Wednesday, November 30, 2016

వ్యాపారే గానీ మనసున్నోడు...

వెయ్యి, 500 నోట్ల రద్దయిన ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లర కోసం జనం రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఇలా వయో, లింగ భేదాలతో సంబంధం లేకుండా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద రేయింబవళ్ళు పడిగాపులు కాస్తున్నారు.  పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న కష్టాలు, బ్యాంకులు, ఏటీఎంల దగ్గర పెరుగుతున్న క్యూలను చూసిన ఓ వ్యాపారి వారి కష్టాలు తీర్చడానికి పెద్దమనసుతో ముందుకొచ్చాడు. తన దగ్గరున్న చిల్లర నోట్లు, నాణేలను బ్యాంకులో జమచేసి చిల్లర కష్టాలు తీర్చడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఆయన పేరు చెందిన అవదేశ్ గుప్తా. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఈయన, బ్యాంకులో రూ.1.55 లక్షల మొత్తాన్ని చిల్లర రూపంలో జమచేశాడు. రూ.10, రూ.50, రూ.100 నోట్ల రూపంలో ప్రజల కోసం చిల్లరను జమ చేయడం విశేషం. ఒక వ్యాపారస్తుడైన అవదేశ్‌కు చిల్లర ఎంతో ముఖ్యం. ఆయన వద్ద చిల్లర ఉంటేనే వ్యాపారం బాగా సాగుతుంది. అయితే, చిల్లర డబ్బుల కోసం బ్యాంకుల వద్ద జనం పడుతున్న పాట్లను తొలగించాలనే సదుద్దేశంతో అవదేశ్ ముందుకొచ్చారు. లాభాపేక్షను పక్కన పెట్టి తక్కువ విలువ కలిగిన నోట్లను జమచేశారు. నవంబర్ 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ స్వయంగా ప్రకటించారు. ఆ క్షణం నుంచే చిల్లర సమస్యలు చుట్టుముట్టాయి. అవదేశ్ లాంటివారు మరికొందరు ముందుకొస్తే దేశవ్యాప్తంగా చిల్లర సమస్య కొంతలో కొంతయినా పరిష్కారమవుతుంది.