Thursday, October 29, 2015

ఉచితంగా చెప్పులు, గొడుగులు కుట్టి ఇవ్వబడును

సాయం చెయ్యాలన్న మనసుండాలి గానీ, అందుకు చేతి నిండా డబ్బుండాల్సిన పనిలేదని నిరూపించాడు నెల్లూరు వాసి చాట్ల వెంకటరత్నం. ఈ పట్టణంలో మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న విద్యుత్‌భవన్ ఆఫీసు ప్రహరీగోడకు ఆనుకుని కనిపిస్తుంది ఒక చిన్నపాక. అందులో రోజూ చెప్పులు కుడుతూ కనిపించే వ్యక్తే వెంకటరత్నం. అక్కడికొచ్చి చెప్పులు బాగు చేయించుకునే వారికి ఒక బోర్డు కనిపిస్తుంది. అది చదివితే చాలు.. వెంకటరత్నం దయాగుణం ఏంటో తెలుస్తుంది. ‘అనాధ బాలబాలికలకు, వికలాంగులకు, కుష్టువారికి, అంధులకు ఉచితంగా చెప్పులు, గొడుగులు కుట్టి ఇవ్వబడును’ అని ఆ పాకకు తగిలించిన చిన్న బోర్డు మీద రాసి ఉంది.

నిజానికి వెంకటరత్నం సేవలు ఇంతటితో ఆగలేదు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల చెప్పులు, బ్యాగులు డబ్బు తీసుకోకుండా కుట్టిస్తాడు. డబ్బున్నవారు వాడి పడేసిన బ్యాగులు, చెప్పులు, గొడుగులను సంపాదించి వాటిని బాగుచేసి పైసా ఆశించకుండా పేద విద్యార్థులకు ఇస్తాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ల  నుంచి కూడా ఏదో ఒక రేటుకు చెప్పులు, షూలు తీసుకుని వీలైనంత వరకూ సరిచేసి ఉచితంగా ఇచ్చేస్తాడు. ఆయన గురించి ఇంతకంటే ఇంకేం చెప్పాలి?

వెంకటరత్నం తండ్రి వెంకటగిరిలో చెప్పులు కుట్టుకునే వృత్తిలోనే ఉండేవారట. అదే ఊరిలోని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో వెంకటరత్నం పదోతరగతి వరకు చదివాడు. అక్కడ తనతో ఉన్న స్నేహితుల బాధలను చూసి చలించిపోయాడు. వారి తల్లిదండ్రులు ఇచ్చే రూపాయి, అర్ధరూపాయి ఆ పిల్లలకు ఒక్కరోజు ఖర్చుకు కూడా చాలేవి కావు. ఆ విద్యార్థుల బ్యాగులు, చెప్పులు పాడైతే వాటిని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి కుట్టించేవాడు వెంకటరత్నం. తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు వెంకటరత్నం  మీద పడ్డాయి. నెల్లూరు చేరుకుని చెప్పులు కుట్టే దుకాణం పెట్టుకున్నాడు. నాటి నుంచి నేటి వరకూ హాస్టల్స్‌లో ఉంటూ చదువుకునే విద్యార్థుల బ్యాగులు, చెప్పులను డబ్బులు తీసుకోకుండా బాగు చేస్తూ సేవలందిస్తున్నాడు.

నెల్లూరులోని రైల్వేట్రాక్ పక్కనే ఒక పూరిపాకలో వెంకటరత్నం నివసిస్తుంటాడు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అతని సంతానం. కుటుంబసభ్యులు వెంకటరత్నం సేవకు తోడుగా ఉన్నారు.

Thursday, July 30, 2015

ఖర్చు భరించి వైద్యం చేసిన డాక్టర్ గారు...

డాక్టర్లంటే రోగుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసేవారనే ముద్ర పడిపోయిన రోజులివి. కానీ వైద్య నారాయణులున్నారని నిరూపించారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ఉదయ్ కృష్ణ. ఒక లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు నుజ్జునుజ్జయిపోయి, ఇన్ఫెక్షన్ సోకి గుండెలు అరచేతిలో పెట్టుకున్న ఒక రోగికి ఆపరేషన్ ఖర్చు 1.66 లక్షల రూపాయల్ని ఆయనే భరించారు. ఆ రోగి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన 42 ఏళ్ళ మహిళ కృష్ణకుమారి. యాక్సిడెంట్‌లో ఆమె కాలు విరిగిపోతే ఉన్న డబ్బంతా ఖర్చుచేసి ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఒక దశలో  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారావిడ. అలాంటి పరిస్థితుల్లో తెలిసినవారి ద్వారా డాక్టర్ ఉదయ్ కృష్ణను కలుసుకున్నారు. కృష్ణకుమారికి ఆర్థిక సహాయం, వైద్య సహాయం చేసి తను చేస్తున్న వైద్య వృత్తికి సార్థకత చేకూర్చారు డాక్టర్ ఉదయ్ కృష్ణ.

