Friday, November 28, 2014

తాళిబొట్టు అమ్మేసింది... టాయిలెట్ కోసం..

ఎవరైనా సరే... ఆస్తులు, నగలు ఎప్పుడు అమ్ముకుంటారు? అప్పులు గాని, అనారోగ్య సమస్యలు గాని, పిల్లల చదువుల కోసమో... సొంతిల్లు కట్టుకునేందుకోవడానికో అమ్ముతారు. కానీ మరాఠీ గ్రామీణ మహిళ సంగీత అహాల్వే తన మంగళసూత్రంతో సహా నగలన్నీ అమ్మేసింది. మహారాష్ట్రలోని వషీం జిల్లా పరిధిలో ఉన్న సాయిఖేదా గ్రామ వాసి సంగీత అహ్వాలే. నగల కంటే మరుగుదొడ్డే తన కుటుంబానికి మేలు చేస్తుందని భావించింది. అందుకోసం తన నగలన్నీ అమ్మేసింది. భారతీయ మహిళలు ప్రాణం కంటే మిన్నగా భావించే మంగళసూత్రం కూడా! ఈ సంగతి సర్కారు దృష్టికి వచ్చింది. సంగీతను రాష్ట్ర మంత్రి పంకజ ముండే ప్రభుత్వం తరపున తన కార్యాలయంలో సత్కరించారు. సంగీత స్పందిస్తూ, మరుగుదొడ్డి అనేది ప్రాథమిక అవసరమని, అందుకే నగలమ్మానని తెలిపింది. మంత్రి పంకజ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా తనకు వచ్చే నిధుల్లో 25 శాతం మరుగుదొడ్లు కట్టించేందుకు ఖర్చు చేస్తానన్నారు.

Monday, September 01, 2014

గంగా పుత్రుడు...

అతని పేరు అరుణ్ కృష్ణమూర్తి. 26 ఏళ్ళ వయసు వచ్చేసరికి అతను సాధించిన ఘనత ఏంటో తెలుసా.. దేశంలోని 6 సరస్సులకు జలకళ తీసుకొచ్చాడు. ప్రకృతి మాత మనకు వరంగా ప్రసాదించిన జలవనరులను కాపాడుతున్నాడు. ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని తానే చేస్తున్నాడు. గూగుల్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి మరీ స్వచ్ఛంద సంస్థ స్థాపించి దేశ ప్రజల దాహార్తి తీర్చుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రోలెక్స్ అవార్డు అందుకున్నాడు. యువత దేశానికి ఏం చెయ్యాలన్నది ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా చేసి చూపిస్తున్నాడు. ఎన్విరానమెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా... ఇఎఫ్‌ఐ స్థాపించి సరస్సుల పునరుద్ధరణకు నడుం బిగించాడు ఈ గంగా పుత్రుడు.

Thursday, July 31, 2014

91 ఏళ్ళు + క్యాన్సర్ + నిధుల సేకరణ

ఒక పక్క క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ.. 91 సంవత్సరాల వయసులో 42 కిలోమీటర్ల దూరాన్ని 7గంటల 7నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేశారు బామ్మగారు హారియట్ థాంప్సన్. పైగా ఇదేదో రికార్డు కోసం కాదు. ఈ వయసులోనూ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపనే ఆమెను పరుగు తీయించింది. తన స్నేహితురాలు నిర్వహిస్తున్న లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు బామ్మ పరుగు పెట్టి ఏకంగా 90 వేల డాలర్లను సొసైటీకి ఇచ్చి సత్తా చాటారావిడ. ఈ మారథాన్ పరుగుకు 4 వారాల ముందు హారియట్ 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకున్నారు. దాని వల్ల రెండు కాళ్లకూ విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ పరుగు తీసింది మన బామ్మ. బామ్మగారి 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా తల్లితో పరిగెత్తి, సాయం చేశాడు. ఇంత పెద్ద మారథాన్ పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో రికార్డులకెక్కారు. అందరూ బామ్మ మాట బంగారు మాట అంటుంటారు... బామ్మ బాట కూడా బంగారు బాటేనని ఈ బామ్మగారు రుజువు చేశారు.

Monday, June 30, 2014

గ్రేస్‌కు ఇంజనీరింగ్ సీటొచ్చింది..

హిజ్రాలంటే ఏహ్య భావంతో చూసే సమాజం ఇది. కానీ, తమిళనాడులో గ్రేస్ బాను అనే హిజ్రా తనకు  ఎదురైన అవహేళనల్ని తట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. అన్నా యూనివర్శిటీ కౌన్సిలింగ్ ద్వారా అరక్కోణంలోని శ్రీకృష్ణా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ట్రిపుల్ ఇ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్) కోర్సులో చోటు దక్కించుకుంది. పాలిటెక్నిక్‌లో గ్రేస్ 94 శాతం మార్కులతో సంపాదించింది. గ్రేస్ ట్రాన్స్‌జెండర్ కావడంతో ప్లస్ టూలో ఉండగానే తల్లిదండ్రులు వదిలేశారు. అప్పటి నుంచీ ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ వరకూ వచ్చింది.

Saturday, May 31, 2014

చెట్టు కొడుకు..

మధ్యప్రదేశ్‌లో నివసించే శ్యామ్ లాల్ పతిదార్ తన కొడుక్కి ప్రతి ఏటా క్రమం తప్పకుండా పుట్టినరోజు వేడుక జరుపుతుంటాడు. కొడుకును ముద్దు పెట్టుకుని మురిసిపోతుంటాడు. ఇంట్లో తిండి గింజలు లేకపోయినా పట్టించుకోడు కానీ, తన చెట్టంత కొడుకు పుట్టినరోజున కేక్ కట్ చేసి, బుడగలు కట్టి నానా హడావుడి చేస్తాడు. ఇంతకీ ఆ కొడుకు అంత గొప్పవాడా.. అని మీరు అడగవచ్చు. అవును మరి. ఆ చెట్టంత కొడుకు మరెవరో కాదు. ఒక వేప చెట్టు. ఆ చెట్టునే తన కొడుకుగా భావించి పండుగ చేస్తుంటాడాయన. శామ్ లాల్‌ను అందరూ ఆదర్శంగా తీసుకుంటే పర్యావరణ సమస్యలే రావని మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఆయన గురించి గొప్పగా చెబుతుంటారు.

Friday, January 31, 2014

పెన్షన్ ఇస్తున్నారుగా... పనిచేస్తా..

రిటైర్ అయిన తరువాత హాయిగా ఇంట్లో కూర్చుందామనుకోలేదు ఆ పెద్దాయన. ఇస్తున్న పెన్షన్‌కు తగిన పని చేస్తానంటూ మళ్ళీ ఆఫీసు బాటపట్టారు. తమిళనాడులోని శ్రీరంగంలో నివసిస్తున్న రిటైర్డ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ వి గోపాలన్ గారి జీవితం ఇది. అక్కడికి 9 కిలోమీటర్ల దూరాన మన్నార్‌పురంలో పనిచేస్తుండేవారు. అయితే 2006లో రిటైర్ అయినప్పటికీ పెన్షన్ పేరిట డబ్బులిస్తున్నారు కనుక అందుక తగ్గ సేవలందిస్తానంటూ రోజూ సైకిల్‌పై అంతదూరం వెళ్ళి స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. తన ఆరోగ్యం భేషుగ్గా ఉందంటూ మళ్ళీ సైకిలెక్కారాయన..