Saturday, April 29, 2006

మధుమేహం కళ్లు పీకినా... సడలని పట్టుదల

పుట్టుకతోనే కళ్లు లేకపోవడం వేరు. జీవితంలో కొన్నేళ్ల పాటు కళ్లతో ఈ లోకపు అందాలను ఎంతో ఆనందించి, అనుభవించిన తరువాత ఆ కళ్లను పోగొట్టుకోవడం మరింత బాధాకరం. ఈమె జీవితంలోనూ ఇదే జరిగినా, తన ధైర్యాన్ని కోల్పోలేదు సరికదా, పట్టుదలతో ముందడుగు వేసి, చివరకు రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఔట్ స్టాండింగ్ డిజేబుల్డ్ ఎంప్లాయ్ అవార్డును చేజిక్కించుకుంది. మదురైకి చెందిన డాక్టర్ ఉషానాగరాజన్ (41) స్ఫూర్తిదాయక జీవితం ఇది. 1987లో ఎంబిబిఎస్ పూర్తి చేసి స్పెషలైజేషన్ దిశగా అడుగులేద్దామనుకుంటున్న సమయంలో ఆమె కాలికి వేసిన పుండు ఉగ్రరూపం దాల్చడంతో ఎగబాకిన ఇన్ఫెక్షన్ ఉష కళ్లను కూడా కబళించింది. డయాబెటిక్ రెటీనోపతి ఫలితంగా ఉష జీవితం చీకటిమయమైంది. చిన్నతనం నుంచీ చదువులో మంచి ప్రతిభ కనబరిచి ఉపకారవేతనాలు కూడా పొందిన ఉష డాక్టరై ఎందరికో సేవ చేయాలని తపనపడేవారు. ఈ నేపథ్యంలో ఆమె కళ్లు పోవడంతో పరిస్థితిని జీర్ణించుకోలేని పరిణామాలు చోటుచేసుకున్నా... తను నేర్చుకున్న విద్యతోనే ఎలాగైనా ముందడుగేసి ఇతరులకు చేయూతనిచ్చే స్థాయికి ఎదగాలన్న గట్టి నిర్ణయం తీసుకున్నారు ఉష. వెంటనే తన వైకల్యాన్ని అధిగమించేందుకు బ్రెయిలీ సహా పలు అంశాలపై రెండేళ్లపాటు తగిన శిక్షణ పొందారు. అనంతరం తన ప్రతిభతో మదురైలోని మదురై కెనెట్ ఆసుపత్రిలో వైద్యాధికారిణిగా చేరి రోగులకు సేవ చేస్తున్నారు. అంతేగాక ఈ సంస్థకే చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో నర్సులకు వివిధ అంశాల్లో పాఠ్యాంశాలను ఉష బోధిస్తున్నారు. ఇంతటితో ఆగక అంగవికలురకు చేయూతనిచ్చే పలు సంస్థలకు ఉష అండగా నిలిచి వైద్య సేవలందిస్తున్నారు. ఆమె మదురైలోని రోటాక్ టాకింగ్ లైబ్రరీ సలహా మండలి సభ్యురాలిగా కూడా ఉన్నారు. తన సేవలతో అందరినీ మెప్పించిగా లయన్స్ క్లబ్, జేసీస్ క్లబ్ వంటి సంస్థల పురస్కారాలు ఉషను వెదుక్కుంటూ వచ్చాయి. కర్ర సాయం లేకుండానే పనులు చేసుకోవడంలో భర్త నాగరాజన్ ఉషకు ప్రత్యేక శిక్షణనివ్వడంతో ఆమె స్వంతంగా వంట కూడా చేయగలరు. తన కుమారుడు సంజీవ్ కూడా నేత్ర వైద్యంలో పరిశోధన చేసి మరెందరికో సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. కళ్లు పోయినా తన జీవితంలో కోత్త కోణాన్ని ఆవిష్కరించి ఉషస్సును నిలుపుకున్న ఉష జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమనడంలో సందేహమేముంది ? Print this post

1 comment: