Saturday, May 26, 2007

కరవులోనూ కారుణ్యం...

అవి కర్నాటకలోని కోలార్ జిల్లా మిట్టూర్ గ్రామ పరిసరాలు. కొన్నేళ్ల కిందట తీవ్ర వర్షాభావం కారణంగా అక్కడ కరవు కాటకాలు కరాళ నృత్యం చేశాయి. అన్నం మెతుకు కోసం ఆ ప్రాంతంలోని రైతుల కుటుంబాలు క్షుద్బాధతో విలవిలలాడిపోయాయి. దాదాపు రెండేళ్ల పాటు పొలాల్లో తిండి గింజ మొలవలేదు. దీనికి తోడు ఆ ప్రాంతంలో కోతుల బెడద. ఏ చిన్న తినుబండారం కనిపించినా లాక్కుని పీక్కుపోతాయి. ఇక కరవుకాలంలో వాటి ఆగడాలు సహించనలవి కాదు. నీళ్లు సైతం లేక రైతులు ఎంతో శ్రమించి పండించిన అతి కొద్దిపాటి పంట కోతుల పాలయ్యేది. ఇలాంటి పరిస్థితే మన నగరాల్లో ఎదురైతే ఏం జరుగుతుందో ఊహించండి. వెంటనే కార్పోరేషన్ లేదా మున్సిపాలిటీ సిబ్బంది రంగ ప్రవేశం చేసి కోతుల్ని పట్టి బంధించి చంపడమో లేదా వాటిని సుదూర ప్రాంతాలకు తరలించేయడమో జరుగుతుంది.

మరి ఈ కర్నాటక రైతులేంచేశారో తెలుసా... కోతుల్ని తరిమేయలేదు సరికదా వాటి ఆకలి తీర్చడానికి నడుం బిగించారు. తినడానికి తమకేమీ లేకపోయినా సరే ఆ కోతుల్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆ ప్రాంతంలోని రైతు కుటుంబాలన్నీ వంతులు వేసుకొని కోతుల ఆకలి బాధను తీర్చే కార్యభారాన్ని తమ భుజస్కందాలపై వేసుకున్నాయి. రోజూ ఆ కోతులకు రాగి ముద్దలను వండి పెడుతూ ప్రతి రైతు కుటుంబం ఈ జీవ కారుణ్య యజ్ఞంలో పాల్గొంది.

మనకు అన్నీ ఉన్నా పక్కవాళ్లను దోచుకోవడం, వీలైతే మన ఖర్చులు కూడా ఎదుటివాళ్లపై రుద్దేయడం, అధికార దుర్వినియోగం, భూ కబ్జాలు, మానవత్వం మంటగలిపేలా కన్నవాళ్లనే గెంటేయడం ఇలా చెప్పుకుంటూ పోతే మానవుల్లో దుర్బుద్ధులు చాలానే బయటపడతాయి. ఇక కరవు కాటకాల్లాంటివి వస్తే సొంత మనుషుల్ని పీక్కు తినడానికి సైతం వెనుకాడం. నాగరికంగా ఎంతో ఎదిగిపోయామనుకునే మనం, మానసికంగా ఇంకా మృగాలమేననిపిస్తుంది. తోటి మనిషినే పట్టించుకోని ఈ రోజుల్లో జంతుజాలానికి ప్రేమను పంచడమనే విలువలకు చోటేలేదు. ఆధునిక సమాజమంటూ మిడిసిపడే మనం గ్రామీణుల నుంచి మంచితనపు పాఠాలు ఎన్నో నేర్చుకోవాలి. అలాంటి పాఠమే ఇది. మన జీవితంలోనూ ఈ పాఠం ఓ కొత్తకోణాన్ని పూయిస్తుందని ఆశిస్తున్నా...