Saturday, December 08, 2007

కప్పగంతులు...

జంతువుల్లో ఉభయచరమైన కప్ప నుంచి పుట్టిన ఈ కప్పగంతులు... మనుషుల్లో రాజకీయ నాయకులు మాత్రమే పార్టీలు మార్చేందుకు వేస్తుంటారు. అయితే తమిళనాడులోని వేలూరులో రాహుల్ గణేశ్ అనే 13 ఏళ్ల బాలుడు ఎయిడ్స్ వ్యాధిపై జనానికి అవగాహన కలిగించేందుకు డిసెంబర్ 7వ తేదీన ఏడు కిలోమీటర్ల దూరం కప్పగంతులు వేసుకుంటూ వెళ్లాడు. వేలూరు గ్రామీణ యువజన సంఘం నిర్వహించిన ఎయిడ్స్ ప్రచారంలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ కప్పగంతుల కార్యక్రమం సాగింది. మొత్తం మీద పరిశీలిస్తే రాహుల్ గణేశ్ కిలోమీటర్‌కు 1000 కప్పగంతులేసినట్లు లెక్క తేలింది. వేలూరులోని శ్రీపురం లక్ష్మీదేవి స్వర్ణాలయం నుంచి బస్టాండ్ వరకూ సాగిన ఈ కార్యక్రమంలో 100 చోట్ల ఆగి ఎయిడ్స్‌పై ప్రచారం కూడా చేశాడు. ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ను తరిమికొట్టి జీవితంలో కొత్త కోణాలను ఆస్వాదించమంటూ అరియూర్ గ్రామానికి చెందిన రాహుల్ గణేశ్ చేసిన ఈ వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. అతనిపై ప్రశంసల వర్షం కురిసింది.

Wednesday, November 28, 2007

ఆమె కాదని తెలిసింది....

చెన్నైలోని నారద గానసభలో ఓ అందమైన యువతి. జావళితో నాట్యాన్ని మొదలుపెట్టి పదాలు... కీర్తనలతో హావభావ యుక్తంగా నర్తించి ఆహూతులను ఓహో అనిపించింది. కార్యక్రమం ముగిశాక ముఖానికున్న రంగు చెరిపేసుకొని ఆ నర్తకి సభ ముందుకు వచ్చింది. జనం సంభ్రమాశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఆ నాట్యం చేసింది ఆమెకాదు. అలాగని అతడూ కాదు. ఆమే...అతడూ... కాని హిజ్రా 40 ఏళ్ల నటరాజ్.

తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి (కళల్లో మణిపూస... మన నంది అవార్డుకు సమానం) పురస్కారం. దూరదర్శన్ టాప్ గ్రేడ్ హోదా. దేశ విదేశాల్లో సన్మానాలు. ఇదీ నటరాజ్ సత్తా. హిజ్రాగా ఛీత్కారాల నేపథ్యమైన పాత జీవితపు రాళ్లబాటలో నడచిన నటరాజ్ అకుంఠిత దీక్షతో సత్కారాల పూలబాటలోకి అడుగుపెట్టారు. అసలొకసారి నటరాజ్ జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే....

నటరాజ్ పుట్టింది ఓ నిరుపేద కుటుంబంలో. నటరాజ్ పూర్తిగా 'అతడు' కాదని తెలిసిన క్షణం నుంచీ ఇంటితో మొదలై తోటి విద్యార్థుల వరకూ అందరి నుంచీ అవహేళనలే. ఎన్నో అవమానాల మధ్య నాట్యం నేర్చుకుంటే స్త్రీగా అభినయించి ఓ సంప్రదాయ జీవనశైలిని ఏర్పరచుకోవచ్చన్న ఆలోచన నటరాజ్ మదిలో అంకురించింది. సరైన గురువు దొరకక నాటి నటీమణులైన పద్మిని, వైజయంతిమాల సినిమాలు చూస్తూ, వారిని అనుకరించి ఎంత బాగా నాట్యాలు చేసినా ఎవరి నుంచీ ప్రోత్సాహం లేదు. ఇంట్లో నాట్య సాధనకు ఎవరూ ఒప్పుకునే వారు కాదు. దీంతో నటరాజ్ నాట్య సాధన స్మశానంలో సాగేది. (తాండవమాడే శివుడు కూడా ఇష్టపడేది రూద్రభూమినేగా...) తన శారీరక లోపం వల్ల కటుంబీకులు సైతం ఇబ్బందుల పాలవుతున్నారని గ్రహించిన నటరాజ్ తన 16వ ఏట తనకు ఎప్పుడూ ప్రోత్సాహమిచ్చే ఒకే ఒక స్నేహితుడు శక్తి భాస్కర్‌తో కలసి ఇల్లు విడిచిపెట్టారు. చేతిలో డబ్బుల్లేక ఇద్దరూ అష్టకష్టాల పాలయ్యారు.

తంజావూరులోని ప్రముఖ భరతనాట్య ఆచార్యులు కిట్టప్ప పిళ్లై గురించి తెలుసుకున్న నటరాజ్ ఆయన ముందుకెళ్లి తన ఆవేదనను వెళ్లగక్కారు. అయినప్పటికీ కిట్టప్ప పిళ్లై ఏడాది పాటు పరీక్షించాకే నటరాజ్ అంకితభావాన్ని గుర్తించి నాట్యాన్ని కూలంకుషంగా బోధించారు. 1999లో కిట్టప్ప మరణించేవరకూ... అంటే దాదాపు పదిహేనేళ్ల పాటు ఆయనను సేవించి నాట్య కళను అభ్యసించిన నటరాజ్ చెన్నై బాట పట్టారు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. హిజ్రా నాట్యం ఎవరు చూస్తారంటూ అవకాశాలు రాలేదు. అయినప్పటికీ పట్టు వీడని నటరాజ్ అవకాశాలు సంపాదించి తనను తాను నిరూపించుకున్నారు. నటరాజ్ ఏ స్థాయికి ఎదిగారంటే... అమెరికా, బ్రిటన్, రష్యా తదితర దేశాల్లో ప్రదర్శనలివ్వడంతో పాటు భరతనాట్యంలో ప్రముఖులమని చెప్పుకునేవారికి సైతం ఉన్నత శిక్షణనిస్తున్నారు.

స్త్రీ లేదా పురుషునిగా పుట్టినవారు ఒకసారే చస్తారని... అయితే హిజ్రాలుగా పుట్టినవారు అనుక్షణం అవమానాలతో చావలేక బతుకుతుంటారనేది నటరాజ్ తరచూ చెప్పేమాట. అందుకే వారు వ్యభిచారం లేదా యాచకవృత్తిని అశ్రయించి మరింత దిగజారిపోతున్నారని నటరాజ్ అంటుంటారు. హిజ్రాలను సానబడితే మెరిసే వజ్రాలెన్నో బయటకు వచ్చి సమాజానికి వెలుగును సైతం ఇస్తాయనడానికి నటరాజ్ జీవితం ఓ ఉదాహరణ. నిజమే మరి... అలా చేస్తే హిజ్రాల జీవితాల్లో కొత్త కోణాలు కదలాడతాయి.

Sunday, October 21, 2007

ఫర్జానా... ఐదు జీవితాలు

బీహార్ రాష్ట్రం పూర్ణే జిల్లాలోని బైసీ అనే పల్లెటూరులో ఉంటున్న ఫర్జానా అనే 15 ఏళ్ల బాలిక కోసం 2 వేల డాలర్ల డబ్బుతో వెదుక్కుంటూ వచ్చాడు హాంగ్‌కాంగ్ నుంచి పనిచేస్తున్న సుప్రీం మాస్టర్ చింగ్ హాయ్ ప్రపంచ సంఘ ప్రతినిధి యెటు కెన్. ఫర్జానా చేతికి డబ్బిచ్చి, భలే ధైర్య సాహసాలు ప్రదర్శించావంటూ మెచ్చుకొని ప్రశంసా పత్రం కూడా అందించి వెళ్లాడు. ఫర్జానా సాహసం గురించి తెలుసుకున్న స్థానిక నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా కానుకలందించారు. డబ్బులేక ఆమె చదువు మానేసిందని తెలుసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఫర్జానా చదువుకయ్యే ఖర్చు తాము భరిస్తామంటూ పాఠశాలలో చేర్పించారు. అసలు ఫర్జానా ఏం చేసిందో తెలుసుకుందాం...

నిరుపేద కుటుంబానికి చెందిన ఫర్జానా ఆ రోజు పనార్ నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటోంది. అల్లంత దూరంలో బోలెడు మోటార్ సైకిళ్లు, మరో 15 మందితో ఓ పెద్ద పడవ వెళుతోంది. పాపం తనకూ అలాంటి మోటార్ సైకిల్ పైన తిరగాలని ఉన్నా... కుదరదుగా. ఎందుకంటే నాన్న జమిల్ అహ్మద్‌కు కష్టపడటమే తప్ప వెనకేసుకోవడం తెలీదు.... కుటుంబం ఎలా గడుస్తుందే ఏమిటోనన్న ఆలోచనలతో బట్టల మురికి వదిలిస్తోంది. పరవళ్లు తొక్కుతున్న పనార్ ప్రవాహంతో సమానంగా ఆమె ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి....

రక్షించమంటూ కేకలు వినిపించడంతో ఆలోచనలకు అడ్డుకట్ట వేసి అటూవైపు చూసిందామె. ఇంకేముంది... తాను దేని గురించి ఆలోచిస్తోందో ఆ మోటార్ సైకిళ్లున్న పడవ నదిలో తిరగబడింది. జనాల హాహాకారాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫర్జానా ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే నదిలోకి దూకి ఓ మహిళ, ఇంకో ముగ్గురు పిల్లలు, మరో లావుపాటి పెద్దాయనతో పాటు మొత్తం ఐదుగురి ప్రాణాలు కాపాడింది. పదిహేనేళ్ల బక్కపిల్ల ఫర్జానా నీట మునుగుతున్న ఐదుగురి ప్రాణాలను కాపాడేందుకు ఎంత కిందామీదా పడి ఉంటుందో చెప్పనక్కర్లేదు. తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఈ సాహసానికి పూనుకుంది.

పేదరికం కారణంగా చదువుకు దూరమైన ఫర్జానా ఎంతో చురుకైన పిల్ల. గ్రామీణ భారతంలోని మామూలు బాలికల్లా క్రమశిక్షణ, కట్టుబాట్ల మధ్య జీవిస్తూనే తాను మాత్రం ఈత చాలా బాగా నేర్చుకుంది. అదే ఆ రోజున ఐదుగురికి పునర్జన్మనిచ్చి ఆ జీవితాల్లో కొత్త కోణాలను పూయించింది.

Thursday, September 27, 2007

పాపం తాబేళ్లు...

అది 2001వ సంవత్సరం. చెన్నైకి చెందిన సుప్రజ బీసెంట్ నగర్ సమీపానగల నీలాంగరై బీచ్‌లో వాకింగ్‌కు వెళ్లారు. బీచ్‌లో ఓ వస్తువు కోసం కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. మొత్తం మీద ఓ కుక్క దాన్ని నోట కరచుకొని కంగారుగా పరిగెడుతుండగా ఆ వస్తువు సుప్రజ కాళ్ల ముందు పడింది. తీరా చూస్తే... అది అలివ్ రిడ్లీ జాతి తాబేలు పిల్ల. ఆ క్షణంలోనే సుప్రజ మదిలో ఉదయించింది తాబేళ్ల సంక్షేమం కోసం కృషి చేసే 'ట్రీ ఫౌండేషన్'.

