Wednesday, November 28, 2007

ఆమె కాదని తెలిసింది....

చెన్నైలోని నారద గానసభలో ఓ అందమైన యువతి. జావళితో నాట్యాన్ని మొదలుపెట్టి పదాలు... కీర్తనలతో హావభావ యుక్తంగా నర్తించి ఆహూతులను ఓహో అనిపించింది. కార్యక్రమం ముగిశాక ముఖానికున్న రంగు చెరిపేసుకొని ఆ నర్తకి సభ ముందుకు వచ్చింది. జనం సంభ్రమాశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఆ నాట్యం చేసింది ఆమెకాదు. అలాగని అతడూ కాదు. ఆమే...అతడూ... కాని హిజ్రా 40 ఏళ్ల నటరాజ్.

తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి (కళల్లో మణిపూస... మన నంది అవార్డుకు సమానం) పురస్కారం. దూరదర్శన్ టాప్ గ్రేడ్ హోదా. దేశ విదేశాల్లో సన్మానాలు. ఇదీ నటరాజ్ సత్తా. హిజ్రాగా ఛీత్కారాల నేపథ్యమైన పాత జీవితపు రాళ్లబాటలో నడచిన నటరాజ్ అకుంఠిత దీక్షతో సత్కారాల పూలబాటలోకి అడుగుపెట్టారు. అసలొకసారి నటరాజ్ జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే....

నటరాజ్ పుట్టింది ఓ నిరుపేద కుటుంబంలో. నటరాజ్ పూర్తిగా 'అతడు' కాదని తెలిసిన క్షణం నుంచీ ఇంటితో మొదలై తోటి విద్యార్థుల వరకూ అందరి నుంచీ అవహేళనలే. ఎన్నో అవమానాల మధ్య నాట్యం నేర్చుకుంటే స్త్రీగా అభినయించి ఓ సంప్రదాయ జీవనశైలిని ఏర్పరచుకోవచ్చన్న ఆలోచన నటరాజ్ మదిలో అంకురించింది. సరైన గురువు దొరకక నాటి నటీమణులైన పద్మిని, వైజయంతిమాల సినిమాలు చూస్తూ, వారిని అనుకరించి ఎంత బాగా నాట్యాలు చేసినా ఎవరి నుంచీ ప్రోత్సాహం లేదు. ఇంట్లో నాట్య సాధనకు ఎవరూ ఒప్పుకునే వారు కాదు. దీంతో నటరాజ్ నాట్య సాధన స్మశానంలో సాగేది. (తాండవమాడే శివుడు కూడా ఇష్టపడేది రూద్రభూమినేగా...) తన శారీరక లోపం వల్ల కటుంబీకులు సైతం ఇబ్బందుల పాలవుతున్నారని గ్రహించిన నటరాజ్ తన 16వ ఏట తనకు ఎప్పుడూ ప్రోత్సాహమిచ్చే ఒకే ఒక స్నేహితుడు శక్తి భాస్కర్‌తో కలసి ఇల్లు విడిచిపెట్టారు. చేతిలో డబ్బుల్లేక ఇద్దరూ అష్టకష్టాల పాలయ్యారు.

తంజావూరులోని ప్రముఖ భరతనాట్య ఆచార్యులు కిట్టప్ప పిళ్లై గురించి తెలుసుకున్న నటరాజ్ ఆయన ముందుకెళ్లి తన ఆవేదనను వెళ్లగక్కారు. అయినప్పటికీ కిట్టప్ప పిళ్లై ఏడాది పాటు పరీక్షించాకే నటరాజ్ అంకితభావాన్ని గుర్తించి నాట్యాన్ని కూలంకుషంగా బోధించారు. 1999లో కిట్టప్ప మరణించేవరకూ... అంటే దాదాపు పదిహేనేళ్ల పాటు ఆయనను సేవించి నాట్య కళను అభ్యసించిన నటరాజ్ చెన్నై బాట పట్టారు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. హిజ్రా నాట్యం ఎవరు చూస్తారంటూ అవకాశాలు రాలేదు. అయినప్పటికీ పట్టు వీడని నటరాజ్ అవకాశాలు సంపాదించి తనను తాను నిరూపించుకున్నారు. నటరాజ్ ఏ స్థాయికి ఎదిగారంటే... అమెరికా, బ్రిటన్, రష్యా తదితర దేశాల్లో ప్రదర్శనలివ్వడంతో పాటు భరతనాట్యంలో ప్రముఖులమని చెప్పుకునేవారికి సైతం ఉన్నత శిక్షణనిస్తున్నారు.

స్త్రీ లేదా పురుషునిగా పుట్టినవారు ఒకసారే చస్తారని... అయితే హిజ్రాలుగా పుట్టినవారు అనుక్షణం అవమానాలతో చావలేక బతుకుతుంటారనేది నటరాజ్ తరచూ చెప్పేమాట. అందుకే వారు వ్యభిచారం లేదా యాచకవృత్తిని అశ్రయించి మరింత దిగజారిపోతున్నారని నటరాజ్ అంటుంటారు. హిజ్రాలను సానబడితే మెరిసే వజ్రాలెన్నో బయటకు వచ్చి సమాజానికి వెలుగును సైతం ఇస్తాయనడానికి నటరాజ్ జీవితం ఓ ఉదాహరణ. నిజమే మరి... అలా చేస్తే హిజ్రాల జీవితాల్లో కొత్త కోణాలు కదలాడతాయి.