Wednesday, November 01, 2017

అందరూ అనుకుంటారు... ఇతను ఆచరించాడు

అవును... పేదోళ్ళకు ఎంతో సాయం చెయ్యాలని ఎందరో అనుకుంటారు. కానీ, జేబులోంచి డబ్బులు తీయాలనేసరికి 'తర్వాత ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు చూద్దాం లే..' అనుకుని జీవితకాలం పాటు వాయిదా వేసుకుంటూ పోతారు. కానీ, హైదరాబాదు వాసి అయిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగి గౌతమ్ కుమార్ మాత్రం తనకు ఆలోచన వచ్చిందే తడవుగా 'సర్వ్ నీడీ' (అవసరార్థులకు సేవ) అనే సంస్థను ప్రారంభించి ఎందరికో అండగా నిలిచాడు. గ్రామాలు, నగరాల్లోని రోడ్లు, ఫుట్ పాత్‌ల మీద కాస్తంత సాయం కోసం ఎదురు చూసి ఆలసిసొలసి పడి ఉండే ఎందరెందరో ఆభాగ్యులకు చూసిన గౌతమ్, వారికి ఎలాగైనా సాయమందించాలని తపనపడి ఈ మహత్కార్యానికి పూనుకున్నాడు. 'సర్వ్ నీడీ'కి అనుబంధంగా మొబైల్ మెడికల్ క్యాంపులు, లాస్ట్ రైట్స్ (అనాథ శవాలకు అంత్యక్రియలు) లాంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాల్ని చేపట్టి ఇందులో మరెందరినో భాగస్వాముల్ని చేశాడు. గౌతం సర్వ్ నీడీకి వందనం, సలాం, సెల్యూట్...

Monday, August 07, 2017

టీచర్ రంగయ్య... మీలా ఉంటే స్కూలు బాగయ్య !

తెలంగాణ రాష్ట్రం కుమరం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న సావర్‌ఖేడ్ గ్రామానికి వెళితే ఉపాధ్యాయులనేవారు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునేవారంతా ఈ గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగయ్యను కలిస్తే ఈ వృత్తికున్న పవిత్రత ఏమిటో అర్థమవుతుంది. తాను పనిచేస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులకు స్వంత డబ్బుతో డిజిటల్‌ పాఠాలు చెబుతున్నారు రంగయ్య. ఇది తెలుగు మీడియం పాఠశాల అయినా ఇంగ్లీష్‌ మీడియంను కూడా మొదలుపెట్టారు.

రంగయ్య అంతటితో ఆగలేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ళలో చేర్చుతుండగా ఆయన మాత్రం తన కూతురు అక్షరను ఇదే పాఠశాలలో చేర్పించి గ్రామస్థులకు, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతున్నారు.

విద్యార్థులకు జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు గుర్తుండేలా పాఠశాల గోడలపై మహత్మజ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ తదితరుల చిత్రాలతో పాటు దేశ, రాష్ట్ర చిహ్నాలు, భారతదేశ, ప్రపంచ చిత్రపటాలను వేయించారు. అలాగే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా గుణింతాలు, ఇంగ్లీష్‌, తెలుగు అక్షరమాలతో పాటు అంకెలను రాయించారు.

సావర్‌ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆరుగురు విద్యార్థులు ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. మరో విద్యార్థి చుక్కా రామయ్య పీపుల్స్‌ ప్రొగ్రెస్‌ టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఉపాధ్యాయుడు రంగయ్య కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

ఉపాధ్యాయుడు రంగయ్య కృషి వల్ల సావర్‌ఖేడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయుడు విద్యాబోధన కొనసాగిస్తుండడంతో గ్రామ ప్రజలు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు పంపించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.

Friday, March 31, 2017

క్యాన్సర్ రోగుల కోసం ఐదు లక్షలిచ్చిన విద్యార్థినులు

హైదరాబాదులో ఐదుగురు విద్యార్థినులు సౌమ్య, సంయుక్త, అద్వితీయ, అనూష, సాత్విక అపూర్వమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఫిబ్రవరి 5న నోవాటెల్‌ హోటల్‌లో  పాటలు పాడి డబ్బు సేకరించారు. సమాజానికి తమవంతు సేవ చేయాలని భావించిన ఈ విద్యార్థినులు ఒక బృందంగా ఏర్పడి సుమారు మూడు గంటలకు పైగా పాటలు పాడారు. మొత్తం  5 లక్షల రూపాయలు సేకరించి ‘గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌’కు అందజేశారు. హైదరాబాదులోని బేగంపేట పర్యాటకభవన్‌లో మార్చి 26న గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు సేకరించిన ఈ డబ్బును కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలోని క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు అందజేస్తామని గ్రేస్‌ క్యాన్సర్‌ కో ఫౌండర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి తెలిపారు.

విద్యార్థిని సౌమ్య మాట్లాడుతూ తాను క్యాన్సర్‌ రోగులను చూశానని, వారికి ఏదైనా చేయాలని అనిపించేదని తెలిపింది. క్యాన్సర్ రోగులకోసం డబ్బు సేకరించేందుకు ఆరు నెలల క్రితమే కార్యాచరణ రూపొందించామని, లక్ష్మణచారి సంగీత కళాశాలకు చెందిన శశికళస్వామి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించామని ఇందులో పాల్గొన్న సంయుక్త అనే ఇంటర్మీడియట్‌ విద్యార్థిని చెప్పింది. రోగులను ఆదుకునేందుకు ముందుకురావాలని వీరు పిలుపునిచ్చారు.

Tuesday, February 28, 2017

గోవు మెడలో గంట వద్దు... మహిళ ఉద్యమం

స్విట్జర్లాండ్ నివాసి నాన్సీ హోల్టన్‌ (42) గోవు మెడలో గంట వద్దంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నెదర్లాండ్‌లో జన్మించిన ఈమె తన ఎనిమిదేళ్ల వయసు నుంచి స్విట్జర్లాండ్‌లోనే నివసిస్తున్నారు. అవుల మెడలో తగిలించే గంటలు బరువుగా ఉంటాయని, అవి ఆవు చర్మానికి రాసుకుపోయి గాయాలు చేస్తుంటాయని నాన్సీ ఆవేదన చెందుతున్నారు. 100 డెసిబుల్స్‌ శబ్దం చేసే ఇలాంటి గంటలను మన కంఠంలో చెవులకు దగ్గరగా ఉంచుకోగలమా?’’ అని నాన్సీ నిలదీస్తారు. గోవు మెడలో గంటలు వద్దని ఆమె ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే, నాన్సీ ఉద్యమం నచ్చని స్విస్ ప్రభుత్వం ఆమెకు పాస్‌పోర్ట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. జంతు హక్కుల కోసం పోరాడే నాన్సీ ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా, మోడల్‌గా పనిచేస్తున్నారు.