సంజీవి... తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా రామభద్రకండ్రిగకు చెందిన హొటల్ కార్మికుడు. అలమట్టి, బాబ్లీ, కావేరి... ఇలా జలం కోసం జరుగుతున్న జనం చేసే పోరాటాలు కోలాహలంగా ప్రారంభమై హాలాహలాన్ని సృష్టించక ముందే జల చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం అతనికి కనిపించింది. వెంటనే అతనూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించేయాలని అనుకోలేదు. ఉద్యమాలు సృష్టించే స్థాయి భేదాల గురించి అతనికీ తెలుసు. అందుకే వన్ మ్యాన్ అర్మీగా అవతారమెత్తాడు. సైకిల్‌నే తన చైతన్య రథంగా చేసుకొని దక్షిణాది నాలుగు రాష్ట్రాల వెంబడి అవగాహన పర్యటన చేపట్టాడు.
జటిలమైన జల పోరాటాల చిక్కు ముడులను విప్పాలంటే నదుల అనుసంధానమే మార్గం అంటున్నాడితను. ఇదే విషయాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పలువురు ఎలుగెత్తి చాటినా... వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు, కాగితాలపై రాతలు జనసామాన్యుల హృదయాలను అంత సులభంగా తాకలేవంటున్నాడు సంజీవి. కుటుంబాలను కాలరాస్తున్న జల ప్రళయాలను అడ్డుకోవాలంటే ప్రతి వ్యక్తీ చొరవ తీసుకొని ఈ మంచిపనికి పూనుకోవాలని, ఆ దిశగా వ్యక్తులందరినీ ప్రేరేపించాలంటే వారితో మమేకమై వ్యక్తిగతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చెయ్యాలని సంజీవి నిర్ణయించుకున్నాడు.
తన ప్రయత్నంలో భాగంగా సంజీవి సైకిల్ ప్రారంభించి దక్షిణాది పర్యటనను విజయవంతంగా పూర్తి చేశాడు. నదుల అనుసంధానంలో భాగంగా మొదట దక్షిణ భారతదేశపు నదులనైనా అనుసంధానించేందుకు ప్రభుత్వాలు - ప్రజలు ముందుకు రావాలని అతను కనిపించిన ప్రతివారినీ కోరాడు. ఈ ప్రయత్నం ఫలించి ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలు పుట్టుకు రావాలని అతను ఆకాంక్షిస్తున్నాడు.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment