Friday, December 30, 2011

చెట్టు కాదు గోడనే పడగొట్టండి...

ఫ్రెంచ్ మొరాకోలో దర్శకుడు హెన్రీ తన "ది బ్లాక్ రోజ్" సినిమా తీస్తున్న రోజులవి. ఆ ప్రాంతంలో హథవే కెయిడ్ ఇబ్రహీం అనే వ్యక్తికి చెందిన ఒక అద్భుతమైన ప్యాలెస్ ఉంది. అందులో తన సినిమా షూటింగ్ కోసం ఇబ్రహీం అనుమతి కోసం హెన్రీ వచ్చాడు. తన ప్యాలెస్‌లో షూటింగ్ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ప్యాలెస్ ఆవరణలోకి కెమెరాలు, క్రేన్‌లు, భారీ లైట్లు, ఇతర సామాను తీసుకురావడానికి చెట్లు అడ్డు వస్తున్నాయి. ఇక ఆ చెట్లు కొట్టించడానికి అంగీకరించాలంటూ ఇబ్రహీంని కలిశాడు హెన్రీ.

చెట్లు కొట్టించవద్దు. కావాలంటే గోడ పడగొట్టుకోండి.. అన్నాడు ప్యాలెస్ యజమాని ఇబ్రహీం

చెట్లు కొట్టించడం చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. గోడ కూల్చడం, మళ్లీ కట్టించడం చాలా ఖర్చు వ్యవహారం కదా.. అన్నాడు దర్శకుడు హెన్రీ..

నాకున్న డబ్బుతో అలాంటి గోడలు ఎన్నయినా క్షణాల్లో కట్టిస్తాను. కానీ, చెట్లు పడగొడితే తిరిగి మొలిపించే శక్తి నాకు లేదు.. అంటూ గోడను కూల్చడానికే మొగ్గు చూపాడు పర్యావరణ ప్రేమికుడైన ఇబ్రహీం...

భారత పాలకులారా.. మీకు అర్థమయిందనుకుంటాను.

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు..

Thursday, December 01, 2011

డాక్యుమెంటరీల పోలీస్..

గుంటూరు జిల్లా డిసిఆర్‌బిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ కొట్టె శ్రీహరి స్టయిలే వేరు. సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేయడానికి వినూత్న శైలిని ఎంచుకున్నారీయన. రకరకాల నేరాలపై డాక్యుమెంటరీలు నిర్మించి వాటిని ప్రదర్శించడం ద్వారా శ్రీహరి పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఈక్రమంలోనే 2007 పౌరులారా పారాహుషార్, 2009లో బతుకు బతికించు అనే రెండు లఘు చిత్రాలు నిర్మించి నేరాల నిరోధానికి తన వంతు సేవలందిస్తున్నారు. నకిలీ బాబాలు, వ్యసనాలు, గొలుసు దొంగలు, ప్రేమ మోసాలు, దురలవాట్లు, ర్యాగింగ్, బిస్కెట్ గ్యాంగులు లాంటివి ఈయన నిర్మించే లఘు చిత్రాల ఇతివృత్తంగా ఉంటాయి. జర్నలిజంలో ఎం.ఎ చేసిన శ్రీహరి తన ఈ లఘుచిత్రాలకు గాను 2001లో హైదరాబాద్ పోలీస్ డ్యూటీ మీట్‌లో బంగారు పతకాన్ని కూడా సాధించారు.

Monday, October 10, 2011

బ్లాగుతో బాగుపడిన జీవితం..

బ్లాగులు, ఇంటర్నెట్, చాటింగ్, బజ్.. ఈ పదాలు వింటూనే ఇవేమిటర్రా బాబూ అంటూ ముఖం చిట్లించుకునే ఒక వర్గానికి కనువిప్పు కల్గించాడు ఒక బ్లాగర్. అపూర్వ మానవత్వాన్ని ప్రదర్శించి బ్లాగులు తల్చుకుంటే జీవితాల్ని బాగుచేయవచ్చని నిరూపించాడు. అతనే కేరళకు చెందిన బ్లాగర్ సనల్ శశిధరన్. ఇతను తన బ్లాగు sanathanan.blogspot.com ద్వారా షరి అనే మహిళ ఆపరేషన్ కోసం లక్షలాది రూపాయల విరాళాలు సమకూర్చి సాయపడ్డాడు. ఆ వైనం ఏమిటంటే..

