Saturday, December 27, 2008

వీడేరా పోలీస్...

నాన్నా అని పిలిపించుకోవడానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన పనిలేదు. మరి అక్రమ సంబంధం ద్వారా పిల్లల్ని కంటేనో... అంటారా ? అలాంటి వాళ్లకు తల్లిదండ్రులుగా చెప్పుకునే అర్హత అంతకన్నా ఉండదు. ఆత్మీయతను అందుకోవడానికీ, అనురాగాన్ని పంచుకోవడానికీ ఉన్న మరో మార్గం మానవత్వం. అదే ఒక పోలీస్‌ను నాన్నా అనిపించింది. ఇది వరంగల్ జిల్లాలోని మరిపెడలో చాలాకాలం కిందట జరిగిన సంఘటనే అయినా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం...

ఈ జిల్లాలోని మరిపెడ గ్రామానికి 1997 ప్రాంతంలో 27 ఏళ్ల వయసుగల మతి స్థిమితం లేని ఒక యువతి ఎక్కడి నుంచో వచ్చింది. ఆమెకు తెలుగు తెలియదు. ఊళ్లో వాళ్లు మాత్రం ఆమెను సత్యవతి అని పిలిచేవారు. మనం కూడా అలాగే పిలుద్దాం. సత్యవతి ఆ ఊళ్లో చెట్లు చేమల వెంట, బస్టాండ్ పరిసరాల్లోనూ తిరుగుతూ అడుక్కుంటూ ఉండేది. వయసులో ఉన్న యువతి పట్ల ఓ కామాంధుడి ప్రవర్తన కారణంగా పాపం ఆమె గర్భం దాల్చింది. తనకేమయిందో కూడా తెలియని స్థితిలో సత్యవతి అలాగే ఊరంతా తిరుగుతూ ఉండేది. రోజులు గడుస్తుండగా ఆమె ఒక రోజున ప్రసవవేదన పడుతుంటే అక్కడివారు ఆటో ఎక్కించి ఆసుపత్రికి పంపిస్తున్న తరుణంలో ఆటోలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జరిగిందేంటో కూడా తెలియక ఆ పిచ్చితల్లి బిడ్డను కన్న వెంటనే రోడ్డెక్కి అడుక్కోవడానికి వెళ్లిపోయింది. బస్టాండ్‌లో ఆ పసిగుడ్డు అలాగే పడి ఉంది.

మరిపెడలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామరాజు సాంబయ్య ఈ విషయం తెలుసుకుని ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బిడ్డకు వేద శాస్త్రోక్తంగా సాయికిరణ్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కడి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాయికిరణ్‌ను చేర్చగా ఈ చిచ్చరపిడుగు అతని ఆశలు నెరవేర్చుతూ నూటికి నూరు మార్కులు సంపాదించి చల్ మోహనరంగా అంటున్నాడు. ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన ఈ దేవుడిచ్చిన బిడ్డకు రామరాజు ఘనంగా పుట్టినరోజు జరుపుతుంటారు. అంతేకాదు, ఈ చిన్నారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అక్కడి తపాలా కార్యాలయంలో జమ చేస్తూ వస్తున్నారు. నన్నడిగితే... వీడేరా పోలీస్ అంటాను.

Friday, December 26, 2008

సునామీ... షాజన్ ఉన్నాడు సుమీ!

జీవితాల్ని నాశనం చెయ్యడం నీకు తెలిస్తే... దాన్ని కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. సునామీ... నేనున్నాను సుమీ అంటూ నాలుగేళ్ల కిందట ఇదే రోజున (డిసెంబర్ 26, 2004) చోటుచేసుకున్న జలప్రళయం బారిన పడకుండా నాలుగు నిండు జీవితాల్ని కాపాడాడు తమిళనాట కన్యాకుమారి జిల్లాలో కడియపట్టణానికి చెందిన షాజన్. ఈ ఘటన జరిగినప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న షాజన్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించగా రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి ఇతనికి 'జీవన్‌రక్ష' పురస్కారమిచ్చి గౌరవించారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ఇక్కడి సెయింట్ పీటర్ మాథ్యమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షాజన్ డిసెంబర్ 26, 2004వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటికి దగ్గర్లో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళాడు. ఎగసిపడుతున్న అలల్ని చూచి కేరింతలు కొడుతున్నాడు. అంతలో ఓ భారీ కెరటం షాజన్‌ను కొట్టుకుంటూ తీసుకుపోగా అతని ఒక ఇంటి పై కప్పుమీదకెళ్ళి పడ్డాడు. అది శేఖరాజన్ అనే వ్యక్తి ఇల్లు. ఆ ఇంట్లో కూడా పూర్తిగా నీరు చేరింది. పై కప్పు మీద ఉన్న షాజన్‌కు ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. ఆ ఇంటివారిని అప్రమత్తం చేసిన షాజన్‌ను చూచి కాపాడమంటూ తన మూడు నెలల పసికందును కింద ఉన్న శేఖరాజన్ అతనికి అందించాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా పొదివి పట్టుకున్న షాజన్ పక్కింటి కప్పుపై సురక్షితంగా ఉన్న వృద్ధుని చేతిలో పెట్టాడు.

