Friday, November 30, 2012

పంచానన్ పడూయ్.. ఎందరికి తెలుసు ?

రేపటి కోసం అంటూ ఒక్క పైసా దాచుకోకుండా తాను జీవితాంతం గడించిన జీతంలో 90 శాతం మొత్తాన్ని పశ్చిమ బెంగాల్లోని 685 పాఠశాలలకు విరాళంగా ఇచ్చిన ధన్యజీవి, విద్యాదాత శ్రీ పంచానన్ పడూయ్. హౌరాలోని  డోమ్‌జడ్ ప్రాంతానికి చెందిన ఈ ఉపాధ్యాయుడు. ఏడేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయి, ఉన్న పొలం కాస్తా కరవు కోరల్లో చిక్కుకోవడంతో ఈ కుటుంబం నిరుపేదగా మారింది. తన తల్లి మట్టికుండల్లో చాలీచాలని బియ్యాన్ని వండిపెట్టేదట. సాయం పొందే అవకాశమేలేకపోయింది. పశువులు కాశారు, గడ్డి కోశారు. డబ్బున్నవారిళ్ళల్లో బట్టలుతికారు. చీరెలు అమ్మారు. జౌళి మిల్లులో పనిచేశారు. ఈ క్రమంలో రాత్రి వేళ చదువుకుని బికాం పాసయ్యారు. రాహ్రాలోని శ్రీ రామకృష్ణ మిషన్ ద్వారా పీజీ పూర్తి చేశారు. చివరికి హిందీ పండితునిగా ఉద్యోగంలో స్థిరపడ్డారు.

ఒకప్పుడు తనకే గనుక ఉద్యోగం వస్తే ఆర్థిక ఇక్కట్లతో చదువుకోలేకపోయిన వారికి ధన సహాయం చేయాలని ఆ రోజుల్లోనే నిశ్చయం చేసుకున్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం పెళ్ళికి దూరంగా ఉండాలని కూడా ఒట్టు పెట్టుకున్నారు శ్రీ పడూయ్. తన ఇంట్లో వెలుగు కోసం లాంతరు, కొవ్వొత్తులూ ఉపయోగించుకుంటూ కరెంట్ వాడకాన్ని సైతం పక్కనపెట్టారు. ఎందుకంటే కరెంటు బిల్లుకయ్యే ఖర్చుతో మరో విద్యార్థికి సాయం చెయ్యచ్చు కదా అంటారాయన. బిగ్డే స్కూలులో 28 సంవత్సరాలు పనిచేసి 1997లో పదవీ విరమణ చేసిన తర్వాత మూడేళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఈయన్ని ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి గౌరవించింది.

Saturday, September 01, 2012

భర్త నుంచి భార్యను రక్షించిన డ్రైవర్...

కలకత్తాలో ఒక ఇల్లాలిని వ్యభిచారకూపంలో పడేయాలనుకున్న భర్త నుంచి ఆమెను ఒక టాక్సీ డ్రైవర్ కాపాడాడు. శ్యామ్ లాల్ సొరెన్ అనే వ్యక్తి తన భార్యతో కలసి ఒక షేర్ టాక్సి ఎక్కాడు. భార్యను వెనుక సీట్లో కూర్చోబెట్టి ముందు సీట్లో ఉన్న డ్రైవర్ పక్కన తాను కూర్చున్నాడు. ఆ షేర్ టాక్సీలో ఉన్న మిగతా ప్రయాణీకులందరూ దిగిపోయాక కలకత్తాలో అమ్మాయిలను అమ్మడానికి సరైన చోటేదని డ్రైవర్ చెవిలో మెల్లగా అడిగాడు. అక్కడికి తీసుకెళితే 250 రూపాయలిస్తానని ఆశపెట్టాడు. శ్యామ్ లాల్ తీరుతో విస్తుపోయిన ఆ డ్రైవర్ మరేమీ మాట్లాడకుండా ఆ మహా నగరంలోని వీధుల గుండా తీసుకెళుతూ సెక్రెటేరియట్ దగ్గర ఆపాడు. అక్కడున్న పోలీసుల్ని పిలిచి శ్యామ్ లాల్ పన్నాగం గురించి చెప్పాడు. పోలీసులు డ్రైవర్‌తో పాటు శ్యామ్ లాల్, అతని భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మూడు నెలల కిందటే పెళ్ళి చేసుకున్న శ్యామ్ లాల్‌కు ఏమైందో తెలియదు గానీ తన భార్యను అత్తారించికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వ్యభిచార కూపంలోకి నెట్టాలని చూశాడు. కానీ టాక్సీ డ్రైవర్ మంచితనంతో ఈ ఘోరం తప్పింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల పైన ఆరోపణలు వస్తుంటాయి. తామంతా అలాంటివారం కాదని ఈ టాక్సీ డ్రైవర్ నిరూపించాడు.