షరి, అనిల్ కుమార్ దంపతులు కేరళలోని కొల్లం పట్టణంలో నివసిస్తుంటారు. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న షరికి తిరువనంతపురం ప్రాంతీయ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో వైద్యం చేయిస్తూ వచ్చారు. ఈమెకు కీమోథెరపీ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరగాల్సి ఉందని, ఇందుకోసం దాదాపుగా రూ.15 లక్షల మొత్తం అవసరమవుతుందని వైద్యులు చెప్పారు.

ఈ దంపతుల సమస్య గురించి తెలుసుకున్న శశిధరన్ తన బ్లాగ్ ద్వారా వీరి పరిస్థితిని Google buzz, Blogosphere, Facebook తదితరాల ద్వారా సైబర్‌వాసుల దృష్టికి తీసుకువచ్చాడు. సైబర్ మోసాలు మారుమోగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ దంపతుల వాస్తవ స్థితిగతులకు సాక్ష్యంగా మెడికల్ రిపోర్ట్‌లు, వీరి కుటుంబ సభ్యుల ఫోటో, ఫోన్ నెంబర్, అనిల్ కుమార్ బ్యాంక్ ఖాతా వివరాలు తన బ్లాగ్ ద్వారా వెల్లడించాడు.

శశిధరన్ నిజాయితీని గమనించిన పలువురు బ్లాగర్లు వెంటనే స్పందించగా ఆ నోటా ఈ నోటా ఈ వార్త పాకి వందలాదిగా సాయమందించేందుకు ముందుకు వచ్చారు. వీరి ద్వారా సమకూరిన డబ్బు వివరాల్ని గూగుల్ స్ప్రెడ్ షీట్ ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేసి పారదర్శకంగా మంచిపనిని నిర్వహించాడు.

Saturday, October 08, 2011

ఏమి రాజండీ... అధికారం ఉండదని తెలిసీ..

ఒక దేశానికి రాజంటే.. మందీమార్బలం, హద్దుల్లేని అధికారం, కోరుకున్నదల్లా క్షణాల్లో సమకూరే విలాసవంతమైన జీవితం. ఇలాంటి జీవితాన్ని తమంత తాముగా త్యాగం చెయ్యడానికి ఎవరైనా ముందుకొచ్చారా ?.. త్రేతాయుగంలో శ్రీరాముడు, తర్వాత బుద్ధ భగవానుడు తప్ప మరెవరూ గుర్తుకురావడం లేదు కదూ.. ఈ దివ్య పురుషుల జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలోనే నడిచాడు భూటాన్ దేశ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్.

భూటాన్‌లో తమ వంశం అధికారంలో ఉన్న రాచరిక వ్యవస్థ కంటే ప్రజాస్వామ్యమే ప్రజలకు మేలు చేస్తుందని నమ్మిన జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 2008 కల్లా మహారాజు హోదాను వదులుకోవడానికి సిద్ధమని ముందే ప్రకటించాడు. తన ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికిగాను 34 సూత్రాల రాజ్యాంగాన్ని రూపొందించి దీనిని ప్రతి ఇంటికీ పంపి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.

ఈ రాజ్యాంగం అమలులోకి వస్తే భూటాన్ రాజుకున్న అధికారాలన్నీ రద్దవుతాయి. మూడింట రెండొంతుల మంది పార్లమెంట్ సభ్యులు అంగీకరిస్తే రాజును తొలగించే అధికారాన్ని పార్లమెంట్‌కే ఉండేలా రాజ్యాంగాన్ని తయారు చేశారు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్. చివరికి 2006లో తన మహారాజుగా తప్పుకుని కుమారుడు జిగ్మే గేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌కు పాలనా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడీయన తండ్రి ఆశయాలకు అనుగుణంగా భూటాన్ దేశాన్ని ప్రజాస్వామ్యం దిశగా నడిపిస్తూ ఎన్నికల చట్టాలు, భూసంస్కరణల అమలుకోసం పార్లమంట్‌లో జరిగిన చర్చలకు నేతృత్వం వహించారు.

