2009

ప్రాణం పోతుందనుకుని రక్తమిచ్చాడు....

కెనడాలోని ఒంటరియో ప్రావిన్స్‌లో ఉన్న లిజ్ అనే టీనేజర్ ఒక అరుదైన, ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతోంది. ఆమె రోగానికి మందులేదు. ఆ రోగం వచ్చి తగ్గిన ఎవరి రక్తమైనా ఆమెకి ఎక్కిస్తే, అందులోని యాంటీబాడీస్ పనిచేసి ఆమె రోగం తగ్గవచ్చని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి కంప్యూటర్‌లోని రికార్డ్‌లను పరిశీలిస్తే కొద్ది కాలం కిందట మైఖేల్ అనే ఆరేళ్ళ బాలుడికి ఇదే రోగం వచ్చి తగ్గినట్లు వైద్యులకు తెలిసింది. వారు వెంటనే మైఖేల్ అమ్మానాన్నలతో మాట్లాడారు. ఒక ప్రాణం కాపాడటం కోసం రక్త మార్పిడి చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆరేళ్ళ చిన్నారి మైఖేల్‌ని ఒక రోజున ఆసుపత్రికి తీసుకువచ్చారు. రక్త మార్పిడి ఎలా జరుగుతుందో మైఖేల్‌కు వివరించిన వైద్యులు లిజ్ కోసం రక్తమివ్వడానికి అంగీకారమేనా అని అతన్ని అడిగారు. లిజ్ బతకడానికి రక్తం ఇస్తానని చిన్నారి మైఖేల్ చెప్పాడు.

రక్త మార్పిడి జరుగుతోంది. తన ఒంట్లోని రక్తం లిజ్ ఒంట్లోకి ఎక్కడం మైఖేల్ చూశాడు. కాసేపయ్యాక మైఖేల్ ముఖం పాలిపోయింది. ఏడుపు మొదలు పెట్టాడు. నొప్పిగా ఉందా అని ఒక వైద్యుడు అడిగినప్పుడు ఏమీ లేదని జవాబిచ్చాడు.

""నేను ఇక ఎంతసేపట్లో చనిపోతాను?'' అని మైఖేల్ అడిగాడు.

చిన్నపిల్లవాడైన మైఖేల్ తనకు వైద్యులు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. తన ఒంట్లోని రక్తం మొత్తం లిజ్‌కు ఎక్కిస్తారని, దాంతో తాను చచ్చిపోతానన్న అభిప్రాయంతో మైఖేల్ ఉన్నాడు.

""నువ్వు చనిపోవు. రక్తం అంతా తీసుకోం. కొంచమే తీసుకుంటాం'' అని మైఖేల్‌కు చెప్పాడు వైద్యుడు.

అయితే, తన రక్తం మొత్తం తీసేసి లిజ్‌కు ఎక్కిస్తారని, అందువల్ల లిజ్ బతుకుతుందని, అప్పుడు తాను మరణిస్తానని అనుకుని కూడా మైఖేల్ రక్తమివ్వడానికి ముందుకు రావడం ఆసుపత్రిలో అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. రక్తమార్పిడి జరిగాక మైఖేల్ ఇంటికి వెళుతుంటే అందరూ అతన్ని ఆరాధన భావంతో మెచ్చుకుని వీడ్కోలిచ్చారు.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Saturday, June 20, 2009

గవురుమెంటు డాట్రారు

గవురుమెంటు డాట్రారు అని మన పల్లెవాసులు అమాయకంగా పిలుచుకునే ఒక గవర్నమెంట్ డాక్టర్ గారికి కర్తవ్యం పట్ల ఉన్న నిబద్ధత ఎంత విలువైన ఫలితాన్ని ఇచ్చిందో తెలియజెప్పే ఘటన ఇది. జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీ రామారావు, కర్తవ్యం సినిమాలో విజయశాంతి చట్టానికి, న్యాయానికి ఎంత విలువనిచ్చారో తన వద్దకు వచ్చే రోగుల ప్రాణాలకు అంతకంటే ఎక్కువ విలువనిచ్చి కర్తవ్య పాలన చేశారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్ జ్యోతిర్మయి దత్తా. వృత్తిపట్ల దత్తాగారికి ఉన్న అంకితభావం చూస్తే మన తెలుగు సినిమాలు డాక్టర్ ఆనంద్, డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో రోగుల పట్ల ఆదరణ కనబరచిన ఎన్టీ రామారావు, అక్కినేని తప్పక గుర్తుకు వస్తారు. కాకుంటే దత్తా జీవితంలో డ్యూయెట్లుండవు అంతే...

గవురుమెంటు డాట్రారు అనగానే తమ వద్దకు వచ్చే రోగులకు రంగునీళ్ళు, నాలుగు తెల్ల మాత్రలు ఇచ్చే రకం అనే అభిప్రాయం జనంలో ఉంది. డాక్టర్ జ్యోతిర్మయి దత్తా అలాకాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్శిటీ బిఎ విద్యార్థి అయిన దుర్గాపూర్ నివాసి సంజొయ్ పుట్టుకతోనే కంటిచూపునకు దూరమై తాను గుడ్డివాడినని ధృవపత్రం తీసుకోవడం కోసం నేషనల్ మెడికల్ కాలేజి డాక్టర్ అయిన జ్యోతిర్మయి దత్తా వద్దకు వచ్చాడు. కొందరు డాక్టర్లు ఎంతో కొంత లంచం ఆ చేత్తో పుచ్చుకుని ఈ చేత్తో ధృవపత్రం ఇచ్చేస్తారు. దత్తా అలా చెయ్యకుండా 22 ఏళ్ళ సంజొయ్‌ని పరీక్ష చేశారు. సంజొయ్‌కు పుట్టుక నుంచే కంట్లో శుక్లాలున్నాయి. కంటిపై ఏదైనా బలమైన కాంతిపుంజం పడినప్పుడు కొంత అనుభూతి కలుగుతుంది. ఇతను "స్టిములస్ డిప్రైవేషన్ అమోలైపియా" అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న డాక్టర్ అతనికి శస్త్రచికిత్స చేస్తే తప్పక చూపు వస్తుందని గ్రహించి ఆ విషయాన్నే సంజొయ్‌కు చెప్పారు.

జీవితంలో 22 ఏళ్ళ కాలం చూపులేకుండా గడిపిన సంజొయ్ తనకు చూపు వచ్చే అవకాశాలున్నాయని తెలిసి ఆనందంగా శస్త్రచికిత్సకు ఒప్పుకున్నాడు. దీంతో ఇతనికి పలు పరీక్షలు చేసి ఈ ఏడాది మార్చి 14, ఏప్రిల్ 7 తేదీల్లో రెండు కళ్ళకూ శస్త్రచికిత్స చేశారు. కనుగుడ్డు కదలికలు అపసవ్యంగా ఉండటంతో అవి కూడా సరిచేశారు. కుడి కంట్లో ఉన్న సున్నం నిల్వలు తొలగించారు. మొదటి ఆపరేషన్ జరిగిన ఒక రోజు గడిచాక ఎడమ కంటి కట్టు తీసేసినప్పుడు కంటిపై చాలా బలమైన కాంతిపుంజం పడిన అనుభూతికి అతను లోనయ్యాడు. ఆ విషయాన్నే అతను డాక్టర్‌కు చెప్పాడు. దత్తా వెంటనే ఆ కన్ను తెరవమని సూచించారు. జీవితంలో మొదటిసారిగా తన సాటి మనిషిని చూశాడు సంజొయ్.

వైద్యులూ దత్తాను ఆదర్శంగా తీసుకుంటే అంతా మిమ్మల్ని వైద్యనారాయణులని కొలుస్తారని మర్చిపోకండి.

Sunday, June 14, 2009

బుద్ధి చెప్పే బాంద్రా బ్యానర్

ముంబై నగరంలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో నగల వ్యాపారం చేసుకునే వర్తకుడు కిశోర్ వాల్‌చంద్ జైన్. అందమైన ఆభరణాలను తళతళ మెరిసేలా తయారు చేసి ఖాతాదార్ల మెప్పు పొందడంలో దిట్ట ఈ వ్యాపారి. నగలు మాత్రం తళతళలాడితే సరిపోతుందా? సుందరమైన ఆ నగలు ధరించే తన ఖాతాదారుల మానసిక సౌందర్యం తనకెంతో ముఖ్యం అంటాడీయన. అందుకే తన దుకాణం బయట మంచి సందేశాలతో కనిపించే బ్యానర్‌ను గత 10 ఏళ్ళకు పైగా ప్రదర్శిస్తూ వస్తున్నారు వాల్‌చంద్ జైన్ గారు. సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ బ్యానర్ ప్రత్యేకత . దేశంలో జరిగే ఉగ్రవాద దాడులు, అధికారుల అవినీతి చర్యలు, రాజకీయ నాయకుల పట్ల అసహ్యంతో వారిపై జరిగే బూటు దాడులు వంటివన్నీ ఇక్కడ బ్యానర్ ఐటెమ్స్‌గా మనకు కనిపిస్తాయి. ఇలాంటి పరిణామాలే ఆయుధాలుగా వాల్‌చంద్ గారి బ్యానర్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వారి డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ సిగ్గుపడేలా చేస్తుంది. తమ దుకాణంలోని నగల అమ్మకాలతో వచ్చే లాభాల్ని మిగిలిన వ్యాపారుల్లాగా అనుభవించడంతో సరిపెట్టుకోని వాల్‌చంద్ గారు సమాజం పట్ల తన బాధ్యతను బ్యానర్ సందేశాల రూపంలో నెరవేర్చుతున్నారు. బంగారు నగల్లాగే ఈయన మనసుకూడా భలే మెరిసిపోతుంది కదూ...

Saturday, May 30, 2009

అక్కడ బొబ్బిలి బ్రహ్మన్న లేడు...

ఆస్తి గొడవలొస్తే అన్నదమ్ములే కత్తులు దూసుకునే రోజులివి. డబ్బు విషయంలో తేడాలొస్తే మిత్రులే శత్రువులవుతున్న సమాజమిది. కుల, మత, జాతి, ప్రాంత విభేదాలతో రగిలిపోతున్న ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని వామన్‌ఖేడ్ గ్రామం గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. రాష్ట్రపతి ప్రశంసలు సైతం పొందిన ఈ గ్రామం ఎన్నోసార్లు ఆదర్శగ్రామంగా పురస్కారం అందుకుంది. ఈ ఊరిలో మహిళలకు సమానహక్కులున్నాయి. వేడుకలను అందరూ కలసికట్టుగా నిర్వహించుకుంటారు. ఈర్ష్య, అసూయలకు చోటు లేదిక్కడ. రాథోడ్ వంశానికి చెందినవారే ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికీ ప్రేమాభిమానాలు సరిసమానం. ఏ ఒక్కరికి సహాయం కావాలన్నా, మరే అవసరమున్నా సత్వరం వారికి చేయూత లభిస్తుంది. ఈ గ్రామ స్త్రీలు వారిళ్ళకు చాలావరకూ తాళాలు వెయ్యరు. కొత్తవారెవరైనా ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారి అవసరాన్ని వెంటనే గుర్తించి కావలసిన పనులు చేసిపెట్టి మర్యాదతో సాగనంపుతారు. ఆ మధ్య ఎప్పుడో ఒక వేడుక సందర్భంగా రెండు వర్గాలవారు కేవలం తూలనాడుకున్నందుకు వారిని వెలివేశారు. భారత శిక్షాస్మృతి పరిధిలోకి వచ్చే ఒక్క నేరం కూడా ఈ గ్రామంలో చోటు చేసుకోలేదు. అందువల్లే పోలీసులు కూడా అడుగుపెట్టలేదు. అంతేగాని బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలోలాగా ఆ ఊరు పెద్ద కృష్ణంరాజు పరిపాలనలో లేదు. అక్కడంతా మర్యాద రామన్నలే...

Friday, May 15, 2009

భార్యకోసం కొండను తవ్విన దశరథ్ మాన్జీ

ప్రభుత్వాధికార్ల గుండెల్ని కరిగించడం కన్నా కఠిన శిలల్ని కదిలించడమే తేలిక అని అతను గ్రహించాడు. అర్థాంగి అంటే నిజమైన అర్థం ఎందరికి తెలుసన్నది చెప్పలేం కానీ బీహార్‌కు చెందిన దశరథ్ మాన్జీ జీవితం మాత్రం దీనికి సరైన నిర్వచనమన్నది సూర్యచంద్రులు కనిపిస్తున్నంత నిజం. అతను తన భార్య కోసం 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి బాట ఏర్పరిచాడు. ఇది పూర్తయ్యేనాటికి ఆమె ప్రాణాలతో లేకపోయినా అతని గ్రామస్థుల పాలిట వరమైంది. అదేంటో తెలుసుకుందాం...

బీహార్‌లోని వజీర్‌గంజ్ సమీపాన గల గహ్‌లోర్ ఘాటీ గ్రామానికి చెందిన దశరథ్ మాన్జీ అత్యంత నిరుపేద. ముసాహర్ జాతి (ఎలుకల బొరియల్లో దొరికే ధాన్యాన్ని తిని జీవించే జాతి)కి చెందిన ఈయనంటే మాత్రం ఆ ప్రాంతం వారికి అత్యంత గౌరవం ఉంది. ఈయన్ని దశరథ్ బాబా అని కూడా పిలుస్తారు. 1962లో దశరథ్ భార్య ఫగుణీ ఈయన కోసం పొలానికి భోజనం తీసుకువస్తుండగా కిందపడిపోతే ఆమె చెయ్యి విరిగిపోయింది. వైద్యం కోసం ఊరిలో సదుపాయాలు లేవు. ఊరికి అడ్డుగా ఉన్న కొండను చుట్టి 30 కిలోమీటర్లు ప్రయాణించి గయకు వెళ్ళాల్సిందే. ఈ సంఘటనతో కొండను తవ్వి బాట ఏర్పరచాలన్న సంకల్పానికి ఆయనలో బీజం పడింది. 300 అడుగుల ఎత్తు, 1.5 కిలోమీటర్ వెడల్పున్న ఈ పర్వతాన్ని తవ్వి దారి ఏర్పరచడం అంత సులభం కాదని అందరికీ తెలుసు.

కొండను తవ్వి దారి ఏర్పరచాలనుకుంటున్నట్లు తన వారికి చెప్పగానే అందరూ వేళాకోళం చేశారు. వ్యతిరేకత వ్యక్తమైంది. అదేం పట్టించుకోని దశరథ్ తన మేకలు, ఇతర ఆస్తులు అమ్మి కొండ తవ్వడానికి పనికివచ్చే గడ్డపార, సమ్మెట, ఇతర వస్తువులు కొన్నాడు. ఇది గమనించిన వారు దశరథ్‌ను పిచ్చివాళ్ళ కేటగిరిలో వేసేశారు. సరిగ్గా ఇదే సమయంలో దశరథ్ భార్య జబ్బు పడగా ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో కొండను తవ్వితీరాలన్న ఆలోచన వజ్ర సంకల్పంగా మారింది. కొండను తవ్వడానికి రోజూ తన ఇంటి నుంచి వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుందని భావించిన ధశరథ్ కొండ దగ్గరే గుడిసె కట్టుకుని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు.

అది మొదలు 22 సంవత్సరాల పాటు ఏ ఒక్కరి సాయం లేకుండా రేయింబవళ్ళు శ్రమించి 1984లో 16 అడుగుల వెడల్పుతో చక్కని దారి సిద్ధం చేశాడు. దీంతో గహ్‌లోర్ ఘాటీ ప్రజల కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు వైద్యం కోసం చాలా తక్కువ సమయంలో గమ్యం చేరుకోగలుగుతున్నారు. కొండను తవ్వి ఎలుకలు పట్టే ఈ రోజుల్లో చోటు చేసుకున్న అద్భుతం ఇది.

దశరథ్ జీవించి ఉండగా గుర్తింపు రాలేదుగానీ, 2007లో ఆగస్ట్ 17న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తన 78వ ఏట మరణించినప్పుడు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన నిర్మించిన ఆ బాటకు "దశరథ్ మాన్జీ మార్గ్" అనే పేరు పెట్టారు. గహ్‌లోర్ ఘాటీలో ఈయన పేరిట ఆసుపత్రి నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.

