Tuesday, April 17, 2007

శవాల్ని వెదకడంలో సవాల్

దక్షిణ చెన్నైలో ఉన్న పల్లికరణైలోని జలటిన్ పేట వెళ్లయల్ కోవెల వీధికి ఎక్కువగా వచ్చేది అగ్నిమాపక దళం లేదా పోలీసు సిబ్బందే. హత్యలు, దొంగతనాలు లేదా ఇళ్లు తగలబడే కార్యక్రమాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే ! వీళ్లంతా అక్కడికొచ్చేది శవాల వెలికితీతలో దిట్ట అయిన 34 ఏళ్ల అంధుడు సుందర్‌రాజన్ కోసమే. ఇదే ఇతని వృత్తి, ప్రవృత్తి. ఒక్కో కాష్ఠాన్నీ (శవం) వెలికి తీయడంలో ఉన్న కష్టాన్ని బట్టి ఇతనికి రూ.500 నుంచి రూ.5000 వరకూ ఆదాయం వస్తుంది. బావులు లేదా చెరువుల్లో దూకి ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులు, పడవలు లేదా బస్సులు ప్రమాదవశాత్తూ నీట మునిగినప్పుడు లోపలెక్కడో ఉన్న శవాల్ని బయటకు తీయడంలో పోలీసులు లేదా అగ్నిమాపక దళం సిబ్బందికి ఇబ్బందులతో సతమతమౌతున్నప్పుడు వాళ్లకు గుర్తొచ్చేది ఇతనే.

అసలు సుందర్‌రాజన్ ఈ వృత్తిలోకి ఎలా వచ్చాడో కొంచెం తెలుసుకుందాం. పుట్టుగుడ్డి అయిన ఇతను ఐదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు తనుంటున్న ప్రాంతంలోని బావుల్లో మిత్రులతో కలిసి ఈత కొడుతుండే వాడట. ఎక్కువసేపు శ్వాస నిలిపి నీళ్లలో ఉండాలని వాళ్లలో వాళ్లు పందాలు కాసుకున్నప్పుడు విజయం సుందర్‌రాజన్‌నే వరించేది. మిత్రులంతా వెళ్లిపోయిన తర్వాత కూడా ఇతను ఒంటరిగా ఈ పద్ధతినే సాధన చేసేవాడు. దీంతో శ్వాస తీసుకోకుండా ఏకంగా 4 నిమిషాల పాటు నీళ్లలో ఉండటం సుందర్‌రాజన్‌కు అలవాటైంది. చివరకు శవాలను తీయడానికి ఎక్కువసేపు నీళ్లలో గడపటమే తన వృత్తిలో భాగంగా మారుతుందని తాను ఊహించలేదని ఇతను అంటుంటాడు. సుందర్‌రాజన్ 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నూతిలో దూకి ప్రాణాలు తీసుకున్న ఒక బాలుడి మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు నానా ఇక్కట్లకు గురికాగా వెంటనే సుందర్ రంగప్రవేశం చేసి క్షణాల్లో ఆ శవాన్ని లాగాడు. అలా ఇతని వృత్తి జీవితం మొదలైంది.

ఈ వృత్తిలోని సమస్యల గురించి సుందర్‌రాజన్ మాట్లాడుతూ... నీళ్లలో ఎక్కువసేపు ఉండటం ఎంతగా సాధన చేసినా రోజుల కొద్దీ నీళ్లలో కుళ్లిపోయిన మృతదేహాలను వెలికి తీసేటప్పుడు వచ్చే దుర్వాసన భరించలేనంతగా ఉంటుందని, అలాంటి సమయాల్లో ఊపిరి తీసుకోవడం ప్రాణాంతకంగా ఉంటుందని చెప్పాడు. ముఖ్యంగా బావులు, చెరువుల్లో విషపు పురుగులు కాట్లు వేస్తుంటాయని తన పరిస్థితిని వివరించాడు. ఈ వృత్తి గురించి ఎవరైనా తేలికగా మాట్లాడితే సుందర్‌రాజన్ సహించడు. గుడ్డివాడినైన తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోతే దేవుడే తనకు ఈ మార్గాన్ని చూపించాడంటూ పై వాడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అయితే, నీళ్లలో మునిగిన వారిలో ఒక్కరినైనా ప్రాణాలతో రక్షించగలిగితే అంతకు మించిన సంతృప్తి ఏదీ ఉండదని, అదే తన జీవితంలో ఓ కొత్త కోణమని సుందర్‌రాజన్ పేర్కొంటాడు. సుందర్‌రాజన్ అంతరంగం కూడా సుందర మందిరమే...

Friday, April 13, 2007

ఔదార్యానికి అర్థం చెప్పిన అరక్కోణం...

అది మార్చి 31, 2007వ తేదీ. మిగిలిన అందరి విషయంలో అయితే ఇది వాళ్ల జీవితంలో గడిచిపోయిన ఒక రోజు. పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు, కోయంబత్తూర్-చెన్నై రైలు ప్రయాణీకులకు మాత్రం ఔదార్యానికి అర్థం తెలిసిన రోజు. తమ జీవితాలను కాపాడిన రోజు. ఇక అసలు విషయానికి వద్దాం...

ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన బంద్ కారణంగా ఈ రాష్ట్రంలో తిరుపతి వెళ్లే మార్గంలో ఉన్న అరక్కోణం స్టేషన్‌లో పైన చెప్పిన రెండు రైళ్లూ ఆగిపోయాయి. సాయంత్రం వరకూ బళ్లు కదలవని చెప్పేశారు. బంద్ ప్రభావంతో చుట్టుపక్కల దుకాణాలు, హొటళ్లు ఏమీ లేవు. రాత్రంతా ప్రయాణించిన ఈ రైలు ప్రయాణీకులు పొద్దున్న కూడా ఏమీ తినలేదు. రోజు గడిచిపోతోంది... దాంతో పాటు ఆకలీ మండిపోతోంది. మిట్ట మధ్యాహ్నం వేళైంది. యువకుల సంగతి ఎలా ఉన్నా... పసి పిల్లలు, ముసలివాళ్ల సంగతి దయనీయం.

అదే సమయంలో అరక్కోణం పట్టణంలో అహింసకు ప్రతీకగా నిలిచిన జైన మహనీయుడు మహావీర జయంతి జరుగుతోంది. ఇందులో భాగంగా స్థానిక జైనులు సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం రైల్వే అధికారులకు ఎవరో చెప్పారు. దాంతో వాళ్లు వెంటనే స్పందించి ప్రయాణీకుల పరిస్థితిని మహావీర జయంతి నిర్వాహకులకు తెలియజేసారు.

ఇంకేముంది, మానవత్వం పరిమళించగా ప్రయాణీకుల క్షుద్బాధ ఉపశమించింది. ఆత్మారాముడు శాంతించి ఔదార్యానికి అర్థం చెప్పాడు. అరక్కోణం వారి జీవితంలో కొత్త కోణాన్ని పూయించింది.