పదవుల కోసం పాకులాడే నేటి రాజకీయ నాయకులు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ గారి దగ్గర పనివారిగా చేరినా బాగుపడతారంటారా?..

ఈ రాజుగారి మరో గొప్పతనం ఏమిటంటే.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పొగతాగడాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నారు. అయితే తనకూ ఈ అలవాటు ఉండటంతో పూర్తిగా దాని నుంచి బయటపడి అప్పుడు భూటాన్‌లో పొగతాగడంపై నిషేధం విధించారు.

సౌజన్యం: శ్రీ మల్లాది కృష్ణమూర్తిగారు...

Thursday, October 06, 2011

మాట నిలుపుకున్న జైలు వార్డర్

ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారి సంఖ్య నానాటికీ క్షీణిస్తున్న నేటి తరుణంలో మాటకు కట్టుబడి మంచితనానికి ప్రతిరూపమై ఉన్న నాగభూషణం (55) లాంటి కొద్దిమందిని స్మరించుకోవలసిన బాధ్యత మనందరిదీను. ఇక ఆయనిచ్చిన మాటేమిటో.. దానిని ఎలా నెరవేర్చారో తెలుసుకోండి.

నాగభూషణంగారి గురించి నాకు తెలిసే సరికి ఆయన కడప సెంట్రల్ జైల్ వార్డర్‌గా పనిచేస్తున్నారు. 2003లో ఆయన విశాఖపట్టణం సెంట్రల్ జైల్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక హత్యకేసులో జీవితఖైదు శిక్షకు గురైన దువ్వూరు రాజారావు అనే వ్యక్తి ఈ జైలుకు వచ్చాడు. రాజారావు కొడుకు దువ్వూరు నేతాజీ ఆ సమయంలో 10వ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. కొడుక్కి మంచి జీవితం ఇవ్వలేక తాను జైలుకు వచ్చానన్న బెంగతో రాజారావు తన వ్యథను జైల్ సూపరింటెండెంట్‌కు మొరపెట్టుకున్నాడు. ఆ సూపరింటెండెంట్‌గారు ఖైదీ రాజారావు కొడుకు నేతాజీకి సాయపడమని జైల్ వార్డర్‌గా ఉన్న నాగభూషణానికి చెప్పారు.

తన ఉన్నతాధికారి ఆదేశాల్ని శిలాశాసనంగా భావించిన వార్డర్ నాగభూషణం తన ఖైదీ రాజారావు కొడుకు నేతాజీ బాధ్యతల్ని పూర్తిగా నెత్తిన వేసుకున్నారు. సుమారు ఎనిమిదేళ్ళపాటు దాతల సాయం తీసుకుని నేతాజీ చదువు కొనసాగించేలా చేయూతనిచ్చారు. తన వంతుగా నేతాజీ కూడా కష్టపడి చదువుకుని ఇంటర్మీడియెట్ నుంచి ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) వరకూ ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యి, ఒక ఆదర్శ విద్యార్థిగా నిలబడ్డాడు.

నేతాజీ చదువు కొనసాగించిన ఎనిమిదేళ్ళ కాలంలో వార్డర్ నాగభూషణం విశాఖపట్టణం నుంచి నెల్లూరు, తర్వాత కడప సెంట్రల్ జైల్‌కు బదిలీ అయ్యారు. అయితే ఎక్కడకెళ్ళినా నేతాజీ చదువు బాధ్యతను మాత్రం విస్మరించలేదాయన. అతనికి డబ్బు, వస్తువుల కొరత రాకుండా అండగా నిలిచారు. కాలేజీకి వెళ్ళడానికి సైకిల్ కూడా కొనిపెట్టారు. పోలీసుల వ్యవహారశైలి పట్ల నేటి సమాజంలో కొంత చిన్నచూపు ఉన్నప్పటికీ నాగభూషణం లాంటి ఎందరో ఆ శాఖలో మానవత్వానికి భూషణాల్లా ఉన్నారని తెలుసుకోవాల్సి ఉంది.