నీలాంగరై బీచ్‌లో అడుగడుగునా తాబేలు గుడ్లు.... వాటి నుంచి బయటకు వచ్చే తాబేలు పిల్లలు కనిపిస్తుంటాయి. అక్కడి జాలరి కుటుంబాలు ఈ తాబేలు గుడ్లను వండుకోవడం... ఒక్కోసారి ఈ పిల్లల్ని తమ పిల్లలకు ఆట వస్తువులుగా ఇవ్వడం తాబేళ్ల సంతతికి ముప్పుగా పరిణమించడం సుప్రజను కదిలించింది. ఈ పరిణామాల మధ్య ఆవిర్భవించిన ట్రీ ఫౌండేషన్ తాబేళ్ల రక్షణ దిశగా అక్కడి జాలర్ల గ్రామాల్లోని మత్స్యకారులకు, నౌకాశ్రయ సిబ్బందికి స్లయిడ్ షోల ద్వారా అవగాహన కలిగించేందుకు ఉద్యమించింది.

ట్రీ ఫౌండేషన్‌లో ఉన్న సుమారు 500 మంది సభ్యులు వివిధ గ్రామాలను దత్తత తీసుకొని తాబేళ్ల వల్ల కడలికి కలిగే ప్రయోజనాలు, పర్యావరణపరంగా వాటి ఆవశ్యకతపై పాఠాలు చెబుతుంటారు. 2001 నాటి సంఘటన తర్వాత పౌండేషన్ అధినేత్రి సుప్రజ మద్రాసులోని క్రోకడైల్ బ్యాంక్ ట్రస్ట్‌లో చేరి, సముద్ర తాబేళ్ల నిపుణుడైన కార్తీక్ శంకర్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకొని 2002లో ట్రీ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టారు.

అలివ్ రిడ్లీ జాతి తాబేళ్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం... ఇవి 60 నుంచి 150 గుడ్ల వరకూ పెట్టి సముద్రంలోకి వెళ్లిపోతాయి. సుమారు 50 నుంచి 55 రోజుల తర్వాత గుడ్ల నుంచి బయటకు వచ్చిన తాబేలు పిల్లలు తమంత తాముగా సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత 12 నుంచి 14 ఏళ్ల కాలంలో ఆ తాబేళ్లు తాము పుట్టిన తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. సృష్టిలో ఎంతో అరుదైన విషయం ఇది.

తాబేళ్ల జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ట్రీ ఫౌండేషన్ వైనం ఇది.

Wednesday, August 29, 2007

ఆ కిడ్నీ పేరు రాఖీ...

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని మోడ్రన్ మెడికల్ ఇన్‌స్టిస్ట్యూట్ (ఎమ్ఎమ్ఐ) ట్రామా యూనిట్‌లోని బెడ్ నెంబర్ 5లో ఉన్న రోగి అసిమ్ కుమార్ సిన్హాకు ఆగస్టు 26వ తేదీ ఆదివారంనాడు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. నిబంధనల ప్రకారం అతనికి కిడ్నీ ఇచ్చింది రక్త సంబంధీకురాలు, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకుంటారేమో ! ఇక అసలు విషయం చెబుతా...

రాఖీ పౌర్ణమి దగ్గరకొచ్చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా కుంకురి గ్రామానికి చెందిన 36 ఏళ్ల అనూమిత స్నేహితురాళ్లంతా వాళ్ల అన్నయ్యలు, తమ్ముళ్ల కోసం ఖరీదైన రాఖీలు కొన్నారు. అనూమిత, ఆమె అక్క చెల్లెళ్లందరూ తమ సోదరుడికి ఈసారి తప్పనిసరిగా ఓ అపూర్వమైన కానుక ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే, నలుగురు అమ్మాయిలు, ముసలివాళ్లయిన తల్లిదండ్రులున్న ఆ కుటుంబానికి ఏకైక ఆధారమై, చాలీచాలని జీతంతో తమను ఇన్నేళ్లూ పాడుకుంటూ వచ్చాడు వాళ్లన్నయ్య అసిమ్ కుమార్ సిన్హా. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక కుటుంబానికే జీవితాన్ని అర్పించి, చివరకు మూత్రపిండాలు రెండూ దెబ్బతిని కొన్ని నెలలుగా ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.

రాఖీ పౌర్ణమి ఇక రెండ్రోజులే ఉంది. అనూమిత, అక్కా చెల్లెళ్లంతా కలసి ఎమ్ఎమ్ఐ డాక్టర్లను కలుసుకున్నారు. తమ నిర్ణయం చెప్పారు. చివరకు ఆందరికంటే ఆరోగ్యంగా ఉన్నందున అనూమితకే తన అన్నయ్యకు ఆ అపూర్వ కానుక ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ కానుకతో అసిమ్ మళ్లీ ఆరోగ్యవంతుడయ్యాడు. జీవితంలో సోదర ప్రేమకు అసలైన అర్థాన్ని చెబుతూ కిడ్నీ దానంతో అన్నయ్య జీవితంలో కొత్త కోణాన్ని చూపించిన అనూమిత అందరికీ ఆదర్శప్రాయమే.

Thursday, July 26, 2007

ఎన్రికో మెరిగల్లీ...

రీకో అసలు పేరు ఇదే. రీకో అంటే నేను చెబుతోంది వాచీ కంపెనీ గురించి మాత్రం కాదండోయ్. అయితే, ఇటలీలో పుట్టి ఏలూరులో స్థిరపడిన అరవైయ్యేళ్ల ఈ రీకో గారికి వాచీకి మధ్య పోల్చదగిన విషయం ఒకటుంది. ఈ రీకో గారు కూడా వాచీలాగే విరామం లేకుండా ఇరవైనాలుగ్గంటలూ సమాజ సేవ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మన దేశానికి మహా మహా సేవలు చేసిన మహాత్ములే గుర్తుండరు. ఇక ఎక్కడో ఇటలీ నుంచి వచ్చి, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో స్థిరపడి, గాంధేయ విలువలను శ్వాసిస్తూ, ఇటలీలోని తన ఆస్తులను అమ్ముకుని మరీ మన భారతీయులకు సేవలందిస్తున్న ఈ రీకో ఎంతమందికి గుర్తుంటారు చెప్పండి. అందుకే ఈయన్ని ఈ నెల కథానాయకుడిగా పరిచయం చేయాలనుకున్నాను.

ఇంతకీ రీకోగారు ఎక్కడుంటారో తెలుసా...? బాధితులు ఎక్కడుంటే అక్కడ. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు.... ఇలా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించినా... రీకో గారి సేవల్ని మాత్రం కించిత్తు కూడా కదిలించలేవు. నీటి సమస్య ఉన్నచోట బోర్లు వేయిస్తుంటారు. ప్రకృతి విలయతాండవం చేస్తే బాధితులకు ఆహారంతో సిద్ధంగా ఉంటారు. వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు ఇవ్వడం, వసతులు లేని పాఠశాలలకు బల్లలు, కంప్యూటర్ సదుపాయాలు కల్పించడం ఇలా రీకో సేవలు ఎన్నో.

యువతీ యువకులకు ఐటిఐ ద్వారా పలు వృత్తుల్లో శిక్షణనిస్తూ విద్యార్థుల వ్యక్తిగత సంక్షేమాన్ని గమనించే రీకో వారి పెళ్లిళ్లు చేసే బాధ్యతలను కూడా స్వీకరిస్తుంటారు. అరవయ్యేళ్లొచ్చినా ఆయన మాత్రం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఎన్‌ఫీల్డ్ పై దూసుకెళ్లే రీకో చదువుకునే రోజుల్లో మోటార్ సైకిల్ రేసులో ఛాంపియన్. మూడు దశాబ్దాలుగా తెలుగు దేశంలోనే ఉంటూ చక్కని తెలుగు మాట్లాడే రీకో అందరికీ ఆత్మీయుడే.


ఇంతకీ ఈయన మన దేశానికి ఎలా వచ్చారంటే... రీకో గారు ఇటలీలో ఉండే రోజుల్లో పి.ఐ.ఎం.ఇ (పీమే) అనే స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు. ఈ సంస్థకు మన దేశంలోనూ శాఖలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ చేపట్టే సేవల్లో భాగంగా తన సభ్యులను పలు దేశాలకు పంపుతుంటుంది. అలా రీకో గారు 1974వ సంవత్సరంలో భారత్ వచ్చారు. పీమే నిర్వహణలో ఉన్న ఏలూరులోని సెయింట్ జేవియర్ ఐటీఐ నుంచి ఈయన సేవలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.

Wednesday, June 13, 2007

అంధులు కాదు... సుస్వర బంధువులు

రవితేజ, భూమిక, గోపిక నటించిన "నా ఆటోగ్రాఫ్..." సినిమాలో "మౌనంగానే ఎదగమనీ... మొక్క నీకు చెబుతోంది" అనే పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో భూమికతో నటించిన అంధ గాయకుడు, తమిళనాడు వాసి అయిన కోమగన్ కూడా మొక్కలాగా మౌనంగానే ఎదిగాడు. ఆ పాటలో కనిపించే వాద్య కళాకారులంతా మొక్క నుంచి మహావృక్షంగా ఎదిగిన కోమగన్ నీడలో సంగీత ఫలాలను ఆరగిస్తూ రాగభావాలను ఒలికిస్తుంటారు. వాళ్లెవరికీ కళ్లులేవు... అయినా గుండెగూళ్లలో సుస్వరాల గుళ్లు కడుతూనే ఉంటారు. ఈ సంగీత బృందం పేరు రాగప్రియ, దాని నిర్వాహకుడే ఆ కోమగన్.

సామాజిక బాధ్యతనెరిగిన ఈ (అను)రాగప్రియ బృందం తమ కచేరీల ద్వారా సంపాదించిన డబ్బును తమలాంటి శాపగ్రస్తుల కోసమే వినియోగిస్తూ సద్వినియోగం చేస్తుంటుంది. ఆ మధ్య ఎయిడ్స్ బాధిత బాలల కోసం కోమగన్ జట్టు 40 వేల రూపాయలకు పైగా మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. అలాగే వికలాంగ సంక్షేమానికి కూడా ఈ రాగప్రియ బృందం ధన సహాయం చేసింది. ఈ అంధ కళాకారుల ఉదారతకు ఇదో మచ్చుతునక మాత్రమే... ఆ మధ్య చెన్నైలో ఆర్కెస్ట్రాల మధ్య పోటీలు జరిగాయి. చాలా ఆర్కెస్ట్రాలు ఈ పోటీల్లో పాల్గొనగా రాగప్రియ అంధ బృందం రన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత 16 గంటల నిర్విరామ సంగీత విభావరి, ఈ మధ్య 50 గంటల నిర్విరామ సంగీత విభావరులు నిర్వహించి లిమ్కా బుక్ మరియు గిన్నిస్ బుక్‌ల దిశగా రాగప్రియ బృందం అడుగు వేసింది. ఆ మధ్య వీళ్లకు విదేశాలు వెళ్లే అవకాశం కూడా వచ్చింది. తమిళ, తెలుగు సినీరంగాలకు చెందిన ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు, సంగీత దర్శకులు రాగప్రియ కార్యక్రమాలకు ఎన్నోమార్లు విచ్చేసి ప్రశంసల వర్షం కురిపించారు. అలా... వీళ్లు మొదట తమిళ సినిమా (దాని పేరు కూడా ఆటోగ్రాఫే)లోకి ప్రవేశించి, తర్వాత మన రవితేజ దృష్టిలో పడ్డారన్నమాట. ఎస్పీబీ ఈ బృందాన్ని "ఆర్కెస్ట్రా బై గాడ్ బ్లెస్డ్" అని కొనియాడారు.

కచేరీల్లో పాటలు పాడేందుకు ఈ సంగీత బృందంలోని అంధ గాయనీ గాయకులు గానీ వాద్య కళాకారులుగానీ బ్రెయిలీ లిపిపై ఏమాత్రం ఆధారపడరు. ఈ అంధుల సంగీత బృందంలో ప్రతి ఒక్కరికీ కనీసం 200 పాటలు కంఠతా వచ్చు. అందరికీ వాళ్ల జ్ఞాపకశక్తే పెట్టుబడి. సాధనే వారి అసలైన బడి. అదే వాళ్ల అమ్మ ఒడి. అన్నట్లు వీరి గానం తమిళ భాషకే పరిమితం కాదండోయ్... తెలుగు, కన్నడ, మలయాళ గీతాలనూ అలపించగలరు. వీళ్ల సాధన పద్ధతి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైనా కొత్త సినిమా విడుదల కాగానే రాగప్రియ నిర్వాహకుడు కోమగన్ ఆ క్యాసెట్ లేదా సీడీ కొని అందులోని మంచి పాటల్ని ఎంపిక చేస్తాడు. తన రాగప్రియులందరికీ ఫోన్లు చేసి ఆ పాటలు వివరాలు చెప్పి సాధన చేయమంటాడు. ఆ తర్వాతి ఆదివారం అందరూ కలుసుకొని సామూహిక సాధన చేసి పరిపూర్ణత సాధిస్తారు.

అసలు ఈ అంధ సంగీత బృంద నిర్వాహకుడు కోమగన్ గురించి కొంచెం తెలుసుకుందాం. అతను పుట్టుగుడ్డి. తనలాగే అందరికీ కళ్లుండవేమో అనుకునేవాడట. చెన్నైలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంస్థలో చేరాకే అసలు ఈ ప్రపంచం గురించి తెలుసుకున్నాడు. ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి. వైరు కుర్చీల అల్లిక నుంచి స్వరాల పల్లకీలు ఎక్కడం వరకూ అన్నీ అతనికి తెలుసు. పాడటం, ధ్వన్యనుకరణ (మిమిక్రీ), బేస్ గిటార్, డ్రమ్స్ ఇలా.... ఎన్నో అంశాల్లో నైపుణ్యాన్ని సాధించాడు. ప్రతి పురుషుని వెనుకా ఓ స్త్రీ ఉంటుందన్న నానుడి కోమగన్ విషయంలో నూటికి నూరుపాళ్లూ నిజం. కళ్లులేని కోమగన్‌ను అతని భార్య అనిత ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ప్రేరణతోనే అతను ఈ రాగప్రియ సంగీత బృందాన్ని స్థాపించడం, విజయాలు సాధించడం అన్నీ జరిగాయి. కోమగన్ - అనితలు మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం. మరెందరో అంధుల జీవితాల్లో కొత్త కోణాలను పూయిస్తారని ఆకాంక్షిద్దాం.

Saturday, May 26, 2007

కరవులోనూ కారుణ్యం...

అవి కర్నాటకలోని కోలార్ జిల్లా మిట్టూర్ గ్రామ పరిసరాలు. కొన్నేళ్ల కిందట తీవ్ర వర్షాభావం కారణంగా అక్కడ కరవు కాటకాలు కరాళ నృత్యం చేశాయి. అన్నం మెతుకు కోసం ఆ ప్రాంతంలోని రైతుల కుటుంబాలు క్షుద్బాధతో విలవిలలాడిపోయాయి. దాదాపు రెండేళ్ల పాటు పొలాల్లో తిండి గింజ మొలవలేదు. దీనికి తోడు ఆ ప్రాంతంలో కోతుల బెడద. ఏ చిన్న తినుబండారం కనిపించినా లాక్కుని పీక్కుపోతాయి. ఇక కరవుకాలంలో వాటి ఆగడాలు సహించనలవి కాదు. నీళ్లు సైతం లేక రైతులు ఎంతో శ్రమించి పండించిన అతి కొద్దిపాటి పంట కోతుల పాలయ్యేది. ఇలాంటి పరిస్థితే మన నగరాల్లో ఎదురైతే ఏం జరుగుతుందో ఊహించండి. వెంటనే కార్పోరేషన్ లేదా మున్సిపాలిటీ సిబ్బంది రంగ ప్రవేశం చేసి కోతుల్ని పట్టి బంధించి చంపడమో లేదా వాటిని సుదూర ప్రాంతాలకు తరలించేయడమో జరుగుతుంది.

మరి ఈ కర్నాటక రైతులేంచేశారో తెలుసా... కోతుల్ని తరిమేయలేదు సరికదా వాటి ఆకలి తీర్చడానికి నడుం బిగించారు. తినడానికి తమకేమీ లేకపోయినా సరే ఆ కోతుల్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆ ప్రాంతంలోని రైతు కుటుంబాలన్నీ వంతులు వేసుకొని కోతుల ఆకలి బాధను తీర్చే కార్యభారాన్ని తమ భుజస్కందాలపై వేసుకున్నాయి. రోజూ ఆ కోతులకు రాగి ముద్దలను వండి పెడుతూ ప్రతి రైతు కుటుంబం ఈ జీవ కారుణ్య యజ్ఞంలో పాల్గొంది.

మనకు అన్నీ ఉన్నా పక్కవాళ్లను దోచుకోవడం, వీలైతే మన ఖర్చులు కూడా ఎదుటివాళ్లపై రుద్దేయడం, అధికార దుర్వినియోగం, భూ కబ్జాలు, మానవత్వం మంటగలిపేలా కన్నవాళ్లనే గెంటేయడం ఇలా చెప్పుకుంటూ పోతే మానవుల్లో దుర్బుద్ధులు చాలానే బయటపడతాయి. ఇక కరవు కాటకాల్లాంటివి వస్తే సొంత మనుషుల్ని పీక్కు తినడానికి సైతం వెనుకాడం. నాగరికంగా ఎంతో ఎదిగిపోయామనుకునే మనం, మానసికంగా ఇంకా మృగాలమేననిపిస్తుంది. తోటి మనిషినే పట్టించుకోని ఈ రోజుల్లో జంతుజాలానికి ప్రేమను పంచడమనే విలువలకు చోటేలేదు. ఆధునిక సమాజమంటూ మిడిసిపడే మనం గ్రామీణుల నుంచి మంచితనపు పాఠాలు ఎన్నో నేర్చుకోవాలి. అలాంటి పాఠమే ఇది. మన జీవితంలోనూ ఈ పాఠం ఓ కొత్తకోణాన్ని పూయిస్తుందని ఆశిస్తున్నా...

