Saturday, December 23, 2006

రోడ్ వాటర్ కారు... నడక భలే జోరు

ప్రజ్ఞకు వయసుతో సంబంధం లేదని యువ అవిష్కర్త వినోద్ రూపంలో మరోమారు నిరూపితమైంది. అనుకున్నది సాధించడానికి పాపం ఈ యువకుడు అప్పుల పాలు కావడానికి సైతం సిద్ధపడ్డాడు. కేరళ రాజధాని ట్రివేండ్రం సమీపంలోని బలరాంపురం ప్రాంతంలో ఉన్న రస్సెల్‌పురం వాస్తవ్యుడు పిఎస్ వినోద్ వయసు 2003 నాటికి 28 ఏళ్లు. అప్పటి వయసు ఇప్పుడెందుకు అనుకోవద్దు. ఈ మహత్కార్యానికి బీజం పడింది అప్పుడే.

వర్షాకాలం వస్తే కేరళ వాసులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. అందుకని రోడ్డు మరియు నీళ్లలో నడిచే కారును (Amphibious Car) తయారుచేయాలని వినోద్ నిర్ణయించుకున్నాడు. ఎస్సెస్సెల్సీ చదువుకొని, ఐటిఐలో రిఫ్రిజిరేషన్, ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసి కారు, ఎసీ మెకానిక్‌గా స్వంత వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వినోద్‌కు ఈ ఆలోచన వచ్చిందే తడవుగా పాతిక వేలకు ఒకటి చొప్పున 1985 మాడల్ మారుతీ కార్లు మూడు కొని తన ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతరత్రా చాలా మంది నుంచి 8 లక్షలకు పైగా అప్పులు చేయాల్సి వచ్చింది. మొత్తానికి మొదటి రెండు ప్రయోగాలు విఫలంకాగా (అంటే 2 మారుతీ కార్లు హాంఫట్...) మూడో ప్రయత్నం విజయవంతమైంది.

ఈ రోడ్ వాటర్ కారు పరిజ్ఞానాన్ని నేవీ, కోస్ట్ గార్డ్ విభాగాలకు ఇవ్వడానికి వినోద్ సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా కేరళ సహా ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లోను, ఈశాన్య భారత రాష్ట్రాల్లో రోడ్డు మార్గంతో పోటీపడుతూ వాటికి సమాంతరంగా కిలోమీటర్ల పాటు సాగే పొడవైన జల మార్గాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో రవాణాకు ఇదెంతో ఉపకరిస్తుంది. రద్దీ కారణంగా ఆలస్యం జరిగే పరిస్థితులను అధిగమించవచ్చు. ముంబై, చెన్నై నగరాల్లో ఆ మధ్య సంభవించిన భారీ వరదలకు రోడ్లన్నీ రోజుల తరబడి నీళ్లలోనే ఉండిపోయాయి. ఇలాంటి సమస్యలకు వినోద్ రూపొందించిన రోడ్ వాటర్ కారు సరైన సమాధానం. సాంకేతికంగా తగు జాగ్రత్తలు తీసుకొని, అన్ని విధాలా పటిష్టంగా ఉండేలా వినోద్ ఈ కారును రూపొందించాడు. ఒక స్నేహితుని సాయంతో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దృష్టికి వచ్చిన వినోద్ కృషిని ఆ సంస్థ వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఇతరులు సైతం ఇలాంటి వాటిని రూపొందించినప్పటికీ వినోద్ పిన్న వయసులోనే వాటికంటే మెరుగ్గా ఈ రోడ్ వాటర్ కారును తయారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం లేదా ఇతర సంస్థల నుంచి ఆశించిన ప్రోత్సాహం లేకుంటే... ఇలాంటి రోడ్ వాటర్ వాహనాల తయారీ, వినియోగం అధికంగా ఉన్న ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ లేదా గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలకోసం వెళ్లిపోయిన భారతీయుల్లో వినోద్ కూడా ఒకడై ఇతని జీవితంలో మరో కోణం మొదలయ్యే అవకాశం ఉంది. అప్పుడు మరో రోజున భారత ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహించే ప్రవాసభారతీయ వేడుకలకు ఇతన్నే పిలిచి ఎన్నారైల కోసం రూపొందించిన ఏదో ఓ కొత్త పథకాన్ని అతని చేతే మొదలుపెట్టించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, మన గొప్పదనాన్ని విదేశాలు గుర్తించాకేగా మనవాళ్లూ అహో అనేది.