Tuesday, July 31, 2012

రోగాలున్నా డబ్బులు తిరిగిచ్చేశారు..


అక్రమార్జన, అవినీతి కలసి ప్రళయ రుద్రతాండవం చేస్తున్న రోజులివి. వ్యక్తులను.. సామాజిక వాతావరణాన్నీ అనారోగ్యం పట్టి పీడిస్తున్న పరిస్థితులివి. అలాంటి తరుణంలో 89 సంవత్సరాల రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి చార్లెస్ విలియమ్స్ అనే ఆయన తన నిజాయితీని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం మైసూరులో నివసిస్తున్న ఈయన అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ తన పెన్షన్ అకౌంట్‌లో తనకు రావలసిన మొత్తంకంటే ఎక్కువగా జమ అయిన డబ్బును తిరిగిచ్చేశారు.

విలియమ్స్ గారు మన దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా చేరారు. పలు యుద్ధాల్లో పాల్గొని ఎన్నో చారిత్రక అనుభవాల గూడుగా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత తనకు రావలసిన పెన్షన్ మొత్తంలో పొరపాట్లు చోటు చేసుకున్నట్లు గ్రహించిన విలియమ్స్ స్థానిక సైనిక సంక్షేమం, రీసెటిల్మెంట్ బోర్డు వారిని కలుసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి మైసూరులోని వెకరె ఎక్స్ సర్వీస్‌మెన్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎం ఎన్ సుబ్రమణిని సంప్రదించారు. చివరికి మంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌కు చెందిన సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఎక్కువ మొత్తం విలియమ్స్ పెన్షన్ ఖాతాలో పడినట్లు లెక్కల్లో తేలింది.

తనకు అర్హత లేనప్పటికీ fixed medical allowance కింద ప్రతి నెలా రూ.300 చొప్పున అదనపు మొత్తంగా ఖాతాలో 2007 నుంచీ రూ.15,200 జమ అయినట్లు గ్రహించిన విలియమ్స్ ఈ మొత్తాన్ని తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి కంటి సమస్య, గుండెకు ఆపరేషన్ కోసం ప్రస్తుతం ఆయన ఒకటిన్నర లక్ష రూపాయల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తనకు ఇబ్బందులున్నప్పటికీ దేశ ఖజానాపై భారం మోపకూడదన్న నైతికతతో ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు వారికి లేఖ పంపి తనపై ఆర్థిక భారం పడకుండా ఈ డబ్బును సులభ వాయిదాల్లో వెనక్కి తీసుకోవలసిందిగా కోరారు.

ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటో చెప్పనక్కరలేదనుకుంటా...

Saturday, June 30, 2012

రూపాయికే బీజా...పూర్ ఫీడింగ్


ఒక్క రూపాయిస్తే నాలుగు జొన్న రొట్టెలు, వాటికి సరిపడా కూర. ఎంతమంది వచ్చినా ఇదే రేటు అక్కడ. ఇంతకుముందు 50 పైసలకే ఇదంతా ఇచ్చేవారట. 50 పైసలు కనుమరుగైపోవడంతో ఈ ధరను రూపాయికి పెంచారు. ఆ రూపాయి కూడా ఇవ్వలేనివారికి ఉచితంగానే ఈ రొట్టెలు, కూర ఇస్తారు. ఇంతకీ ఈ దృశ్యం ఎక్కడిదనుకుంటున్నారా ? కర్ణాటకలోని బీజాపూర్ పట్టణంలోని కబ్‌రాజీ బజార్‌లో ఉన్న హేమంత్ నగర్ దుకాణం వద్ద ఒక చేత్తో రూపాయి.. మరో చేత్తో విరిగిన పళ్ళెమో లేక పాలిథిన్ కవరో పట్టుకుని మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య సమయంలో పేదలు వరుసలో నిల్చుని ఉంటారు. 

ఇది దాదాపు నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్న సేవ. అప్పట్లో హేమంత్ తండ్రిగారు కేవలం 10 పైసలకే పేదల కోసం ఈ సేవను ప్రారంభించారట. అప్పటి 10 పైసలుకానివ్వండి.. ఇప్పటి రూపాయి కానివ్వండి. ఈ మొత్తం సొమ్ముకు మరి కొంత డబ్బు చేర్చి వంటవారికి, రొట్టెల కోసం పిండి ఆడే మిల్లువారికి ఇస్తుంటారు. హేమంత్ కుటుంబం చేస్తున్న ఈ సేవ గురించి తెలిసినవారు ఈ సేవలో భాగస్వాములై ఎంతో కొంత సొమ్మును విరాళంగా ఇస్తుంటారు. కొందరైతే జొన్నలు, కూరగాయలు ఇస్తుంటారు. దాతలెవరైనా 08352 250114 ద్వారా హేమంత్ నహర్‌ను సంప్రదించవచ్చు.

Wednesday, May 30, 2012

పదేళ్ళ కుర్రాడు.. ప్లెయిన్ ఐస్‌క్రీం చాలన్నాడు..


ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఆ రోజుల్లో సన్‌డా ఐస్‌క్రీం వెల ఒకొక్కటి యాభై సెంట్లు. ఆ రోజుల్లో పిల్లలకు ఇది మహా ప్రాణమట. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హేరిస్‌బర్గ్ అనే ఊరిలో ఎప్పుటూ కిటకిటలాడే ఒక ఐస్‌క్రీం పార్లర్‌లోకి పదేళ్ళ కుర్రాడొకడు అడుగుపెట్టి టేబుల్ ముందు కూర్చున్నాడు. వెయిట్రెస్ వచ్చి గ్లాస్ మంచినీరు ఇచ్చి నిలబడింది...

ఐస్‌క్రీం సన్‌డా ఎంత ?.. అడిగాడు ఆ అబ్బాయి.

యాభై సెంట్లు.. చెప్పిందామె.

ఆ అబ్బాయి తన జేబులో ఉన్న నాణేల్ని లెక్కబెట్టుకుంటూ మళ్ళీ అడిగాడు.

మామూలు ఐస్‌క్రీం ఎంత ?..

అక్కడ చాలామంది కస్టమర్లు ఉండటంతో "ముప్ఫై ఐదు సెంట్లు.." అని విసుగ్గా చెప్పింది ఆ వెయిట్రెస్.

పిల్లవాడు తన దగ్గరున్న నాణేలన్నిటినీ లెక్కబెట్టుకుని చివరికి ఒక ప్లెయిన్ ఐస్‌క్రీం తెమ్మని అడిగాడు.

ఆమె ఐస్‌క్రీంతో పాటు బిల్ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళింది. ఈ పిల్లవాడు దాన్ని తినేసి కౌంటర్‌లో డబ్బు చెల్లించి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఈ వెయిట్రెస్ ఆ ఖాళీ కప్ తీసుకెళ్ళడానికి ఈ అబ్బాయి కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చింది. ఖాళీ కప్ పక్కనే రెండు నికెల్స్, ఐదు పెన్నీ నాణేలు.. మొత్తం 15 పెన్నీలు కూడా కనిపించాయి. వెయిట్రెస్‌కు టిప్ ఇవ్వడం కోసం పిల్లలు ఎంతో ఇష్టపడే సన్‌డా ఐస్‌క్రీం వద్దనుకుని మరీ ఈ పిల్లవాడు మామూలు ఐస్‌క్రీం ఆర్డర్ చేసినట్లు ఆమె గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు.

