తెలంగాణ రాష్ట్రం కుమరం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న సావర్‌ఖేడ్ గ్రామానికి వెళితే ఉపాధ్యాయులనేవారు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునేవారంతా ఈ గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగయ్యను కలిస్తే ఈ వృత్తికున్న పవిత్రత ఏమిటో అర్థమవుతుంది. తాను పనిచేస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులకు స్వంత డబ్బుతో డిజిటల్ పాఠాలు చెబుతున్నారు రంగయ్య. ఇది తెలుగు మీడియం పాఠశాల అయినా ఇంగ్లీష్ మీడియంను కూడా మొదలుపెట్టారు.
రంగయ్య అంతటితో ఆగలేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళలో చేర్చుతుండగా ఆయన మాత్రం తన కూతురు అక్షరను ఇదే పాఠశాలలో చేర్పించి గ్రామస్థులకు, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతున్నారు.
విద్యార్థులకు జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు గుర్తుండేలా పాఠశాల గోడలపై మహత్మజ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ తదితరుల చిత్రాలతో పాటు దేశ, రాష్ట్ర చిహ్నాలు, భారతదేశ, ప్రపంచ చిత్రపటాలను వేయించారు. అలాగే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా గుణింతాలు, ఇంగ్లీష్, తెలుగు అక్షరమాలతో పాటు అంకెలను రాయించారు.
సావర్‌ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆరుగురు విద్యార్థులు ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. మరో విద్యార్థి చుక్కా రామయ్య పీపుల్స్ ప్రొగ్రెస్ టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఉపాధ్యాయుడు రంగయ్య కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
ఉపాధ్యాయుడు రంగయ్య కృషి వల్ల సావర్‌ఖేడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయుడు విద్యాబోధన కొనసాగిస్తుండడంతో గ్రామ ప్రజలు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు పంపించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment