Saturday, January 26, 2008

ష్... గబ్బిలాలు ఎగిరిపోతాయ్

శబ్ద కాలుష్యం అతి తక్కువగా ఉన్న గ్రామాలపై సర్వే చేస్తే... చెన్నై - పాండిచ్చేరి సముద్రతీర మార్గమధ్యంలో ఉన్న కళుపెరుంబాక్కం అనే ఊరికి మొదటి బహుమతి ఖాయం. ఎందుకంటే గత 14 ఏళ్లుగా ఆ ఊరు శబ్దాలకు దూరంగా నిశ్శబ్దంగా ఉంటోంది. అంతేకాదు బాగా కాంతివంతమైన దీపాలు కూడా వెలిగించరు. దీపావళి పండుగ వచ్చినా అక్కడ ఇదే పరిస్థితి. బాంబులు, టపాసులు ఏమీ పేల్చరు.

ఏమిటయ్యా అని గట్టిగా ఆరా తీస్తే ష్... గబ్బిలాలు ఎగిరిపోతాయ్ మెల్లగా మాట్లాడమన్నారు. గబ్బిలాలేమిటి, ఎగిరిపోవడమేమిటి బాబూ కాస్త ఆ కథ, కమామీషు ఏమిటో సెలవిమ్మని అడిగితే అప్పుడు ఆ ఊరి పెద్ద పళనిస్వామి అసలు విషయం చెప్పారు. వాళ్ల ఊళ్లోని చెట్లపై 20 ఏళ్లుగా వందల సంఖ్యలో గబ్బిలాలు నివాసముంటున్నాయని, శబ్దాలకు బెదిరిపోయి అవి ఎగిరిపోకుండా తామంతా శబ్దాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు.

గబ్బిలాలు ఎగిరిపోతే ఏంటంట అని అడిగినవాళ్లను పళనిస్వామి గద్దిస్తూ... అంటే మా ఊరు సుఖంగా ఉండాలని లేదా మీకు అని రెట్టించి అడిగారు. గబ్బిలాలకు, మీ ఊరి సుఖసంతోషాలకు సంబంధమేంటో అర్థం కావడం లేదు కానీ... కాస్త ఆ గుట్టు విప్పండని అడిగితే అప్పుడు ఆయన మళ్లీ మొదలు పెట్టారు.

ఓసారి కళుపెరుంబాక్కం ఆలయంలో మేళతాళాలతో ఉత్సవం జరిగినప్పుడు ఈ గబ్బిలాలు ఆ ధ్వనులకు బెదిరిపోయి చెట్లు విడిచి వెళ్లిపోయాయట. ఆ తర్వాత రెండు రోజులకు ఈ గ్రామంలో జనం ఉన్నట్టుండి వ్యాధుల బారిన పడటం, పలువురు అకారణంగా మరణించడం, కరవు లాంటి అశుభాలు చోటు చేసుకున్నాయట. ఎన్నడూ లేని విధంగా విపరీత పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ చేటుకు కారణం చెట్ల మీద ఉండే గబ్బిలాలు ఎగిరిపోవడమేనని గ్రామస్తులకు అనిపించిందట. ఎందుకంటే, గబ్బిలాలు అన్నాళ్లూ చెట్లపై ఉన్నంతకాలం గ్రామం సుభిక్షంగా ఉందని, అవి బాజాభజంత్రీల శబ్దాలకు బెదిరి చెల్లా చెదురైనప్పుడే ఈ విషాదం సంభవించిందని వాళ్లంతా నమ్మారు. ఆ వెంటనే వాళ్లంతా శబ్దాలకు స్వస్తి పలికి, గబ్బిలాల్ని మళ్లీ రప్పించమని గుడిలో ప్రత్యేకంగా పూజలు జరిపించారు.

ఆ పూజలు ఫలించాయి. గలగలమంటూ గబ్బిలాలు మళ్లీ చెట్లపై వాలాయి. ఆ రోజు నుంచీ కలుపెరుంబాక్కంలో శబ్దాలు వినిపిస్తే ఒట్టు. ఇది ఊరి పెద్దల తీర్మానం.