సౌజన్యం: శ్రీ మల్లాది కృష్ణమూర్తిగారు...

Saturday, March 31, 2012

పుస్తకాల డాక్టర్..

వైద్యుడి కోసం రోగులు ఎదురు చూస్తుంటారు. ముల్లంగి వెంకట రమణారెడ్డి కోసం పుస్తకాలు ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే చెదలుపట్టి, కుట్లు ఊడి, రేపోమాపో గాలికెగిరిపోయే పరిస్థితుల్లో ఉన్న వేలాది పుస్తకాలకు ఊపిరిపోసి పునర్జన్మనిచ్చారు ఈ విశాఖ వాసి. తన సైకిల్ పై నగరంలోని గ్రంథాలయాల్ని సందర్శించి అక్కడ అట్టలు విడిపోయి, చిరిగిపోయి, కుట్లు తెగిన పుస్తకాలను పట్టుకెళ్ళి బాగుచేసి చదువరుల కోసం సిద్ధం చేస్తుంటారాయన. పుస్తకాలకు జీవంపోయడమేగాక పలు గ్రంథాలయాలకు ఎన్నెన్నో పుస్తకాల్ని తన స్వంత ఖర్చుతో సమకూర్చారు. తెలుగులో తొలి కార్టూనిస్ట్ అయిన తలిశెట్టి రామారావు గురించి పరిశోధన చేశారు. పుస్తకాలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా, వాటి ద్వారా సముపార్జించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన ధన్యజీవి ఈయన. 55 ఏళ్ళ కిందటే బాల వితంతువు అయిన తన మామయ్య కుమార్తెను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. పుస్తకాలనే కాదు సమాజాన్ని సైతం సంస్కరించే వైద్యుడయ్యారు రమణారెడ్డి.

Wednesday, February 29, 2012

శ్రీనివాసాచార్యులు.. హృదయం చలువపందిరి

సికింద్రాబాద్ అడిక్‌మెట్ వేదపాఠశాలలో గురువు, హబ్సిగూడ రామాలయం పూజారి శ్రీ గట్టు శ్రీనివాసాచార్యులు. సత్గ్రంథ పఠనంతో మనస్సును, వాటి నుంచి నేర్చుకున్న మంచిని సత్కార్యాచరణ ద్వారా అమలు చేయడం ద్వారా దేవుడిచ్చిన శరీరాన్ని పునీతం చేసుకున్నారాయన. మండువేసవిలో నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల్లో వచ్చిపోయేవారికి సూర్య(ప్ర)తాపం నుంచి ఉపశమనం కల్గిస్తూ ఎన్నో పందిళ్ళు స్వంత ఖర్చుతో వేయించారాయన.

"మానవ సేవే మాధవ సేవ" అని తండ్రి వెంకట నరసింహాచార్యులు చేసిన బోధననే శ్రీనివాసాచార్యులు తన బాటగా ఎంచుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని రాంనగర్, ఉప్పల్, అంబర్‌పేట్, మెట్టుగూ, చిరుగానగర్, నాగోలు, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈయన పాదచారులు, బాటసారులు, ప్రయాణీకుల కోసం పలు తాత్కాలిక చలువ పందిళ్ళు వేయించారు. ఆచార్యులుగారి ఈ చలువ పందిరి సేవలో ఆటో రవి, తడికెల బాలయ్య, మల్లేష్ అనేవారు తగినంత చేయూతనిస్తున్నారట.

ఒక్కో చలువ పందిరి వేయడానికి సుమారు రూ.వెయ్యి వరకూ ఖర్చవుతున్నదని, ఎవరైనా తనతో ముందుకొస్తే ఈ సేవను మరింత ఉధృతంగా చేద్దామని పిలుపు ఇస్తున్నారాయన. మిత్రులారా స్పందిస్తారుగా..