Friday, November 28, 2014

తాళిబొట్టు అమ్మేసింది... టాయిలెట్ కోసం..

ఎవరైనా సరే... ఆస్తులు, నగలు ఎప్పుడు అమ్ముకుంటారు? అప్పులు గాని, అనారోగ్య సమస్యలు గాని, పిల్లల చదువుల కోసమో... సొంతిల్లు కట్టుకునేందుకోవడానికో అమ్ముతారు. కానీ మరాఠీ గ్రామీణ మహిళ సంగీత అహాల్వే తన మంగళసూత్రంతో సహా నగలన్నీ అమ్మేసింది. మహారాష్ట్రలోని వషీం జిల్లా పరిధిలో ఉన్న సాయిఖేదా గ్రామ వాసి సంగీత అహ్వాలే. నగల కంటే మరుగుదొడ్డే తన కుటుంబానికి మేలు చేస్తుందని భావించింది. అందుకోసం తన నగలన్నీ అమ్మేసింది. భారతీయ మహిళలు ప్రాణం కంటే మిన్నగా భావించే మంగళసూత్రం కూడా! ఈ సంగతి సర్కారు దృష్టికి వచ్చింది. సంగీతను రాష్ట్ర మంత్రి పంకజ ముండే ప్రభుత్వం తరపున తన కార్యాలయంలో సత్కరించారు. సంగీత స్పందిస్తూ, మరుగుదొడ్డి అనేది ప్రాథమిక అవసరమని, అందుకే నగలమ్మానని తెలిపింది. మంత్రి పంకజ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా తనకు వచ్చే నిధుల్లో 25 శాతం మరుగుదొడ్లు కట్టించేందుకు ఖర్చు చేస్తానన్నారు.