Monday, April 03, 2006
రజనీ సీఏ అయ్యింది
చార్టెడ్ అకౌంటెన్సీ... సర్వాంగాలూ ఆరోగ్యంగా ఉండి, ఇంటి నుంచి ఎప్పటికప్పుడు డబ్బు వస్తూ, ట్యూషన్లు పెట్టించుకుంటున్నా పూర్తి చేయలేక మధ్యలోనే ఈ కోర్సు విడిచిపెట్టిన వాళ్ల సంఖ్య వేలు, లక్షల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ కంటి చూపులేని రజనీ గోపాలకృష్ణన్ ఇందుకు భిన్నం. అందుకే ఆమె గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చిన్నప్పుడు పెన్సిలిన్ రియాక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలై 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే సరికి ఈమె కుడి కంటి చూపు పోయింది. ఎడమ కంటి చూపు మందగించినా అలాగే డిగ్రీ పూర్తిచేశారు. తదుపరి ఎందరికో సవాలుగా నిలిచిన చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో ఆమె చేరారు. సి.ఎ ఇంటర్ పూర్తయ్యే సరికి మొత్తం చూపు పోయింది. ఈలోగా ఆమె కన్న తండ్రి క్యాన్సర్ వ్యాధికి బలై పోయారు. తర్వాత మాతాజీ నిర్మలా దేవి నుంచి సహజ యోగ శిక్షణ పొంది రజని తనను తాను సన్నద్ధం చేసుకున్నారు. అనంతరం సామర్థనం అనే సంస్థ చేయూతనివ్వగా, జీఈ కంపెనీ వారు ఈమెకు ఓ కంప్యూటరును సమకూర్చి, పాఠ్యాంశాలను కూడా చదివి వినిపించే ఏర్పాట్లు చేశారు. నేర్చుకున్న యోగా ద్వారా క్లిష్టమైన ఎన్నో అంశాలను మెదడులో నిక్షిప్తం చేసుకొని స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాసి సిఎలో దిగ్విజయంగా ఉత్తీర్ణురాలయ్యారు. అంతటితో ఆమె ఆగిపోలేదు. బెంగళూరులో తాజ్ వెస్టెండ్ కమ్యూనిటీ కోఆర్డినేటరుగా ఎందరో అంధులకు కంప్యూటర్ ద్వారా పాఠాలు చెబుతూ సేవలందిస్తున్నారు. ఇంకా తనను ఆదరించిన సామర్ధనం సంస్థకు కూడా వీలైనంత తోడ్పడుతున్నారు. రజనీ ప్రతిభను గుర్తించిన చెన్నైలోని ఎబిలిటీ ఫౌండేషన్ సంస్థ కెవిన్‌కేర్ ఎబిలిటీ అవార్డుతో గౌరవించింది. రజనీ ది గ్రేట్.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment