Sunday, June 14, 2009

బుద్ధి చెప్పే బాంద్రా బ్యానర్

ముంబై నగరంలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో నగల వ్యాపారం చేసుకునే వర్తకుడు కిశోర్ వాల్‌చంద్ జైన్. అందమైన ఆభరణాలను తళతళ మెరిసేలా తయారు చేసి ఖాతాదార్ల మెప్పు పొందడంలో దిట్ట ఈ వ్యాపారి. నగలు మాత్రం తళతళలాడితే సరిపోతుందా? సుందరమైన ఆ నగలు ధరించే తన ఖాతాదారుల మానసిక సౌందర్యం తనకెంతో ముఖ్యం అంటాడీయన. అందుకే తన దుకాణం బయట మంచి సందేశాలతో కనిపించే బ్యానర్‌ను గత 10 ఏళ్ళకు పైగా ప్రదర్శిస్తూ వస్తున్నారు వాల్‌చంద్ జైన్ గారు. సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ బ్యానర్ ప్రత్యేకత . దేశంలో జరిగే ఉగ్రవాద దాడులు, అధికారుల అవినీతి చర్యలు, రాజకీయ నాయకుల పట్ల అసహ్యంతో వారిపై జరిగే బూటు దాడులు వంటివన్నీ ఇక్కడ బ్యానర్ ఐటెమ్స్‌గా మనకు కనిపిస్తాయి. ఇలాంటి పరిణామాలే ఆయుధాలుగా వాల్‌చంద్ గారి బ్యానర్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వారి డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ సిగ్గుపడేలా చేస్తుంది. తమ దుకాణంలోని నగల అమ్మకాలతో వచ్చే లాభాల్ని మిగిలిన వ్యాపారుల్లాగా అనుభవించడంతో సరిపెట్టుకోని వాల్‌చంద్ గారు సమాజం పట్ల తన బాధ్యతను బ్యానర్ సందేశాల రూపంలో నెరవేర్చుతున్నారు. బంగారు నగల్లాగే ఈయన మనసుకూడా భలే మెరిసిపోతుంది కదూ... Print this post

No comments: