Thursday, July 26, 2007

ఎన్రికో మెరిగల్లీ...

రీకో అసలు పేరు ఇదే. రీకో అంటే నేను చెబుతోంది వాచీ కంపెనీ గురించి మాత్రం కాదండోయ్. అయితే, ఇటలీలో పుట్టి ఏలూరులో స్థిరపడిన అరవైయ్యేళ్ల ఈ రీకో గారికి వాచీకి మధ్య పోల్చదగిన విషయం ఒకటుంది. ఈ రీకో గారు కూడా వాచీలాగే విరామం లేకుండా ఇరవైనాలుగ్గంటలూ సమాజ సేవ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మన దేశానికి మహా మహా సేవలు చేసిన మహాత్ములే గుర్తుండరు. ఇక ఎక్కడో ఇటలీ నుంచి వచ్చి, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో స్థిరపడి, గాంధేయ విలువలను శ్వాసిస్తూ, ఇటలీలోని తన ఆస్తులను అమ్ముకుని మరీ మన భారతీయులకు సేవలందిస్తున్న ఈ రీకో ఎంతమందికి గుర్తుంటారు చెప్పండి. అందుకే ఈయన్ని ఈ నెల కథానాయకుడిగా పరిచయం చేయాలనుకున్నాను.

ఇంతకీ రీకోగారు ఎక్కడుంటారో తెలుసా...? బాధితులు ఎక్కడుంటే అక్కడ. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు.... ఇలా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించినా... రీకో గారి సేవల్ని మాత్రం కించిత్తు కూడా కదిలించలేవు. నీటి సమస్య ఉన్నచోట బోర్లు వేయిస్తుంటారు. ప్రకృతి విలయతాండవం చేస్తే బాధితులకు ఆహారంతో సిద్ధంగా ఉంటారు. వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు ఇవ్వడం, వసతులు లేని పాఠశాలలకు బల్లలు, కంప్యూటర్ సదుపాయాలు కల్పించడం ఇలా రీకో సేవలు ఎన్నో.

యువతీ యువకులకు ఐటిఐ ద్వారా పలు వృత్తుల్లో శిక్షణనిస్తూ విద్యార్థుల వ్యక్తిగత సంక్షేమాన్ని గమనించే రీకో వారి పెళ్లిళ్లు చేసే బాధ్యతలను కూడా స్వీకరిస్తుంటారు. అరవయ్యేళ్లొచ్చినా ఆయన మాత్రం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఎన్‌ఫీల్డ్ పై దూసుకెళ్లే రీకో చదువుకునే రోజుల్లో మోటార్ సైకిల్ రేసులో ఛాంపియన్. మూడు దశాబ్దాలుగా తెలుగు దేశంలోనే ఉంటూ చక్కని తెలుగు మాట్లాడే రీకో అందరికీ ఆత్మీయుడే.


ఇంతకీ ఈయన మన దేశానికి ఎలా వచ్చారంటే... రీకో గారు ఇటలీలో ఉండే రోజుల్లో పి.ఐ.ఎం.ఇ (పీమే) అనే స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు. ఈ సంస్థకు మన దేశంలోనూ శాఖలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ చేపట్టే సేవల్లో భాగంగా తన సభ్యులను పలు దేశాలకు పంపుతుంటుంది. అలా రీకో గారు 1974వ సంవత్సరంలో భారత్ వచ్చారు. పీమే నిర్వహణలో ఉన్న ఏలూరులోని సెయింట్ జేవియర్ ఐటీఐ నుంచి ఈయన సేవలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.