Thursday, April 30, 2015

దోపిడీ విద్యాసంస్థలు ఉమను చూసి సిగ్గు తెచ్చుకోవాలి..

తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాకు చెందిన ఉమ ఒక మామూలు గృహిణి. కానీ వీధి బాలల కోసం ఆమె చేసిన విద్యా సేవలు చూస్తే ప్రమాణాలు దిగజారిన మన విద్యావ్యవస్థ సిగ్గుతో తల దించుకోవాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్ల పరిసరాల్లో చదువూ సంధ్య లేకుండా తిరిగే వీధి బాలల కోసం ఏదో ఒకటి నిశ్చయించుకుని 2003లో సిరాగూ మాంటిస్సోరీ స్కూలును ఏర్పాటుచేశారామె. బిచ్చగాళ్ల పిల్లలు, వీధి బాలలు ఆ బడిలో చేరేలా ఆమె రోడ్లపై తిరిగి ప్రచారం చేశారు.  ఆ పిల్లలకు ఐసిఎస్‌ఇ సిలబస్‌‌లో విద్యా బోధన చేశారు. అక్కడితో ఆగలేదు. జీవన్ విద్య పేరిట ఐఐటి కోచింగ్ కూడా అందజేస్తున్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వచ్చిన పిల్లలకు వ్యవసాయం, ఆరోగ్యం, వంటలు, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో తర్ఫీదు ఇచ్చి భవిష్యత్తులో వారి అభిరుచికి తగిన రంగాన్ని ఉపాధి కోసం ఎంచుకునేలా తయారు చేస్తున్నారు. తన సేవల్ని అంతటితో ఆపలేదు... సూయం చారిటబుల్ ట్రస్ట్, భారతమాత స్కూలు, కన్నిమేరీ నర్సరీ స్కూలు వంటి మరెన్నో సంస్థల్ని నడుపుతున్నారామె. తిరువల్లూరు, కన్యాకుమారి, నాగపట్నం లాంటి చోట్ల వైద్య శిబిరాలు, విద్యా సంబంధమైన అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నారు.

Saturday, January 31, 2015

అతనికి జ్ఞానం ఉంది... అందుకే...

ఆ రైతు పేరు జ్ఞాన్ సింగ్. స్కూలు పాఠాల జ్ఞానమైతే ఆయనకు లేదు గానీ, తన సమాజానికేం చెయ్యాలో మాత్రం తెలిసిన జ్ఞాని ఆయన. బరేలా అనే గిరిజన జాతికి చెందిన జ్ఞాన్ సింగ్, మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా మెల్ ఫాలియా గ్రామంలో ఉంటారాయన. ఒకసారి అనుకోకుండా ప్రమాదం జరిగితే, పాపం ఆయన కదలలేక... ఏ పనీ చేసుకోలేని అవస్థకు గురయ్యాడు. వైద్యం చేయించుకోవాలంటే, తమ ఊరికి అడ్డుగా ఉన్న ఒక కొండను దాటుకుని వెళ్లాలి. చివరికి ఆ ఊరివాళ్లు నలుగురు జ్ఞాన్ సింగ్‌ని అతి కష్టం మీద మోసుకుని వెళ్లారు. చికిత్స చేయించుకున్నాక కోలుకున్న జ్ఞాన్ సింగ్, తనేం చెయ్యాలో నిర్ణయించుకున్నారు. కత్తి, సుత్తి, గునపం లాంటి సామాగ్రిని సిద్ధం చేసుకుని... ఆ కొండ మధ్యగా దారి ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. మొదట్లో ఆయన సోదరులు, భార్య సలు బాయ్ తోడుగా వచ్చారు. ఏం జరగబోతోందో గ్రహించిన గ్రామస్తులు కూడా వారి నుంచి స్ఫూర్తి తీసుకుని రోడ్డు నిర్మాణం కోసం నడుం బిగించారు. ఇప్పుడు మెల్ ఫాలియా గ్రామ ప్రజలు మన దేశంలోని సోమరులందరికీ స్ఫూర్తిదాతలయ్యారు.