Saturday, April 30, 2016

బాలికలకు అపురూపం... మీనమ్మ కానుక !

మీనా మెహతా... ఈ పేరు వింటే సూరత్, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బాలికలందరికీ ఒక ఆరాధనా భావం కలుగుతుంది. ఎందుకంటే, మీనా ఆ బాలికలకు అందిస్తున్న సాయం మిగతా దాతలకంటే భిన్నమైంది కనుక. సాధారణంగా పేద బాలబాలికలకు స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలు, పెన్సిళ్లు, ఒక పూట భోజనం లాంటివి దాతలు అందిస్తుంటారు. కానీ, మీనా మెహతా రూటే సపరేటు. ఈమే ఆ విద్యార్థినుల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. స్కూళ్ళలోని బాలికలకు హైజీన్ కిట్స్, శానిటరీ నాప్‌కిన్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజెపుతుంటారు. ఈ హైజీన్ కిట్స్‌లో శానిటరీ నాప్‌కిన్స్‌తో పాటు లోదుస్తులు, షాంపూ ప్యాకెట్లు, సబ్బులు ఉంటాయి. సూరత్ పరిసరాల్లోని 22 మున్సిపల్ పాఠశాలలు, అంగవికలురకు ఉద్దేశించిన బడులలో మీనా ఈ కిట్స్ పంచుతుంటారు. ఇప్పుడామే విద్యార్థినులకే కాకుండా పేద మహిళలకు కూడా ఈ కిట్స్‌ని ఇస్తున్నారు. మీనా భర్త అతుల్ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని తన వల్ల చెయ్యగల్గినదంతా చేస్తుంటారు.