Sunday, April 26, 2009

అంబలి దాతా సుఖీభవ

మండే ఎండల్లో అలసిపోయినవారి సేద తీర్చేందుకు సుమారు 29 ఏళ్ళ కిందట ఒక తల్లి ప్రారంభించిన సేవా యజ్ఞాన్ని ఆమె కుమారుడు నేటికీ కొనసాగిస్తూ పలువురికి ఆదర్శప్రాయుడై నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన సరోజ దాదాపు 3 దశాబ్దాల కిందట ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ప్రారంభమై వేసవికాలం అంతా రాగులతో చేసిన అంబలిని ఉచితంగా అందిస్తూ మృగశిర కార్తె రోజు వరకూ కొనసాగి మిఠాయిల పంపకంతో ముగుస్తుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సరోజ ఆ తర్వాత మరణించినప్పటికీ ఆమె కుమారుడు, ఎలక్ట్రీషియన్ అయిన ప్రభాకర్ తన భార్య కృష్ణవేణితో కలసి ఈ సేవను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్ చిక్కడపల్లి డివిజన్‌లోని బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి కాలనీలో ఈ కేంద్రం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సేవకు చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకు వచ్చినప్పటికీ ప్రభాకర్ సున్నితంగా తిరస్కరించి తన స్వంత ఖర్చుతో ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు. ఈ వేసవి కాలమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ దాహార్తులు, ఆకలిగొన్నవారికి ఇక్కడ అంబలి సిద్ధంగా ఉంటుంది.

Monday, April 20, 2009

పెద్దలు ఓటేస్తే పిల్లలకు స్టార్

ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఏమిటన్నది నిజంగా గ్రహించిన పాఠశాల ఇది. హైదరాబాద్ నగరం చింతల్‌లో ఉన్న సెయింట్ మార్టిన్ హైస్కూల్ యాజమాన్యం తనకున్న పరిధిలో పౌరులను ఓటు వేసే దిశగా చైతన్యపరిచేందుకు ఓ మంచి పథకం వేసింది. తన పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యత గుర్తెరిగి ఓటు వేస్తే వారి పిల్లల రిపోర్ట్ కార్డ్‌లో సదరు విద్యార్థికి ప్రత్యేక గౌరవం ఇస్తూ బోనస్ స్టార్ కేటాయిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఉత్తమ పౌరులుగా గుర్తిస్తామని కూడా వెల్లడించింది. ఈ బోనస్ స్టార్ ద్వారా ప్రత్యేక గౌరవం పొందడానికి ఆ పిల్లలు తమ అమ్మానాన్నలతో ఓటు వేయించడంతో పాటు తాము ఉత్తమ పౌరుల బిడ్డలమన్న గుర్తింపు కూడా పొందుతారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఓటు వేసినట్లు రుజువు చేసుకోవడానికి ఈ నెల 25న స్వయంగా పాఠశాలకు వచ్చి తమ వేలిపై ఉన్న ఇంకు మార్కును పాఠశాల ఉపాధ్యాయులకు చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే నేతలు అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని, ఇది జరగాలంటే పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు వెయ్యాలన్నది ఈ పాఠశాల గుర్తించిన వాస్తవం.