Wednesday, April 17, 2019

భార్య కోసం టాయ్‌లెట్ బెడ్

తమిళనాడులోని నాగర్‌కోయిల్ ప్రాంతానికి చెందిన ఎస్ శరవణ ముత్తు అనే 42 ఏళ్ళ వెల్డింగ్ కార్మికుడు తన భార్య కోసం రిమోట్ కంట్రోల్ బెడ్ తయారు చేసి తన ప్రేమను చాటుకున్నాడు. ఇతని శ్రమను గుర్తించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ జాతీయ స్థాయిలో 2వ బహుమానాన్ని ప్రకటించింది. కొన్ని రోజుల కిందట అనారోగ్యానికి గురైన ముత్తు భార్యకు ఆపరేషన్ జరిగింది. ఆమె మంచం దిగలేని పరిస్థితిని గమనించిన శరవణముత్తు రిమోట్ కంట్రోల్ టాయ్‌లెట్ బెడ్ తయారు చేశాడు. ఇది సెప్టిక్ ట్యాంక్‌కు కనెక్ట్ అయ్యేలా 3 బటన్స్‌తో రూపొందించాడు.

సూపర్ శరవణా... మీలాంటివారుంటే భార్యలకు బాధలుండవు.

Thursday, February 28, 2019

సైన్యం కోసం యాచకురాలి డబ్బులు...

రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరానికి చెందిన నందినీ శర్మ అనే యాచకురాలు అక్కడి బజరంగఢ్ అనే ప్రాంతంలో ఉన్న అంబే మాత అలయం వద్ద యాచిస్తూ జీవించేది. 6 నెలల కిందట అమె మరణించింది. ఆమె తన జీవితకాలంలో భిక్షాటన ద్వారా సేకరించిన 6.61 లక్షల రూపాయలను ఈ ఆలయ ట్రస్టీల చేతికి అప్పగించి ఏదైనా సత్కార్యానికి ఉపయోగించాల్సిందిగా కోరింది. నందినీ శర్మ కోరిక మేరకు పుల్వామా దాడిలో మరణించిన సైనికుల కుటుంబాల సహాయార్థం ట్రస్టీలు ఈ సొమ్మును జిల్లా కలెక్టర్ విశ్వమోహన్ శర్మ ద్వారా చెక్ రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. నందిని ప్రతి రోజూ భిక్షాటన ద్వారా ఆర్జించిన ధనాన్ని బ్యాంకులో దాచేవారు. తనకు ప్రభుత్వ గుర్తింపు ఏదీ లేకపోవడంతో ఆలయ ట్రస్టీల సూచన మేరకు ఒక మెడికల్ షాపు యజమాని అంకుర్ అగర్వాల్‌తో కలసి జాయింట్ అకౌంట్ తెరచి అందులో ఈ డబ్బు వేసేవారు. ఆ డబ్బే ఆమె చివరి కోరిక మేరకు సత్కార్యానికి ఉపయోగపడి ఆ యాచకురాలిని దాతృత్వమూర్తిగా చేసింది. ఆలయ ట్రస్టీల్లో ఒకరైన సందీప్ గౌర్ ఈ వివరాలందించారు.

Thursday, January 31, 2019

అగ్ని ఆహుతి చేస్తే... ఆమె ఆకలి తీర్చింది

 హైదరాబాదులోని నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల అక్కడ వందలాది దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ దుకాణాలు పెట్టుకున్న చిరువ్యాపారులు దిక్కుతోచక ఆకలితో అలమటిస్తుంటే నగరంలోని హిమాయత్ నగర్‌కు చెందిన ఆర్తి అనే మహిళ... అడక్కుండానే అమ్మలా అన్నం వారికి పెట్టి వారి ఆకలి తీర్చారు. ఆలు బాత్‌, పెరుగు చట్నీ తీసుకొచ్చి తన స్నేహితులతో కలిసి నుమాయిష్‌ బాధితులు దాదాపు 200 మందికి వడ్డించారు. భోజనం అయిపోయినా ఆమె సేవలు ఆగిపోలేదు. కర్రీ పఫ్‌లు, బిస్కెట్స్, అరటి పండ్లు, మంచినీళ్ళ ప్యాకెట్లను కూడా అందించి ఆదర్శంగా నిలిచారు ఆర్తి.

