Thursday, October 29, 2015

ఉచితంగా చెప్పులు, గొడుగులు కుట్టి ఇవ్వబడును

సాయం చెయ్యాలన్న మనసుండాలి గానీ, అందుకు చేతి నిండా డబ్బుండాల్సిన పనిలేదని నిరూపించాడు నెల్లూరు వాసి చాట్ల వెంకటరత్నం. ఈ పట్టణంలో మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న విద్యుత్‌భవన్ ఆఫీసు ప్రహరీగోడకు ఆనుకుని కనిపిస్తుంది ఒక చిన్నపాక. అందులో రోజూ చెప్పులు కుడుతూ కనిపించే వ్యక్తే వెంకటరత్నం. అక్కడికొచ్చి చెప్పులు బాగు చేయించుకునే వారికి ఒక బోర్డు కనిపిస్తుంది. అది చదివితే చాలు.. వెంకటరత్నం దయాగుణం ఏంటో తెలుస్తుంది. ‘అనాధ బాలబాలికలకు, వికలాంగులకు, కుష్టువారికి, అంధులకు ఉచితంగా చెప్పులు, గొడుగులు కుట్టి ఇవ్వబడును’ అని ఆ పాకకు తగిలించిన చిన్న బోర్డు మీద రాసి ఉంది.

నిజానికి వెంకటరత్నం సేవలు ఇంతటితో ఆగలేదు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల చెప్పులు, బ్యాగులు డబ్బు తీసుకోకుండా కుట్టిస్తాడు. డబ్బున్నవారు వాడి పడేసిన బ్యాగులు, చెప్పులు, గొడుగులను సంపాదించి వాటిని బాగుచేసి పైసా ఆశించకుండా పేద విద్యార్థులకు ఇస్తాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ల  నుంచి కూడా ఏదో ఒక రేటుకు చెప్పులు, షూలు తీసుకుని వీలైనంత వరకూ సరిచేసి ఉచితంగా ఇచ్చేస్తాడు. ఆయన గురించి ఇంతకంటే ఇంకేం చెప్పాలి?

వెంకటరత్నం తండ్రి వెంకటగిరిలో చెప్పులు కుట్టుకునే వృత్తిలోనే ఉండేవారట. అదే ఊరిలోని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో వెంకటరత్నం పదోతరగతి వరకు చదివాడు. అక్కడ తనతో ఉన్న స్నేహితుల బాధలను చూసి చలించిపోయాడు. వారి తల్లిదండ్రులు ఇచ్చే రూపాయి, అర్ధరూపాయి ఆ పిల్లలకు ఒక్కరోజు ఖర్చుకు కూడా చాలేవి కావు. ఆ విద్యార్థుల బ్యాగులు, చెప్పులు పాడైతే వాటిని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి కుట్టించేవాడు వెంకటరత్నం. తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు వెంకటరత్నం  మీద పడ్డాయి. నెల్లూరు చేరుకుని చెప్పులు కుట్టే దుకాణం పెట్టుకున్నాడు. నాటి నుంచి నేటి వరకూ హాస్టల్స్‌లో ఉంటూ చదువుకునే విద్యార్థుల బ్యాగులు, చెప్పులను డబ్బులు తీసుకోకుండా బాగు చేస్తూ సేవలందిస్తున్నాడు.

నెల్లూరులోని రైల్వేట్రాక్ పక్కనే ఒక పూరిపాకలో వెంకటరత్నం నివసిస్తుంటాడు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అతని సంతానం. కుటుంబసభ్యులు వెంకటరత్నం సేవకు తోడుగా ఉన్నారు.