Sunday, December 31, 2023

రితిక పట్టుదల... యూట్యూబ్ పాఠాలతో నీట్‌లో సీటు



చదువుకోవడానికి చాలామంది కోచింగుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఆ అవసరం లేదనీ... శ్రద్ధ ఉంటే మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే ఎంతో సాధించవచ్చని నిరూపించింది. రితికా పాల్ అనే బాలిక. ఈ అమ్మాయి ప్రైవేటు కోచింగ్‌కు డబ్బులు లేక యూట్యూబ్ వీడియోలు చూస్తూ నీట్ పరీక్షలో విజయం సాధించింది. తనలాంటి ఎంతో మందికి మార్గదర్శిగా నిలబడింది. రితికాకు తొలి నుంచీ ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కానీ, కాన్సర్ స్పెషలిస్టు కావాలన్న తన కల నెరవేర్చుకునేందుకు ఆమె ధైర్యంగా రంగంలోకి దిగింది. కానీ, ఈ ప్రయత్నంలో తనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక కష్టాలు పెద్ద అడ్డంకిగా మారాయి. రితిక వద్ద స్మార్ట్ ఫోన్ కూడా లేదు. ప్రైవేటు కోచింగ్‌కు డబ్బులు లేక ఆమె తన స్నేహితుల నుంచి తెచ్చుకున్న పుస్తకాల నుంచి చదువుకునేది. రితిక తండ్రి ఓ ఎంబ్రాయిడరీ కంపెనీలో పనిచేస్తుండగా... తల్లి గృహిణి. చిన్న ఇల్లు. తండ్రికొచ్చే కొద్దిపాటి జీతమే కుటుంబానికి ఆధారం. కానీ కరోనా సంక్షోభం ఆమెకు ఈ ఆసరా కూడా దూరమైంది. ఇన్ని కష్టాలున్నా రితికలో పట్టుదల మాత్రం నిలిచే ఉంది. ఈ పరిస్థితుల్లో రితిక తల్లి తన కూతురికి తోడుగా నిలబడింది. తన నగలు అమ్మి మరీ ఆమెకు కావాల్సిన పుస్తకాలు కొన్నది. దీనికి తోడు రితిక యూట్యూబ్‌లోని ఉచిత వీడియోలు చూసి నీట్‌కు సిద్ధమైంది. కష్టానికి తగ్గ ఫలం ఉంటుందని రితిక విషయంలో నిజమైంది. నీట్ పరీక్షలో ఆమె 502 మార్కులతో దేశం మొత్తం మీద 3032 ర్యాంకుతో డాక్టర్ సీటు సాధించి ఆదర్శంగా నిలబడింది.