Monday, August 06, 2018

నా స్కూటర్ ఆ పిచ్చుకలకే అంకితం!

సవీతా టీచర్ ఇంటికి వెళితే ఇనుప వలల మధ్య భద్రంగా ఉన్న ఒక స్కూటర్ కనిపిస్తుంది. అదేదో కేరళ మహారాజులు ఉపయోగించిన  స్కూటర్ అనుకోకండి. దాని మీద వాలే హక్కును కేవలం పిచ్చుకలకు మాత్రమే ఇచ్చారు ఆ టీచర్. ఆ ఊరి వాళ్ళు రోజూ వచ్చి ఆ స్కూటర్‌ని ఓసారి చూసి పోతున్నారు. కొద్ది రోజుల్లో ఈ సీన్ మారి మళ్ళీ ఆ స్కూటర్‌ని ఆవిడ వాడుకుంటారనుకోండి. అది వేరే విషయం ఇంతకీ అసలేం జరిగిందంటే...

ఉపాధ్యాయురాలైన సవీతా మహేంద్రన్ కేరళలోని సత్యమంగళం ప్రాంతంలో ఉన్న అరియప్పంపాళ్యం గ్రామంలో నివసిస్తుంటారు. ఆ మధ్య పని ఉండి ఓ వారం రోజులు సెలవు పెట్టి ఎక్కడికో వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి తన స్కూటర్‌ని పిచ్చుకలు ఉపయోగించుకోవడం ఆమె చూశారు. కాళ్ళు పెట్టుకునే చోట పిచ్చుకలు గూడు కట్టుకుని గుడ్లు పెట్టాయి. ఓ రెండు రోజులయ్యాక వెళ్ళిపోతాయిలే... అనుకున్నారు కానీ అదేం జరగలేదు.

పిచ్చుకల గూడులోని మూడు గుడ్లలో రెండిటి నుంచి పిల్లలు బయటకొచ్చాయి. మరొకటి కూడా పగిలి పిచ్చుక పిల్ల బయటకు వచ్చి, అవన్నీ స్వేచ్ఛగా ఎగిరే వరకూ ఆ స్కూటర్‌ని తాను ఎక్కకూడదని సవీత నిర్ణయించుకున్నారు. తమ వల్ల పిచ్చుకలకు ఇబ్బంది కలగకూడదని, అటు ఎవ్వరూ వెళ్ళకుండా స్కూటర్ చుట్టూ ఇనుప వలలు కట్టించారు.

ఆ పిచ్చుకలు ఎగిరాకే... ఈ బండి చక్రం కదిలేది.

Wednesday, February 28, 2018

రాజు కోడి అక్కడుంటే జాగ్రత్తగా వెళ్ళాలి మరి...

కోడి పేరెత్తగానే ఎప్పుడు కూరొండుకుని తినేద్దామా అనుకుంటారు చాలామంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌లో ఉన్న ఓ కోడిపుంజు ఇంటికి కాపలా కాస్తూ విశ్వాసాన్ని చూపిస్తోంది. మామూలుగా అయితే, మనుషులు దగ్గరకు రాగానే కోళ్లు పరుగులు తీస్తాయి. కానీ సుల్తానాబాదులోని అమృతమ్మ ఇంటి దగ్గర కొత్తవాళ్ళు కనిపిస్తే కోడి వెంటనే దాడి చేస్తుంది. వెంటపడి, తరిమికొడుతుంది. ఈ పుంజు పిల్లగా ఉన్నప్పుడు దానిని ఓ కుక్క నోట కరుచుకుని తీసుకెళుతుండగా... అమృతమ్మ ఆ కుక్కను తరిమేసి కోడిపిల్లను రక్షించింది. చావు బతుకుల్లో ఉన్న ఆ కోడిపిల్లకు చికిత్స చేయించి చక్కగా పెంచి రాజు అని పేరు కూడా పెట్టింది. అప్పటి నుంచి అమృతమ్మకు ఈ కోడి పుంజుతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఒంటరిగా ఉంటున్న అమృతమ్మకు ఈ కోడి పుంజు రక్షణ కల్పిస్తోంది. తన యజమానురాలి అనుమతి లేకుండా ఇంటి వస్తే మీద పడి పొడుస్తుంది. అమృతమ్మ ఆజ్ఞలను అక్షరాలా అనుసరిస్తుంది. ఇంటికి వచ్చినవారిపై ఆ పుంజు దాడి చేసినప్పుడు వద్దని అమృతమ్మ చెబితే చాలు వెంటనే ఆగిపోతుంది. జంతువులు, పక్షులను అందరూ చాలా చిన్నచూపు చూస్తారు. ఈ కోడిపుంజులాంటి చురుకైన పశుపక్ష్యాదులు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి.

Wednesday, November 01, 2017

అందరూ అనుకుంటారు... ఇతను ఆచరించాడు

అవును... పేదోళ్ళకు ఎంతో సాయం చెయ్యాలని ఎందరో అనుకుంటారు. కానీ, జేబులోంచి డబ్బులు తీయాలనేసరికి 'తర్వాత ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు చూద్దాం లే..' అనుకుని జీవితకాలం పాటు వాయిదా వేసుకుంటూ పోతారు. కానీ, హైదరాబాదు వాసి అయిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగి గౌతమ్ కుమార్ మాత్రం తనకు ఆలోచన వచ్చిందే తడవుగా 'సర్వ్ నీడీ' (అవసరార్థులకు సేవ) అనే సంస్థను ప్రారంభించి ఎందరికో అండగా నిలిచాడు. గ్రామాలు, నగరాల్లోని రోడ్లు, ఫుట్ పాత్‌ల మీద కాస్తంత సాయం కోసం ఎదురు చూసి ఆలసిసొలసి పడి ఉండే ఎందరెందరో ఆభాగ్యులకు చూసిన గౌతమ్, వారికి ఎలాగైనా సాయమందించాలని తపనపడి ఈ మహత్కార్యానికి పూనుకున్నాడు. 'సర్వ్ నీడీ'కి అనుబంధంగా మొబైల్ మెడికల్ క్యాంపులు, లాస్ట్ రైట్స్ (అనాథ శవాలకు అంత్యక్రియలు) లాంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాల్ని చేపట్టి ఇందులో మరెందరినో భాగస్వాముల్ని చేశాడు. గౌతం సర్వ్ నీడీకి వందనం, సలాం, సెల్యూట్...

Monday, August 07, 2017

టీచర్ రంగయ్య... మీలా ఉంటే స్కూలు బాగయ్య !

తెలంగాణ రాష్ట్రం కుమరం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న సావర్‌ఖేడ్ గ్రామానికి వెళితే ఉపాధ్యాయులనేవారు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునేవారంతా ఈ గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగయ్యను కలిస్తే ఈ వృత్తికున్న పవిత్రత ఏమిటో అర్థమవుతుంది. తాను పనిచేస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులకు స్వంత డబ్బుతో డిజిటల్‌ పాఠాలు చెబుతున్నారు రంగయ్య. ఇది తెలుగు మీడియం పాఠశాల అయినా ఇంగ్లీష్‌ మీడియంను కూడా మొదలుపెట్టారు.

రంగయ్య అంతటితో ఆగలేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ళలో చేర్చుతుండగా ఆయన మాత్రం తన కూతురు అక్షరను ఇదే పాఠశాలలో చేర్పించి గ్రామస్థులకు, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతున్నారు.

విద్యార్థులకు జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు గుర్తుండేలా పాఠశాల గోడలపై మహత్మజ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ తదితరుల చిత్రాలతో పాటు దేశ, రాష్ట్ర చిహ్నాలు, భారతదేశ, ప్రపంచ చిత్రపటాలను వేయించారు. అలాగే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా గుణింతాలు, ఇంగ్లీష్‌, తెలుగు అక్షరమాలతో పాటు అంకెలను రాయించారు.

సావర్‌ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆరుగురు విద్యార్థులు ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. మరో విద్యార్థి చుక్కా రామయ్య పీపుల్స్‌ ప్రొగ్రెస్‌ టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఉపాధ్యాయుడు రంగయ్య కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

ఉపాధ్యాయుడు రంగయ్య కృషి వల్ల సావర్‌ఖేడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయుడు విద్యాబోధన కొనసాగిస్తుండడంతో గ్రామ ప్రజలు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు పంపించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.