Tuesday, October 26, 2010

అంకవికలుడు... పేదల కంటి జోడు

విజయవాడలోని అరుండేల్ పేటలో ఆప్టికల్ షాపు నడిపే 50 ఏళ్ళ మహ్మద్ అయూబ్ ఖాన్ అంటే పేదలపాలిటి కంటి చూపుగా మెలగుతూ సేవలందిస్తున్నారు. తన 12వ ఏట బడికి వెళుతున్నప్పుడు జరిగిన ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్న ఈయన జైపూర్ కాలుతో నడుస్తున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తన వద్ద 2,000 రూపాయలు ఉండి ఉంటే ఆ కాలు పోకుండా రక్షించుకునేవాడినని అంటుంటారాయన. అప్పట్లో ఆయనకు డబ్బులేనందువల్ల చికిత్స పొందలేక కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనే ఈయన జీవితాన్ని మలుపుతిప్పింది. తర్వాతికాలంలో జీవితంలో స్థిరపడి ఆప్టికల్ షాపు పెట్టుకున్నారు. తాను సైతం ఇతరులకు చేయూతనివ్వగలనన్న విశ్వాసం చేకూరాక నేత్ర సమస్యలతో బాధపడే పేదలకు అండగా ఉంటూ వస్తున్నారు అయూబ్. ఈయన సేవలు ఏమిటంటే....

కంటి సమస్యలున్న పేదవారి నుంచి ఎలాంటి రుసుమూ తీసుకోకుండా ఆయూబ్ పరీక్షలు చేయిస్తారు. వారికి ఉచితంగా కంటి అద్దాలు సమకూర్చుతారు. తన వద్దకు వచ్చినవారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఫ్రేమ్‌కు మాత్రం డబ్బు తీసుకుంటారు. వారు ఇవ్వలేకుంటే అదీ పుచ్చుకోరు. అయూబ్ సేవలకు ఆయన కుమారులు చేయూతనిస్తుంటారు. ఈ ఉచిత కంటి పరీక్షలు, కళ్ళద్దాల పంపిణీ గురించి నగరంలోని ముఖ్య కూడళ్ళలో ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతుంటారు.

ప్రస్తుతం ఎందరో నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులైన పేదవారి కళ్ళద్దాలు విరిగిపోయి ఉన్నప్పటికీ (ఏనాడో కొనుక్కున్నవి) డబ్బులేక వాటినే వాడుకుంటూ ఉంటారని, వాటికి పవర్ కూడా ఉండదని నేటి పరిస్థితిని అయూబ్ వివరించారు.

Tuesday, October 19, 2010

జ్ఞాననేత్రుని కలం నుంచి భీమాయణం

మధ్యప్రదేశ్‌కు చెందిన వేద పండితుడు, సంస్కృత ఉపాధ్యాయులైన ప్రభాకర్ జోషి వయసు 84 ఏళ్ళు. గ్లకోమా వ్యాధికారణంగా అంధత్వానికి గురైన జ్ఞాన నేత్రుడు. అయినప్పటికీ సుమారు తన 78 ఏళ్ళ వయసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధించారు. అదేమిటంటే... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రను సంస్కృతంలో రచించడం. 2004లో ఈ బృహత్కార్యాన్ని చేపట్టిన జోషీ మొత్తం 1,577 సంస్కృత శ్లోకాలతో 2010లో "భీమాయణం" పేరిట మన రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను పూర్తి చేశారు.

ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... డాక్టర్ అంబేద్కర్‌కు సంస్కృతం నేర్పించాలని ఆయన తండ్రి రాంజీకి ఎంతో కోరికగా ఉండేదట. అయితే, ఒకప్పుడు దళితులకు దూరంగా ఉన్న సంస్కృత భాషలో నేడు అంబేద్కర్ చరిత్ర వెలువడటం నిజంగా విశేషమే. ప్రతిష్ఠాత్మక "మహాకవి కాళిదాస్" అవార్డు గ్రహీత అయిన జోషీకి అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం. అంబేద్కర్ చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు తెలుసుకున్న కొన్ని వాస్తవాల నుంచి జోషీ గారూ స్ఫూర్తి పొంది "భీమాయణం" రచనకు శ్రీకారం చుట్టారు.