Friday, March 31, 2017

క్యాన్సర్ రోగుల కోసం ఐదు లక్షలిచ్చిన విద్యార్థినులు

హైదరాబాదులో ఐదుగురు విద్యార్థినులు సౌమ్య, సంయుక్త, అద్వితీయ, అనూష, సాత్విక అపూర్వమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఫిబ్రవరి 5న నోవాటెల్‌ హోటల్‌లో  పాటలు పాడి డబ్బు సేకరించారు. సమాజానికి తమవంతు సేవ చేయాలని భావించిన ఈ విద్యార్థినులు ఒక బృందంగా ఏర్పడి సుమారు మూడు గంటలకు పైగా పాటలు పాడారు. మొత్తం  5 లక్షల రూపాయలు సేకరించి ‘గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌’కు అందజేశారు. హైదరాబాదులోని బేగంపేట పర్యాటకభవన్‌లో మార్చి 26న గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు సేకరించిన ఈ డబ్బును కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలోని క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు అందజేస్తామని గ్రేస్‌ క్యాన్సర్‌ కో ఫౌండర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి తెలిపారు.

విద్యార్థిని సౌమ్య మాట్లాడుతూ తాను క్యాన్సర్‌ రోగులను చూశానని, వారికి ఏదైనా చేయాలని అనిపించేదని తెలిపింది. క్యాన్సర్ రోగులకోసం డబ్బు సేకరించేందుకు ఆరు నెలల క్రితమే కార్యాచరణ రూపొందించామని, లక్ష్మణచారి సంగీత కళాశాలకు చెందిన శశికళస్వామి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించామని ఇందులో పాల్గొన్న సంయుక్త అనే ఇంటర్మీడియట్‌ విద్యార్థిని చెప్పింది. రోగులను ఆదుకునేందుకు ముందుకురావాలని వీరు పిలుపునిచ్చారు.