ఇది కేవలం ప్రభుత్వాధికార్లు మాత్రమేకాదు, సమస్యల బారినపడి ఎదుటివాడు ఏడుస్తున్నా మనకెందుకులే అని మిన్నకుండే తోలుమందం ప్రజలందరూ దశరథ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, మరెన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయాలి....

Sunday, May 10, 2009

గుంటూరు గాంధీజీకీ జై

శ్రమదానం అన్న పదం వినగానే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ప్రవేశపెట్టిందేగా అనెయ్యకండి. ఆయనకంటే ముందే శ్రమదానానికి నిజమైన నిర్వచనమిచ్చి 40 ఏళ్ళకు పైగా శ్రమనే దానం చేస్తూ "గుంటూరు గాంధీ"గా పేరు పొందారు వట్టికూటి వెంకట సుబ్బయ్యగారు. గుంటురు జిల్లాలోని పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో 1916, అక్టోబర్ 28న (గాంధీ పుట్టిన నెలలోనే) జన్మించిన ఈయన తన జీవితాన్ని స్వచ్ఛంద సేవకే అంకితం చేశారు. మురికి కాల్వలు, రోడ్లు... చివరికి శ్మశానాలను సైతం శుభ్రం చేస్తూ కనిపిస్తుంటారు. ఈయన సేవలను గుర్తించి ఆ మధ్య మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఈ గుంటూరు గాంధీ గారికి సత్కారం కూడా చేశారు.

Monday, May 04, 2009

తువాలు విసిరే సవాలు

ఆ దేశం పేరు తువాలు. జనాభా కాస్త అటూ ఇటూగా ఒక 12000 మంది ఉండవచ్చు. అక్కడ స్వతంత్రంగా పత్రికా వ్యవస్థ లేకున్నప్పటికీ సామాన్యుల నుంచి సెల్‌లోని ఖైదీ వరకూ అందరినీ సంతృప్తిగా ఉంచే మానవహక్కుల వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. బాలలను హింసించిన పరిణామాలు కానరావు. పలు దేశాల్లో మానవహక్కుల అమలు గురించి 2002లో అమెరికా విదేశాంగశాఖ ఒక నివేదిక రూపొందించింది. ఈ తువాలు దేశంలో ఒక్క తప్పునైనా పట్టుకునేందుకు ఆ శాఖ విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఫిజీకి ఉత్తరంగా ఉన్న ఈ దేశంలో మహిళలపై నేరాలు జరగడం చాలా చాలా అరుదు. తువాలులోని ప్రభుత్వం ప్రజల హక్కుల్ని పూర్తిగా గౌరవిస్తుంది. ఇక్కడేమిటంటే పెద్దలు చెప్పిన మాట చట్టంతో సమానంగా అమలవుతుంది. నివేదిక 2002లో రూపొందించినప్పటికీ ఈ రోజుకు సైతం ఇది మానవహక్కుల పాలిట భూలోక స్వర్గమే. మానవహక్కుల పరిరక్షణలో తువాలు విసిరే సవాలుకు జవాబెక్కడుంది చెప్పండి?

Sunday, April 26, 2009

అంబలి దాతా సుఖీభవ

మండే ఎండల్లో అలసిపోయినవారి సేద తీర్చేందుకు సుమారు 29 ఏళ్ళ కిందట ఒక తల్లి ప్రారంభించిన సేవా యజ్ఞాన్ని ఆమె కుమారుడు నేటికీ కొనసాగిస్తూ పలువురికి ఆదర్శప్రాయుడై నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన సరోజ దాదాపు 3 దశాబ్దాల కిందట ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ప్రారంభమై వేసవికాలం అంతా రాగులతో చేసిన అంబలిని ఉచితంగా అందిస్తూ మృగశిర కార్తె రోజు వరకూ కొనసాగి మిఠాయిల పంపకంతో ముగుస్తుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సరోజ ఆ తర్వాత మరణించినప్పటికీ ఆమె కుమారుడు, ఎలక్ట్రీషియన్ అయిన ప్రభాకర్ తన భార్య కృష్ణవేణితో కలసి ఈ సేవను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్ చిక్కడపల్లి డివిజన్‌లోని బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి కాలనీలో ఈ కేంద్రం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సేవకు చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకు వచ్చినప్పటికీ ప్రభాకర్ సున్నితంగా తిరస్కరించి తన స్వంత ఖర్చుతో ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు. ఈ వేసవి కాలమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ దాహార్తులు, ఆకలిగొన్నవారికి ఇక్కడ అంబలి సిద్ధంగా ఉంటుంది.

Monday, April 20, 2009

పెద్దలు ఓటేస్తే పిల్లలకు స్టార్

ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఏమిటన్నది నిజంగా గ్రహించిన పాఠశాల ఇది. హైదరాబాద్ నగరం చింతల్‌లో ఉన్న సెయింట్ మార్టిన్ హైస్కూల్ యాజమాన్యం తనకున్న పరిధిలో పౌరులను ఓటు వేసే దిశగా చైతన్యపరిచేందుకు ఓ మంచి పథకం వేసింది. తన పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యత గుర్తెరిగి ఓటు వేస్తే వారి పిల్లల రిపోర్ట్ కార్డ్‌లో సదరు విద్యార్థికి ప్రత్యేక గౌరవం ఇస్తూ బోనస్ స్టార్ కేటాయిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఉత్తమ పౌరులుగా గుర్తిస్తామని కూడా వెల్లడించింది. ఈ బోనస్ స్టార్ ద్వారా ప్రత్యేక గౌరవం పొందడానికి ఆ పిల్లలు తమ అమ్మానాన్నలతో ఓటు వేయించడంతో పాటు తాము ఉత్తమ పౌరుల బిడ్డలమన్న గుర్తింపు కూడా పొందుతారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఓటు వేసినట్లు రుజువు చేసుకోవడానికి ఈ నెల 25న స్వయంగా పాఠశాలకు వచ్చి తమ వేలిపై ఉన్న ఇంకు మార్కును పాఠశాల ఉపాధ్యాయులకు చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే నేతలు అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని, ఇది జరగాలంటే పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు వెయ్యాలన్నది ఈ పాఠశాల గుర్తించిన వాస్తవం.

Saturday, March 28, 2009

ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా...

కొన్నేళ్ళ క్రితం అమెరికాలో మేథ్యూ లిసగే అనే మూడో క్లాసు చదివే విద్యార్థి తనుండే నగరంలోని ఆకలిగొన్న బీదవారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దాంతో అతను "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " అనే కార్యక్రమాన్ని ఆరంభించాడు. అది ఆరంభించిన నాలుగో ఏడు "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " నలభై వేల డాలర్లని సేకరించి అనాథల పొట్టలని నింపగలిగింది.

మరో పిల్లవాడి కథ కూడా ఇలాంటిదే. ఆఫ్రికాలోని రోగగ్రస్థులైన బీదవాళ్ళ కోసం డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ కృషి చేస్తున్నాడని తెలిసిన పదమూడేళ్ళ జాన్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఓ ఉత్తరం రాశాడు. తన దగ్గరున్న డబ్బుతో ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా కొన్నానని, దాన్ని ఆఫ్రికాలోని డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ హాస్పిటల్‌లో పడేయగలరా అని అడిగాడు. ఓ లోకల్ రేడియో స్టేషన్‌కి ఈ సంగతి తెలియడంతో అది ఆ చిన్న పిల్లవాడి గొప్ప మనసు గురించి వార్తగా ప్రసారం చేసింది. అది విన్న ఎంతోమంది తగిన విధంగా స్పందించారు. దాంతో ప్రభుత్వం ఆ పిల్లవాణ్ణి, వేల మంది నుంచి ఉచితంగా వచ్చిన నాలుగు లక్షల డాలర్ల విలువ చేసే నాలుగున్నర టన్నుల మందులతో డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ నడిపే హాస్పిటల్‌కి విమానంలో పంపించింది.

ఆ పిల్లల్లోని నిజాయితీతో కూడుకున్న, బీదలకి సహాయం చేయాలనే తపనని చూసి దేవుడు వాళ్ళకి చేయాల్సిన సహాయాన్ని అనేకమంది మంచివాళ్ళని పరికరాలుగా వాడుకుని చేశాడు.

సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Tuesday, March 17, 2009

కార్ల దొంగ

టర్కీలోని ఓ దొంగకి 16 ఏళ్ళ క్రితం తను చేసిన నాలుగు కారు దొంగతనాలకి పశ్చాత్తాపం కలిగింది. ఆ నాలుగు కార్లలోంచి తను దొంగిలించి అమ్ముకున్న టేప్ రికార్డర్ల ఖరీదు అయిన నాలుగు వందల యూరో డాలర్లని సెంట్రల్ టర్కీలోని కిరిక్కాలె అనే ఊరి పోలీస్ చీఫ్ సలీంకి పంపించాడు. 1992లో తన చేసిన ఆ నాలుగు దొంగతనాల వివరాలని కూడా పంపాడు. ఒకొక్కరికీ వంద యూరో డాలర్లని ఇవ్వమని, తన క్షమాపణలని కూడా తెలియచేయమని కోరాడు. ఆ దొంగ మాత్రం అజ్ఞాతంగానే ఉండిపోయాడు.

సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Thursday, March 12, 2009

ఓటర్ల కోసం గుంజీళ్ళ దీక్ష

తమిళనాట కోయంబత్తూరు జిల్లా పుదూర్ గ్రామానికి చెందిన వడ్రంగి 23 ఏళ్ళ రామనాథన్‌కు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేదు. తన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనమంతా ఎన్నికల్లో పాల్గొని మంచి నేతలను ఎన్నుకోవాలని మాత్రం గ్రహించాడు. తన కోరిక ఫలించాలని కోరుతూ తన ఊరిలో ఉన్న ఆది వినాయకర్ ఆలయంలో మే 8, 2006వ తేదీ ఉదయం 6 గంటలకు సుముహూర్తం నిర్ణయించుకుని 14 నిమిషాల్లో 1008 గుంజీళ్ళు తీశాడు. ఈ గుంజీళ్ళు సరిగ్గా తీశాడా లేదో గమనించడానికి అక్కడి "యూత్ పవర్ ఫెడరేషన్" ప్రతినిధులు వచ్చి పర్యవేక్షించారు. తన గుంజీళ్ళ దీక్ష పూర్తయిన తర్వాత రామనాథన్ మాట్లాడుతూ మన ప్రజాస్వామిక దేశంలో ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని, రాష్ట్ర భవిష్యత్తును మంచి బాటలో పయనింపజేయాల్సింది ఓటర్లే అయినందున అవినీతి, పక్షపాత వైఖరికి దూరంగా ఉండే నేతలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రాజకీయాల్ని అసహ్యించుకొని ఓట్లేయడం మానకుండా మంచివారికి ఓటు వేయడం ద్వారా స్వలాభం కోసం పాకులాడేవారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. తన కోసం కాకుండా జనం బాగు కోసం గుంజీళ్ళు తీసిన రామనాథన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ... జన జీవితంలో కొత్త కోణం ప్రకాశిస్తుంది.

