Tuesday, October 19, 2010

జ్ఞాననేత్రుని కలం నుంచి భీమాయణం

మధ్యప్రదేశ్‌కు చెందిన వేద పండితుడు, సంస్కృత ఉపాధ్యాయులైన ప్రభాకర్ జోషి వయసు 84 ఏళ్ళు. గ్లకోమా వ్యాధికారణంగా అంధత్వానికి గురైన జ్ఞాన నేత్రుడు. అయినప్పటికీ సుమారు తన 78 ఏళ్ళ వయసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధించారు. అదేమిటంటే... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రను సంస్కృతంలో రచించడం. 2004లో ఈ బృహత్కార్యాన్ని చేపట్టిన జోషీ మొత్తం 1,577 సంస్కృత శ్లోకాలతో 2010లో "భీమాయణం" పేరిట మన రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను పూర్తి చేశారు.

ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... డాక్టర్ అంబేద్కర్‌కు సంస్కృతం నేర్పించాలని ఆయన తండ్రి రాంజీకి ఎంతో కోరికగా ఉండేదట. అయితే, ఒకప్పుడు దళితులకు దూరంగా ఉన్న సంస్కృత భాషలో నేడు అంబేద్కర్ చరిత్ర వెలువడటం నిజంగా విశేషమే. ప్రతిష్ఠాత్మక "మహాకవి కాళిదాస్" అవార్డు గ్రహీత అయిన జోషీకి అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం. అంబేద్కర్ చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు తెలుసుకున్న కొన్ని వాస్తవాల నుంచి జోషీ గారూ స్ఫూర్తి పొంది "భీమాయణం" రచనకు శ్రీకారం చుట్టారు. Print this post

No comments: