Monday, February 26, 2007

ఎదురులేని వెదురు మనిషి...

అస్సాంలోని నాల్‌బారీకి చెందిన దాధీ పాఠక్... ప్రమాదవశాత్తూ అతని నోటి ముందు మూడు పళ్లూ ఊడిపోతే టేకిటీజీ అనుకున్నాడు. వెంటనే వెదురు బొంగను ఆశ్రయించి దాంతోనే మూడు పళ్ల సెట్లు తయారు చేసుకున్నాడు. పదేళ్లుగా వాటినే వాడుకుంటూ చేపలు, చికెన్ నమిలి నమిలి తింటున్నా ఏమీ కాని వెదురు పళ్లతో దంత వైద్యుల్నే సవాల్ చేశాడు. ఈశాన్య భారతదేశంలోని కోట్లాది పేద కుటుంబాల్లో ఎందరో సృజనశీలురున్నారు. వారులో ఒకడు దాధీ పాఠక్. ఇతను ఈ పళ్ల సెట్ తయారీతో సంతృప్తిపడలేదు. స్వతహాగా పాటగాడు కనుక పళ్లూ ఊడిపోతే పాటలో స్పష్టత లోపిస్తుంది కాబట్టి ప్రకృతి ఉత్పత్తినే ఈ లోపాన్ని అధిగమించేందుకు ఉపయోగించుకున్నాడు.

దాధీ పాఠక్ ఏనాడూ తన గ్రామం వదలి బయటకు వెళ్లలేదు. ఓ రోజు ఉన్నట్టుండి ఆ గ్రామంలో వెదురుతో చేసిన తాజ్‌మహల్ వెలిసింది. అందరూ వహ్ తాజ్ అనుకున్నారు. ఇది దాధీ పాఠక్ పనే అని వేరే చెప్పాలా... అయితే గ్రామస్తులందరికీ వచ్చిన సందేహమల్లా అతను తమకు తెలియకుండా ఆగ్రా ఎప్పుడు వెళ్లాడా అని. క్యాలెండర్లో తాను చూసిన తాజ్ బొమ్మకే వెదురుతో ప్రాణం పోశానన్న పాఠక్ మాటలతో వాళ్లంతా అవాక్కయ్యారు. లక్ష రూపాయలు ఇస్తామన్నా అతను దీన్ని అమ్మలేదు. సరైఘాట్ వంతెన సహా అస్సాంలోని పలు చారిత్రక కట్టడాలకు కూడా వెదురు ప్రతిరూపాలను తయారుచేసి తన సత్తా చాటాడు.

ఎలాంటి సమస్య వచ్చినా మనసు చెదిరిపోకుండా... నదురూ... బెదురూ లేకుండా అన్నిటికీ వెదురునే ఆశ్రయిస్తూ తన పొదరింట్లోనే (అదీ వెదురిల్లేనండోయ్) ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు పాఠకు. తన చిన్న చిన్న అవసరాలకు అటూ ఇటూ వెళ్లడానికి ఒక వాహనం ఉంటే బాగుంటుందని పాఠక్‌కు అనిపించింది. ఈ పాటికే మీరు ఊహించే ఉంటారు. అతను ఏం చేసి ఉంటాడా అని. మీరనుకున్నది దాదాపు నిజమే. వెదురు బొంగలతోనే సైకిల్ తయారు చేసుకున్నాడు. ఈ సైకిల్ చైన్, టైర్లు, ట్యూబులు తప్ప మిగిలిన ప్రతి భాగమూ వెదురుతో తయారు చేసిందే. ఆ సైకిల్ మీదే పాఠక్ కొడుకు పాఠశాలకు వెళుతుంటాడు. ఇంతటితో ఆగని పాఠక్ బస్సు నమూనాలు కూడా తయారు చేశాడు. ఇతను తయారు చేసిన ఒక బొమ్మ రైలు విషయం ఇంకా విచిత్రమైంది. వేణువు ఊదుతూంటే దాని స్వరాలే వాహకంగా ఈ రైలు కదులుతుందట. భలే ఆశ్చర్యం కదూ...

ఇంకా చెప్పాలంటే...బావులు, చెరువుల నుంచి నీళ్లు తోడుకోవడానికి వెదురుతోనే ఇతను చేతిపంపు తయారు చేశాడు. దాని పిస్టన్, వాల్వ్, బారెల్, హ్యాండిల్ అన్ని భాగాలూ వెదురే. సంగీత వాద్యాలతో పాటు ఇంకా ఎన్నో వస్తువులు పాఠక్ ప్రతిభకు ప్రతీకలుగా అతని ఇంట్లో కనిపిస్తాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రశంసలందుకున్న దాధీ పాఠక్ జీవితంలో ఎన్ని కొత్త కోణాలో... అతనికే కాదు అతని కళారూపాలను చూసినవారికి కూడా. Print this post

9 comments: