Saturday, May 30, 2009

అక్కడ బొబ్బిలి బ్రహ్మన్న లేడు...

ఆస్తి గొడవలొస్తే అన్నదమ్ములే కత్తులు దూసుకునే రోజులివి. డబ్బు విషయంలో తేడాలొస్తే మిత్రులే శత్రువులవుతున్న సమాజమిది. కుల, మత, జాతి, ప్రాంత విభేదాలతో రగిలిపోతున్న ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని వామన్‌ఖేడ్ గ్రామం గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. రాష్ట్రపతి ప్రశంసలు సైతం పొందిన ఈ గ్రామం ఎన్నోసార్లు ఆదర్శగ్రామంగా పురస్కారం అందుకుంది. ఈ ఊరిలో మహిళలకు సమానహక్కులున్నాయి. వేడుకలను అందరూ కలసికట్టుగా నిర్వహించుకుంటారు. ఈర్ష్య, అసూయలకు చోటు లేదిక్కడ. రాథోడ్ వంశానికి చెందినవారే ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికీ ప్రేమాభిమానాలు సరిసమానం. ఏ ఒక్కరికి సహాయం కావాలన్నా, మరే అవసరమున్నా సత్వరం వారికి చేయూత లభిస్తుంది. ఈ గ్రామ స్త్రీలు వారిళ్ళకు చాలావరకూ తాళాలు వెయ్యరు. కొత్తవారెవరైనా ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారి అవసరాన్ని వెంటనే గుర్తించి కావలసిన పనులు చేసిపెట్టి మర్యాదతో సాగనంపుతారు. ఆ మధ్య ఎప్పుడో ఒక వేడుక సందర్భంగా రెండు వర్గాలవారు కేవలం తూలనాడుకున్నందుకు వారిని వెలివేశారు. భారత శిక్షాస్మృతి పరిధిలోకి వచ్చే ఒక్క నేరం కూడా ఈ గ్రామంలో చోటు చేసుకోలేదు. అందువల్లే పోలీసులు కూడా అడుగుపెట్టలేదు. అంతేగాని బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలోలాగా ఆ ఊరు పెద్ద కృష్ణంరాజు పరిపాలనలో లేదు. అక్కడంతా మర్యాద రామన్నలే...

Friday, May 15, 2009

భార్యకోసం కొండను తవ్విన దశరథ్ మాన్జీ

ప్రభుత్వాధికార్ల గుండెల్ని కరిగించడం కన్నా కఠిన శిలల్ని కదిలించడమే తేలిక అని అతను గ్రహించాడు. అర్థాంగి అంటే నిజమైన అర్థం ఎందరికి తెలుసన్నది చెప్పలేం కానీ బీహార్‌కు చెందిన దశరథ్ మాన్జీ జీవితం మాత్రం దీనికి సరైన నిర్వచనమన్నది సూర్యచంద్రులు కనిపిస్తున్నంత నిజం. అతను తన భార్య కోసం 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి బాట ఏర్పరిచాడు. ఇది పూర్తయ్యేనాటికి ఆమె ప్రాణాలతో లేకపోయినా అతని గ్రామస్థుల పాలిట వరమైంది. అదేంటో తెలుసుకుందాం...

బీహార్‌లోని వజీర్‌గంజ్ సమీపాన గల గహ్‌లోర్ ఘాటీ గ్రామానికి చెందిన దశరథ్ మాన్జీ అత్యంత నిరుపేద. ముసాహర్ జాతి (ఎలుకల బొరియల్లో దొరికే ధాన్యాన్ని తిని జీవించే జాతి)కి చెందిన ఈయనంటే మాత్రం ఆ ప్రాంతం వారికి అత్యంత గౌరవం ఉంది. ఈయన్ని దశరథ్ బాబా అని కూడా పిలుస్తారు. 1962లో దశరథ్ భార్య ఫగుణీ ఈయన కోసం పొలానికి భోజనం తీసుకువస్తుండగా కిందపడిపోతే ఆమె చెయ్యి విరిగిపోయింది. వైద్యం కోసం ఊరిలో సదుపాయాలు లేవు. ఊరికి అడ్డుగా ఉన్న కొండను చుట్టి 30 కిలోమీటర్లు ప్రయాణించి గయకు వెళ్ళాల్సిందే. ఈ సంఘటనతో కొండను తవ్వి బాట ఏర్పరచాలన్న సంకల్పానికి ఆయనలో బీజం పడింది. 300 అడుగుల ఎత్తు, 1.5 కిలోమీటర్ వెడల్పున్న ఈ పర్వతాన్ని తవ్వి దారి ఏర్పరచడం అంత సులభం కాదని అందరికీ తెలుసు.