పసివాడి హృదయం కరిగింది

"పిల్లలూ ఈ రోజు మీకో వీడియో చూపిస్తాం... అది చూచి మనకు తోచిన సాయం చేద్దాం" అని టొరంటోలోని ఒక స్కూలు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశమైన మలావీలోని బాలల దుస్థితిని వీడియో ద్వారా చూపించారు. ఆ స్కూల్లోనే చదువుకుంటున్న తొమ్మిదేళ్ళ భారత సంతతి విద్యార్థి నీల్ అగర్వాల్ పసి హృదయం మలావీ చిన్నారుల కష్టాలు చూచి కరిగిపోయింది. వెంటనే తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న 170 డాలర్ల మొత్తాన్ని (దాదాపు రూ.7,800) యునిసెఫ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. నీల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ భారతీయుడు కాగా, తల్లి ఎలిజబెత్ కెనడాలో పుట్టి పెరిగిన ఇటలీ సంతతి మహిళ. ఇంత పెద్ద మొత్తం (ఆ కుర్రాడి వయసుకు ఇది పెద్ద మొత్తమే...) అలా ఎలా ఇచ్చేశావురా అని అడిగితే... నా వయసు పిల్లలు పేదరికంతో తిండి లేక పాఠశాలలకు కూడా వెళ్ళడం లేదని తెలిసి, ఆ డబ్బు నాకంటే వారికే ఎక్కువ అవసరమనిపించిందని బదులిచ్చాడు ఈ రెండవ బాల కర్ణుడు (ఇలాంటి మరో బాలుడి గురించి ఇంతకు ముందొక కథనం ఇచ్చాను అందుకే రెండవ బాల కర్ణుడు అన్నాను). ఈ ఘటన 2006లో జరిగింది.

Thursday, February 26, 2009

మాకు కరెంట్ వద్దు...

మన పొరుగున ఉన్న భూటాన్ మనకన్నా చిన్న దేశం. మనకన్నా పేద దేశం. కాని భూటాన్ ప్రజల మనసులు మాత్రం చాలా విశాలం. వారికి భూతదయ ఎంత ఎక్కువంటే, నదుల్లోని చేపలని పట్టరు. డబ్భై ఐదు శాతం అడవే అయినా జంతువుల్ని వేటాడి చంపరు. ఆ దేశంలోని ఫోబ్జికా లోయకు తరచూ కొంగలు వలస వస్తూంటాయి. ఆ లోయకి వచ్చే దారిలో ఉన్న ఓ ఊళ్ళోని కరెంటు తీగల మీద వాలి అవి మరణించడం గమనించిన ఆ ఊరి వాసులు విద్యుత్‌కు స్వస్తి చెప్పారు. సౌర శక్తితో తమ ఇళ్ళను వెలిగించుకుంటున్నారు. వారు బాగా సున్నిత మనస్కులు కాబట్టి హింసా ప్రవృత్తి గల రెజ్లింగ్ పోటీలను ప్రసారం చేసే పాశ్చాత్య ఛానెళ్ళకు అడ్డుకట్ట వేశారు. ఫ్యాషన్ టీవీ, టెన్ స్పోర్ట్స్, ఎంటీవీ లాంటి అర్ధనగ్న దృశ్యాలు ప్రసారం చేసే ఛానెళ్ళు కూడా భూటాన్‌లో ప్రసారం కావు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించిన తొలి దేశం కూడా భూటానే. ప్రజలు ఇలాంటి మంచి పనులకు వ్యతిరేకతను తెలియచేయకపోవడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది. సమున్నత సంస్కృతికి మారు పేరని చెప్పుకునే మన భారతీయులంతా భూటాన్‌ను అనుసరించాల్సిన అవసరముంది.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు

Wednesday, February 18, 2009

వీళ్ళు పే......ద్ద పిల్లలు

శత్రువులు పాలిట తూపాకీ తూటాలాంటివాడు తుఫాన్ కుమార్ అయితే... భారతీయ సైనికుల ధన్వంతరి భారతీ సింగ్. ఈ విద్యార్థులు సాధించిన ఘనతల గురించి చదివాక నేను పెట్టిన శీర్షిక నిజమేనని మీరు కూడా ఒప్పుకుంటారని నా నమ్మకం. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక బృందం) అధిపతి హేమంత్ కర్కారే, అశోక్ కామ్టే తదితరులు ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరాడి అసువులు బాసిన సంగతి తెలిసిందే. వాళ్ళు వేసుకున్న బులెట్ ప్రూఫ్ జాకెట్లు నాసిరకం కావడమన్నది వీరి మరణానికి ఒక కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని బట్టి ఉగ్రవాద నిర్మూలన పట్ల మన పాలనా వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందలాది ప్రాణాలను బలిగొన్న ఆ నాటి దాడి తర్వాత మనం నేర్చుకున్న పాఠాల సంగతేమోగాని ఈ మధ్య మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన ఒక బాలల సైన్స్ సమావేశంలో ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన ఆవిష్కరణలతో ముందుకొచ్చారు.

