Saturday, April 29, 2006

మధుమేహం కళ్లు పీకినా... సడలని పట్టుదల

పుట్టుకతోనే కళ్లు లేకపోవడం వేరు. జీవితంలో కొన్నేళ్ల పాటు కళ్లతో ఈ లోకపు అందాలను ఎంతో ఆనందించి, అనుభవించిన తరువాత ఆ కళ్లను పోగొట్టుకోవడం మరింత బాధాకరం. ఈమె జీవితంలోనూ ఇదే జరిగినా, తన ధైర్యాన్ని కోల్పోలేదు సరికదా, పట్టుదలతో ముందడుగు వేసి, చివరకు రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఔట్ స్టాండింగ్ డిజేబుల్డ్ ఎంప్లాయ్ అవార్డును చేజిక్కించుకుంది. మదురైకి చెందిన డాక్టర్ ఉషానాగరాజన్ (41) స్ఫూర్తిదాయక జీవితం ఇది. 1987లో ఎంబిబిఎస్ పూర్తి చేసి స్పెషలైజేషన్ దిశగా అడుగులేద్దామనుకుంటున్న సమయంలో ఆమె కాలికి వేసిన పుండు ఉగ్రరూపం దాల్చడంతో ఎగబాకిన ఇన్ఫెక్షన్ ఉష కళ్లను కూడా కబళించింది. డయాబెటిక్ రెటీనోపతి ఫలితంగా ఉష జీవితం చీకటిమయమైంది. చిన్నతనం నుంచీ చదువులో మంచి ప్రతిభ కనబరిచి ఉపకారవేతనాలు కూడా పొందిన ఉష డాక్టరై ఎందరికో సేవ చేయాలని తపనపడేవారు. ఈ నేపథ్యంలో ఆమె కళ్లు పోవడంతో పరిస్థితిని జీర్ణించుకోలేని పరిణామాలు చోటుచేసుకున్నా... తను నేర్చుకున్న విద్యతోనే ఎలాగైనా ముందడుగేసి ఇతరులకు చేయూతనిచ్చే స్థాయికి ఎదగాలన్న గట్టి నిర్ణయం తీసుకున్నారు ఉష. వెంటనే తన వైకల్యాన్ని అధిగమించేందుకు బ్రెయిలీ సహా పలు అంశాలపై రెండేళ్లపాటు తగిన శిక్షణ పొందారు. అనంతరం తన ప్రతిభతో మదురైలోని మదురై కెనెట్ ఆసుపత్రిలో వైద్యాధికారిణిగా చేరి రోగులకు సేవ చేస్తున్నారు. అంతేగాక ఈ సంస్థకే చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో నర్సులకు వివిధ అంశాల్లో పాఠ్యాంశాలను ఉష బోధిస్తున్నారు. ఇంతటితో ఆగక అంగవికలురకు చేయూతనిచ్చే పలు సంస్థలకు ఉష అండగా నిలిచి వైద్య సేవలందిస్తున్నారు. ఆమె మదురైలోని రోటాక్ టాకింగ్ లైబ్రరీ సలహా మండలి సభ్యురాలిగా కూడా ఉన్నారు. తన సేవలతో అందరినీ మెప్పించిగా లయన్స్ క్లబ్, జేసీస్ క్లబ్ వంటి సంస్థల పురస్కారాలు ఉషను వెదుక్కుంటూ వచ్చాయి. కర్ర సాయం లేకుండానే పనులు చేసుకోవడంలో భర్త నాగరాజన్ ఉషకు ప్రత్యేక శిక్షణనివ్వడంతో ఆమె స్వంతంగా వంట కూడా చేయగలరు. తన కుమారుడు సంజీవ్ కూడా నేత్ర వైద్యంలో పరిశోధన చేసి మరెందరికో సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. కళ్లు పోయినా తన జీవితంలో కోత్త కోణాన్ని ఆవిష్కరించి ఉషస్సును నిలుపుకున్న ఉష జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమనడంలో సందేహమేముంది ?

Friday, April 21, 2006

తేనెటీగలు మళ్లీ వచ్చాయి....

ఇది 1993 నాటి విషయం. అప్పట్లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా చెరువతూర్ ప్రాంతంలో వ్యవసాయ శాఖ చిరుద్యోగిగా పనిచేస్తున్న 57 ఏళ్ల లీలా కుమారిపై ఆ రాష్ట్ర ప్లాంటేషన్ కార్పోరేషన్ అధికారులు పగబట్టారు. ఆమెపై దాడి చేయడానికి గూండాలను పంపడమే గాక ఆమె ఇంటిపై పెస్టిసైడ్ కంపెనీ హెలికాఫ్టర్‌తో రసాయనాన్ని కుమ్మరించారు. ఇంతకూ లీలాకుమారి చేసిన తప్పల్లా... ఎండోసల్ఫాన్ రసాయనాన్ని ఇక్కడి జీడి తోటల్లో చల్లవద్దనడం, ఇందుకోసం ఆవిడ కోర్టుకెక్కడం. ఈ ప్రాంతంలోని జీడితోటల్లో పురుగులను చంపడానికి ప్లాంటేషన్ శాఖ హెలికాఫ్టర్ ద్వారా ఎండోసల్ఫాన్ రసాయనం సృష్టించిన అల్లకల్లోలమే సమస్యకు మూలకారణం. ఈ రసాయన ప్రభావం ఆ తోటల్లోని పురుగులను చంపడంతో ఆగిపోలేదు. అక్కడి జనం ఆరోగ్యంతో చెలగాటమాడింది. ఈ రసాయనాన్ని తోటల్లో చల్లినప్పుడల్లా ఆ ప్రాంతవాసులకు ఆస్మా, క్యాన్సర్, నరాలు, మెదడు, స్త్రీలకు పునరుత్పత్తి సమస్యలు.... ఇలా ఎన్నెన్నో వ్యాధులు వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అంతేకాదు ఇక్కడి పర్యావరణం కూడా స్తంభించి పక్షులను పారిపోయేలా చెసింది. మరోపక్క రైతులు కట్టే గూళ్లలో చేరి పుట్టతేనెను పండించే తేనెటీగలు తుర్రుమన్నాయి.

ఈ ఎండోసల్ఫాన్ విషపూరితమైనదని యూరోపియన్ యూనియన్, అమెరికా ఎన్విరానమెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు దీనిని నిషేధించినా గత 18 ఏళ్లుగా సుమారు 5 వేల ఎకరాల్లో ఈ రసాయనాన్ని కుమ్మరించారు ప్రభుత్వాధికారులు. దీని ప్రమాదకర ప్రభావాన్ని గుర్తించి పొరాటానికి సన్నద్ధమైన లీలా కుమారికి మొదట గ్రామస్ధుల సహకారం లభించకపోయినా తర్వాత చేయూతనిచ్చారు. లీలా కుమారి పట్టుదలకు మీడియా తోడ్పాటు లభించడంతో పాటు స్థానిక వైద్యులు కూడా దిగజారిన ఇక్కడి ఆరోగ్య ప్రమాణాలపై నివేదికలిచ్చారు. మరోవైపు ఢిల్లీలోని సెంటర్ పర్ సైన్స్ అండ్ ఎన్విరానమెంట్ సైతం రంగంలోకి దిగి ఈ ప్రాంతవాసులకు రక్త పరీక్షలు చేసి జరుగుతున్న దారుణాన్ని ధృవీకరించింది. దీంతో కేరళ హైకోర్టు ఎండోసల్ఫాన్ పిచికారీని పూర్తిగా నిషేధించింది. ఫలితంగా చెరువతూర్ ప్రాంతంలోని పర్యావరణ, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థలు వైద్యసేవలందించాయి. ఇప్పుడిక్కడి రైతులంతా సేంద్రీయ ఎరువులనే వాడుతున్నారు. ఇదంతా లీలాకుమారి చలవే మరి.

ఈ రసాయనం కారణంగా అనారోగ్యం పాలైన తన కొడుకు చికిత్సకు అవుతున్న ఖర్చులు, మరోవైపు ఈ కేసుకై అవుతున్న వ్యయభారం, ఇంచుమించు అదే సమయంలో తానూ ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైనా.... లీలాకుమారి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయం సాధించింది. తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ, జరుగుతున్న్ దారుణాన్ని ఎండగట్టేందుకు మరో ప్రభుత్వ సంస్థతో పోరాటానికి వెనుకాడలేదామె. కొట్టాయం జిల్లాలోని కిజుతిరి గ్రామంలో 11 మంది సంతానం ఉన్న కుటుంబంలో ఏడో బిడ్డగా పుట్టిన లీలాకుమారి వ్యవసాయ విద్యకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సును మాత్రమే చదివారు. వ్యవసాయ శాఖలో ఆమె ఉన్నతాధికారి కూడా కాదు. అంతా బాగుండాలనే ఆమె తపన అందరి జీవితాల్లోనూ కొత్తకోణాలను చూపించింది. దశాబ్దాల కిందటే తుర్రుమన్న తేనెటీగలు తిరిగొచ్చాయి, పారిపోయిన పక్షుల కిలకిలారావాలు మళ్లీ వినిపించాయి.

