Monday, December 28, 2009

నెత్తురు ఉడుకుతోంది... మా రక్తం తీసుకోండి

అస్సాం రాష్ట్రానికి 2008వ సంవత్సరం ఒక పీడకలలాంటిది. వరుస బాంబు దాడులతో ఈ ఈశాన్యరాష్ట్రం అతలాకుతలమైంది. అలాంటి ఒక సందర్భంలో జరిగిన భయానక బాంబుదాడి పెద్దసంఖ్యలో జనాన్ని క్షతగాత్రుల్ని చేసింది. వారి ప్రాణం నిలపడానికి కావలసినంత రక్తం లేక ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. చూస్తూ చూస్తూ కళ్ళముందే ప్రాణాలు పోతుంటే తట్టుకోలేకపోయిన గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బందికి మనసు కకావికలమైంది పాపం. చివరికి మీడియా, ఎస్ఎంఎస్‌ల ద్వారా రక్తం కోసం వీలైనంతమందికి విజ్ఞప్తులు పంపారు. ఎవరైనా స్పందిస్తే బాగుంటుందని, ఒక వేళ స్పందించినా వారిచ్చే రక్తం సరిపోతుందో లేదోనన్న ఆందోళన.

మరికాసేపటికి ఉరుకులు పరుగుల మీద వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు. వారంతా బాంబు దాడి బాధితులేమోనని ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి. వచ్చింది బాధితులు కాదు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలవారు, వ్యాపారులు, వినోదరంగాలకు చెందినవారు ముందుకొచ్చి మేమంటే మేమంటూ రక్తమివ్వడానికి ఉత్సాహం చూపారు. బాంబు దాడులతో మా నెత్తురు ఉడికిపోతోంది... మారక్తం తీసుకుని మావాళ్ళను కాపాడండి అని వారంతా ముక్తకంఠంతో స్పందించారు.

ఆ రోజున వారిచ్చిన రక్తంతో ఎందరో బాధితులు బతికిబట్టకట్టారు. బ్లడ్ బ్యాంకుల్లో అయితే ఇక రక్తం దాచే చోటు కూడా లేదు. దాంతో చాలామంది దాతల వివరాలు తీసుకుని అవసరమైతే కబురు చేస్తామని బలవంతంగా తిప్పిపంపారు. ప్రజల స్పందనతో గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎం ఎం దేకా ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఐక్యత దేశమంతటా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. దాతల రక్తంతో పునర్జన్మ ఎత్తిన బాధితులు ఆ ప్రేమ దేవుళ్ళకు చేతులెత్తి మొక్కారు.

Wednesday, December 23, 2009

ఫోన్ చేస్తే రక్తమిస్తా....

మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ప్రశాంతినగర్ వాసి అయిన వరాల ప్రశాంత్ కుమార్ ఎప్పుడూ 'బీ పాజిటివే'. మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ 'సంచార రక్తనిధి'గా ప్రశంసలందుకున్నాడు. అంతేకాదు, ఫోన్ చేస్తే చాలు స్పందిస్తానంటూ తన ఫోన్ నెంబర్లు సైతం బహిరంగంగా ప్రకటించాడు (9397675737, 9949453585). రాత్రి, పగలన్న తేడా లేకుండా అత్యవసర సమయాల్లోను, రక్తం కావాలని వచ్చే టీవీ ప్రకటనలకు స్పందించి రక్తమిచ్చి ఎన్నో ప్రాణాల్ని నిలబెట్టాడు. లెక్కలేనన్నిమార్లు రక్తమివ్వడమేగాక, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాడీ నిజమైన దేశభక్తుడు. ఆర్తులపాలిటి వరాల మూట వరాల ప్రశాంత్ కుమార్.

Tuesday, December 22, 2009

అతను కూరొండుకోలేదు

చెన్నైలోని పులియంతోపు ప్రాంతంలో జూలై 25, 2006వ తేదీన జరిగిందీ ఘటన. ఉదయం 7.30 గంటల సమయంలో ఒక ఆటోడ్రైవర్ ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడు. అప్పుడు దారిలో పడి ఉన్న ఒక గుడ్లగూబ చుట్టూ కొన్ని కాకులు చేరి దాన్ని పొడుస్తుండటం ఈ ఆటోడ్రైవర్ కంటబడింది. ఒక్కసారిగా బండికి బ్రేక్ వేసి దాన్ని కాకుల బారినుంచి కాపాడి అక్కడికి సమీపాన ఉన్న అగ్నిమాపక దళం సిబ్బందికి విషయం చెప్పాడు. వారు వెంటనే ఆ గుడ్లగూబకు ప్రాథమిక చికిత్స చేసి బ్లూక్రాస్‌కు తరలించారు. అదే దారిలో వెళుతున్న చాలామంది వాహనదారులు వింతగా చూస్తున్నారే తప్ప ఒక్కరూ దానిని కాపాడే ప్రయత్నం చెయ్యలేదని ఆటో డ్రైవర్ ఆవేదన వెలిబుచ్చాడు. అదే మరొకరైతే ఈ గుడ్ల'గూబ గుయ్యిమని'పించి కూర వండేసుకుంటారు. ఒకప్పుడు మనకు రోజూ కనిపించే పిచ్చుకలతోబాటు పలురకాల పక్షి జాతులు నానాటికి అంతరించిపోతూ పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నప్పటికీ చదువుకున్నవారెందరో పట్టించుకోవడంలేదు. వారందరికీ ఆదర్శప్రాయుడీ ఆటో డ్రైవర్ (క్షమించండి, ఇతని పేరు తెలుసుకోలేకపోయాను).

Sunday, December 20, 2009

మూగజీవాల వృద్ధాశ్రమం

మనుషుల్లో మానవత్వం మృగ్యమై మృగాలవుతున్న ఈ రోజుల్లో చెన్నైకి చెందిన 45 ఏళ్ళ అశోక్ మాత్రం మూగజీవాల శోకాన్ని పోగొట్టేందుకు నడుం బిగించారు. 10 సంవత్సరాల కిందట చెన్నైలోని ఇంజంబాక్కంలో "బెంజీస్ డాగ్ అకాడెమీని" ప్రారంభించి తొలుత శునక (కుక్కలు) సంరక్షణ, తర్వాత మార్జాల (పిల్లులు) సంరక్షణ కూడా ఆయన చేపట్టారు. అమ్మానాన్నలు ముసలివారైతే ఎలా వదిలించుకోవాలా అని చూసే ఈ కాలం కుర్రకారు లాంటివారు కాదు అశోక్. ఈ మూగజీవాలకు వయసు మీరినా ఇబ్బందులు ఎదురుకాకుండా "మూగజీవాల వృద్ధాశ్రమం" కూడా ఏర్పాటు చేశారు. అవి తనువు చాలిస్తే వాటి అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా స్మశానవాటికను కూడా ఏర్పాటు చేశారాయన. ఈ మూగజీవాలకు అన్నంపెట్టి, వైద్యసేవలందించి ఆదరించడమేగాక వాటికి వివిధ అంశాల్లో తర్ఫీదునిప్పిస్తుంటారు. అందువల్ల అవి తెలుగు, తమిళ సినిమాల్లోను, వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తుంటాయి. అశోక్ జీవకారుణ్యం గురించిన స్థానికులు ఎప్పుడైనా బయటి ఊళ్ళకు వెళ్ళాల్సి వస్తే వారి జంతువుల్ని కొంతకాలం అశోక్ సంరక్షణలో ఉంచి వెళుతుంటారు. తన సేవలకు చెన్నైలో స్థలం చాలకపోవడంతో సమీపానగల ప్రముఖ పర్యాటకకేంద్రం మహాబలిపురంలో మరో విశ్రాంతి కేంద్రం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సేవలో ఆయన కుటుంబం తోడ్పాటు కూడా ఉంది.