Tuesday, April 17, 2007

శవాల్ని వెదకడంలో సవాల్

దక్షిణ చెన్నైలో ఉన్న పల్లికరణైలోని జలటిన్ పేట వెళ్లయల్ కోవెల వీధికి ఎక్కువగా వచ్చేది అగ్నిమాపక దళం లేదా పోలీసు సిబ్బందే. హత్యలు, దొంగతనాలు లేదా ఇళ్లు తగలబడే కార్యక్రమాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే ! వీళ్లంతా అక్కడికొచ్చేది శవాల వెలికితీతలో దిట్ట అయిన 34 ఏళ్ల అంధుడు సుందర్‌రాజన్ కోసమే. ఇదే ఇతని వృత్తి, ప్రవృత్తి. ఒక్కో కాష్ఠాన్నీ (శవం) వెలికి తీయడంలో ఉన్న కష్టాన్ని బట్టి ఇతనికి రూ.500 నుంచి రూ.5000 వరకూ ఆదాయం వస్తుంది. బావులు లేదా చెరువుల్లో దూకి ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులు, పడవలు లేదా బస్సులు ప్రమాదవశాత్తూ నీట మునిగినప్పుడు లోపలెక్కడో ఉన్న శవాల్ని బయటకు తీయడంలో పోలీసులు లేదా అగ్నిమాపక దళం సిబ్బందికి ఇబ్బందులతో సతమతమౌతున్నప్పుడు వాళ్లకు గుర్తొచ్చేది ఇతనే.

అసలు సుందర్‌రాజన్ ఈ వృత్తిలోకి ఎలా వచ్చాడో కొంచెం తెలుసుకుందాం. పుట్టుగుడ్డి అయిన ఇతను ఐదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు తనుంటున్న ప్రాంతంలోని బావుల్లో మిత్రులతో కలిసి ఈత కొడుతుండే వాడట. ఎక్కువసేపు శ్వాస నిలిపి నీళ్లలో ఉండాలని వాళ్లలో వాళ్లు పందాలు కాసుకున్నప్పుడు విజయం సుందర్‌రాజన్‌నే వరించేది. మిత్రులంతా వెళ్లిపోయిన తర్వాత కూడా ఇతను ఒంటరిగా ఈ పద్ధతినే సాధన చేసేవాడు. దీంతో శ్వాస తీసుకోకుండా ఏకంగా 4 నిమిషాల పాటు నీళ్లలో ఉండటం సుందర్‌రాజన్‌కు అలవాటైంది. చివరకు శవాలను తీయడానికి ఎక్కువసేపు నీళ్లలో గడపటమే తన వృత్తిలో భాగంగా మారుతుందని తాను ఊహించలేదని ఇతను అంటుంటాడు. సుందర్‌రాజన్ 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నూతిలో దూకి ప్రాణాలు తీసుకున్న ఒక బాలుడి మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు నానా ఇక్కట్లకు గురికాగా వెంటనే సుందర్ రంగప్రవేశం చేసి క్షణాల్లో ఆ శవాన్ని లాగాడు. అలా ఇతని వృత్తి జీవితం మొదలైంది.

ఈ వృత్తిలోని సమస్యల గురించి సుందర్‌రాజన్ మాట్లాడుతూ... నీళ్లలో ఎక్కువసేపు ఉండటం ఎంతగా సాధన చేసినా రోజుల కొద్దీ నీళ్లలో కుళ్లిపోయిన మృతదేహాలను వెలికి తీసేటప్పుడు వచ్చే దుర్వాసన భరించలేనంతగా ఉంటుందని, అలాంటి సమయాల్లో ఊపిరి తీసుకోవడం ప్రాణాంతకంగా ఉంటుందని చెప్పాడు. ముఖ్యంగా బావులు, చెరువుల్లో విషపు పురుగులు కాట్లు వేస్తుంటాయని తన పరిస్థితిని వివరించాడు. ఈ వృత్తి గురించి ఎవరైనా తేలికగా మాట్లాడితే సుందర్‌రాజన్ సహించడు. గుడ్డివాడినైన తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోతే దేవుడే తనకు ఈ మార్గాన్ని చూపించాడంటూ పై వాడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అయితే, నీళ్లలో మునిగిన వారిలో ఒక్కరినైనా ప్రాణాలతో రక్షించగలిగితే అంతకు మించిన సంతృప్తి ఏదీ ఉండదని, అదే తన జీవితంలో ఓ కొత్త కోణమని సుందర్‌రాజన్ పేర్కొంటాడు. సుందర్‌రాజన్ అంతరంగం కూడా సుందర మందిరమే...

Friday, April 13, 2007

ఔదార్యానికి అర్థం చెప్పిన అరక్కోణం...

అది మార్చి 31, 2007వ తేదీ. మిగిలిన అందరి విషయంలో అయితే ఇది వాళ్ల జీవితంలో గడిచిపోయిన ఒక రోజు. పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు, కోయంబత్తూర్-చెన్నై రైలు ప్రయాణీకులకు మాత్రం ఔదార్యానికి అర్థం తెలిసిన రోజు. తమ జీవితాలను కాపాడిన రోజు. ఇక అసలు విషయానికి వద్దాం...

ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన బంద్ కారణంగా ఈ రాష్ట్రంలో తిరుపతి వెళ్లే మార్గంలో ఉన్న అరక్కోణం స్టేషన్‌లో పైన చెప్పిన రెండు రైళ్లూ ఆగిపోయాయి. సాయంత్రం వరకూ బళ్లు కదలవని చెప్పేశారు. బంద్ ప్రభావంతో చుట్టుపక్కల దుకాణాలు, హొటళ్లు ఏమీ లేవు. రాత్రంతా ప్రయాణించిన ఈ రైలు ప్రయాణీకులు పొద్దున్న కూడా ఏమీ తినలేదు. రోజు గడిచిపోతోంది... దాంతో పాటు ఆకలీ మండిపోతోంది. మిట్ట మధ్యాహ్నం వేళైంది. యువకుల సంగతి ఎలా ఉన్నా... పసి పిల్లలు, ముసలివాళ్ల సంగతి దయనీయం.

అదే సమయంలో అరక్కోణం పట్టణంలో అహింసకు ప్రతీకగా నిలిచిన జైన మహనీయుడు మహావీర జయంతి జరుగుతోంది. ఇందులో భాగంగా స్థానిక జైనులు సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం రైల్వే అధికారులకు ఎవరో చెప్పారు. దాంతో వాళ్లు వెంటనే స్పందించి ప్రయాణీకుల పరిస్థితిని మహావీర జయంతి నిర్వాహకులకు తెలియజేసారు.

ఇంకేముంది, మానవత్వం పరిమళించగా ప్రయాణీకుల క్షుద్బాధ ఉపశమించింది. ఆత్మారాముడు శాంతించి ఔదార్యానికి అర్థం చెప్పాడు. అరక్కోణం వారి జీవితంలో కొత్త కోణాన్ని పూయించింది.

Wednesday, March 28, 2007

అంధలోకంలో అనుబంధాలు...

తమిళనాడులోని మదురై పరిసరాల్లో ఉన్న శిక్కమంగళం పంచాయితీలో ఓ చిన్న గూడెం అది. ఇక్కడ దాదాపు 40కి పైగా అంధ జంటలు ఉన్నాయి. ఈ గూడానికి తైపూసం అనే వ్యక్తి నాయకుడు కాగా ఆయనా అంధుడే. ఎందుకనో తెలీదుకానీ ఈ ప్రాంతంలో పుట్టిన చాలా మంది జన్మతః అంధులు కాగా, మరి కొందరు పుట్టిన తర్వాత బాల్యంలోనే ఏదో ఒక దశలో అంధులై చూపును కోల్పోతున్నారు. వీళ్లలో చాలామంది సమీపంలోని అంధుల పాఠశాలలో చదువుకుంటారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలు ప్రేమ బంధానికి దారితీయగా ఎన్నో జంటలు వివాహబంధంతో ఒకటయ్యాయి.

తమ ప్రేమ వివాహాలకు సంబంధించి అంధ జంటలు మాట్లాడుతూ తమ పెళ్లిళ్లు బాహ్య సౌందర్యంతో గాక, అంతః సౌందర్యంతో ముడిపడినవి కనుక తాము ఎంతో అవగాహనతో జీవితాల్లో ముందడుగు వేస్తున్నామన్నాయి. కళ్లున్న లోకంలో కేవలం బయటి అందానికే ప్రాధాన్యతనిస్తూ జరిగే చాలా పెళ్ళిళ్లు కొద్ది రోజులకే విడాకులతో పెటాకులు కావడం లేదా అక్రమ సంబంధాలతో ముగిసిపోతున్నాయని వీళ్లంటున్నారు. అంటే, తమ ఉద్దేశం అందరూ గుడ్డివాళ్లు కావాలని కాదని, మనసెరిగి మసలుకోవడం ముఖ్యమని చెబుతున్నామన్నారు.

వీళ్ల జీవనశైలికి సంబంధించిన మరికొన్ని విశేషాలేమిటంటే... పండుగలు పబ్బాలన్నిటినీ కలసికట్టుగా చేసుకుంటారు. ఎలాంటి విభేదాలకూ చోటులేదు. తమ కళ్లకు అన్నీ ఒకేలా ఉంటాయి కనుక అసమానతలకు తావులేదని వారు స్పష్టం చేశారు. వీళ్ల ఐకమత్యాన్ని గమనించిన ప్రభుత్వం ఈ కుటుంబాలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించింది. త్వరలో శాశ్వత నివాసానికి వీలు కలిగేలా పట్టాలు కూడా ఇవ్వనుంది. ఈ అంధలోకంలో అనుబంధాలను పంచుకోవడానికి త్వరలో మరో 40 అంధ కుటుంబాలు ఇక్కడికి రానున్నాయట.

వీళ్ల ఆశ ఏమిటో తెలుసా...? తమ సంతానంలో కళ్లున్న వాళ్లు మరింత పైకెదిగి, తమను విడిచిపోకుండా అండగా ఉండాలన్న ఓ చిన్న కోరిక మాత్రమే. అదే తమ జీవితంలో రాబోయే కొత్త కోణం అంటున్నారు ఈ అంధ బంధువులు... ప్రేమ సింధువులు.

Monday, February 26, 2007

ఎదురులేని వెదురు మనిషి...

అస్సాంలోని నాల్‌బారీకి చెందిన దాధీ పాఠక్... ప్రమాదవశాత్తూ అతని నోటి ముందు మూడు పళ్లూ ఊడిపోతే టేకిటీజీ అనుకున్నాడు. వెంటనే వెదురు బొంగను ఆశ్రయించి దాంతోనే మూడు పళ్ల సెట్లు తయారు చేసుకున్నాడు. పదేళ్లుగా వాటినే వాడుకుంటూ చేపలు, చికెన్ నమిలి నమిలి తింటున్నా ఏమీ కాని వెదురు పళ్లతో దంత వైద్యుల్నే సవాల్ చేశాడు. ఈశాన్య భారతదేశంలోని కోట్లాది పేద కుటుంబాల్లో ఎందరో సృజనశీలురున్నారు. వారులో ఒకడు దాధీ పాఠక్. ఇతను ఈ పళ్ల సెట్ తయారీతో సంతృప్తిపడలేదు. స్వతహాగా పాటగాడు కనుక పళ్లూ ఊడిపోతే పాటలో స్పష్టత లోపిస్తుంది కాబట్టి ప్రకృతి ఉత్పత్తినే ఈ లోపాన్ని అధిగమించేందుకు ఉపయోగించుకున్నాడు.

దాధీ పాఠక్ ఏనాడూ తన గ్రామం వదలి బయటకు వెళ్లలేదు. ఓ రోజు ఉన్నట్టుండి ఆ గ్రామంలో వెదురుతో చేసిన తాజ్‌మహల్ వెలిసింది. అందరూ వహ్ తాజ్ అనుకున్నారు. ఇది దాధీ పాఠక్ పనే అని వేరే చెప్పాలా... అయితే గ్రామస్తులందరికీ వచ్చిన సందేహమల్లా అతను తమకు తెలియకుండా ఆగ్రా ఎప్పుడు వెళ్లాడా అని. క్యాలెండర్లో తాను చూసిన తాజ్ బొమ్మకే వెదురుతో ప్రాణం పోశానన్న పాఠక్ మాటలతో వాళ్లంతా అవాక్కయ్యారు. లక్ష రూపాయలు ఇస్తామన్నా అతను దీన్ని అమ్మలేదు. సరైఘాట్ వంతెన సహా అస్సాంలోని పలు చారిత్రక కట్టడాలకు కూడా వెదురు ప్రతిరూపాలను తయారుచేసి తన సత్తా చాటాడు.

ఎలాంటి సమస్య వచ్చినా మనసు చెదిరిపోకుండా... నదురూ... బెదురూ లేకుండా అన్నిటికీ వెదురునే ఆశ్రయిస్తూ తన పొదరింట్లోనే (అదీ వెదురిల్లేనండోయ్) ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు పాఠకు. తన చిన్న చిన్న అవసరాలకు అటూ ఇటూ వెళ్లడానికి ఒక వాహనం ఉంటే బాగుంటుందని పాఠక్‌కు అనిపించింది. ఈ పాటికే మీరు ఊహించే ఉంటారు. అతను ఏం చేసి ఉంటాడా అని. మీరనుకున్నది దాదాపు నిజమే. వెదురు బొంగలతోనే సైకిల్ తయారు చేసుకున్నాడు. ఈ సైకిల్ చైన్, టైర్లు, ట్యూబులు తప్ప మిగిలిన ప్రతి భాగమూ వెదురుతో తయారు చేసిందే. ఆ సైకిల్ మీదే పాఠక్ కొడుకు పాఠశాలకు వెళుతుంటాడు. ఇంతటితో ఆగని పాఠక్ బస్సు నమూనాలు కూడా తయారు చేశాడు. ఇతను తయారు చేసిన ఒక బొమ్మ రైలు విషయం ఇంకా విచిత్రమైంది. వేణువు ఊదుతూంటే దాని స్వరాలే వాహకంగా ఈ రైలు కదులుతుందట. భలే ఆశ్చర్యం కదూ...

ఇంకా చెప్పాలంటే...బావులు, చెరువుల నుంచి నీళ్లు తోడుకోవడానికి వెదురుతోనే ఇతను చేతిపంపు తయారు చేశాడు. దాని పిస్టన్, వాల్వ్, బారెల్, హ్యాండిల్ అన్ని భాగాలూ వెదురే. సంగీత వాద్యాలతో పాటు ఇంకా ఎన్నో వస్తువులు పాఠక్ ప్రతిభకు ప్రతీకలుగా అతని ఇంట్లో కనిపిస్తాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రశంసలందుకున్న దాధీ పాఠక్ జీవితంలో ఎన్ని కొత్త కోణాలో... అతనికే కాదు అతని కళారూపాలను చూసినవారికి కూడా.

Monday, January 29, 2007

జలమా... హాలాహలమా...

సంజీవి... తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా రామభద్రకండ్రిగకు చెందిన హొటల్ కార్మికుడు. అలమట్టి, బాబ్లీ, కావేరి... ఇలా జలం కోసం జరుగుతున్న జనం చేసే పోరాటాలు కోలాహలంగా ప్రారంభమై హాలాహలాన్ని సృష్టించక ముందే జల చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం అతనికి కనిపించింది. వెంటనే అతనూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించేయాలని అనుకోలేదు. ఉద్యమాలు సృష్టించే స్థాయి భేదాల గురించి అతనికీ తెలుసు. అందుకే వన్ మ్యాన్ అర్మీగా అవతారమెత్తాడు. సైకిల్‌నే తన చైతన్య రథంగా చేసుకొని దక్షిణాది నాలుగు రాష్ట్రాల వెంబడి అవగాహన పర్యటన చేపట్టాడు.

జటిలమైన జల పోరాటాల చిక్కు ముడులను విప్పాలంటే నదుల అనుసంధానమే మార్గం అంటున్నాడితను. ఇదే విషయాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పలువురు ఎలుగెత్తి చాటినా... వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు, కాగితాలపై రాతలు జనసామాన్యుల హృదయాలను అంత సులభంగా తాకలేవంటున్నాడు సంజీవి. కుటుంబాలను కాలరాస్తున్న జల ప్రళయాలను అడ్డుకోవాలంటే ప్రతి వ్యక్తీ చొరవ తీసుకొని ఈ మంచిపనికి పూనుకోవాలని, ఆ దిశగా వ్యక్తులందరినీ ప్రేరేపించాలంటే వారితో మమేకమై వ్యక్తిగతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చెయ్యాలని సంజీవి నిర్ణయించుకున్నాడు.

తన ప్రయత్నంలో భాగంగా సంజీవి సైకిల్ ప్రారంభించి దక్షిణాది పర్యటనను విజయవంతంగా పూర్తి చేశాడు. నదుల అనుసంధానంలో భాగంగా మొదట దక్షిణ భారతదేశపు నదులనైనా అనుసంధానించేందుకు ప్రభుత్వాలు - ప్రజలు ముందుకు రావాలని అతను కనిపించిన ప్రతివారినీ కోరాడు. ఈ ప్రయత్నం ఫలించి ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలు పుట్టుకు రావాలని అతను ఆకాంక్షిస్తున్నాడు.