అప్పుడే ఛార్లెస్ అనే వ్యక్తి ఇంట్లోంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించగా షాజన్ ఆ ఇంటి పైకప్పు ఎక్కి పైనున్న పెంకులు తొలగించి చూశాడు. అందులో తన మిత్రుడు విన్‌బ్రాండో, అతని చెల్లెలు నీటిలో చిక్కుకుని కనిపించారు. షాజన్ వారికి పైనుంచి తన చెయ్యి అందించి సినిమాల్లో చూపించే దృశ్యాల్లోలా వారిని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. పట్టు జారిపోతున్నప్పటికీ పట్టు విడువక వారిని ఉడుం పట్టుతో విజయవంతంగా పైకి లాగి కాపాడాడు. అదే సమయంలో విద్యుత్ స్తంబానికి వేలాడుతూ కనిపించిన ఆంటోని శ్యామల అనే మహిళను కూడా షాజన్ రక్షించాడు. కిందకు దిగడానికి వీల్లేనంతగా సముద్రపు నీరు ఉండగా నేర్పరితనంతో ఇళ్ల పైకప్పులెక్కుతూ వారికి ప్రాణదానం చేశాడు ఈ జాలరి బిడ్డ. మరొకరైతే తాను బయటపడినందుకు బతుకు జీవుడా అంటూ తలదాచుకునేవారే తప్ప షాజన్‌లాగా స్పందించేవారా.

సునామీ నువ్వెంత?

సునామీ బాధితులైన ఆ చిన్నారులంతా చెన్నైలోని అన్నైసత్య అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలారు. వారు కుమిలిపోలేదు సరికదా బాధల్ని నమిలి మింగేసి, తమలాంటి మరిందరిని ఆదుకునేందుకు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కష్టాల అంధకారంలో కాంతి పుంజాల్లా కదులుతున్నారు. వీళ్లు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. సునామీ సంభవించి ఏడాది పూర్తయిన సందర్భంగా 2005 డిసెంబర్ నెలలో 66 మంది చిన్నారులు 20 నిమిషాల వ్యవధిలో 72 అడుగుల పొడవైన భారీ చిత్రకళాఖండాన్ని రూపొందించారు. దీంతో అప్పటి వరకూ ఉన్న 43 అడుగుల పొడవైన కళాఖండం రికార్డు చెరిగిపోయింది. మరో సందర్భంలో వీరంతా కలసి 24 గంటల సమయంలో 35 ఎకరాల స్థలంలో 1.74 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కారు. తమ సర్వస్వాన్నీ దూరం చేసిన సునామీని వెక్కిరిస్తూ విజయాలు సాధించుకుంటూ పోతున్న ఈ చిట్టి మనసుల ముందు ఓ సునామీ... నువ్వెంత?

అన్నట్టు మరో విషయం సు(నా)మీ... మా ప్రభుత్వాలది కూడా నీలా కరడుగట్టిన హృదయమే. అయితే, ప్రజలది మాత్రం మంచి మనసే. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో చదువుకుంటున్న విద్యార్థినులు కొందరు భారత సునామీ బాధితులకు చేయూతనిచ్చేందుకు వెయ్యి డాలర్ల నిధిని చెక్కు రూపంలో భారత ప్రధానమంత్రికి అందించారు. భారత్‌లో సునామీ వస్తే పాకిస్థాన్ జనం సంతోషిస్తారనుకున్నావు కదూ. వెర్రి సునామీ... జనాన్ని విడదీద్దామనుకున్నావు. నీ పాచికలు పారవులే.

Saturday, December 13, 2008

రక్త సంబంధం ఎన్టీఆర్, సావిత్రి...

ఇది రక్తసంబంధం సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి గురించి కాదుగానీ... అంతకంటే గొప్ప నిజజీవిత పాత్రల గురించి. కాకపోతే ఈ నిజ జీవితగాథలో ఇద్దరికీ పెళ్లి కాలేదు, వీళ్లు డబ్బున్నోళ్లు కాదు. అదే తేడా. ఇక సిద్ధయ్య వయసు 50 ఏళ్ల పైమాటే... అతని చెల్లెలి వయసు బహుశా 40 పైన ఉండొచ్చు. అయినా అతనికి ఆమె "చిట్టి" చెల్లెలే. ఎందుకంటే ఆమెకు పాపం మూర్ఛరోగమట. తాను పెళ్లి చేసుకుంటే తన భార్య, పిల్లల మధ్య ఆమెను పట్టించుకోగలనో లేదో అన్న అనుమానంతో సిద్ధయ్య పెళ్లే చేసుకోలేదు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన సిద్ధయ్య తల్లిదండ్రులు వీరి చిన్న వయసులోనే గతించారు. అప్పట్నుంచీ చెల్లెలు లచ్చవ్వకు అన్నీ సిద్ధయ్యే. తన జీవితాన్ని చెల్లెలి సేవకు అంకితం చేసేశాడు. ఆస్తి పాస్తులేమీ లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అడవికెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఏ రోజుకారోజు బియ్యం కొనుక్కుని చెల్లెలికి వంట చేసిపెట్టి తానూ తింటాడు. ఊరిలో ఎవరి ఇల్లయినా ఖాళీగా ఉంటే వీరు అందులో నివసిస్తుంటారు. వయసు మీదపడిన కొద్దీ శరీరం సహకరించడం లేదని బాధపడుతుంటాడు సిద్ధయ్య. అనుబంధాలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో చెల్లెలి సుఖమే తన జీవితంగా భావించే సిద్ధయ్య లాంటి మనుషులు ఇంకా మన మధ్య ఉన్నారనేది నిజంగా నిజం.

సరోజ చేతిలో ఎర్రజెండా

గడచిన పాతికేళ్లుగా వేలూర్‌లోని వళ్లలార్ బస్టాండ్ గుండా వెళ్లే చెన్నై - బెంగళూర్ జాతీయ రహదారి ప్రాంతంలో చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఇక్కడేదో అదనపు ట్రాఫిక్ పోలీస్ పికెట్ గానీ, ప్రత్యేకంగా సిగ్నలింగ్ వ్యవస్థ గానీ ఉందనుకోకండి. అందుకు కారణం దాదాపు 70 ఏళ్ల పిల్ల (ఆమె చురుకుదనం చూచి నాకైతే ఇలాగే అనాలనిపిస్తోంది) సరోజ చేతిలో ఉండే ఎర్ర జెండా. అందరూ మామీ అని పిలిచే సరోజ ఆ రహదారిపై నిలబడి ఎర్రజెండా చూపిస్తే సైకిల్ నుంచి పంజాబ్ లారీ వరకూ వాహనాలన్నీ ఆగిపోవాల్సిందే. అప్పుడామె తన దగ్గర గుంపుగా నిలుచున్న పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటిస్తుంది. అవతలకెళ్లి ఎర్రజెండా దించాకే ఆ వాహనాలన్నీ కదుల్తాయి. ఇక ఈమె చరిత్ర తెలుసుకుందాం.

సరోజ ఈ ప్రాంతంలోని పర్వతమలై అనే కొండ దిగువన పోరంబోకు స్థలంలో పాత గుడిసెలో నివాసముంటుంది. ఒకప్పుడు స్థానిక గణపతి ఆలయంలో పూజారిగా పనిచేసే ఈమె భర్త వెంకటరామ అయ్యర్ కామెర్ల వ్యాధితో 20 ఏళ్ల కిందటే మరణించారు. అప్పట్నుంచీ పేదరికంతో బాధపడుతున్న సరోజకు 1982లో వంటమనిషిగా ఉద్యోగమిచ్చారు. 1997లో పదవీ విరమణ వయసు రావడంతో ఆ పని కాస్తా పోయింది. కూతుళ్లిద్దరున్నా వారికి పెళ్లిళ్లు కావడంతో వారికి బరువు కాకూడదని ఈమె గుడిసెలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమాజానికి తనకు తోచిన, తాను చేయగల్గిన ఏదో ఒక సహాయం చెయ్యాలన్న తపనతో ఎర్రజెండా చేతబూని పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటించి సహకరిస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ సేవ సాయంత్రం 5 గంటలకు పాఠశాల ముగియడంతో పూర్తవుతుంది. సరోజ సామాజిక స్పృహకు మెచ్చిన పాఠశాల యాజమాన్యం నెలకు రూ.200, ప్రభుత్వం ఇచ్చే నెలవారీ వృద్ధుల పింఛన్ మరో 200 రూపాయలు, పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ఇచ్చేవి ఈమెకు జీవనాధారం. ముదిమిలోనూ మానవసేవతో జీవితంలో కొత్త కోణాన్ని ఆస్వాదిస్తున్న సరోజ మనందరికీ స్ఫూర్తిదాయకమే కదూ...