నాగభూషణం వ్యక్తిత్వాన్ని పరికిస్తే, స్వతహాగా గాయకుడు మాత్రమేగాక ఉత్తమ సామాజిక కార్యకర్తగా 1984 నుంచీ పలు పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటివరకూ వివిధ సంస్థల నుంచి 17 వరకూ ప్రశంసాపత్రాలు పొందారు. అయితే, ఖైదీ రాజారావు కొడుకు నేతాజీ సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడమే తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారాయన. ఇక నేతాజీ కూడా దేశ పౌరునిగా బాధ్యతల్ని నిర్వర్తించాలని మాత్రమే ఆకాంక్షించారు.

ఆదర్శ జంట గ్రామాలు.. కడప జిల్లా ప్రత్యేకం

జంట నగరాల పేర్లు విన్నాం గానీ ఈ జంట గ్రామాల కథేమిటా అనుకుంటున్నారు కదూ..! జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్నగరాలు ఒకదానికొకటి ఎంత ఆదర్శంగా ఉన్నాయో మనకు తెలీదుగానీ.. కడప జిల్లాలోని "ఎగువ కంచరపల్లి", "దిగువ కంచరపల్లి"జంట గ్రామాలు మాత్రం గత 50 ఏళ్లుగా మద్యపానం, పొగతాగడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ఈ జిల్లాకు "ఫ్యాక్షన్"ముద్రేమిటా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.

ఈ జంట గ్రామాల్లో ఉన్న దాదాపు 200 కుటుంబాలు భారతీయ సంప్రదాయ విలువల్ని ఆచరిస్తూ భవిష్యత్ తరాలకు వీటినేకానుకలుగా అందిస్తున్నాయి. 50 ఏళ్ళ క్రిందటే అప్పటి గ్రామ పెద్దలు ఊరి ప్రజలచేత దురలవాట్లకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞచేయించడమేగాక ఈ ప్రతిన ఏ మాత్రం సడలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా చేసుకున్న ఈ గ్రామాల్లో అగ్గిపెట్టె దొరుకుతుందిగానీ చుట్ట, బీడీ, సిగరెట్ కనిపించవు. బయటి ఊళ్ళనుంచి వచ్చే వారికి సైతం ఇవే నియమాలు వర్తిస్తాయి. తేడా వచ్చిందో "బొబ్బిలి బ్రహ్మన్న", "మర్యాద రామన్న"ల సమక్షంలో రచ్చబండ పంచాయితీలు, శిక్షలు తప్పవు.

మంచితనపు సిరులు... సిరియా పౌరులు

సిరియాలోని నియంత ప్రభుత్వం తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న పౌరులపై కత్తిగట్టింది. ప్రత్యేకించి యువతులపై "రేప్" ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. దీంతో జీవితకాలపు అవమానభారాన్ని మోయలేక కుంగిపోతున్న ఈ బాధితురాళ్ళను పెళ్ళి చేసుకుని అండగా నిలుస్తామని సిరియా యువకులు ముందుకొచ్చి తమలోని నిజమైన మానవత్వాన్ని చాటుకున్నారు.

సిరియాలోని క్రూర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన షబియా మిలిషియా వర్గం ఆ దేశ మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతుండటంతో గౌరవంగా బతుకుతున్న కుటుంబాలు ఈ మహళలను పరువు హత్యలకు గురిచేస్తున్నాయి. సిరియా - టర్కీ సరిహద్దులో ఉన్న Jisr al-Shughur లాంటి పలు పట్టణాల్లో వేధింపులు, అత్యాచారాలకు గురైన 10 వేలమందికి పైగా సిరియా యువతులు టర్కీలోని శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ దారుణమైన పరిణామాల మధ్య సుమేరియా పట్టణంలో రేప్‌కు గురైన నలుగురు అక్కాచెల్లెళ్ళు టర్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షుగౌర్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం కాయిస్ అనే వ్యక్తి ఇచ్చిన స్ఫూర్తితో మరికొందరు యువకులు ఇలాంటి యువతుల తెలుసుకుని కొత్త జీవితాన్ని అందించడానికి ముందుకొచ్చారు.

సిరియాలో ప్రభుత్వ అకృత్యాల గురించి ఇంతకంటే ఎక్కువ రాయలేను. ఆక్కడి పరిస్థితులపై మీకు ఆసక్తి ఉంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి..

