Monday, December 28, 2009

నెత్తురు ఉడుకుతోంది... మా రక్తం తీసుకోండి

అస్సాం రాష్ట్రానికి 2008వ సంవత్సరం ఒక పీడకలలాంటిది. వరుస బాంబు దాడులతో ఈ ఈశాన్యరాష్ట్రం అతలాకుతలమైంది. అలాంటి ఒక సందర్భంలో జరిగిన భయానక బాంబుదాడి పెద్దసంఖ్యలో జనాన్ని క్షతగాత్రుల్ని చేసింది. వారి ప్రాణం నిలపడానికి కావలసినంత రక్తం లేక ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. చూస్తూ చూస్తూ కళ్ళముందే ప్రాణాలు పోతుంటే తట్టుకోలేకపోయిన గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బందికి మనసు కకావికలమైంది పాపం. చివరికి మీడియా, ఎస్ఎంఎస్‌ల ద్వారా రక్తం కోసం వీలైనంతమందికి విజ్ఞప్తులు పంపారు. ఎవరైనా స్పందిస్తే బాగుంటుందని, ఒక వేళ స్పందించినా వారిచ్చే రక్తం సరిపోతుందో లేదోనన్న ఆందోళన.

మరికాసేపటికి ఉరుకులు పరుగుల మీద వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు. వారంతా బాంబు దాడి బాధితులేమోనని ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి. వచ్చింది బాధితులు కాదు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలవారు, వ్యాపారులు, వినోదరంగాలకు చెందినవారు ముందుకొచ్చి మేమంటే మేమంటూ రక్తమివ్వడానికి ఉత్సాహం చూపారు. బాంబు దాడులతో మా నెత్తురు ఉడికిపోతోంది... మారక్తం తీసుకుని మావాళ్ళను కాపాడండి అని వారంతా ముక్తకంఠంతో స్పందించారు.

ఆ రోజున వారిచ్చిన రక్తంతో ఎందరో బాధితులు బతికిబట్టకట్టారు. బ్లడ్ బ్యాంకుల్లో అయితే ఇక రక్తం దాచే చోటు కూడా లేదు. దాంతో చాలామంది దాతల వివరాలు తీసుకుని అవసరమైతే కబురు చేస్తామని బలవంతంగా తిప్పిపంపారు. ప్రజల స్పందనతో గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎం ఎం దేకా ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఐక్యత దేశమంతటా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. దాతల రక్తంతో పునర్జన్మ ఎత్తిన బాధితులు ఆ ప్రేమ దేవుళ్ళకు చేతులెత్తి మొక్కారు. Print this post

4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఇలాంటి స్పందనను చూసైనా ఉగ్రవాదులకు కనువిప్పు కలుగదా?

నరేష్ నందం (Naresh Nandam) said...

అటువంటి సహృదయ వాతావరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటే పక్కవాడిని చూసి భయపడే అగత్యం తప్పుతుంది.

Venkat said...

gud post.....

keep it ....

100000 % better , compared to useles controverial posts....

gud.. very gud...

శరత్ కాలమ్ said...

Nice.