Monday, July 31, 2006

రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా...

...అనే ఈ మెగా సూపర్ హిట్టే కాదు... చిట్టీ చిలకమ్మా.. అమ్మా కొట్టిందా.. మా గూట్లో కొస్తావా లాంటి చిలకల పలుకుల పాటలు కూడా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని మావూళ్లయ్య, వాసవి దంపతులకు కంఠోపాఠమే. ఎందుకంటే వాళ్లింటికి వెళితే మీకు ముందుగా స్వాగతం పలికేవి రామ చిలుకలే కనుక.

అసలు సంగతేంటంటారా, అనుబంధాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో... గత ఇరవైయ్యేళ్లుగా మావూళ్లయ్య, వాసవి దంపతులు ఈ చిలుకల్ని దేవుడిచ్చిన పిల్లలుగా భావించి సాకుతున్నారు. ఉదయం ఆరున్నర కాగానే ఆ ఊరి చిలకలన్నీ మావూళ్లయ్య నడిపే బియ్యం దుకాణం ముందు వాలిపోతాయి. దుకాణం ముందు వీటి కోసమే మావూళ్లయ్య దంపతులు ఉంచే బియ్యాన్ని ఆరగిస్తూ ఆట పాటలతో రోజూ ఆనందంగా గడిపేస్తుంటాయి. వీటి కోసమే ప్రతిరోజూ సుమారు మూడు లేదా నాలుగు కిలోల నాణ్యమైన బియ్యాన్ని ఆ దంపతులు ప్రత్యేకంగా ఉంచుతారు.

వివరాల్లోకి వెళితే.... మావూళ్లయ్య దాదాపు 30 ఏళ్ల కిందట సిద్ధాంతం వచ్చి బియ్యం దుకాణాన్ని ప్రారంభించారు. ఓ రోజున ఒక చిలుక ఆయన కొట్లోకి వచ్చి బియ్యం రుచి చూసింది. దాన్ని ఆయన ఏమీ అనకపోవడంతో ఈ అనుకోని అతిథుల సంఖ్య అలా అలా పెరిగి ఇప్పటికి యాభైకి చేరుకుంది. ఆ అనుబంధం అలా పెరిగి పెనవేసుకుపోయింది. ఊళ్లకు వెళ్లాల్సివచ్చినప్పుడు వీటికోసం ఎప్పుడూ ఇల్లు, దుకాణం తెరిచి ఉండేలా మావూళ్లయ్య దంపతులు సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. చిత్రం ఏమంటే ఇప్పటి వరకూ చిలుకలు రాని రోజే లేదు. వీటి గురించి ఎవరైనా అడిగితే వారి నుంచి వచ్చే సమాధానం "ఈ పచ్చని చిలుకలు సీతారాముల ప్రతిరూపాలు" అని.