అంధుని పంట పండింది

సకల అంగాలూ సక్రమంగానే పనిచేస్తున్నా కాలం కలసిరాలేదని కలత చెందే మందమతులకు అతను కనువిప్పు కల్గిస్తున్నాడు. నిరాశ, నిస్పృహలకు లోనైన వారికి ఈ అంధుని జీవితం ఒక గుణపాఠం. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం, చిగురుకోటకు చెందిన భట్రాజు చిననాగేశ్వరరావు కళ్ళముందు ఎప్పుడూ కారు చీకట్లే. ఒకరి తోడు లేకుండా తన జీవితం గడపలేని ప్రతికూల పరిస్థితుల్లో ఇతను వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. పుట్టుకతోనే కళ్ళులేని చిననాగేశ్వరరావు బ్రెయిలీ లిపి నేర్చుకున్నాడు. ఒకనాడు తన తండ్రితో బాటు పొలానికి వెళ్ళివస్తూ ఇతను కూడా సేద్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. కళ్ళు లేకున్నా కూలీలతో పనులు చేయిస్తూ దిగుబడుల్లో సాటి రైతులకంటే ముందున్నాడు. తనకు స్వంతంగా ఉన్న భూమితోపాటు ఇంకొంత భూమిని కౌలుకు సాగుచేసి మంచి 'ఫలసాయం' పొందాడు. ఒకప్పుడు చేపల చెరువుల నిర్వహణలో నష్టం రావడంతో తన భూములమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చినప్పటికీ దిగులుపడక మొక్కవోని దీక్షతో జీవితంలో ముందుగు సాగాడు చిననాగేశ్వరరావు.

Saturday, December 19, 2009

గొల్లనాగయ్య మూలికావైద్యం

మహబూబ్‌నగర్ జిల్లా చర్లపల్లికి చెందిన గొల్ల నాగయ్య కోసం ఆయన ఇంటివద్ద ప్రతిరోజూ వందల సంఖ్యలో జనం నిరీక్షిస్తుంటారు. మూలికావైద్యం, మేకపాలతో మందులివ్వడం ఈయన ప్రత్యేకత. ఏ మాత్రం డబ్బు ఆశించకుండా గత 30 ఏళ్ళ నుంచీ ఆయన ఈ సేవలందిస్తున్నారు. విశేషమేంటంటే... పెద్ద ఆసుపత్రుల్లో పనిచేసే నర్స్‌లు, ఇతర సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఆయన వైద్య సేవలందుకుంటుంటారు. గొల్ల నాగయ్య కుమారులు కూడా తండ్రి బాటనే అనుసరిస్తూ రోగులకు స్వాంతన కల్గిస్తున్నారు. రోగుల సౌకర్యార్థం వారు తమ స్తోమత మేరకు ఒక రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేసి ధన్వంతరి ఆశీస్సులు అందుకుంటున్నారు. గొల్ల నాగయ్య వైద్యం ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయించింది. అన్నట్టు మరిచిపోయా... ఈయన వైద్య సేవలు మూగజీవాలకు కూడా అందుతున్నాయ్.

వికలాంగుని చేపలవేట...

ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం సమీపానగల కె పల్లెపాలెం వాసి ఏసురత్నం. కాళ్ళులేని ఈ మత్స్యకారుడు తన ఇంట్లో పెద్దకొడుకు. ఈ వికలాంగుని చేపలవేటతోనే ఆ ఇంటికి పూటగడుస్తుంది. ముసలివారైన అమ్మానాన్నలు, అత్తింటివారి కట్నం వేధింపులతో తిరిగివచ్చిన సోదరి, మరో చెల్లెలు, ఒక తమ్ముణ్ణి ఇతను పోషిస్తున్నాడు. వీరుగాక మరో ఇద్దరు అక్కచెల్లెళ్ళకు తానే పెళ్ళిళ్ళు చేసి పంపాడు. కాళ్ళులేక తాను వికలాంగుడై ఉన్నప్పటికీ అతి కష్టం మీద తోటి జాలర్ల సాయంతో పడవ నడుపుకుంటూ చేపలకోసం నడి సముద్రంలోకి వెళ్ళోస్తాడితను. తీరనికష్టాలతో ఇతని కుటుంబమూ నడి సంద్రంలోనే ఉంది. అతని గుండె మాత్రం ఆత్మస్థైర్యపు అలలతో కదలాడుతూనే ఉంది. ప్రభుత్వ సాయం ఆశించక తన కుటుంబాన్ని తానే పోషించుకుంటున్న ఈ ఏసురత్నం... ఏ అమ్మానాన్నలకైనా నిజమైన పుత్రరత్నమే...