Saturday, June 20, 2009

గవురుమెంటు డాట్రారు

గవురుమెంటు డాట్రారు అని మన పల్లెవాసులు అమాయకంగా పిలుచుకునే ఒక గవర్నమెంట్ డాక్టర్ గారికి కర్తవ్యం పట్ల ఉన్న నిబద్ధత ఎంత విలువైన ఫలితాన్ని ఇచ్చిందో తెలియజెప్పే ఘటన ఇది. జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీ రామారావు, కర్తవ్యం సినిమాలో విజయశాంతి చట్టానికి, న్యాయానికి ఎంత విలువనిచ్చారో తన వద్దకు వచ్చే రోగుల ప్రాణాలకు అంతకంటే ఎక్కువ విలువనిచ్చి కర్తవ్య పాలన చేశారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్ జ్యోతిర్మయి దత్తా. వృత్తిపట్ల దత్తాగారికి ఉన్న అంకితభావం చూస్తే మన తెలుగు సినిమాలు డాక్టర్ ఆనంద్, డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో రోగుల పట్ల ఆదరణ కనబరచిన ఎన్టీ రామారావు, అక్కినేని తప్పక గుర్తుకు వస్తారు. కాకుంటే దత్తా జీవితంలో డ్యూయెట్లుండవు అంతే...

గవురుమెంటు డాట్రారు అనగానే తమ వద్దకు వచ్చే రోగులకు రంగునీళ్ళు, నాలుగు తెల్ల మాత్రలు ఇచ్చే రకం అనే అభిప్రాయం జనంలో ఉంది. డాక్టర్ జ్యోతిర్మయి దత్తా అలాకాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్శిటీ బిఎ విద్యార్థి అయిన దుర్గాపూర్ నివాసి సంజొయ్ పుట్టుకతోనే కంటిచూపునకు దూరమై తాను గుడ్డివాడినని ధృవపత్రం తీసుకోవడం కోసం నేషనల్ మెడికల్ కాలేజి డాక్టర్ అయిన జ్యోతిర్మయి దత్తా వద్దకు వచ్చాడు. కొందరు డాక్టర్లు ఎంతో కొంత లంచం ఆ చేత్తో పుచ్చుకుని ఈ చేత్తో ధృవపత్రం ఇచ్చేస్తారు. దత్తా అలా చెయ్యకుండా 22 ఏళ్ళ సంజొయ్‌ని పరీక్ష చేశారు. సంజొయ్‌కు పుట్టుక నుంచే కంట్లో శుక్లాలున్నాయి. కంటిపై ఏదైనా బలమైన కాంతిపుంజం పడినప్పుడు కొంత అనుభూతి కలుగుతుంది. ఇతను "స్టిములస్ డిప్రైవేషన్ అమోలైపియా" అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న డాక్టర్ అతనికి శస్త్రచికిత్స చేస్తే తప్పక చూపు వస్తుందని గ్రహించి ఆ విషయాన్నే సంజొయ్‌కు చెప్పారు.

జీవితంలో 22 ఏళ్ళ కాలం చూపులేకుండా గడిపిన సంజొయ్ తనకు చూపు వచ్చే అవకాశాలున్నాయని తెలిసి ఆనందంగా శస్త్రచికిత్సకు ఒప్పుకున్నాడు. దీంతో ఇతనికి పలు పరీక్షలు చేసి ఈ ఏడాది మార్చి 14, ఏప్రిల్ 7 తేదీల్లో రెండు కళ్ళకూ శస్త్రచికిత్స చేశారు. కనుగుడ్డు కదలికలు అపసవ్యంగా ఉండటంతో అవి కూడా సరిచేశారు. కుడి కంట్లో ఉన్న సున్నం నిల్వలు తొలగించారు. మొదటి ఆపరేషన్ జరిగిన ఒక రోజు గడిచాక ఎడమ కంటి కట్టు తీసేసినప్పుడు కంటిపై చాలా బలమైన కాంతిపుంజం పడిన అనుభూతికి అతను లోనయ్యాడు. ఆ విషయాన్నే అతను డాక్టర్‌కు చెప్పాడు. దత్తా వెంటనే ఆ కన్ను తెరవమని సూచించారు. జీవితంలో మొదటిసారిగా తన సాటి మనిషిని చూశాడు సంజొయ్.

వైద్యులూ దత్తాను ఆదర్శంగా తీసుకుంటే అంతా మిమ్మల్ని వైద్యనారాయణులని కొలుస్తారని మర్చిపోకండి.

Sunday, June 14, 2009

బుద్ధి చెప్పే బాంద్రా బ్యానర్

ముంబై నగరంలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో నగల వ్యాపారం చేసుకునే వర్తకుడు కిశోర్ వాల్‌చంద్ జైన్. అందమైన ఆభరణాలను తళతళ మెరిసేలా తయారు చేసి ఖాతాదార్ల మెప్పు పొందడంలో దిట్ట ఈ వ్యాపారి. నగలు మాత్రం తళతళలాడితే సరిపోతుందా? సుందరమైన ఆ నగలు ధరించే తన ఖాతాదారుల మానసిక సౌందర్యం తనకెంతో ముఖ్యం అంటాడీయన. అందుకే తన దుకాణం బయట మంచి సందేశాలతో కనిపించే బ్యానర్‌ను గత 10 ఏళ్ళకు పైగా ప్రదర్శిస్తూ వస్తున్నారు వాల్‌చంద్ జైన్ గారు. సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ బ్యానర్ ప్రత్యేకత . దేశంలో జరిగే ఉగ్రవాద దాడులు, అధికారుల అవినీతి చర్యలు, రాజకీయ నాయకుల పట్ల అసహ్యంతో వారిపై జరిగే బూటు దాడులు వంటివన్నీ ఇక్కడ బ్యానర్ ఐటెమ్స్‌గా మనకు కనిపిస్తాయి. ఇలాంటి పరిణామాలే ఆయుధాలుగా వాల్‌చంద్ గారి బ్యానర్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వారి డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ సిగ్గుపడేలా చేస్తుంది. తమ దుకాణంలోని నగల అమ్మకాలతో వచ్చే లాభాల్ని మిగిలిన వ్యాపారుల్లాగా అనుభవించడంతో సరిపెట్టుకోని వాల్‌చంద్ గారు సమాజం పట్ల తన బాధ్యతను బ్యానర్ సందేశాల రూపంలో నెరవేర్చుతున్నారు. బంగారు నగల్లాగే ఈయన మనసుకూడా భలే మెరిసిపోతుంది కదూ...