Saturday, December 27, 2008

వీడేరా పోలీస్...

నాన్నా అని పిలిపించుకోవడానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన పనిలేదు. మరి అక్రమ సంబంధం ద్వారా పిల్లల్ని కంటేనో... అంటారా ? అలాంటి వాళ్లకు తల్లిదండ్రులుగా చెప్పుకునే అర్హత అంతకన్నా ఉండదు. ఆత్మీయతను అందుకోవడానికీ, అనురాగాన్ని పంచుకోవడానికీ ఉన్న మరో మార్గం మానవత్వం. అదే ఒక పోలీస్‌ను నాన్నా అనిపించింది. ఇది వరంగల్ జిల్లాలోని మరిపెడలో చాలాకాలం కిందట జరిగిన సంఘటనే అయినా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం...

ఈ జిల్లాలోని మరిపెడ గ్రామానికి 1997 ప్రాంతంలో 27 ఏళ్ల వయసుగల మతి స్థిమితం లేని ఒక యువతి ఎక్కడి నుంచో వచ్చింది. ఆమెకు తెలుగు తెలియదు. ఊళ్లో వాళ్లు మాత్రం ఆమెను సత్యవతి అని పిలిచేవారు. మనం కూడా అలాగే పిలుద్దాం. సత్యవతి ఆ ఊళ్లో చెట్లు చేమల వెంట, బస్టాండ్ పరిసరాల్లోనూ తిరుగుతూ అడుక్కుంటూ ఉండేది. వయసులో ఉన్న యువతి పట్ల ఓ కామాంధుడి ప్రవర్తన కారణంగా పాపం ఆమె గర్భం దాల్చింది. తనకేమయిందో కూడా తెలియని స్థితిలో సత్యవతి అలాగే ఊరంతా తిరుగుతూ ఉండేది. రోజులు గడుస్తుండగా ఆమె ఒక రోజున ప్రసవవేదన పడుతుంటే అక్కడివారు ఆటో ఎక్కించి ఆసుపత్రికి పంపిస్తున్న తరుణంలో ఆటోలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జరిగిందేంటో కూడా తెలియక ఆ పిచ్చితల్లి బిడ్డను కన్న వెంటనే రోడ్డెక్కి అడుక్కోవడానికి వెళ్లిపోయింది. బస్టాండ్‌లో ఆ పసిగుడ్డు అలాగే పడి ఉంది.

మరిపెడలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామరాజు సాంబయ్య ఈ విషయం తెలుసుకుని ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బిడ్డకు వేద శాస్త్రోక్తంగా సాయికిరణ్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కడి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాయికిరణ్‌ను చేర్చగా ఈ చిచ్చరపిడుగు అతని ఆశలు నెరవేర్చుతూ నూటికి నూరు మార్కులు సంపాదించి చల్ మోహనరంగా అంటున్నాడు. ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన ఈ దేవుడిచ్చిన బిడ్డకు రామరాజు ఘనంగా పుట్టినరోజు జరుపుతుంటారు. అంతేకాదు, ఈ చిన్నారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అక్కడి తపాలా కార్యాలయంలో జమ చేస్తూ వస్తున్నారు. నన్నడిగితే... వీడేరా పోలీస్ అంటాను. Print this post

11 comments:

Shiva Bandaru said...

నిజంగా రామరాజు సాంబయ్య మంచి మనిషి .

MURALI said...

చాలా మంచి టపాలు రాస్తున్నారండి. ఇలాంటి పోలీసులు మరింత మందికి ఆదర్శం కావాలంటే మీలా అందరికి చెప్పేవారు కావాలి.

worthlife said...

మీ ప్రోత్సాహంతో ఇంకా ఇలాంటివి సేకరిస్తాను. ధన్యవాదాలు

Audisesha Reddy said...

సాంబయ్య వంటి ఆదర్శమూర్తులు వుండబట్టే ఈ భూమి మీద వర్షాలు పడి పంటలు పండుతున్నాయి. ఒక గొప్ప మనుసున్న వ్యక్తిని గురించి సేకరించి తెలియ జేసిన మీ కృషికి అభినందనలు.

వేణూశ్రీకాంత్ said...

మురళి గారిదే నా మాట కూడానూ. మంచి స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్తున్నారు.
Keep it up.

Amar said...

chaala manchi vaarta raasaru.

శ్రీనివాస్ పప్పు said...

మానవత్వమే అడుగంటిపోతున్న ఈరోజుల్లో రామరాజు సాంబయ్య లాంటి పోలీసులు ఇంకా మానవత్వానికి అడ్రస్స్ చూపిస్తున్నారు.మంచి పోస్ట్..

Anji Babu said...

చూసాను కుమార్ గారు. సమాజానికి ఇటువంటి వారు ఉండడం వల్లనే ఇంక మనకి పోలీసు వ్యవస్థ పై నమ్మకం అనేది మిగిలి ఉంది. ( మీ స్పందన చూశాక, ఒక వేళ మీరు నేను పోలీసులను గురించి తప్పుగా అన్ననేమో అని అనుకుని నాకు మీ రచనను చూపించారనుకున్నా. కాదని అర్థం అయ్యింది )

మీ రచనలు చాల బాగున్నాయి. సింప్లిసిటీ ఉట్టిపడుతుంది. అభినందనలు.

అంజి బాబు
ప్యూర్ ఆంధ్ర డాట్.కాం

విహారి(KBL) said...

సార్ మీరు నిజంగా అదృష్టవంతులు.అంతటి మహామనిషి చూసే భాగ్యం మీకు కలిగింది.మీ దగ్గర ఏమన్న భానుమతి గారికి సంభందించిన వివరాలు వుంటే షేర్ చేసుకోగలరు.ధన్యవాదాలు

radha said...

reall HE is a great man

Anonymous said...

really HE is a great man