ఊరు కొత్తకర్ర.. అంధులకు ఊతకర్ర

విద్యల నగరంగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం కొర్ల పంచాయితీ పరిధిలోని కొత్తకర్ర గ్రామం అంధులకు ఊతకర్రగా మారింది. ఎందుకంటే ఈ గ్రామంలోని దాదాపు 100కు పైగా కుటుంబాలకు చెందిన సుమారు 400 మంది తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ మేరకు వీరంతా సమ్మతి పత్రాలపై సంతకాలు చేసి "మానవీయత" అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గోవిందరాజులుకు వాటిని అందజేశారు. తమ మరణానంతరం కూడా మరెందరికో తమ అవయువాలు ఉపయోగపడతాయనేది తమకు ఎంతో ఆనందం కల్గించే విషయమని గ్రామవాసులు పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాకే చెందిన పెదనాదిపల్లి, ఏనుగువలస (గరివిడి మండలం) గ్రామస్థులు కూడా ఇదే విధంగా నేత్రదానానికి ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.

సర్కారు బడిలో కలెక్టర్ కూతురు..

గుమస్తాలు సైతం తమ పిల్లల్ని కార్పోరేట్ బడుల్లో ఇంగ్లీష్ చదువులు చదివించాలని కలలు కంటున్న రోజులివి. అంతెందుకూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేవారి పిల్లలు కూడా కార్పోరేట్ బడుల్లోనే కంప్యూటర్ కీబోర్డులపై వేళ్ళు టకటకలాడిస్తుంటారు. ఇలాంటి ఈ రోజుల్లో తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లా కలెక్టర్ ఆర్ ఆనందకుమార్ మాత్రం తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయం తీసుకుని అమలు చేసి ఎందరో అమ్మానాన్నలకు ఆశ్చర్యం కల్గించి ఆదర్శంగా నిలిచారు. ఈయన తన ఆరేళ్ళ కూతురు గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్ ప్రైమరీ పాఠశాలలో రెండవ తరగతిలో చేర్చారు.

జిల్లాలో ఎన్నో "గొప్ప" ప్రయివేట్ పాఠశాలలున్నప్పటికీ, కలెక్టర్ ఆనందకుమార్ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం చాలా ఆనందం కల్గించిందని ప్రధానోపాధ్యాయిని ఎస్.రాణి సంతోషపడ్డారు. జిల్లా ముఖ్య విద్యాధికారి ఈ పరిణామంపై స్పందిస్తూ తమ ప్రభుత్వ బడులలో కార్పోరేట్ విద్యకు దీటుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నామని, కంప్యూటర్లను వినియోగించడంతోపాటు ప్రాయోగికంగా విద్యనందిస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల మధ్య కలెక్టర్ కుమార్తె సైతం ప్రభుత్వ పాఠశాలలో చేరడం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

నిజానికి తమిళనాడులో జరిగిన ప్లస్ 2, ఎస్ఎస్ఎల్‌సి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినవారే. మరి మన రాష్ట్రం ఎప్పుడు మారుతుందో..

వీరి పేరు ప్రకాశం.. మానవతకు నివాసం

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ప్రకాశరావు మానవత్వానికి మారుపేరుగా నిలిచి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలల్లో మహాత్మా గాంధీ విగ్రహాల్ని తన స్వంత ఖర్చుతో నెలకొల్పి మహాత్ముని ఆదర్శాలను చాటి చెబుతుంటారు. ఇంతవరకూ ఈయన చేతుల మీదుగా 125కు పైగా గాంధీ విగ్రహాల్ని ఏర్పాటు చేయించారు. విగ్రహాల ఏర్పాటుకే పరిమితం కాకుండా పేద కుటుంబాలకు సైతం చేదోడువాదోడుగా నిలిచి వారిళ్ళల్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు ప్రకాశరావుగారు తన వంతు చేయూతనిస్తుంటారు. సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ ఇవన్నీ ఈ మా...స్టార్ గారికి నిత్యకృత్యాలే..

పేరుకే అంధులు.. సేద్యంలో వీరులు

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు వెళ్ళి ఆ ఊరిలో ఆదర్శ జీవనం గడుపుతున్న రామనాథం, దశరథం సోదరుల్ని మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కలుసుకోవాల్సిందే. 60 ఏళ్ళ పైబడిన ఈ ఇద్దరూ గుడ్డివారే. అయినప్పటికీ ఒకరికొకరు తోడుగా గత 35 సంవత్సరాలుగా రామలక్ష్మణుల్లా కలసిమెలసి వ్యవసాయం చేసుకుంటూ దిగుబడిలో ఆదర్శరైతులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పొలంలోని సుమారు 30 గుంటల్లో ధాన్యం, పత్తి, పసుపు పంటలు వేసి మంచి దిగుబడి సాధించారు. పొలానికి నీరు పట్టడం, నాగలితో దున్నడం, బర్రెల్ని తోలుకెళ్ళడం, బస్తాల్లో ధాన్యం నింపడం, పొద్దుపోయాక మోటారు వేయడం లాంటి పనుల్ని చిన్నవయసులోనే తండ్రి ద్వారా నేర్చుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు జ్వరం వచ్చింది. సరైన వైద్యం అందక దృష్టిని కోల్పోయారు. కళ్ళు లేకపోయినా చేతి వేళ్ళతో లోతు కొలిచి పంటకు ఇంకెంత నీరు కావాలో చెప్పగల సామర్థ్యం వీరి సొంతం. మరి ప్రభుత్వం వీరికి ఆదర్శ రైతు పురస్కారాల్ని ఎప్పుడిస్తుందో కదా..

Saturday, January 22, 2011

దాసరి భూమయ్య... మామూలు SI కాదు

ఒకప్పుడు రాజులు, మంత్రులు మారు వేషాల్లో రాజ్య సంచారం చేసి ప్రజా సంక్షేమం గురించి తెలుసుకునేవారట. ఎక్కడైనా లోపాలు, నేరాలు వారి దృష్టికి వస్తే పరిస్థితిని చక్కదిద్ది సమాజాన్ని గాడిలో పెట్టేవారట. ఇలాంటి వాటి గురించి మనం కథల్లోనే తెలుసుకున్నాం గానీ... నేటి కాలంలోనూ అలాంటివారున్నారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరులో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న దాసరి భూమయ్యగారే ఆ వ్యక్తి. ఈయన్ని నేరుగా కలుసుకోవాలంటే కాస్త కష్టం కావచ్చు. ఎందుకంటే నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘాపెట్టి, వారిని కటకటాల వెనక్కి నెట్టే క్రమంలో భూమయ్యగారు ఆటో డ్రైవర్‌గా, సైకిల్ మీద సామాన్లు అమ్ముకునే వ్యక్తిగా లేదా మరో రూపంలోనో తిరుగుతూ ఉంటారు.

భూమయ్యగారి విజయాల్ని గమనిస్తే... ఎన్నోమార్లు సాధారణ ప్రయాణీకుడిలా ఆటోల్లో ప్రయాణించి, పరిమితికి మించిన ప్రయాణీకులతో ప్రమాదకరంగా బండి నడుపుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడే ఆటో డ్రైవర్ల భరతం పట్టారు. పత్తి విత్తనాలు కొంటానంటూ ఒక చోటికెళ్ళి నకిలీ విత్తనాలు అంటగట్టే వ్యాపారులను కోర్టు మెట్లెక్కించారు.

భూమయ్యగారు 2006లో బసంత్‌నగర్‌లో ఎస్ఐగా పనిచేసేటప్పుడు ఒక భూస్వామికి చెందిన భూమిలో కొందరు ఎర్ర జెండాలు పాతిపెట్టారు. ప్రభుత్వం సాయంతో వాటిని పీకించడమేగాక, ఆ భూస్వామిని ఒప్పించి కామన్‌పూర్, మంథని మార్గంలోని 80 శాతం మంది పేదలకు అధికారికంగా పంపిణీ చేయించారు. జీవితంలో ఒక కొత్తకోణాన్ని చూచిన ఆ పేదలంతా ఒక కాలనీ కట్టుకుని దానికి "దాసరి భూమయ్య కాలని" అని పేరు పెట్టుకున్నారు. అక్కడ భూమయ్యగారి ఛాయాచిత్రం కూడా కనిపిస్తుంది.