ఇందులో పాల్గొన్న భువనేశ్వర్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థి తుఫాన్ కుమార్ సమాల్ తన వంతుగా... క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల (సిసిటివి) పైన తుపాకులు అమర్చి కంట్రోల్ రూం నుంచి వాటిని పేల్చడం ద్వారా ఉగ్రవాదులను అంతమొందించే వ్యవస్థను రూపొందించాడు. దీనివల్ల సమయం వృథా కాదు... ప్రాణ నష్టం చాలా చాలా తగ్గుతుంది. పెద్ద పెద్ద హొటళ్ళలో తిరిగే (రివాల్వింగ్) కెమెరాలుంటాయి. వాటి సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని చూస్తాం. మరో అడుగు ముందుకేసి వాటికి తుపాకులు అమర్చడం ద్వారా పని పూర్తి చెయ్యవచ్చట. తుఫాన్ కుమార్ తుఫాను వేగంతో కదిలే మానవరహిత ప్లాస్టిక్ విమానాన్ని కూడా తయరు చేశాడు. దీంతో శత్రు స్థావరాల్ని కచ్చితంగా కనిపెట్టడంతో పాటుగా తుఫానులు వచ్చి వరద బీభత్సం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు సాయం కూడా చెయ్యవచ్చు...

ఉత్తరప్రదేశ్ నుంచి ఇదే సైన్స్ సమావేశంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థిని, బరైలీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన భారతీ సింగ్, నీటిలోని నాచును ఉపయోగించి సైనికులకు చికిత్స చేసే వ్యవస్థను రూపొందించింది. నాచు నుంచి ప్రొటీన్ తీసి యుద్ధ సమయాల్లో గాయపడిన సైనికులకు బాక్టీరియా వల్ల వ్యాధి వ్యాపించకుండా దీంతో చికిత్స చెయ్యవచ్చట. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పటి సైనికులు వ్యాధులు రాకుండా ఈ నాచును పైన పెట్టుకుని కాపాడుకున్నట్లు చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకుని దీనిని తయారు చేసినట్లు భారతీ సింగ్ చెప్పింది. నాచులోని ప్రొటీన్‌ను బయటకు తీసి కొన్ని వైరస్‌లపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. గడచిన డిసెంబర్ నెలలో తాను కనిపెట్టిన ఈ ఆవిష్కరణపై పేటెంట్ కూడా తీసుకుంది.

Wednesday, February 11, 2009

నస్రీన్ నుయ్యి తవ్వింది

అమ్మానాన్నలు ఎప్పుడు చస్తారా... ఓ గొయ్యి తవ్వి పారేద్దాం అనుకునే ఈ రోజుల్లో... నీళ్ళ కోసం తల్లి పడుతున్న కష్టం చూచి ఆవేదన చెందిన నస్రీన్ ఆమె కోసం ఒక నుయ్యి తవ్వింది. తన చెల్లాయిలు తోడుగా నస్రీన్ 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వింది. ఇక నస్రీన్ ఎవరో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఉన్న మహా విద్యాలయం విద్యార్థిని అయిన నస్రీన్ పేద కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి రంజాన్ ఖాన్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మరోవైపు నస్రీన్ పగలు కళాశాలకు వెళుతూ, విద్యార్థులకు ప్రయివేట్లు చెబుతూ తన వంతుగా నాలుగు రాళ్ళు సంపాదించి తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉండేది. ఈ ఇంట్లో దాహార్తి తీర్చుకోవాలంటే నస్రీన్ తల్లి మైళ్ళ దూరం నడిచి మంచి నీళ్ళు తీసుకురావాల్సిందే. కని పెంచిన తల్లి కష్టం చూడలేకపోయిన ఈ ధీశాలి అమ్మ కోసం ఏమైనా చేసి తీరాలని సంకల్పించుకుని ఇంట్లేనే నుయ్యి తవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు అమ్మా నాన్నా ఒప్పుకోరు. చెల్లెళ్ళతో ఈ సంగతి మాట్లాడి అమ్మానాన్నలకు తెలియకుండా అందరూ కలిసి పలుగు పార పట్టుకొని 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వేశారు. పని పూర్తయ్యాక అమ్మానాన్నల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక మహావిద్యాలయ ప్రిన్సిపాల్ ఆర్ కె పాటిల్ గారైతే నస్రీన్‌ను నోరారా పోగిడి కుట్టుమిషన్ బహుమతిగా ఇచ్చారు. ఇంకా డబ్బు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగి రెండేళ్లయినా ఆ వివరాలు నాకు ఇప్పుడు దొరికాయి.

ఇదంతా చూస్తుంటే లక్క ఇంటి నుంచి తన తల్లి, సోదరుల్ని కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో నిద్ర మానుకొని సొరంగం తవ్విన పాండవ మధ్యముడు భీముడు గుర్తుకు రావడం లేదూ...! భీమసేనుణ్ణి మనం చూడలేకపోయాం గానీ ఈ యుగంలో నస్రీన్ మన కళ్ళముందుంది. ఈ నస్రీన్ భారతంలోని భీముని తలపించింది. ఎందుకంటే సందర్భాలు, పరిస్థితులు వేరైనా దృఢ సంకల్పం ఒక్కటేగా...

Saturday, February 07, 2009

హిజ్రాలు కాదు మానవతా వజ్రాలు

హిజ్రాలు లేదా నపుంసకులనగానే ఈ (అ)సభ్య సమాజానికి గుర్తుకొచ్చేది వయ్యారమొలకబొసి, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేస్తూ డబ్బులడుక్కుంటున్న దృశ్యం. హిజ్రాలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విలేఖరిని దత్తత తీసుకున్న ఈ నిజ సంఘటన గురించి తెలుసుకుంటే వారు మంచోళ్ళకంటే మంచోళ్ళన్న అభిప్రాయానికి రాక తప్పదు. మామూలు మనుషుల కొచ్చే కష్టాలనే పట్టించుకోని ప్రభుత్వం మామూలుగానే వీరి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే దేవుడనేవాడు వీరి కోసం విల్లుపురంలో ఒక మనిషిని పుట్టించాడు. అతనే రామ్మూర్తి. ఈ ఊరిలోనే అర్చకుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి (40 ఏళ్ళు) పత్రికా విలేఖరిగా కూడా సమాచార సేవలందిస్తుంటారు. ఈయన వార్తలు సేకరించడంతో ఆగిపోకుండా ఈ హిజ్రాలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు ఇప్పించారు. వారి హక్కుల కోసం పోరాడుతూ వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు.

తమకేమీ కాని రామ్మూర్తి తమ సంక్షేమం కోసం ఇంతగా శ్రమించడం ఆ హిజ్రాల మనసును కరిగించేసింది. వెంటనే రామ్మూర్తిని తమ కుమారునిగా దత్తత తీసుకోవాలని జిల్లా నపుంసకుల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా 2005 డిసెంబర్ 31న శాస్త్రబద్ధంగా దత్తత స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నపుంసకులను శ్రీకృష్ణుని ప్రతిరూపంగా భావించే హిజ్రాలు తనను దత్తత చేసుకోవడం ఎంతో ఆనందంగాను, గర్వంగాను ఉందని రామ్మూర్తి పారవశ్యంతో చెప్పారు. ఈ మానవతా వజ్రాలను ఎన్ని పొగడ్తలతో ప్రశంసిస్తే సరిపోతుంది చెప్పండి.

Monday, January 26, 2009

పెళ్ళా... తమ్ముడా...

చివరికి తమ్ముడే తన ప్రాణమంది లక్నో యువతి 21 సంవత్సరాల దివ్య. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బాద్ షా నగర్‌కు చెందిన సుభాష్ కుమార్తె దివ్యకు పెళ్ళీడు రావడంతో పెద్దలు మంచి సంబంధం కుదిర్చారు. డిసెంబర్ 6, 2008న పెళ్ళి జరగాల్సి ఉంది. సరిగ్గా అదే సమయానికి ఆమె తమ్ముడు అపూర్వ మూత్రపిండాల సమస్యతో అనారోగ్యం పాలయ్యాడు. దాత ఎవరైనా మూత్రపిండం ఇస్తే తప్ప అతను బతకడని అక్కడి "సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్" వైద్యులు తేల్చి చెప్పారు. తోడబుట్టినవాడి పరిస్థితిని అర్థం చేసుకున్న దివ్య తన మూత్రపిండం తమ్ముడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలా చేస్తే పెళ్ళి మానుకుంటామని మగపెళ్ళివారు హెచ్చరించారు. ఆ పెళ్ళి కోడుకుతో "వెళ్ళవయ్యా వెళ్ళు" అని కరాఖండిగా చెప్పి తన తమ్ముడికే అండగా ఉండాలన్న దృఢ నిశ్చయానికి వచ్చింది. నిజంగా ఆమెది "దివ్య"మైన మనసు కదూ...

Friday, January 23, 2009

నాకు పింఛనొద్దు మొర్రో...

అధికారిక దాఖలాల ప్రకారం ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సాలిజంగ గ్రామానికి చెందిన బంధుదాస్ వయసు 100 ఏళ్ళు దాటింది. బంధుదాస్ పేదవాడైనా అందరికీ ఆత్మబంధువులా మెలుగుతూ తన పనులు తానే చేసుకుంటాడు. ఆ మధ్య కొందరు ప్రభుత్వాధికారులు ఈయన దగ్గరికొచ్చి "అన్నట్టు మీకింకా పింఛన్ అందడంలేదని తెలిసిందండీ... ఇప్పించాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారట. దాంతో చిర్రెత్తుకొచ్చిన బంధుదాస్ "పనులు చేసుకోలేనివాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళకు ప్రభుత్వం సాయం చెయ్యాలి గానీ కాళ్ళూ చేతులు ఆడుతున్నవాళ్ళకు కాదురా బాబు. పింఛనిచ్చి నన్ను ముసలోణ్ణి చెయ్యొద్దు. నాకు పింఛనొద్దు మొర్రో..." అని వాళ్ళను వచ్చినదారినే పంపించేశాడు.

బంధుదాస్ దినచర్యను పరిశీలిస్తే... ఉదయమే 5 గంటలకల్లా లేస్తాడు. కొద్దిగా పాలు, మరమరాలు అల్పాహారంగా తీసుకుని తన ఆవులకు గ్రాసం కోసం తన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకెళతాడు. తన కోసం ఓ నాలుగు తమలపాకులు తెచ్చుకుంటాడు. పశువులకు తన చేత్తో స్వయంగా తినిపిస్తాడు. అప్పుడప్పుడూ పొలంపనుల్లో ఓ చెయ్యి వేస్తాడని గ్రామస్తులు చెప్పారు.

గ్రామ కార్యక్రమాల్లో పాల్గొని జానపద గీతాలు ఆలపించే బంధుదాస్‌ను రోగాలేవీ సమీపించడం తాము చూడలేదని, ఇప్పటికీ ఆయన వద్ద కళ్ళజోడు లేదని కోడలు లత చెప్పింది. దాసు గారికి ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు కాగా, భార్య లబానీకి 90 ఏళ్ళు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె పక్షవాతంతో మంచం పట్టింది. తన ఆహారంలో భాగంగా స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు, నెయ్యి తీసుకుంటానని దాస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలందరికీ బంధుదాస్ మార్గదర్శకునిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పొరుగున ఉన్న బలన్సా గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త సంతోష్ సాహు అన్నారు.