కొండను తవ్వి దారి ఏర్పరచాలనుకుంటున్నట్లు తన వారికి చెప్పగానే అందరూ వేళాకోళం చేశారు. వ్యతిరేకత వ్యక్తమైంది. అదేం పట్టించుకోని దశరథ్ తన మేకలు, ఇతర ఆస్తులు అమ్మి కొండ తవ్వడానికి పనికివచ్చే గడ్డపార, సమ్మెట, ఇతర వస్తువులు కొన్నాడు. ఇది గమనించిన వారు దశరథ్‌ను పిచ్చివాళ్ళ కేటగిరిలో వేసేశారు. సరిగ్గా ఇదే సమయంలో దశరథ్ భార్య జబ్బు పడగా ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో కొండను తవ్వితీరాలన్న ఆలోచన వజ్ర సంకల్పంగా మారింది. కొండను తవ్వడానికి రోజూ తన ఇంటి నుంచి వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుందని భావించిన ధశరథ్ కొండ దగ్గరే గుడిసె కట్టుకుని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు.

అది మొదలు 22 సంవత్సరాల పాటు ఏ ఒక్కరి సాయం లేకుండా రేయింబవళ్ళు శ్రమించి 1984లో 16 అడుగుల వెడల్పుతో చక్కని దారి సిద్ధం చేశాడు. దీంతో గహ్‌లోర్ ఘాటీ ప్రజల కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు వైద్యం కోసం చాలా తక్కువ సమయంలో గమ్యం చేరుకోగలుగుతున్నారు. కొండను తవ్వి ఎలుకలు పట్టే ఈ రోజుల్లో చోటు చేసుకున్న అద్భుతం ఇది.

దశరథ్ జీవించి ఉండగా గుర్తింపు రాలేదుగానీ, 2007లో ఆగస్ట్ 17న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తన 78వ ఏట మరణించినప్పుడు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన నిర్మించిన ఆ బాటకు "దశరథ్ మాన్జీ మార్గ్" అనే పేరు పెట్టారు. గహ్‌లోర్ ఘాటీలో ఈయన పేరిట ఆసుపత్రి నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.

ఇది కేవలం ప్రభుత్వాధికార్లు మాత్రమేకాదు, సమస్యల బారినపడి ఎదుటివాడు ఏడుస్తున్నా మనకెందుకులే అని మిన్నకుండే తోలుమందం ప్రజలందరూ దశరథ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, మరెన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయాలి....

Sunday, May 10, 2009

గుంటూరు గాంధీజీకీ జై

శ్రమదానం అన్న పదం వినగానే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ప్రవేశపెట్టిందేగా అనెయ్యకండి. ఆయనకంటే ముందే శ్రమదానానికి నిజమైన నిర్వచనమిచ్చి 40 ఏళ్ళకు పైగా శ్రమనే దానం చేస్తూ "గుంటూరు గాంధీ"గా పేరు పొందారు వట్టికూటి వెంకట సుబ్బయ్యగారు. గుంటురు జిల్లాలోని పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో 1916, అక్టోబర్ 28న (గాంధీ పుట్టిన నెలలోనే) జన్మించిన ఈయన తన జీవితాన్ని స్వచ్ఛంద సేవకే అంకితం చేశారు. మురికి కాల్వలు, రోడ్లు... చివరికి శ్మశానాలను సైతం శుభ్రం చేస్తూ కనిపిస్తుంటారు. ఈయన సేవలను గుర్తించి ఆ మధ్య మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఈ గుంటూరు గాంధీ గారికి సత్కారం కూడా చేశారు.

Monday, May 04, 2009

తువాలు విసిరే సవాలు

ఆ దేశం పేరు తువాలు. జనాభా కాస్త అటూ ఇటూగా ఒక 12000 మంది ఉండవచ్చు. అక్కడ స్వతంత్రంగా పత్రికా వ్యవస్థ లేకున్నప్పటికీ సామాన్యుల నుంచి సెల్‌లోని ఖైదీ వరకూ అందరినీ సంతృప్తిగా ఉంచే మానవహక్కుల వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. బాలలను హింసించిన పరిణామాలు కానరావు. పలు దేశాల్లో మానవహక్కుల అమలు గురించి 2002లో అమెరికా విదేశాంగశాఖ ఒక నివేదిక రూపొందించింది. ఈ తువాలు దేశంలో ఒక్క తప్పునైనా పట్టుకునేందుకు ఆ శాఖ విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఫిజీకి ఉత్తరంగా ఉన్న ఈ దేశంలో మహిళలపై నేరాలు జరగడం చాలా చాలా అరుదు. తువాలులోని ప్రభుత్వం ప్రజల హక్కుల్ని పూర్తిగా గౌరవిస్తుంది. ఇక్కడేమిటంటే పెద్దలు చెప్పిన మాట చట్టంతో సమానంగా అమలవుతుంది. నివేదిక 2002లో రూపొందించినప్పటికీ ఈ రోజుకు సైతం ఇది మానవహక్కుల పాలిట భూలోక స్వర్గమే. మానవహక్కుల పరిరక్షణలో తువాలు విసిరే సవాలుకు జవాబెక్కడుంది చెప్పండి?