Saturday, April 15, 2006

సాహసంతో సావాసం

మేకుల మొనలు పైకి ఉండేలా దిగ్గొట్టి ఉన్న బల్లపై ఏమాత్రం సంకోచం లేకుండా వెల్లకిల్లా పడుకొని ఉండగా.... ఛాతీపై 10 నాపరాళ్లను పెట్టించుకొని పగులగొట్టించుకొనే శరీరం అది. చేతుల మీద నుంచి ఓ పాతిక ముప్పై కార్లు వెళ్లినా ఆ ముఖంపై చిరునవ్వు చెరగదు. తలపై, ఒంటిపై ఓ పదులకొద్దీ ట్యూబులైట్లను పగలగొడుతున్నా... అదే చిరునగవు. కళ్లకు గంతలు కట్టుకొని బులెట్ నడపడం, తాను పడుకొని తన పొట్టపై నుంచి ఇద్దరు కూర్చొని ఉన్న మొటార్ సైకిల్ వెళుతున్నా పెద్దగా పట్టించుకోకపోవడం.... ఇవండీ ఆ మనిషి చేసే పనుల్లో కొన్ని. పై విషయాలన్నీ వినగానే కండలు తిరిగిన గండర గండడు, మాయా మహేంద్రజాల విద్యలు తెలిసిన మాయగాడు గుర్తొస్తున్నాడు కదూ. ఈ సాహసి ఎవరో తెలుసా... 17 ఏళ్లకే అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణపతకాన్ని జయించిన ఖమ్మం వాసి కల్యాణి. ఈ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెంకటనారాయణ, రాజ్యలక్ష్మిల కుమార్తె అయిన కల్యాణి కరాటేలో బ్లాక్ బెల్ట్ విజేత. పిన్న వయసుకే అన్ని రకాల వాహనాలూ నడపడం నేర్చుకుంది. తల్లి రాజ్యలక్ష్మి మూత్రపిండాల జబ్బుతో మంచాన పడగా ఆమెకు ఎప్పటికప్పుడు సేవలందిస్తూనే అన్ని విద్యల్లోనూ కల్యాణి నైపుణ్యం సాధించింది. ఇవన్నీ చూసుకుంటూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కల్యాణి అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఇతర ఆటలన్నిటిలోను రాణించి, బాలరత్న అవార్డు కూడా గెల్చుకొని, మార్షల్‌ఆర్ట్స్‌లో రెడ్‌బెల్ట్ దిశగా పయనం సాగిస్తోంది (ఈ వివరాలు అందేనాటికి) . కల్యాణికున్న పట్టుదలలో కొంతైనా మనకూ ఉంటే లోకకల్యాణమే.

Tuesday, April 11, 2006

వడియాలతో వడివడిగా...

ఆయన మొదట పట్టు పురుగుల పెంపకం చేపట్టారు. ఫలితం నష్టాలు. తర్వాత కోళ్ల ఫారం పెట్టారు. ఫలితం కష్టాలు. ఇది కాదనుకొని ఎస్టీడీ బూత్ పెట్టగా కష్టనష్టాలు నట్టింట నడిచాయి. ఇక లాభం లేదనుకొని ఆయన శ్రీమతి గంగా భవాని కేవలం 15 రూపాయలు పట్టుకొని రంగప్రవేశం చేసారు. తెలుగింటా రోజూ కరకరలాడే ఆవిరి వడియాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆవిడకు తెలిసిన విద్య అదే. మరి ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఈమె కేంద్రంలో ఒక రోజుకు ఉత్పత్తి చేసే సుమారు 40 నుంచి 50 కిలోల వడియాలు విజయవాడ, విశాఖ, గుంటూరు తదితర పట్టణాల్లోని ప్రముఖ హొటళ్లకు పరుగులు తీస్తుంటాయి. తన అవిడియాలతో (సారీ ఐడియాలతో.... జస్ట్ ప్రాసకోసం) ఎన్ని రకాల ఒడియాలు చేస్తారో చెప్పనా ? కొత్తిమీర, కాకర, పుదీనా, బీట్ రూట్, మొక్కజొన్న, క్యారెట్, మిర్చి, వాము... ఇలా ఎన్నో రకాల మిశ్రమాలతో కూడిన వడియాలను గంగా భవాని బృందం తయారు చేస్తుంటుంది. ఈ కృషిలో ఆమె భర్త, ఓ కుమారుడు చేయుతనందిస్తున్నారు. అన్నట్లు వీళ్లది ఏ ఊరో చెప్పలేదు కదూ.... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం, చొదిమెళ్ల పంచాయితీలోని లక్ష్మీపురం గ్రామం. కృషికి సృజనాత్మకత తోడైతే జీవితంలో కొత్తకోణాలెన్నో కనిపిస్తాయనడానికి ఈ కుటుంబమే ఉదాహరణ.

Tuesday, April 04, 2006

ఇంకా రి...టైర్ కాని మా...స్టార్

ఎందుకంటే ఆయన వయసు ఇంకా 80 ఏళ్లే మరి. పైగా తనకు ప్రభుత్వమిచ్చే పెన్షన్ డబ్బుల్ని కూడా పేద విద్యార్ధుల కోసం ఖర్చు చేస్తూ గత 18 సంవత్సరాలుగా ఉచితంగా విద్యా బోధన చేస్తున్నారు. మనం చెప్పుకుంటోంది గుంటూరు జిల్లా జూలకల్లు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు గంజిబోయిన కృష్ణారావుగారి గురించి. 1976లో ఈ పాఠశాలకు బదిలీపై వచ్చి, 1987లో పదవీ విరమణ చేసినా ఆయన ఈ ఊరు విడిచి వెళ్లకుండా ఆ గ్రామస్తుల ప్రేమాభిమానాలు కట్టిపడేశాయి. నక్సల్ ప్రభావిత జూలకల్లు గ్రామంలో విద్యార్ధులను తీర్చిదిద్దడంలో కృష్ణారావుగారు చూపిన కృషి, అంకితభావాలే ఇందుకు కారణం. 11 ఏళ్ల కిందటే పదవీ విరమణ చేసినప్పటికీ నేటికీ రోజూ ఈ పాఠశాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యా బోధన చేస్తూ తుదిశ్వాస విడిచే వరకూ ఈ ఉచిత విద్యాబోధన యజ్ఞాన్ని కొనసాగిస్తానని ఒట్టుపెట్టుకున్నారు. ఇదీ మన మా.....స్టార్ గారి జీవితంలోని కొత్త కోణం.

Monday, April 03, 2006

రజనీ సీఏ అయ్యింది

చార్టెడ్ అకౌంటెన్సీ... సర్వాంగాలూ ఆరోగ్యంగా ఉండి, ఇంటి నుంచి ఎప్పటికప్పుడు డబ్బు వస్తూ, ట్యూషన్లు పెట్టించుకుంటున్నా పూర్తి చేయలేక మధ్యలోనే ఈ కోర్సు విడిచిపెట్టిన వాళ్ల సంఖ్య వేలు, లక్షల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ కంటి చూపులేని రజనీ గోపాలకృష్ణన్ ఇందుకు భిన్నం. అందుకే ఆమె గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చిన్నప్పుడు పెన్సిలిన్ రియాక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలై 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే సరికి ఈమె కుడి కంటి చూపు పోయింది. ఎడమ కంటి చూపు మందగించినా అలాగే డిగ్రీ పూర్తిచేశారు. తదుపరి ఎందరికో సవాలుగా నిలిచిన చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో ఆమె చేరారు. సి.ఎ ఇంటర్ పూర్తయ్యే సరికి మొత్తం చూపు పోయింది. ఈలోగా ఆమె కన్న తండ్రి క్యాన్సర్ వ్యాధికి బలై పోయారు. తర్వాత మాతాజీ నిర్మలా దేవి నుంచి సహజ యోగ శిక్షణ పొంది రజని తనను తాను సన్నద్ధం చేసుకున్నారు. అనంతరం సామర్థనం అనే సంస్థ చేయూతనివ్వగా, జీఈ కంపెనీ వారు ఈమెకు ఓ కంప్యూటరును సమకూర్చి, పాఠ్యాంశాలను కూడా చదివి వినిపించే ఏర్పాట్లు చేశారు. నేర్చుకున్న యోగా ద్వారా క్లిష్టమైన ఎన్నో అంశాలను మెదడులో నిక్షిప్తం చేసుకొని స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాసి సిఎలో దిగ్విజయంగా ఉత్తీర్ణురాలయ్యారు. అంతటితో ఆమె ఆగిపోలేదు. బెంగళూరులో తాజ్ వెస్టెండ్ కమ్యూనిటీ కోఆర్డినేటరుగా ఎందరో అంధులకు కంప్యూటర్ ద్వారా పాఠాలు చెబుతూ సేవలందిస్తున్నారు. ఇంకా తనను ఆదరించిన సామర్ధనం సంస్థకు కూడా వీలైనంత తోడ్పడుతున్నారు. రజనీ ప్రతిభను గుర్తించిన చెన్నైలోని ఎబిలిటీ ఫౌండేషన్ సంస్థ కెవిన్‌కేర్ ఎబిలిటీ అవార్డుతో గౌరవించింది. రజనీ ది గ్రేట్.