Saturday, December 31, 2016

పుస్తక ప్రియులకు, స్టాల్స్‌కు పిల్లలే చిల్లర ఇచ్చారు...

భారత ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సందర్భంలో ప్రజల్ని చిల్లర సమస్య ఎంతగా వేధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనం చిన్న చిన్న అవసరాల కోసం ఏం కొనాలన్నా, వ్యాపారులు అమ్మాలన్నా ఎన్ని తిప్పలు పడ్డారో మనకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు కూడా ఇబ్బందులు తప్పవనే అనుకున్నారు కానీ.... పుస్తక ప్రియులకు చిల్లర సమస్య ఉండరాదని భావించారు ఘట్‌కేసర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పాఠశాల విద్యార్థులు. వరుసగా మూడు రోజుల పాటు రోజుకు రూ.10 వేల చొప్పున బుక్ స్టాల్స్ నిర్వాహకులకు చిల్లర పంచారు. కాస్తంత చిల్లర కోసం జనం ఏటీఎంల దగ్గర క్యూలు కడుతున్నారు. చాలామంది అనారోగ్యం పాలయ్యారు కూడాను. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులు రూ.40 వేల విలువైన చిల్లరను అందించడమంటే మామూలు విషయం కాదు ! భళా‌.. అంటూ ఈ పిల్లలను పుస్తక ప్రియులు నోరారా మెచ్చుకుంటున్నారని ఆ పాఠశాల డైరెక్టర్‌ ఉన్నికృష్ణన్‌ గర్వంగా చెప్పారు. తల్లిదండ్రులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన చిల్లర డబ్బులను కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న ఈ పిల్లలు వాటి ద్వారా పుస్తక ప్రియులకు సాయపడ్డారు. పుస్తక ప్రదర్శనలో ఈ పిల్లలను చూసిన పెద్దలందరూ బ్యాంకుల కన్నా ఈ చిన్నారులే మంచి సేవ చేశారని తెగ పొగిడారు.