Saturday, December 13, 2008

రక్త సంబంధం ఎన్టీఆర్, సావిత్రి...

ఇది రక్తసంబంధం సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి గురించి కాదుగానీ... అంతకంటే గొప్ప నిజజీవిత పాత్రల గురించి. కాకపోతే ఈ నిజ జీవితగాథలో ఇద్దరికీ పెళ్లి కాలేదు, వీళ్లు డబ్బున్నోళ్లు కాదు. అదే తేడా. ఇక సిద్ధయ్య వయసు 50 ఏళ్ల పైమాటే... అతని చెల్లెలి వయసు బహుశా 40 పైన ఉండొచ్చు. అయినా అతనికి ఆమె "చిట్టి" చెల్లెలే. ఎందుకంటే ఆమెకు పాపం మూర్ఛరోగమట. తాను పెళ్లి చేసుకుంటే తన భార్య, పిల్లల మధ్య ఆమెను పట్టించుకోగలనో లేదో అన్న అనుమానంతో సిద్ధయ్య పెళ్లే చేసుకోలేదు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన సిద్ధయ్య తల్లిదండ్రులు వీరి చిన్న వయసులోనే గతించారు. అప్పట్నుంచీ చెల్లెలు లచ్చవ్వకు అన్నీ సిద్ధయ్యే. తన జీవితాన్ని చెల్లెలి సేవకు అంకితం చేసేశాడు. ఆస్తి పాస్తులేమీ లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అడవికెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఏ రోజుకారోజు బియ్యం కొనుక్కుని చెల్లెలికి వంట చేసిపెట్టి తానూ తింటాడు. ఊరిలో ఎవరి ఇల్లయినా ఖాళీగా ఉంటే వీరు అందులో నివసిస్తుంటారు. వయసు మీదపడిన కొద్దీ శరీరం సహకరించడం లేదని బాధపడుతుంటాడు సిద్ధయ్య. అనుబంధాలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో చెల్లెలి సుఖమే తన జీవితంగా భావించే సిద్ధయ్య లాంటి మనుషులు ఇంకా మన మధ్య ఉన్నారనేది నిజంగా నిజం. Print this post

4 comments: